[2023 ఫిబ్రవరి నెలలో గుజరాత్, రాజస్థాన్ లలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]
[dropcap]అ[/dropcap]క్షరధామ్ సందర్శకులతో చాలా రద్దీగా ఉంది. మొబైల్ ఫోన్లు లోపలికి అనుమతించరట. క్యూలో నిలబడి ఒక కౌంటరులో మా సెల్ ఫోన్లను డిపాజిట్ చేశాము. కౌంటరు మీద ‘నిశ్శుల్క్’ అని ఉంది. అంటే ఉచితంగానే భద్రపరచుకుంటారు. గుజరాతీ లిపి హిందీని పోలి ఉంది కాని, వేరుగా ఉంది. ఎక్కడా ఇంగ్లీషు, చివరికి బస్సుల మీద సైన్‌బోర్డుల మీద కూడా రాయలేదు. తమిళనాడు, కేరళలో కూడా ఇదే పరిస్థితి. వారి భాషా(దుర)భిమానికి ముచ్చటేసింది నాకు. అదే మావాడితో అంటే వాడు ముఖం చిట్లించి.
“వాళ్లకు తప్ప వేరే వాళ్లకు అర్థం కాకపోతే దాన్నేమంటారు శర్మా? నీకన్నీ ముచ్చటగానే ఉటాయిలే! పద!” అన్నాడు విసుగ్గా.
“ఒరేయ్ యోగా! నీకు నా అంత హిందీ రాదని కుళ్లు రా!” అన్నా.
“ఉద్ధరించావులే!” అన్నాడు వాడు నవ్వుతూ.
ఢిల్లీలోని అక్షరధామ్ తర్వాత అంత పెద్దది అహమ్మదాబాద్ అక్షరధామ్ అని తెలిసింది. ఎన్నో ఎకరాలలో వ్యాపించి ఉందా క్షేత్రం! లేదా ఆశ్రమం! విశాలమైన ఆవరణ. ప్రధాన మందిరానికి వెళ్లే మార్గం, ప్రవేశద్వారం నుంచి దాదాపు నాలుగు వందల మీటర్లు ఉంది.
ఇరువైపులా కళాత్మకంగా నగిషీలు చెక్కిన స్తంభాలతో కూడిన మంటపాలు, ఏనుగులు, సింహాలు, పులుల, సజీవాలని భ్రమింప చేసే పెద్ద పెద్ద లైఫ్ సైజ్ బొమ్మలు ఉన్నాయి. మంటపాల ముందు గ్రానెట్ బెంచీలు వేశారు సేద తీరడానికి. ప్రవేశ రుసుము తలకు 350 రూపాయలు చెల్లించి టికెట్లు తీసుకున్నాము. 7.30 నిముషాలకు వేదిక్ లేజర్ షో ప్రారంభమవుతుందట. దాని టికెట్ రెండు వందలు. అవీ తీసుకుని, మంటపాల, విగ్రహాల అందాలను తిలకిస్తూ ప్రధాన మందిరం దగ్గరికి చేరుకున్నాము. మందిరానికి 50 మీటర్ల ముందు, పొడవైన, పెద్ద నీటి కొలను, దానిలో ఫౌంటెన్లు, మెర్‌మెయిడ్‌లు, పెద్ద పెద్ద కృత్రిమ తామరలు ఉన్నాయి.
ప్రధాన మందిరం అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దబడి ఉంది. ప్రధాన విగ్రహం ‘స్వామినారాయణ్ జీ’ది. కూర్చున్న భంగిమలో ఉంది. ఏడడుగుల ఎత్తు. దానికి బంగారు పూత పూశారు. ధ్యానముద్రలో ఉన్నాడా యోగి.
చుట్టూరా రాధాకృష్ణులు, సీతారాములు, శివపార్వతులు, లక్ష్మీనారాయణులు పాలరాతి విగ్రహాలుగా కొలువు తీరి ఉన్నారు. ఆ విగ్రహాలలో జీవకళ ఉట్టిపడుతూ ఉంది. మదిరం అంతర్భాగమంతా కృష్ణలీలలు, రామాయణంలోని ముఖ్యఘట్టాలు పాలరాతిలో చెక్కారు. నాలుగు వైపులా నాలుగు ద్వారాలు శిల్పసంపదతో శోభిల్లుతున్నాయి. ‘రిచ్‌లీ డివైన్’ అనవచ్చు ఆ మందిరాన్ని.
స్వామి నారాయణ యోగిని, ఇతర దేవతలను దర్శించుకొని కాసేపు మెట్ల మీద కూర్చున్నాము. వాతావరణం చల్లగా, హాయిగా ఉంది. గాలి మృదువుగా మా శరీరాలను పరామర్శిస్తూంది. అప్పుడు టైం ఏడున్నర. ‘వేదిక్ లేజర్ షో’ జరిగే ఓపన్ ఆడిటోరియానికి దారి అన్న సైన్‌బోర్డులను గమనిస్తూ నడవసాగాము. దారిలో ఒక పెద్ద తెరమీద అక్షరధామ్ విశేషాలను ఒక డాక్యుమెంటరీగా ప్రదర్శిస్తున్నారు. అక్కడ పది నిమిషాలు ఆగాము. వ్యాఖ్యానం ఇంగ్లీషులో హిందీలో కూడా చేస్తున్నారు. దాన్ని బట్టి అక్షరధామ్ గురించిన ఎన్నో విషయాలు తెలిశాయి మాకు.
అక్షరధామ్ రజతోత్సవాల సందర్భంగా ఆ మహత్త్వపూర్ణమైన చోటును దర్శించిన వారి వీడియోలను చూపిస్తున్నారు. వారిలో దలైలామా గారిని, ప్రముఖ ఇండో ఆంగ్లియన్ రచయిత, పద్మభూషణ్ శ్రీ ఆర్. కె. నారాయణ్, అబ్దుల్ కలామ్, నరేంద్రమోదీ, ఎల్. కె. అద్వానీ, వాజపేయి, వెంకయ్యనాయుడు గారిని గుర్తించాము. అక్షరధామ్‌లు ప్రపంచంవ్యాప్తంగా 127 దేశాలలో నెలకొల్పారట. వాటి ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక పాఠశాలల్లో దాదాపు ఏడు మిలియన్ల మంది చదువుతున్నారట. అక్కడి విద్యావిధానమంతా భారతీయ సనాతన ధర్మాన్ని ప్రాతిపదికగా చేసుకుని కొనసాగుతుందట.
అక్షరధామ్ ఉన్న ప్రాంతాన్ని గాంధీనగర్ అంటారు. అక్షరధామ్ అంటే అర్థం ‘భగవంతుని ప్రేమ సన్నిధి’. స్వామినారాయణ్ యొక్క నాల్గవ వారసుడు యోగిజీ మహరాజ్, హిందూ మతంలోని ఒక తెగ BAPS సంప్రదాయం ప్రకారం, ఐదవ వారసుడు ప్రముఖ స్వామి మహరాజ్‌చే నిర్మించబడింది. దాన్ని రూపొందించటానికి 13 సంవత్సాలు పట్టింది. 23 ఎకరాల కాంప్లెక్స్ అది! రాజస్థాన్ నుండి తెప్పించిన 6000 మెట్రిక్ టన్నుల పింక్ కలర్ శాండ్‌స్టోన్‌ను దాని నిర్మాణంలో వాడారు. స్వామి నారాయణ్ కల్ట్‌ను అనుసరించేవారు మరణం తర్వాత జీవి ఆత్మ ముక్తిని పొంది, అక్షరధామం చేరుకుంటుందని నమ్ముతారు. అక్షరం అంటే లెటర్ కాదు, క్షరం కానిది అంటే నాశనం కానిదని అర్థం. నవంబరు 2,1992న దీని నిర్మాణం పూర్తయింది.
అభిషేక మంటపం దారిలోనే ఉంది. స్వామి నారాయణ్ అంశ ఐన నీల్‌కాంత్ వర్ణిమూర్తికి అక్కడ భక్తులు అభిషేకం చేసుకోవచ్చు.
2002, సెప్టెంబరు 24న ఇద్దరు సాయిధ తీవ్రవాదులు అక్షరధామ్‌పై దాడి చేశారు. వారు విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో 33 మంది చనిపోయారు. 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ గార్డు (NSG) దళాలు రంగప్రవేశం చేసి ఆ తీవ్రవాదులను మట్టు పెట్టారు.
తర్వాత ‘సహజానంద వనం’ చూశాము. అది పదిహేను ఎకరాలలో తీర్చిదిద్దిన ఉద్యావనం. రాతిలో చెక్కిన కళాకృతులు, ఒక జలపాతం, ఫౌంటెన్లు, 18000 చదరపు అడుగుల వైశాల్యంలో పెంచిన నర్సరీ అందులో ప్రత్యేక ఆకర్షణలు.
అక్కడ ఆరు సాంస్కృతిక మేధో చిహ్నాలున్నాయి. మొదటిది స్వామి నారాయణ్ తన గుర్రం మాంకీ మీద అధిరోహించి ఉన్నది. దాని మీదే ఆయన గ్రామాల్లో పర్యటించేవారట. రెండవది ఆదిశేషునిపై పవళించిన మహావిష్ణువు విగ్రహం. మూడవది సూర్యరథం, సప్తాశ్వశోభితం. నాల్గవది క్షీరసాగరమథనం. ఐవది గంగ, యమున, సరస్వతుల సంగమం. ఆరవది నారాయణ్ సరోవర్. ఆ సరస్సు మధ్యలో 20 అడుగుల ఎత్తున ఫౌంటెన్ నీటిని విరజిమ్ముతూ ఉంది. ఒక చివర పూర్తి శాకాహార రెస్టారెంట్ ఉంది. దాని పేరు ‘ప్రేమావతి’.
తర్వాత ‘ఆర్ష్’ AARSH ను సందర్శించాము. ‘ఆర్ష్’ అంటే ‘అక్షరధామ్ సెంటర్ ఫర్ అప్లయిడ్ రీసర్చ్ ఇన్ సోషన్ హర్మోనీ’. సామాజిక సమస్యల పరిష్కారానికి హిందూ మత సూత్రాలు ఎలా తోడ్పడతాయో అక్కడ పరిశోధన జరుగుతుంది. మతం, తత్త్వశాస్త్రంలకు సంబంధించిన 7000 గ్రంథాలు, చేతి రాతలు వివిధ భాషల్లో అక్కడి గ్రంథాలయంలో ఉన్నాయి. దాని డైరెక్టర్ డా.శృతి ప్రకాష్ స్వామి. ఇది వెరావల్ లోని శ్రీ సోమనాధ్ సంస్కృత విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పని చేసే స్వతంత్ర పరిశోధనా సంస్థ.
మేం వేదిక్ రేజర్ షో జరిగే ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం చేరేసరికి ఎనిమిది కావస్తూంది. షో అప్పుడే ప్రారంభమైంది. వెయ్యి మంది కూర్చొనే లాగా రాతి బెంచీలు వేసి ఉన్నారు. ఎదురుగ్గా ఆరు బయట కృత్రిమంగా నిర్మించిన కొండలున్నాయి. వాటిలో పెద్ద పెద్ద బండరాళ్లున్నాయి. అదే షో కు వేదిక. ఆడిటోరియం గ్యాలరీ పైన ఒక రూమ్ నుండి లేజర్ కిరణాలు దృశ్యాలుగా మారుతున్నాయి. దాని పేరు ‘సత్-చిత్-ఆనంద్ వాటర్ షో’. అది ఒక పరమాద్భుతమైన అనుభవం విక్షకులకు సంభ్రమాశ్చర్యలకు లోనవుతాము.
‘కఠోపనిషత్తు’లోని ‘నచికేతోపాఖ్యానా’న్ని ఆ షోలో నలభై నిమిషాల పాటు ప్రదర్శించారు. దీనిలో మంటలు, జలయంత్రాల ద్వారా ఆవిష్కరించబడే యానిమేషన్లు, లేజర్, వాటర్ స్రీన్ ప్రొజెక్షన్స్, సంగీతం, సజీవ పాత్రలు ఉన్నాయి. భూకంపాలు, అగ్ని పర్వత విస్పోటనాలు, సూర్యోదయ సూర్యాస్తమయాలు, బ్యాక్‌గ్రవుండ్ మ్యూజిక్ తో వాటర్ స్క్రీన్ మీద ప్రదర్శిస్తూ ఉంటే వీక్షకులు ముగ్ధులవక తప్పదు.
నచికేతుని కథ, వారు చూపించింది క్లుపంతగా ఇది. నచికేతుడు ఉద్దాలక మహార్షి కుమారుడు. అతని పాత్ర మాత్రం నిజంగానే ఒక పిల్లవాడు ధరించాడు. అతడు మనకు వేదిక మీద కనబుతుంటాడు. ఉద్దాలకుడు తన సర్వస్వాన్నీ దేవతల కర్పించాలని అనుకుంటాడు. తనను ఎవరికి అర్పిస్తావని తండ్రి నడుగుతాడు నచికేతుడు. ఉద్దాలకుడు కోపించి, యమునికి నిన్ను ఇచ్చేశాను, అక్కడికి వెళ్లమని ఆజ్ఞాపిస్తాడు. వ్యాఖ్యానం అంతా హిందీలో సాగుతూంది.
నచికేతుడు కూడా తపశ్శాలి. యముని లోకం చేరి మూడు రోజులు సమవర్తి కోసం ద్వారం దగ్గర ఎదురు చూస్తాడు. యముడు ప్రత్యక్షమై, అతనికి మూడు వరాలు ఇవ్వజూపుతాడు. నచికేతుడు అడిగిన వరాలు.
- తాను తిరిగి వెళ్లిన తర్వాత తన తండ్రి తనను ప్రేమగా స్వీకరించాలి.
- తనకు స్వర్గంలో నివసించడానికి కావలసిన జ్ఞానం ఇవ్వాలి.
- మరణాన్ని అధిగమించగల ఆత్మజ్ఞానం కావాలి.
నచికేతుడు ఈ వరాల కంటే ముందు యముడిని ఒక ప్రశ్న అడుగుతాడు.
“యమధర్మరాజా! తెలివితక్కువవారు, అసమ్మర్థులు, జ్ఞానులు, చక్రవర్తులు, విజేతలు, విఫలురు అందరూ మరణం వల్ల అంతమవుతున్నపుడు ఇన్ని రకాలు ఎందుకు? అందరూ మరణించివలసినపుడు ఈ వివక్షలెందుకు?”
ఈ ప్రశ్నకు యముడు జవాబు చెబ్బలేకపోతాడు. నచికేతుని తెలివికి సంతోషించి, తన భీకర రూపాన్ని విసర్జించి, ప్రసన్నరూపంతో దర్శనమిస్తాడు. అతని తండ్రికి సద్గతులు, అతనకి ఆత్మజ్ఞానం ప్రసాదిస్తాడు. తర్వాత స్త్రీ పురుషులిద్దరూ సృష్టిలో సమానం అన్న ఒక కథను వివరించారు షోలో. ఆత్మజ్ఞానం పొందితే మరణ భయం ఉండదని, ఆక్షరధామ్ లభిస్తుందని, ఇదే స్వామినారాయణుల వారి దివ్య బోధన అని చెబుతూండగా ముగిసింది.
(అక్షర్‍ధామ్ ఫోటోలు – ఆలయ వెబ్ సైట్ నుంచి సేకరించినవి. వారికి కృతజ్ఞతలు)
కాసేపు ఆ దృశ్య పారవశ్యం నుండి తేరుకోలేకపోయాము. అక్కడ నుంచి ‘ప్రేమావతి’ క్యాంటిన్‌కు వెళ్లి డిన్నర్ చేశాము. ఇడ్లీలు చిన్న చిన్నవి ఎనిమిది ఒక ప్లేట్. చట్నీ, సాంబారు బాగున్నాయి. మసాలా దోశ తిన్నాము. అది అంత బాగోలేదు. పైగా చల్లగా ఉంది. సెల్ఫ్ హెల్ప్ పద్ధతి. టోకెన్లు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్లి ఆ చల్లని దోశలు అతనికి చూపాము. “ఇదేనా భక్తులకు మీరిచ్చే తిండి?” అని ఇంగ్లీష్‌లో దబాయించాను. ఇడ్లీ ప్లేటు వంద. దోసె నూటయాభై. తక్కువేమీ కాదు కదా! అతడు మొత్తబడి, సప్లయి చేసే వారిని పిలిచి, వేడిగా మళ్లీ వీళ్లకు దోసెలు వేసి ఇమ్మన్నాడు! అడగందే అమ్మయినా పెట్టదు కదా!
మా డ్రయివర్ ఫోన్ చేశాడు. తొమ్మది నలభైకి కారులో హోటల్ చేరుకున్నాం. మా ద్వారక ప్రయాణం రేపు ఉదయమే. నాకొక ఆలోచన వచ్చింది. ఈ నాలుగు బ్యాగులూ మోసుకొని ద్వారక, సోమనాథ్ అన్నీ తిరగడం ఎందుకు, రెండు రోజులే కదా! కావలసినవి ఒక బ్యాగ్‌లో సర్దుకొని, మిగతా మూడు ‘ప్యురాట్ ఇన్’ వారి స్టోర్ రూములో ఉంచుకుంటారేమో అడిగితే?
“ఇదిదో బాగుందే?” అన్నాడు మా యోగా. “ఒప్పుకుంటారంటావా?” అన్నాడు అనుమానంగా.
“అడిగి చూద్దాం! తప్పేముంది?” అని, రిసెప్షన్‌కు వెళ్లి “ద్వారక, సోమనాథ్ లకు రెండు రోజులు వెళ్లివస్తాము. మా లగేజ్ అంతా మోసుకుపోవడం కష్టం. చెక్ అవుట్ చేసి, బ్యాగులు మీ వద్ద ఉంచుతాము. సీనియర్స్ సిటిజన్స్‌ము సాయం చేయండి” అని హిందీలో కోరాను.
“అలాంటి ప్రొవిజన్ లేదు సార్. కాని మీరు ఇంతగా అడుగుతున్నారు పాపం. సరే ఉంచుకుంటాం లెండి!” అన్నాడతడు.
అతనికి కృతజ్ఞతలు చెప్పాను. ఒక బ్యాగ్‌లో మా ఇద్దరి బట్టలు. మందులు వగైరా సర్దేశాము. రాత్రి మిగిలిన బ్యాగులు బాయ్ తీసుకువెళ్లి వారి స్టోరు రూంలో పెట్టి వచ్చాడు.
మా రైలు ఐదు గంటలకే. నాలుగు కల్లా లేచి తయారయ్యాము. ముందు రోజు రాత్రే రిసెప్షన్ వారితో చెప్పి, ఉదయం మమ్మల్ని అహమ్మాదాబాద్ సెంట్రల్ స్టేషన్‌లో డ్రాప్ చేయడానికి ఒక క్యాబ్ అరెంజ్ చేయమన్నాము. డోనౌట్ ట్రావెల్స్ వారు ఆ విషయం మాకు ముందే చెప్పారనీ, నాలుగున్నరకు మీ క్యాబ్ వస్తుందనీ చెప్పారు.
‘వెరీ గుడ్’ అనుకున్నాము.
నాలుగుకు లేచి ‘రైలు యాత్రీ’ యాప్‌లో ట్రయిన్ రన్నింగ్ స్టేటస్ చూశాము. నలభై నిమషాలు లేటుగా నడుస్తూంది. ఆ రైలు పేరు సౌరాష్ట్ర మెయిల్. ముంబయి ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మినల్ నుండి (CST) ద్వారక, రాజ్‌కోట్, సోమనాథ్‌ల మీదుగా ఓభా వెళుతుందది.
క్యాబ్ డ్రైవరుకు చెప్పాము. దారిలో ఎక్కడయినా మంచి “బినా చీనీ కాఫీ తాగించరా అబ్బాయ్!” అని. స్టేషన్ ఏడు కి.మీ ఉందట. ట్రాఫిక్ ఆ టైంలో అస్సలు లేదు. ఒక చోట టీ కొట్టు కనబడింది. ఆపాడు. నెస్‌కెఫ్ ఇన్‌స్టెంట్ కాఫీ కలిపి ఇచ్చాడు. ప్రాణాలు కుదుటబడ్డాయి. “డ్రైవర్‌కు మీరు క్యాష్ ఇచ్చేయండి, 600 రూ. నేను. మీకు ఆ డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తాను సార్” అని డోనౌట్ ట్రావెల్స్ సందీప్ అంత పొద్దున్నే ఫోన్ చేసి నాకు చెప్పాడు. సరే అన్నాను.
రైలు ఐదు ముఫై ఐదుకు వచ్చింది. నాలుగో నంబరు ప్లాట్‌ఫాం. చక్కగా ఓవర్ బ్రిడ్జి ఎక్కడానికి దిగడానికి లిఫ్టులున్నాయి. పైగా లింగులింగు మంటూ ఒకే బ్యాగు! దానికి చక్రాలు! అడుతూ పాడుతూ రైలెక్కాం. నాకు B2లో, మా వాడికి B4లో లోయర్ బెర్తులు వచ్చాయి. ఒక నవయువకుడిని రిక్వెస్ట్ చేసి, ఇద్దరం ఒకే చోట అడ్జస్ట్ అయ్యాం. వృద్ధులను గౌరవించే సంస్కృతి మనది! “Old age hath its own honour and toil” అన్నాడు కదా టెన్నిసన్. బెర్తుల మీద హాయిగా పడుకుని నిద్దరోయాము. తొమ్మిదికి తీరుబాటుగా లేచి, రాజ్‌కోట్ స్టేషన్‌లో వడ సాంబార్ తిన్నాం. చాలా బాగుంది టిఫిన్. విస్తరాకు దొన్నెల్లో రెండు వడలు వేసి, అందులోనే సాంబారు, చట్నీ వేసి ఇచ్చాడు. ఒక చెక్క స్పూన్ కూడా. లంచ్ కూడా రైల్లోనే. IRCTC వారిదే. అది రొటీనే! చప్పుకోవడానికేం లేదు.
రైలు ద్వారకకు ఒకటిన్నరకి చేరింది. రెండు గంటల ముందే అక్కడ మా కోసం ఎదురు చూస్తున్న డ్రైవర్ రామ్‌దేవ్ ఫోన్ చేసి తాను స్టేషన్ వద్ద సిద్ధంగా ఉంటానని చెప్పాడు. అతని పూర్తి పేరు రామ్‍దేవ్ ఖురానా. కారు టయోటా ఎటియస్. మమ్మల్ని సాదరంగా రిసీవ్ చేసుకున్నాడు. నర్సీ కేశవ్వాడి లోని ‘హోటల్ రుద్రప్లాజా’కు తీసుకుని వెళ్లాడు. హోటల్ చాలా బాగుంది. చెకిన్ అయ్యి, ఒక గంటన్నర రిలాక్స్ అయ్యాము. నాలుగున్నరకు ద్వారకాధీశుడైన శ్రీకృష్ణపరమాత్మను దర్శించుకోవడానికి బయలుదేరాం.
***
“సార్, మొదట గోమతీఘాట్‌కు వెళదాం. గోమతీ నది సముద్రంలో కలిసే ‘సంగమ్’ను ‘సన్‌సెట్’ లోపే చూస్తే బాగుంటుంది. చీకటి పడితే చూడలేం. ద్వారకాధీశ్ దర్శన్ రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. కాబట్టి పరవాలేదు.” అని చెప్పాడు ఖురానా. మాకు ప్రతి చోట ఇచ్చిన డ్రైవర్ లందరూ గైడ్లు కూడా. సరే అన్నాం.
కారు ఒక చోట ఆపాడు. అంత వరకే కార్లు వెళ్లగలవట. అన్నీ చూసి ద్వారకాధీశ్ దర్శనం చేసుకుని ఇక్కడికే వచ్చి ఫోన్ చేయమన్నాడు.
అక్కడి నుంచి గోమతీ నది తీరానికి వెళ్లే త్రోవ చాలా ఇరుగ్గా ఉంది. ఇరు వైపుల రకరకాల దుకాణాలు. స్నాక్స్ బండ్లు. కేవలం మోటార్ బైకులకు మాత్రమే అనుమతి ఉన్నట్లుంది. ఆటోలు కూడా కనబడలేదు. మధ్యలో ఒక ‘గోల్‌గప్పా’ బండి కనబడింది. నాకు ప్రతి రోజూ సాయంత్రం అయ్యేసరికి ఏవో ఒక స్నాక్స్ తినాలి. మా వాడు ఏమీ తినడు. వాడికి ఆరోగ్య సూత్రాల పాటింపు, హెల్త్ అండ్ హైజీన్ పట్ల పట్టింపు చాలా ఎక్కువ. కానీ వాడిలో ఉన్న మంచి గుణం ఏమిటంటే నన్ను తినొద్దని అనడు. ‘గోల్‌గప్ప’ అంటే పానీ పూరీ. బండి మీద ‘గోల్ గప్పే’ అనే రాసి ఉంది.
నాకెందుకో ‘గప్పాలు’ అనే తెలుగు పదం గుర్తొచ్చింది. గప్పాలు కొడుతున్నారు అంటే పోసుకోలు కబుర్లు చెబుతూ కూర్చున్నరని కాదా అర్థం. “గోల్ అంటే గుండ్రం, గప్పా అంటే లోపల డొల్లగా ఉంటేది” అని మావాడికి దాని ‘వ్యుత్పత్తి’ చెప్పాను. వాడు నవ్వి ఇలా అన్నాడు.
“ప్రతిదాన్నీ సాహిత్యపరంగా వివరిస్తే గాని నీకు తోచదా శర్మా! అయితే గప్పాలు అంటే డొల్ల కబుర్లు అంటే సరిపోతుంది.”
“అవునురోయ్! హిందీ, తెలుగు ఎలా కలిశాయో చూడు!” అన్నా.
ప్లేటు 30 రూపాయలు. చెప్పాడు. ఎనిమిది వచ్చాయి. “మన హైదరాబాదులో అయితే ఇరవయ్యే!” అన్నా.
నేను పానీపూరీ తింటుంటే వాడు నాకు తెలియకుండా ఫోటో తీశాడు. నాకు చూపించాడు.
“ఇది అవసరమా, వెధవా!” అన్నాను కోపంగా.
“అవసరమే!” అన్నాడు వాడు నవ్వుతూ.
గోమతీ నదిలో బాగానే నీళ్లున్నాయి. మేం దాదాపు అరకిలోమీటరు నడిచాం ఆ సందుల్లో. అప్పుడు సమయం ఆరు కావస్తోంది. నదీ తీరం వెంబడి అలంకరించబడిన ఒంటెలు కనువిందు చేస్తున్నాయి. వాటి మీద ఎక్కించుకొని, ఇసుకలో తిప్పి, కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. వేయించిన, ఉడికించిన ప్లలీలు, శనగలు, సోడాలు, భేల్‌పూరీ, సమోసాలు, సర్వేసమస్తమూ అమ్ముతున్నారు. కొంటున్నారు.
నదీ తీరం చేరాం. కుడి వైపు వంద మీటర్లు నడిచి గోమతీ ఘాట్ చేరుకున్నాం. క్రిందికి దిగడానికి ఒక ఇరవై మెట్లున్నాయి. దిగి ఇసుకలోకి వెళ్లాం. నదిని వాళ్లు ‘గోమ్‌టీ’ అంటున్నారు.
నదిలో స్పీడ్ బోట్లు టూరిస్టులనెక్కించుకొని రయ్ రయ్ మని తిరుగుతున్నాయి. వాటి వెనుక నది నీటిని చీలుస్తూ, దూరంగా అంటే మరీ దూరంగా కాదు, రెండు వందల మీటర్ల దూరంలో సముద్రం కనబడుతూంది.
స్పీడ్ బోట్లు, నది వెళ్లి సముద్రంలో కలిసే చోటవరకు, వెనక్కు తిరిగి వస్తున్నాయి. ఇటు వైపు కొంత దూరం, నది మీద ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ కనబడుతూంది. అది సముద్రం వరకు ఉంది. దాని పేరు ‘సుదామ సేతు’ అని ముందు రాసి ఉంది.
“సుదామ అంటే ఏమిట్రా?”అని అడిగాడు మా యోగా.
కాసేపు ఆలోచించాను. “సుదాముడంటే కుచేలుడునుకుంటాన్రా. శ్రీకృష్ణునికి బాల్య మిత్రుడు. ఇద్దరూ సాందీపని ఆశ్రమంలో కలిసి చదువుకున్నారు. కుచేలుని కథ మహాభాగవతంలోని దశమస్కంధంలో వస్తుంది. పెద్దయింతర్వాత..”
“చాలులే ఇక ఆపు! కుచేలుని కథ నాకు తెలుసు” అన్నాడు వాడు.
“నీవే కదా అడిగావు!” అన్నా కోపంగా.
“సుదాముడే కుచేలుడని తెలియక అడిగాను మహానుభావా! నీవు రైటర్‌వు కావడం నా చావుకొచ్చింది. ప్రతిదీ వివరించి చంపుతావు” అన్నాడు వాడు నవ్వుతూ.
నేనూ నవ్వి, “ఈ సారి ఏదైనా అడుగు, వెధవా!” అన్నాను.
మిత్రుని దగ్గర ఉండే స్వతంత్రం అలా ఉంటుంది. మనం ఎంత గొప్ప వాళ్లమైనా వాళ్లకు పట్టదు. బయట ఎంతో లబ్ధప్రతిష్ఠుడైన మిత్రుడిని పట్టుకొని, “నీ మొహం లేరా! నోరు ముయ్యి” అనగలిగిన వాడు ఫ్రెండ్ ఒక్కడే. భార్య కూడ తీసుకోలేని చనువు వాడు తీసుకుంటాడు. భగవంతుడే వాడికా అధికారం ఇచ్చాడు. మన గొప్పవాడి దగ్గర కుదరదు.
ఇదే విషయాన్ని ఫ్రాన్సిస్ బేకన్, తన “Of friendship” అనే వ్యాసంలో అందంగా చెప్పాడు.
“For there is no such flatterer
As is a man’s self, and there is
no such remedy against flatters
of man’s self, as the liberty of a friend”
మనిషి తన సొంత డబ్బా కొట్టుకోడానికి చాలా ఇష్టపడతాడట. దానికి ‘రెమెడీ’ అంటే పరిష్కారం ఒకటేనట. అదే స్నేహితుడు! వాడి స్వాతంత్ర్యం!
ఎంత బాగా చెప్పాడో చూడండి. మా యోగా గాడికీ నాకూ నిరంతరం ఇదే గొడవ!
సూర్యుడు సముద్రానికి బారెడు ఎత్తులో నారింజ రంగులో వెలుగుతున్నాడు. లేత బంగారు రంగులోని నీరెండ సముద్రం మీద, దానిలో కలుస్తూన్న నది మీద పరుచుకొని, నీళ్లు బంగారం కరగించిపోసిన ద్రావకంలా మెరుస్తున్నాయి. ఒక గంట కిందట అయితే ఆయన దుర్నీరీక్ష్యుడు, అంటే తేరిపార చూడడానికి శక్యం కాని వాడు. ఇప్పుడు మాత్రం మన భౌతికనేత్రాలతో ఆయనను, ఏమాత్రం కళ్లు చిట్లించుకుండా చూడవచ్చు.
నడుచుకుంటా సంగమ స్థలానికి 50 అడుగుల దూరం వరకు వెళ్లగలిగాము. అంచున నది లోతు తక్కువగా అంటే మోకాలి బంటి ఉంది. ఐదారు గజాల తర్వాత చాలా వడిగా ఉంది. అంతకంటే ముందుకు వెళ్లకండని అక్కడ పిండప్రదానాలు చేస్తున్న పండిత్‌జీ ఒకాయన గుజరాతీలో మమ్మల్ని చూసి అరుస్తున్నాడు. మాకు అర్థమైపోయింది.
అపురూపమైన, అరుదైన ఆ సంగమ దృశ్యాన్ని చూస్తూ నీళ్లల్లో నిలబడిపోయాము. గోమతీ దేవి ఉరుకులు పరుగులతో సముద్రునిలో కలవడానికి ప్రవహిస్తూ వెళుతూ ఉంది. ఆయన తన అలలనే హస్తాలు చాచి ఆమెను తనలోని ఆహ్వానిస్తున్నాడు. వాళ్లిద్దరి ప్రేమ బాగానే ఉంది కాని, నది నీరు ఒక్కసారిగా పోలేక, వెనక్కు తంతూ ఉంది. నీలం రంగు సముద్రం నీరు చాలా మేర తన రంగును కోల్పోయి. నది యొక్క లేత ఎరుపురంగును సంతరించుకుంది. ఆ సంభ్రమాస్పద దృశ్యాన్ని వీడియో తీశాము. అప్రయత్నంగా నాకు తెనాలి రామకృష్ణకవి తుగభద్రానదిని గురించి చెప్పిన మనోజ్ఞమైన ఒక పద్యం గుర్తొచ్చింది. దాన్ని గట్టిగా రాగయుక్తంగా పాడాను.
నీటిహోరులో సరిగ్గా వినిపించదని, నా గొంతు పూర్తిగా వినియోగించి పాడాను.
శా.
“గంగాసంగమ మిచ్చగించునె మదిన్
గావేరి దేవేరిగా
నంగీకార మొనర్చునే, యమునతో
నానందమున్ బొందునే
రంగత్తుంగ తరంగహస్తములనా
రత్నాకరేంద్రుండు నీ
యంగంబంటి సుఖంచునేని,
గుణభధ్ర! తుంగభద్రానదీ!”
నేను పద్యం పాడుతూ ఉంటే చుట్టుపక్కుల ఉన్న వారు కొందరు ముందుకు వచ్చి, ఆసక్తిగా విన్నారు. బాష అర్థం కాకపోయినా, దానిలోని లయను, శ్రావ్యతను వారు గుర్తించారు. ఒకాయన, నెత్తిన తలపాగా, పక్కా గుజరాతీ వేషధారణతో ఉన్నాడు పెద్దాయన నా దగ్గరకి వచ్చి, “బహుత్ ఖూబ్, బహుత్ ఖూబ్! భయ్యా! ఏ కోన్ సీ భాషాహై?” అడిగాడు.
“తెలుగు జీ!” అన్నాను వినయంగా.
‘Music has no language’ అన్న విషయం ఇక్కడా ఋజువైంది.
నీళ్లలోంచి బయటకు వచ్చాము. సూర్యుడు పూర్తిగా సముద్రంలోకి దిగిపోయాడు. కాని, ఆకాశం ఇంకా జేగురంగులో ఉంది. “సరేగాని, పద్యానికి అర్థం చెప్పు” అన్నాడు మావాడు.
“ఎందుకు లేరా, నీకు నా వల్ల చచ్చే చావు కదా!” అన్నానవ్వుతూ.
“ఉద్ధరించావులే గాని చెప్పు” అన్నాడు వాడు.
“తుంగభద్రా నది శరీరాన్ని తాను తనలో లీనం చేసుకోనేటప్పుడు ఆ సముద్రుడు గంగా సంగమాన్ని కూడ ఇష్టపడడట. యమునాది తనలో కలిసినపుడు కూడా అంత ఆనందం పొందట. కావేరిని తన దేవేరిగా ఒప్పుకోడట, తుంగభద్రమ్మ తన ఉత్తుంగ తరంగహస్తాలతో ఆయనను చేరే సమయంలో!”
నేను పద్యం పాడేటప్పుడు సందర్భోచితంగా, చివరలో ‘తుంగభద్రా నదీ’ అన్నచోట ‘గోమతీ నదీ’ అని మార్చి పాడాను. అది మాత్రం ఆ పెద్దాయనకు బాగా అర్థమైందని నాకు అర్థమైంది.
“బాగుందిరా!” అన్నాడు మావాడు మనస్ఫూర్తిగా. “మంచి పద్యం” అని, “మరి తెనాలి రామకృష్ణడిని ‘వికటకవి’ అని, రకరకాల హాస్యకథలు చెబుతూంటారే!” అన్నాడు.
“అవన్నీ కల్పితాలురా! ఆయన మహాకవి!” అన్నా.
“సరే గాని నాకో అనుమానం.”
“చెప్పు.”
ఇద్దరం వెనక్కి వస్తున్నాము. సుదామసేతు మీదకి వెళ్లడానికి. దారిలో ఆగి నిమ్మకాయసోడా తాగాము. మావాడు వద్దనలేదు. అది చాలా మంచిదట!
(ఇంకా ఉంది)