Site icon Sanchika

గుజరాత్ రాజస్థాన్ పర్యటనానుభూతులు-7

[2023 ఫిబ్రవరి నెలలో గుజరాత్, రాజస్థాన్ లలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]మ[/dropcap]ళ్లీ వడోదరకు బయలుదేరాము. రెండు గంటలకు ‘దర్శన్’ అనే హైవే రెస్టారెంట్ దగ్గర లంచ్‌కు ఆపాడు మనోజ్. అది చాలా పోష్‌గా ఉంది. మాకు టేబుల్ దొరకడానికి ఇరవై నిమిషాలు పట్టింది. అక్కడ ‘కథియవాడి’ మీల్స్ స్పెషల్ అట. ప్యూర్ వెజ్! చూద్దాం! అనుకొని ఆర్డరిచ్చాము. తళతళ మెరిసే పెద్ద ఇత్తడి పళ్లాలలో సర్వ్ చేశారు. శుభ్రంగా ఉన్న రాగి జగ్గులు, గ్లాసులతో నీళ్లు పెట్టారు.

వంకాయలు మంట మీద కాల్చిన పచ్చడి వేశారు. అద్భుతంగా ఉంది. అది మనం ఇళ్లలో చేసుకునేదే. దాన్ని బ్రింజాల్ ఖిచిడీ అంటున్నారు. జిహ్వ లేచి వచ్చింది. భెండీ మసాలా, బటర్ నాన్, కొద్దిగా పుదీనా రైస్, దహీ వడ, మసాలా పాపడ్ ఇచ్చారు. అన్నీ బాగున్నాయి. థాలి ధర 170 రూపాయలే. చివర్లో బాదం ఖీర్ ఇచ్చాడు. అది మా శత్రువు కదా! వద్దని చెప్పాము. మజ్జిగ ఉంటే దాని బదులు ఇమ్మంటే లేదన్నాడు. సరే, ‘యావత్ ప్రాప్తం, తావత్ లభ్యం’!

మేము వడోదర చేరుకునే సరికి నాలుగు కావస్తుంది. లాడ్జికి వెళ్లకుండా డైరెక్ట్‌గా ‘లక్ష్మీవిలాస్ ప్యాలెస్’కు వెళ్లితేనే నిదానంగా చూడగలమని. ఎందుకంటే ఆరు గంటలకు దాన్ని క్లోజ్ చేస్తారని చెప్పాడు డ్రయివర్. సరే అన్నాం.

లక్ష్మీవిలాస్ ప్యాలెస్, భారత దేశంలోని అది పెద్ద ప్రయివేట్ ప్రాపర్టీలలో ఒకటి. గైక్వాడ్ వంశస్థుల సొంత ఆస్తి. బరోడా మహారాజు సాయాజీ గైక్వాడ్ దానిని 150 సంవత్సరాల క్రిందట నిర్మించారు. ఇప్పటికీ ఆయన వారసులు, నాలుగో తరం వారు ఆ భవనం ఉపరిభాగంలో నివసిస్తున్నారు. రాజా సమర్‌జిత్ సింగ్ గైక్వాడ్, తన కుటుంబంతో అక్కడ ఉన్నారు. సాయాజీ మహారాజ్ వారసుడు ప్రస్తుతం ఆయనే.

ప్యాలెస్ ఎక్స్‌టీరియర్స్ రాచఠీవితో, అత్యంత హుందాగా, వైభవంగా ఉన్నాయి. అన్ని వైపుల నుంచి రాజభవనాన్ని ఫోటోలు, వీడియోలు తీశాము. ఇక లోపల ఐతే నమ్మలేనంత గ్రాండ్‌గా ఉంది. రాజ్ దర్బార్ హాలయితే పురాతన కంచు విగ్రహాలతో, ఖరీదైన షాండిలియర్స్‌తో, రిచ్ ఆయిల్ పెయింటింగ్స్‌తో, మఖమల్ క్లాత్‌తో చేసిన జెయింట్ సైజు సోఫాలతో అలంకరించబడి ఉంది.

గైక్వాడ్లు ధరించిన ఖడ్గాలు, డాళ్లు, కవచాలు, పిడిబాకులు ఇంకా ఎన్నో రకాల గన్స్, పిస్టల్స్ అన్నీ మరో హాలులో ప్రదర్శించారు. అవన్నీ చూశాము. రాజాగారి ‘పర్సనల్ అడ్డా’ అని ఒక చోటుంది. అది చాలా రిచ్‌గా ఉంది. రాజుగారు కూర్చునే పరుపు, ఆనుకొనే దిళ్లు అన్నీ కళ్లు చెదిరేంత అందంగా ఉన్నాయి. భవనంలోని మెట్ల దారులు (stair cases) తళతళలాడే పాలరాతితో, చిత్ర విచిత్రమైన కళాకృతులు చెక్కబడి ఉన్నాయి. లతలు, పువ్వులు రాతిలో అంత సన్నగా సుకుమారంగా చెక్కడం వారికే చెల్లింది.

రాజభవనం చుట్టూ, వందలాది ఎకరాల్లో మహా వృక్షాలు, పచ్చిక బయళ్లు, ఫౌంటెన్లు ఉన్నాయి. ఒక పెద్ద అడవిలో ఉన్నట్లుంది లక్ష్మీ విలాస్ ప్యాలస్. గ్రీనరీ వల్ల చల్లగా హాయిగా ఉంది.

ఇదొక్కటే ఆ వంశీయులు తమకోసం ఉంచుకున్నారట. వారి మిగతా భవనాలు, భూములు అన్నీ గుజరాత్ ప్రభుత్వానికి ఇచ్చేశారట. బరోడా జైలు, వడోదర రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టు, మార్కెట్ ప్లేస్, కలెక్టర్ ఆఫీసు. ఇలా అన్నీ భవనాలు, భూములు గైక్వాడ్ వంశస్థులు ఇచ్చినవే.

పావు తక్కువ ఆరుకు ప్యాలెస్ చూడడం పూర్తయింది. బయట నెలకొల్పిన నోటీస్ బోర్డులు చదవి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాము. లోపల క్యాంటిన్ ఉంది. దాంట్లో కాఫీ తాగాము. చాలా బాగుంది. కాని వంద రూపాయలు! అదే బాగులేదు!

హోటల్ చేరుకొని, ఒక అరగంట రెస్ట్ తీసుకొని, ఆరున్నరకు చెక్ అవుట్ చేశాము. మళ్లీ అహమ్మదాబాద్‌కు చేరుకొనే సరికి ఎనిమిది. మళ్లీ చెకిన్. ఈసారి మా హోటలు పేరు ‘రాయల్ ఫోర్ట్ రెసిడెన్సీ’ నిజంగా కోటలాగే ఉంది. స్నానం చేసి డిన్నర్ రూంకే తెప్పించుకున్నాం. పుల్కాలు, నవరతన్ కుర్మా, కర్డ్ రైస్! ఒళ్లెరగని నిద్రపట్టింది.

ఉదయం ఎనిమి గంటలకు డొనట్ ట్రావెల్స్ సందీప్ ఫోన్. ఆ రోజంతా రెస్ట్ డే అట. ఆ రోజు సాయంత్రం ఐదున్నరకు మేం రాజస్థాన్ బయలుదేరాలి. “రోజంతా రూంలో ఏం చేస్తాము. ఇంకా ఆహమ్మదాబాద్‌లో చూడవలసినవి ఏమన్నా ఉంటే చూస్తాము” అన్నాము. అలా ప్యాకేజ్‌లో లేదట. రెండు రాష్ట్రాల టూర్‌లో ఒక రోజు రెస్ట్ తప్పదట. “కావాలంటే ఏదైనా క్యాబ్ అరెంజ్ చేయిస్తాను. నాలుగు వేలు అవుతుంది. అది మీరే పెట్టుకోవాలి” అన్నాడు. పది నిమిషాల తర్వాత చెబుతామని గూగుల్‌లో చూస్తే, మూడు నాలుగు మాత్రమే ఉన్నాయి మేం చూడాల్సినవి. బాయ్‌ని పిలిచి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో విచారించాము. “ఒక్క ‘సెప్ట్ వెల్’ మాత్రం 18 కిలోమీటర్ల దూరం సర్. దారిలోనే వైష్టోదేవి హిల్ వస్తుంది. మిగతావన్నీ మన హోటల్‌కు మూడు కిలోమీటర్ల రేడియస్ లోనే ఉన్నాయి” అన్నాడు. ఇప్పుడు బయలుదేరితే మధ్యాహ్నం రెండులోపల అన్నీ చూసి తిరిగి రావచ్చన్నాడు. ఆ అబ్బాయి పేరు అనల్ప్ చౌహాన్ అట. “మీరిద్దరే కద సర్, క్రిందికి రండి, ఒక ఆటో మాట్లాడతాను. ఐదురు వందలకు వస్తాడు” అన్నాడు. ఇదేదో బానే ఉందే అనిపించింది. క్యాబ్‌కు నాలుగు వేలు దండగ! సందీప్‌కు ఫోన్ చేసి వద్దని చెప్పాము.

అనల్ప్ ఏడువందలకు మాకొక ఆటోను మాట్లాడి పెట్టాడు. డ్రైవర్ పేరు ఇంతియాజ్ అహమ్మద్. ముందు ఎక్కడయినా టిఫిన్ చేయాలంటే, నర్మదా భవన్ అనే హోటల్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ పూరీ, సబ్జీ తిని టీ తాగాము.

మొదట మేం వెళ్లింది సీదీ సయ్యద్ మస్జిద్. అది దగ్గర్లోనే ఉంది. దాన్ని 1572లో నిర్మించారని అక్కడున్న బోర్డులో రాసి ఉంది. మసీదు ముందు చిన్న పాండ్ (సరస్సు) ఉంది. పెద్ద పెద్ద నల్లని చేపలు అందులో ఈదుతున్నాయి. మసీదు లోపల స్తంభాలు, డోమ్, కళాత్మకంగా ఉన్నాయి. కొందరు ముస్లింలు నమాజ్ చేసుకుంటున్నారు. పైన పెద్ద బురుజులు ఏమీ లేవు. షేక్ సయ్యద్ ఆల్ హబ్షీ సుల్తానీ అనే ఆయన దీన్ని కట్టారట. మసీదులో పది లట్టిక్ వర్క్ చేసిన కిటికీలు ఉన్నాయి. (జాలీలు) లట్టిక్ రాయి చాలా విలువైనది. అందులో ఒక దానిని 11M అహమ్మదాబాద్ వారు తమ లోగోగా పెట్టుకున్నారు.

మొగలుల సామ్రాజ్యం ప్రారంభానికి ముందున్న చివరి గుజరాత్ సుల్తానేట్ కాలంలో (1573) మసీదు నిర్మించారు. జాలీ కిటికీలకు అది ప్రసిద్ధిగాంచింది. వాటి ఫ్రేములు మాత్రం మార్బుల్‌వి. జాలీలలో అంతర్లీనంగా ఖర్జూర చెట్టు అల్లబడి ఉంటుంది. దీనిది ఆఫ్రికన్ నిర్మాణ శైలి. మసీదు మెయిన్ రోడ్ మీదే ఉంది.

అక్కడికి కేవలం 300 గజాల దూరంలోనే జై భవానీ మందిర్ ఉంది. అక్కడ అమ్మవారు పార్వతీ దేవి అని అర్థమైంది. కాని ఆమె పేరును గుజరాతీ భాషలో ఏదో రాసి ఉన్నారు. మాకు తెలియలేదు. కాని ఆమె మనోజ్ఞసుందరంగా, ప్రశాంత వదనంతో ఉంది. గర్భాలయం చిన్నదే కాని ఆవరణ పెద్దది. సిటీలో అత్యంత జనసమ్మర్దంగా ఉండే మార్కెట్ ప్లేస్ ఉంది.

గుడి ముందు పెద్ద అశ్వత్థ వృక్షం, దానికింద విశాలమైన చప్టా కట్టి ఉన్నారు. దాని మీద కొందరు భక్తులు కూర్చుని అమ్మవారి కీర్తనలు పాడుతూ భజన చేస్తున్నారు. కీబోర్డు, డోలక్, వాయిస్తున్నారు. ఒక పెద్దాయిన మధురమైన స్వరంతో, మైక్ పట్టుకొని పాడుతుంటే ఇతరులు ఆయన్ను తమ గాత్రాలతో అనుసరిస్తున్నారు. అందరూ భక్తి పారవశ్యంలో ఉన్నారు.

మేము అమ్మవారి దర్శనం చేసుకుని, కాసేపు భజనలో కూర్చున్నాము, ఆయన పాడుతున్న పాదాలను, భాష తెలియకపోయినా రిపీట్ చేస్తూ. వారు కొంచెం జరిగి మాకు చోటిచ్చారు. త్వరలోనే భజనలో మేము లీనమయ్యాము. భజన సంప్రదాయంలో ఉన్న గొప్పతనమే అది. వ్యక్తిగతంగా పొందలేని ఏకాగ్రతను సముహంలో పొందగలగడమే అందులోని ప్రత్యేకత.

నా ప్రక్కన కూర్చుని, పాడుతున్న ఒకామెను అమ్మవారి పేరు అడిగితే, నా చెవిలో చెప్పింది “తుల్జా భవనీ మా” అని.

దాని ప్రక్కనే భద్రకాళి మందిర్ ఉంది. దాని ముందు ఒక వేదిక. దాన పైన, చుట్టూ, భక్తులు సమర్పించిన, అందమైన ఎర్రని వస్త్రాలు చుట్టిన, ముడుపులు కట్టి ఉన్నాయి. ఆ వేదిక ఎర్ర కలువలతో కూడిన ఒక చిన్న నీటి కొలనులా అనిపించింది నాకు. నాకెందుకో కొన్నింటిని చూస్తే కవితా వేశం వస్తుంది. మా వాడు విసుక్కుటాడని వాడితో చెప్పలేదు.

కాళీమాత విగ్రహం నిలువెత్తైనది. నల్లని, మెరుస్తూన్న రాయితో చెక్కారు తల్లిని. ఆమె తన ఎర్రని నాలుకను బయటకి చాచి ఉంది. ఆమె చేతుల్లో త్రిశూలం, చామరం లాంటివి ఉన్నాయి. ఆమె నేత్రాలు మంకెన పువ్వుల్లా ఎర్రగా, విశాలంగా ఉన్నాయి. విశేషం ఏమంటే, ఆమె భయం గొలుపేలా లేదు. భక్తిని గొలుపేలా ఉంది.

అమ్మవారి గుడికి సమీపంలోనే ‘భద్ర ఫోర్ట్’ ఉందని చెప్పారు. అదంతా ఓల్డ్ సిటీ ఆట. గుడిలోని ఒక శిలాఫలకం మీద వ్రాసిన దాన్ని బట్టి, దానిని, చాళుక్య వంశానికి చెందిన, రెండవ పులకేశీ మహారాజు, 625 ADలో వేంగిదేశాన్ని తాను జయించిన సందర్భంగా కట్టించాడు. కాకతీయ రాజులు తర్వాత ఆమెను తమ ‘కుల్‌దేవతా’ గా స్వీకరించారు. మార్కండేయ పురాణం ప్రకారం, ఆమె శివుని మూడో కన్ను నుంచి ఉద్భవించిందట, రాక్షస సంహారం కోసం. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందగలమట, ఆమెను ఆరాధిస్తే, అప్పుడు ఆహమ్మదాబాదు నగరం పేరు ‘కర్ణావతి’ అట. జనవరి చివరి భాగంలో దేవాలయంలో దేవీభాగవత సప్తాహం, కార్తీక శుక్ల పూర్ణిమ రోజు అన్నకూటం జరుగుతాయి.

అక్కడికి అతి దగ్గరలోనే ‘భద్ర ఫోర్ట్’ ఉంది. ఈ మూడు ప్రదేశాలు. కాలినడకనే కవర్ చేశాము. ఆటో మెయిన్ రోడ్ మీదే నిలుపుకున్నాడు.

భద్ర పోర్ట్ ఏమంత పెద్ద ఘనమైన కోట కాదు. దీనిని 1411 ADలో మొదటి అహమ్మద్ షా నవాబు, నిర్మించాడు. ఆయన మజఫరీద్ వంశానికి చెందినవాడు. దానిలో ఒక మసీదు, పురాతన చెక్కడాలు, అందంగా మలచిన కుడ్యాలు ఉన్నాయి. 2014లో అమ్దావాద్ పురపాలక సంస్థ దాన్ని పునరుద్ధరించింది. నగరంలోని ఒక సాంస్కృతిక కేంద్రం అది. పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది.

కోట వెలుపల చాలా ప్రభుత్వ కార్యారయాలు ఒక కోర్టు సముదాయం ఉన్నాయి. కోటకు సంబంధించిన భవనాలను అలా ఉపయోగించుకుంటున్నారని మాకు అర్థమైంది.

కోట నిర్మాణం ఇండో-సారాసెనిక్ శైలిలో నిర్మించారు. సబర్మతీ నది తూర్పుతీరం అక్కడికి దగ్గర. రెండ్ స్టోన్ నిర్మాణం. భద్రకాళి అమ్మవారి పేరే కోటకు పెట్టాడు మహమ్మదీయుడైన మొదటి అహమ్మద్ షా. దీన్ని బట్టి ఆయనకున్న మత సామరస్యం తెలుస్తూంది. అందరూ ఘజనీలు, ఔరంగజేలులూ కాదు కదా! కోట విస్తీర్ణం 43 చదరపు ఎకరాలు మాత్రమే. దానిని బ్రిటిష్ వారు 1817లో ఆక్రమించుకొని, స్వాతంత్ర్యం వచ్చే వరకు ఒక జైలుగా వాడుకున్నారు. సుల్తాన్ గారికి అమ్మవారు దర్శనమిచ్చి, నగరం సిరిసంపదలతో తులతూగాలని ఆశీర్వదించారనీ, ఆయన అప్పటి నుంచి ఆమె భక్తుడైనాడనీ అంటారు.

కోటకు 14 చిన్న బురుజులు, ఎనిమిది ద్వారాలు ఉన్నాయి. స్వాతంత్ర్యదినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం, గుజరాత్ ప్రభుత్వం భద్ర ఫోర్ట్‌లో ఘనంగా జరుపుతుంది.

ఆటో దగ్గరికి వెళ్లాము. పదిన్నర. అక్కడ ఉన్న టీ స్టాల్‌లో అద్రక్ ఛాయి బినా చీనీ తాగాము. అక్కడికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూడాబాయ్ మెట్లబావి (step well) కు బయలుదేరాము. సిటీ దాటేంత వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంది. మేం అక్కడికి చేరుకోడానికి 45 నిమిషాలు పట్టింది.

మెట్ల బావి ఉన్న గ్రామం పేరు ‘అదాలజ్’ దానిని 1498 ADలో కట్టారు. ఒక అద్భుతమైన నిర్మాణం అది. Architectural wonder. భూమట్టానికి సుమారు 650 అడుగుల లోతున ఒక బావిని త్రవ్వి, దాని మీద ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. అది ఐదు భాగాలుగా ఉంది. రాక్ కట్ స్తంభాలు, శిల్పాలు, అకులు లతలు పువ్వుల డిజైన్లు చెక్కిన అంచులు, ఆర్చ్‌లు ఆ కట్టడాన్ని అపురూపంగా మార్చాయి.

ఆ స్తంభాల మీది శిల్పకౌశలం, చెక్కడాలయితే వర్ణించలేము. చూడవలసిందే. ఐదు విభాగాలుగా ఉన్న ఆ నిర్మాణంలో నాలుగు వైపులా మెట్లు, మెట్లు, మెట్లు! అన్నీ మెట్లే! పది పన్నెండు మెట్ల తర్వాత కొంత చదును ప్రదేశం వదిలారు. అన్ని మెట్లూ అంతస్తులూ జాగ్రత్తగా దిగి బావిని చేరుకున్నాము. అంచు వరకు నిండుగా నీళ్లున్నాయి. స్వచ్ఛంగా ఉన్నాయి. ఫోటోలు వీడియోలు తీశాము.

అక్కడ కొందరు విద్యార్ధులు నోటు పుస్తకాలు, ప్యాడ్‌లు, ల్యాప్‌టాప్‌లు ధరించి, ఆ కట్టడంలోని డిజైన్లను కాపీ చేసుకుంటున్నారు. ఒక అమ్మాయిని ఇంగ్లీషులో పలకరించాను. “మీరంతా ఎవరు? ఏం చేస్తున్నారు? ” అని. ఆ పిల్ల నవ్వుతూ ఇలా జవాబు చెప్పింది.

“పితాజీ! నమస్తే. మేము బి.ఆర్క్ స్టూడెంట్స్‌మి. అదిగో అటు వైపు కూర్చున్నారే, వారంతా ఫాషన్ డిజైనింగ్ టెక్నాలజీ స్టూడెంట్స్, మాకందరికీ ఈ Step well case study గా పెట్టారు. అందుకే ఎక్కడా దొరకని ఈ డిజైన్లను స్టడీ చేసి, కాపీ చేసుకుంటున్నాము.”

“జీతే రహో బేటీ” అని ఆ అమ్మాయికి చెప్పి, మన పురాతన కట్టడాలు ఆధునిక విద్యా వ్యవస్థలో కూడ ప్రయోగాత్మకంగా పనికొస్తున్నాయి కదా అని ఆనందించాను.

ఈ స్టెప్ వెల్ గురించి కట్టడం బయట చాలా సమాచారం గ్రిల్డ్ బోర్డుల్లో పెట్టారు. చుట్టూ విశాలమైన ఆవరణలో పెద్ద పెద్ద చెట్లు, లాన్స్ పెంచారు. కట్టడం టెర్రెస్ పైకి ఎక్కి అక్కడి నుంచి landscape ను చూడవచ్చు. అక్కడి నుండి కూడా అంత లోతున వున్న బావి కనబడుతుంది. సూర్యకాంతి బావి మీద నేరుగా పడే విధంగా నిర్మాణం ఉంది. చుట్టూ నిర్మాణం, మధ్యలో ఓపెన్ ప్లేస్ అన్నమాట.

బోర్డుల్లో దేవనాగరి లిపిలో, గుజరాతీలో, ఇంగ్లీషులో మూడు వెర్షన్‌లు ఉన్నాయి. ఇంగ్లీషు వెర్షన్ జాగ్రత్తగా చదివాము. లార్డ్ గణేష్ భక్తుడైన మహామ్మద్ షా చక్రవర్తి. ఆయనకు సమర్పణగా ఈ మెట్లబావిని నిర్మించాడు.

అదాలజ్ స్టెప్ వెల్‌నే రూడాబాయి స్టెప్ వెల్ అని కూడ అంటారు. దీని నిర్మాణం 1499లో మొదలైంది. హిందూ శిల్పశైలి. ఇక్కడికి గాంధీనగర్ సిటీ దగ్గర. రణవీర్ సింగ్ మహారాజుగారి స్మృత్యర్ధం రాణి రూడాబాయి దీనిని నిర్మించారు. మరి మహమ్మద్ షా సంగతేమిటి? రణవీర్ సింగ్, వాఘేలా రాజ్యానికి సైన్యాధిపతి. సోలంకీ నిర్మాణ శైలు దీని ప్రత్యేకత. దీనిని octagonal structure అంటారు.

క్రింద నవగ్రహ మూర్తులున్నాయి. స్తంభాలు, గోడల నిండా, హిందూ దేవతామూర్తులు, ఏనుగులు, సింహాలు, పులులు, పువ్వులు, చేపలు, పక్షులు చెక్కారు. శిల్పరీతుల్లో ఇస్లామిక్ ఫ్లోరల్ డిచైన్స్, జైన్ సింబల్స్ కనబడతాయి. కబుర్లు చెప్పుకుంటున్న స్త్రీలు, నృత్య, సంగీత కార్యక్రమాలు, మజ్జిగ చిలుకుతున్న దృశ్యాలు గోడల మీద అందంగా చిత్రించారు (చెక్కారు).

అలా రూడాబాయి(అదాలజ్) మెట్లబావి మా ట్రిప్‌లో ఒక అరుదైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.

పన్నెండున్నరకు సిటీకి తిరుగు ముఖం పట్టాము. దారిలో వైష్ణోదేవి పర్వతం వద్ద ఆపాడు. అది కృత్రిమ, మానవ నిర్మితం, పెద్ద పెద్ద బండారాళ్లను కొండలాగా పేర్చారు. మధ్యలో కొండ దారి మెలికలు తిరుగుతూ సాగుతుంది. మెట్లు లేవు. అంతా slope గా ఉంటుంది. కాబట్టి సులంభంగా ఎక్కగలిగాము. నిజంగా పర్వతారోహణ చేస్తున్న అనుభూతికి లోనయ్యాను. అమ్మవారికి మందిరం కొండపైన ఉంది.

దాన్ని చేరుకోడానికి ముందు పది మీటర్ల పొడవైన ఒక గుహలో గుండా వెళ్లాలి. పూర్తి చివరన గుహ మూడుడుగల ఎత్తే ఉంది. మా యోగాగాడు సునాయాసంగా వంగి దాటి వెళ్లిపోయాడు. బక్క వెధవ! నాకు భయం వేసింది. అలా వంగితే, పొరపాటున నడుం పట్టేస్తే? ఆలోచించాను. ఇంత దూరం వచ్చాక వెనక్కు వెళ్లలేం. ఎందుకంటే వెనక్కు వెళ్లే దారి ఇంకోటి. మోకాళ్ల మీద కూర్చుని, రెండు చేతులూ క్రిందికి పెట్టి దోగాడుతూ గుహ దాటేశాను. మోకాళ్లకు చేతులకు గూహ క్రింద ఉన్న తడి అంటిందంతే! బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నాను.

వైష్ణోదేవి అమ్మవారు గుహ చివర ఒక Altar పై (వేదిక) పై ఉంది. ఆమ్మను దర్శించి, పడిన శ్రమనంతా మరిచిపోయాను. తెల్లని పాలరాతి విగ్రహం. ఎర్రని వస్త్రాలు కట్టారు. మనోజ్ఞ సుందరంగా ఉందా తల్లి. రెండు వైపులా ఎవరో దేవతా మూర్తులున్నారు. అమ్మవారిని స్తుతిస్తూ ఈ శ్లోకాన్ని చదివాను శ్రావ్యంగా.

శ్లో.

సరసిజనయనే సరోజహస్తే

ధవళతమాం శుకగంధమాల్య శోభే

భగవతి హరివల్లభే మనోజ్ఞే

త్రిభువన భూతకరి ప్రసీద మహ్యమ్.

భక్తి భావనతో నా హృదయం నిండిపోయింది. అక్కడున్న పండిత్‌జీ నా శ్లోకాన్ని విని ప్రశంసంగా తల ఊచాడు. ఒక నికెల్ కాయిన్ మీద అమ్మవారి రూపం ముద్రించి ఉంది. అలాంటి కాయిన్లను ప్రతి భక్తునికీ ప్రసాదంగా ఇస్తున్నారు. దాన్ని పర్సులో పెట్టుకుంటే మంచిదట.

అక్కడికి దగ్గర్లోనే సబర్మతీ రైల్వే స్టేషన్ ఉంది. జమ్ము, కాశ్మీర్ (కాత్రా) లోని వైష్ణోదేవి మందిరానికి అనుకరణ ఇది (రెప్లికా). ఈ పర్వతం 50 మీటర్ల వ్యాసం కలిగి ఉంది. వైష్ణోదేవి దుర్గాదేవి అవతారమే. ఇక్కడ దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు.

అప్పుడు సమయం ఒకటిన్నర. అత్మారామ్‌జీ అల్లరి మొదలైంది పొట్టలో. ‘సబర్మతీ సేతు’ మీదుగా మా రాయల్ ఫోర్ట్ చేరుకున్నాము. లంచ్‌కు ఆర్డరిచ్చాము. జీరా రైస్, ప్లెయిన్ రైస్, దాల్ తడ్కా, టమోటో కర్రీ, పెరుగు తిని పడుకున్నాం కాసేపు. ఇంతటితో మా గుజరాత్ టూర్ ముగిసినట్లే!

ఐదు గంటలకు టీ తెప్పించుకొని తాగాము. చెక్ అవుట్ చేశాము. మమ్మల్ని అహమ్మదాబాద్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేయిడానికి ఒక ఆటో మాట్లాడుకున్నాము. స్టేషన్ దగ్గరే. మా రైలు 6.20 నిమిషాలకు, బాంద్రా నుండి ఢిల్లీ వెళ్లే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్. అది జయపూర్(రాజస్థాన్)కు ఉదయం 6.30 నిమిషాలకు చేరుతుంది. మర్నాడు 23వతేదీ. మేం బయలుదేరి అప్పటికి ఎనిమిదో రోజు.

***

రైల్లో మాకు బెర్తులు చెరో చోట వచ్చాయి. ఒక యువకుడు మాకు సాయం చేసి అతని మిడిల్ బెర్త్ మాకు ఇచ్చి, దూరంగా ఉన్న మా లోయర్ బెర్తు తీసుకున్నాడు. అతని పేరు సురేంద్ర సింగ్ రాథోడ్. అతనోక రైటర్ అట. పైగా బాలీవుడ్‌లో అసిస్టెంటు డైరెక్టరట. ‘హిందీ మీడియం’ అన్న సినిమాకు స్టోరీ లైన్ చెప్పింది అతనే అట. కుర్రాడు కత్తిలా ఉన్నాడు. ఆ సినిమా హీరో ఇఫ్రాన్ ఖాన్ ఇతన్నెంతో ఆదరిస్తాడట. ఆ సినిమాను నేను OTTలో చూశానని చెబితే సంతోషించాడు.

మాకెదురుగ్గా ఇద్దరు దంపతులు కూర్చుని ఉన్నారు. ఆయన పేరు శ్రీమనోహర్ మణిచంద. ఆయన ధర్మపత్ని రీటా మణిచంద. మా గురించి అడిగితే చెప్పాము. వాళ్ల కూతురు పాలక్ మణిచంద. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) ప్రోగ్రాంలో పాల్గొన్నదట అక్టోబర్ 2022లో. లక్ష రూపాయలు ప్రశ్న దగ్గర ఓడిపోయింది. ఐనా గొప్పే కదా! అమితాబ్‌జీతో ఆ అమ్మాయి కూర్చున్న ఫోటోను మాకు చూపారా దంపతులు. బంగారు తల్లి! నిండా ఇరవై కూడా ఉండవు!

23వ తేదీ (ఫిబ్రవరి) ఉదయం 6.30కి జయపూర్ చేరుకున్నాము.

(ఫోటోలు – ఇంటర్‍నెట్ నుంచి సేకరణ)

(ఇంకా ఉంది)

Exit mobile version