గుజరాత్ రాజస్థాన్ పర్యటనానుభూతులు-8

2
2

[2023 ఫిబ్రవరి నెలలో గుజరాత్, రాజస్థాన్ లలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

గంట ముందే, తాను జయపూర్ రైల్వే స్టేషన్ దగ్గర మా కోసం వెయిట్ చేస్తున్నట్లు డ్రైవర్ ఫోన్ చేశాడు. అతని పేరు ఆస్తిక్ ఝూ అట. అతడు మమ్మల్ని మోహిత్ ప్యాలెస్ అనే హోటల్‌కు తీసుకెళ్లాడు. రిఫ్రెష్ అయింతర్వాత జయపూర్ సిటీ టూర్‌కు బయలుదేరాం. జయపూర్ పురాతన, చారిత్రక నగరం. చాలా అందమైన ఊరు. దానిని పింక్ సిటీ అంటారు. కారణం ఆ ఊర్లోని ఒక ఏరియా అంతా, భవనాలకు పింక్ రంగు వేశారు. పింక్ అంటే పూర్తిగా పింక్ కాదు లేత ఇటుక రంగు. అలా అని నగరమంతా అలా లేదు. హోటల్ కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఎనిమిదిన్నర తర్వాత ఇస్తారట. బయట తిందామని ఆస్తిక్‌కు చెప్పాము. రోడ్డు సైడ్ చిన్న టిఫిన్ సెంటర్లయిననా పరవాలేదన్నాము.

“అక్కడయితేనే, వేడిగా, రుచిగా ఉంటుంది సర్ ఫుడ్డు!” అన్నాడతడు. “మన కళ్లముందే తయారు చేస్తారు.”

“నిజం భయ్యా!” అన్నాను. “అదీ గాక రెస్టారెంట్‌కు వెళితే ఆర్డరివ్వడం, తెచ్చివ్వడం, ఇలా గంట వేస్టుతుంది.”

ఒక చోట పుట్ పాత్ మీద ఒక వ్యాన్‌లో మొబైల్ క్యాంటిన్ కనబడింది. మా వనస్థలిపురంలో, విజయవాడ హైవే మీద దిల్‌సుఖ్‌నగర్ నుంచి హయత్‌నగర్ వరుకు ఇలాంటివి కి.మీ ఒకటి ఉంటాయి. చట్నీస్, మినర్వా లాంటి ఖరీదైన చోట్ల కంటే వీళ్ల దగ్గర టిఫిన్స్ బాగుంటాయి.

అతని దగ్గర పోహా, ఆలూపరోటా ఉన్నాయి. అంత పొద్దున్న అవి తినలేం అనుకొని “దగ్గర్లో ఇడ్లీ, దోస్ లాంటివి దొరుకుతాయా?” అనడిగాము. కొంచెం ముందుకు వెళ్లి ఎడం వైపు తిరుగుతే హవామహల్ ఎదురుగా ఒక చిన్న టిఫిన్ కొట్టు ఉంటుందని అందులో సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఉంటాయన్నాడు. ఇటినరీలో మా మొదటి ప్లేస్ హవామహలే!

అక్కడ ఇడ్లీ అయిపోయింది. ఊతప్పం ఉందన్నారు. చిన్న ఊతప్పాలు కాలుస్తున్నారు. తలా రెండు తిన్నాము.

హవామహల్ జయపూర్ లోని రాజప్రాసాదాల్లో అతి ముఖ్యమైంది. దాన్ని exteriors చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. లోపలికి వెళ్లాము. అది ఐదంతస్తులుగా ఉంది. అన్ని అంతస్తుల్లో పెద్ద పెద్ద ద్వారాలు, కిటికీలు ఉండి గాలి ధారాళంగా వీస్తూంది. బహుశా అందుకే దానికి ‘హవామహల్’ అని పేరొచ్చిందేమో?

మా యోగా అన్నాడు “ఒరేయ్ శర్మా, ఈ రాజుగారెవరో ‘గాలిగతప్రాణిలా’ ఉన్నాడురా! మరీ ఇంత వెంటిలేషనా? బాబోయ్!”

అదృష్టవశాత్తు హైదరాబాదులో మా ఇల్లు, అదోనిలో వాళ్లదీ ఇండివిడ్యుయల్ హవుస్‌లే. హవామహల్ లెవెల్లో లేకపోయినా, వెంటిలేషన్ బాగుండేలా కట్టించాము లెండి. అయినా, నక్కకూ నాగలోకానికీ పోలికేమిటి, నా ముఖం!

హవామహల్ గోడలకు కూడ పింక్ కలరే వేశారు. అది పింక్ సిటీ ఏరియాలోది, బడీ చౌపాడ్ అనే చోట ఉంది. ఎరుపు, పింక్ శాండ్ స్టోన్ నిర్మాణం. హిందూ రాజ్‌పుట్ శైలిలో కట్టారు. దీనిని 1799లో జయపూర్ స్థాపకుడు మహారాజా సవాయి ప్రతాప్ సింహ్ నిర్మించాడు. దీనిలో మొగలల నిర్మాణ శైలి కూడా కలుస్తుంది. దీని శిల్పి లాల్ చంద్ ఉస్తాద్.

హవామహల్ శ్రీకృష్ణునికి అంకితం చేయబడింది. దాని రూపం పరమాత్మ కిరీటాన్ని పోలి ఉంటుంది. ఇది ఒక సాంస్కృతిక, శిల్పనిర్మాణ అద్భుతం అని చెప్పవచ్చు. మొదటి అంతస్తులో శరద్ మందిరం, రెండవ అంతస్తులో రత్నమందిరం, మూడవ అంతస్తులో విచిత్ర మందిరం, నాల్గవ దాంట్లో ప్రకాశ మందిరం, చివర హవామందిర్ ప్రత్యేక ఆకర్షణలు.

భవనంలో మొత్తం 953 కిటికీలు, జాలీ వర్క్ చేయబడి ఉన్నాయి. కళాత్మకంగా అమర్చారు వాటిని. ప్రవేశద్వారం రాచరిక ఠీవి ఉట్టిపడుతూ, చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో చిన్న మ్యూజియం కూడా ఉంది. రాజస్థాన్ చరిత్రను ప్రతిబించే మినియేచర్ పెయింటింగ్స్, ఇతర స్మారక చిహ్నాలు దర్శనమిస్తాయి. భవనం పై అంతస్తు నుండి చూస్తే, జంతర్ మంతర్, సిటీ ప్యాలెస్‌లు బాగా కనబడతాయి.

భవనంలో మెట్లుండవు. అన్నీ ర్యాంపులే. మాలాంటి సీనియర్ సిటిజన్లకు చాలా సౌకర్యంగా ఉంటుంది. లోపల ఒక ఫౌంటెన్ ఉంది. దాన్ని దాటుతూనే మహారాజా సవాయి ప్రతాప్ సింహ్ విగ్రహం నిలువెత్తున దర్శనమిస్తుంది.

విశేషమేమంటే హావామహల్ ఎలాంటి పునాదులు లేకుండా నిర్మించబడింది! అందుకే అది 87 డిగ్రీల కోణంలో ఉంటుంది. మొత్తం నిర్మాణం ఒక తేనెపట్టును పోలి ఉండటం విచిత్రం. ఎంట్రీ ఫీజు 50 రూపాయలు. విదేశీయులకు 200 రూపాయలు.

హవామహల్ నుంచి బయటకు రావటానికి గంట పైనే పట్టింది. కారు పార్కింగ్ చాలా దూరమట. ఎక్జిట్ గేటు 300 మీటర్ల దూరంలో ఉంది. అక్కడికి రమ్మనమని చేప్పాడు మా ఆస్తిక్ మహాశయుడు.

అక్కడ బొగ్గుల పొయ్యి మీద కెటిల్ కట్టుకొని, అద్రక్ చాయ్ అమ్ముతూ తిరుగుతున్నారు కొందరు. చాయ్ తాగాము. చాలా బాగుంది. మా తరువాతి గమ్యం సిటీ ప్యాలెస్.

అది దగ్గరలోనే ఉంది. ఆ రోడ్డును తులసీమార్గ్ అంటారు. నగరం నడబొడ్డున ఉందా రాజప్రాసాదం. దానిలో ఎన్నో వసారాలు, తోటలు, భవనాలు ఉన్నాయి. అందులో చంద్రమహల్, ముబారక్ మహల్, శ్రీ గోవింద్ దేవ్ మందిరం, సిటీ ప్యాలెస్ మ్యూజియం ముఖ్యమైనవి.

ముబారక్ పాలెస్ వద్ద రచయిత

భవనానికి మొత్తం 3 ద్వారాలు. రాజవంశీకులకు మాత్రం ఉపయోగపడేది త్రిపోలియా ద్వారం. సాధారణ పౌరులు, సందర్శకులకు మాత్రం ఉదయ్ పోల్, వీరేంద్ర పోల్ ద్వారాలు. లోపల ‘సభానివాస్’ అనే దర్బారు హాలు, విశాలంగా శిల్పములు, చెక్కడములతో అలరారుతూంది.

తర్వాత ‘సర్వతోభద్ర’ అనే హాలు. రాజుగారు ఇక్కడ పురప్రముఖలతో మాత్రమే సమావేశమయేవారట. సిటీ ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలు ఇప్పటికీ ఘనంగా జరుపుతారుట. దీనిలో ప్రవేశరుసుము మాత్రం 200 రూపాయలు. ఎక్కువనిపించింది మాకు!

భవన నిర్మాణం 1727లో, మహారాజా సవాయి జైసింగ్ II గారి కాలంలో జరిగింది. ఆయన రాజ్‌పుత్స్ లోని కచ్వాహా వంశీయుడు. మ్యూజియంలో రాజులు వాడిన అయుధాలున్నాయి. రాజకుంటుంబీకుల పురాతన వస్తువులున్నాయి. ‘బగ్గీఖానా’ అనేది పార్కింగ్ ప్లేస్ అప్పుడు. క్వీన్ విక్టోరియా ఇంగ్లాండును పరిపాలిస్తున్న కాలం అది. రకరకాల గుర్రపు బగ్గీల అవశేషాలున్నాయిక్కడ.

మాకే మనిపించిందంటే హావామహల్ కంటే సిటీ ప్యాలెస్ లోనే మెయిన్‌టెనెస్స్ బాగుందని. హవామహల్ అపరిశుభ్రంగా, క్రమం లేకుండా ఉంటుంది. ఎంట్రీ ఫీజుల తేడా వల్లనేమో ఈ తేడాలని అనుకొని నవ్వుకున్నాము. అక్కడి నుంచి జంతర్‌మంతర్ అనే చోటు చేరుకున్నాము. జంతర్ అంటే యంత్రమని, మంతర్ అంటే మంత్రమని అర్థం.

పూర్వం కాలగణన, ఖగోళశాస్త్ర విషయాలను నిర్ధారించడానికి, అప్పటి పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన యంత్రాలు ఉన్న ఆవరణను జంతర్‌మంతర్ అని పిలుస్తారని అర్థమైంది. అంతే గణితశాస్త్రానికి, జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన యంత్రాలు, డయాగ్రామ్స్ అక్కడ ఉన్నాయి. పన్నెండు రాశులు ఎలా పరిభ్రమిస్తాయో కూడా సూచించే యంత్రం ఉంది. అవన్నీ కేవలం సూర్యని దిశ, లాంటి ప్రకృత అంశాలపైనే ఆధారపడి పని చేస్తున్నాయి. ఎలాంటి కృత్రిమ ఇంధనాలు లేవు. ఇలాంటి చోటును ఇంగ్లీష్‌లో Observatory అంటారు.

ఇక్కడ ఖగోళశాస్త్రానికి సంబంధించిన 19 పరికరాలను చూశాము, ఇక్కడి యంత్రాలన్నీ జైపూర్ స్థాపక మహారాజ, రాజపుత్ సంవాయి జైసింగ్ II నిర్మింపచేసినవే. ఇది 1734లో పూర్తయింది. ఆవరణలో ఉన్న ప్రభుత్వ పురావస్తు శాఖ నోటీసులో బోర్డు చదివి చాలా విషయాలు తెలసుకున్నాం.

ప్రపంచంలోనే అతి పెద్దదయిన రాతితో నిర్మించిన గడియారం (sun dial) ఇక్కడ ఉంది. UNESCO ఈ ప్రాంతాన్ని, ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. జంతర్‌మంతర్ విస్తీర్ణం 18,652 హెక్టార్లు (36,241 ఎకరాలు) ఇక్కడ ఒక స్మారక చిహ్నం ఉంది. ఇందులో 3 ఖగోళ సమన్వయ వ్యవస్థలు పని చేస్తాయి. అవి హోరిజన్-జెనిత్ లోకల్, ఈక్విటోరియల్, ఎక్లిప్టిక్ వ్యవస్థలు.

దీని నిర్మాణంలో 23 మంది ఖగోళ శాస్త్రవేత్తలు పని చేశారు.

నేను మా స్నేహితుడితో అన్నా “ఈ సెల్‌ఫోన్‌లు వచ్చి జనాలు చేతి వాచీ పెట్టుకోవడం మానేశారు! అప్పట్లో ప్రకృతిని పరిశీలించడానికి జైసింగ్ ఎంత కృషి చేశాడో!”

మా యోగానందుల వారిలా సెలవిచ్చారు, “వుయ్ టేక్ పైన్స్ ఫర్ గ్రాంటెడ్ రా, శర్మా! అన్నీ మనకు అతి సులభంగా అమిరాయి. పూర్వీకులు ప్రతిదీ శోధించి తెలుసుకున్నారు వాళ్లు. యంత్రాలను శాసిస్తే, యంత్రాలు ఇప్పుడు మనల్ను శాసిస్తున్నాయి. అంతే!”

“ఎంత బాగా చెప్పావురా, వెధవా!” అన్నా.

“ఏమో! నీ సావాసం చేసి, చేసి, చెడిపోయినట్లున్నా!” అన్నాడు వాడు నవ్వుతూ. వాడి భుజం మీద ఒకటి పీకాను. నేనూ నవ్వుతూ. వాడు నాకు దొరక్కుండా పరిగెత్తుతుంటే, వాడి వెంట పడ్డాను. “బుడ్డే లోగ్ మజాక్ కర్ రహై హై!” అన్నాడొక టూరిస్టు మమ్మల్ని చూస్తూ.

అక్కడికి దగ్గరలోనే ‘జల్‌మహల్’ ఉంది ఒక పెద్ద సరస్సు మధ్యన నిర్మించిన పెద్ద భవనమది. సరస్సులో రెండు చోట్ల కళాత్మకమైన మంటపాలున్నాయి. కొంత కాలం క్రింది వరకు భవనం దగ్గరికి వెళ్లడానికి బోటింగ్ సౌకర్యం ఉండేదని, ఇప్పుడు లేదని చెప్పాడు మా ఆస్తిక్ ఝూ. సరస్సు అంచున ఉన్న రెయిలింగ్‌లు పట్టుకు నిలబడి భవనాన్ని చూశాం. ఆ సరస్సు పేరు ‘మన్ సాగర్’ మనస్సు అనే సముద్రం. ఎంత నిగూఢామైన అర్థం ఉందో చూడండి. మనస్సు నిజంగా సాగరమే. దాని లోతులు తెలుసుకోవడం చాలా కష్టం.

సరస్సు విస్త్రీర్ణం 300 ఎకరాలు. వెనుకవైపు పచ్చటి కొండలు, లోయలు, నీరు నీలిరంగులో స్వచ్ఛంగా ఉంది. జల్‌మహాల్‌ను 1699లో నిర్మించారు. 18వ శతాబ్దంలో జైసింగ్ II మహారాజు దాన్ని పునర్నిర్మించారు. సరస్సు లోతు ఐదు మీటర్లు వరకు ఉంటుంది. రాజవంశీయులకు అది ఒక పిక్నిక్ స్పాట్ అట. సరస్సుకు తూర్పున దూరంగా మన్ సాగర్ డ్యాం కనబడుతూంది. వెనక ఉన్న పర్వతాలను నహర్‌గఢ్ కొండలు అంటారు. అవే ఆరావళీ పర్వత శ్రేణులు.

అక్కడ ఇరవై నిమిషాలున్నాము. టైం ఒంటిగంట దాటింది. సరస్సు బయట రోడ్డు పక్కన రకరకాల తినుబండారాలు, డ్ర్రింకులు బండ్ల మీద అమ్ముతున్నారు. ఒక సోడాల బండిని చూసి ప్రాణం లేచి వచ్చింది ముసలి ప్రాణాలకు. అవీ గోలీ సోడాలు! సోడా ధర 30 రూపాయలు. ఎక్కువే అనిపించింది. నిమ్మకాయ సోడాలు తాగాం ఇద్దరం. “అస్సీ రూపయే” అన్నాడు రాజపుత్రవీరుడు. “అదేమిటి, అరవయ్యే కదా, ఎనభై అంటావేమిటి?” అని అడిగా. మామూలు సోడా ముప్ఫై, నీంబుకా సోడా నలభై అట!

‘కాంచనం కర్మవిమోచనం’ అనుకుంటూ అతనికి ఎనభై రూపాయలు సమర్పించుకున్నాము.

మంచి వెజిటేరియన్ హోటల్‌కు తీసుకువెళ్లమన్నాము చోదకాస్తికుడిని.

“ఒరేయ్ మన ఊర్లో, మన హైస్కూల్లో చదివేటప్పుడు, సాయంత్రం ప్లే గ్రవుండ్‌లో బాల్ బాడ్మింటన్ ఆడే వాళ్లం గుర్తుందా?” అని అడిగా యోగాను. “ఎందుకు గుర్తు లేదు?” అన్నాడు వాడు. మా రాయలసీమలో ప్రశ్నకు ప్రశ్నకు సమాధానంగా చెబుతాం. దాన్ని పొగరు అని కూడా అనుకుంటారు.

నేను సోంపేటలో పని చేసేటప్పుడు, కాలేజీకి నడిచి వెళ్లేవాడిని. ఒకసారి మా కెమిస్ట్రీ మాస్టారు ఎమ్.ఎస్.ఎన్ తన బజాజ్ చేతక్ మీద వెళుతూ, నన్ను చూసి ఆపి “వస్తారా, ఇంగ్లీషు మాస్టారు?” అని అడిగాడు. ఆయన ఆ స్కూటర్‌ను పేకాటలో గెలుచుకున్నాడని అనేవారు. నేను మా పద్దతిలో,

“ఎందుకు రాను సార్!” అంటూ వెనకెక్కి కూర్చున్నా.

ఆయన బండిని ముందుకు పోనిచ్చి “ఏమన్నా, మాస్టారు, మీ రాయలసీమ వారికి కొంచెం గీర ఎక్కువే!” అన్నాడు.

“ఏమిటి సార్?” అన్నా ఆశ్చర్యంగా.

“లేకపోతే ఏమిటండీ, వస్తారా? అని అడిగితే, మర్యాదగా, వస్తానని చెప్పాలి గాని, ఎందుకు రాను? అని దబాయిస్తారేమిటి?” అన్నాడాయన.

“అది మా మ్యానరిజం సార్!” అన్నా నవ్వుతూ.

“మీ మ్యానరిజం మండిపోనూ!” అన్నాడాయన కూడా నవ్వుతూ.

తర్వాత, మేమ రిక్వెస్ట్‌ను నెగెటివ్ ప్రశ్నరూపంలో వేస్తాం. హైదరాబాద్‌లో సిటీ బస్సులో, కండక్టరు, నాకు ఇవ్వాల్సిన చిల్లర టికెట్ వెనక రాసిచ్చాడు. నా స్టాప్ రాబోతుంటే నేనతన్ని, “భయ్యా చిల్లరియ్యవా?” అనడిగాను. ఇవ్వమని అర్థం. దానికి కండక్టర్‌కు కోపం వచ్చింది. “ఇయ్యకుంటే ఊకుంటవానె, కాకా! గట్లనా అడిగేది?” అన్నాడు. నాకర్థం కాలేదు. పక్కనున్నాయన వివరించాడు. “మీరన్నదాన్ని ఇస్తావా, ఇయ్యవా, తేల్చు!” అన్నట్లు అనుకున్నాడని.

సరే, ఎక్కడికో.. వెళ్లిపోయాం, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ లాగా. మా యోగా అన్నాడు. “బాడ్మింటన్‌లో గెలిచిన టీంకు ఓడిన టీం సోడాలు తాపించాలని రూలు కదరా. అందరం బస్టాండులోని ‘పిట్టపిడుగు కూల్ డ్రింక్స్’ కు వెళ్లేవాళ్లం పోలోమని.”

“ఇప్పుడు సోడాలు తాగితే అదే గుర్తొచ్చిందిరా! యాభైఏళ్లు కాలా?”

“దాటింది రోయ్! అప్పుడు సోడా పది పైసలు. ఫుల్ గ్యాస్ మక్కుల్లోకి చెవుల్లోకి పోయి ఉక్కిరిబిక్కిరయ్యేవాళ్లం.”

“పిట్టపిడుగు సాయుబు పేరేందిరా, మర్చిపోయాను.”

“నాజిర్. గోలీని వేలితో కొడితే కు.. య్.. మనే సౌండు చాలా సేపు కర్ణపేయంగా వినిపించేవాడు” అతని వైపు ఆరాధనా చూసేవాళ్లం!”

“మనం ఎంత ప్రయత్నించినా ఆ నీలం రంగు గోలీ కొంచెమైనా కదిలేది కాదు.”

“అంగడి బోర్డు గుర్తుందా, ఇచ్చట, సోడా, లెమన్, జింజిర్, నన్నారిషర్బత్, సుగంధపాలు లభించును.”

అలా బాల్య స్మృతులు నెమరేసుకున్నాం కాసేపు.

కారు ఒక రెస్టారెంటు ముందాపాడు. దాని పేరు ‘ఖనాఖజానా’. నాకెందుకో ‘నాబజానా’ గొర్తొచ్చింది. అక్కడ రాజస్తానీ తాలీ తిన్నాం. 170 రూపాయలు. అన్‌లిమిటెడ్. అదేనండి ఫుల్ మీల్స్. మెత్తని, పొంగిన, వేడి వేడి పుల్కాలు, గోబీ మసాలా కర్రీతో అరగించాం. తర్వాత కొంచెం వెజ్ బిర్యానీ, వైట్ లైక్ విత్ కడీ (మజ్జిగ పులుసు) బూందీ రైతా, దహీ, చివర్లో హల్వా కొద్దిగా ఇచ్చాడు. ‘ఇంత కంటె చెడిపోయేదేముందిలే’ అనుకొని తినేశాం. అది మా నాన్నగారికి ఊతదపదం! కాదు, ఊతవాక్యం!

భోజనం బాగుందనుకున్నాం. అక్కడి నుంచి ఆమెర్ కోట (ఆంబెర్) కు తీసుకుని వెళ్లాడు. అది ఒక కొండ మీద కట్టారు. నాలుగు వైపులా కళాత్మకమైన బురుజులు, చుట్టూ పటిష్టమైన ప్రాకారం క్రింది నుంచే కనబడుతున్నాయి.

“మెట్లు చాలా ఎక్కాల్సి ఉంటుందా భయ్యా!” అనడిగాను.

“అస్సలు లేదు సార్. కారు కొండపై వరకు వెళుతుంది. ఘాట్ రోడ్డు లేశారు. పార్కింగ్ నుంచి వంద మీటర్లు దూరంలోనే కోట మెయిన్ తలుపు సార్.”

“వెరీ గుడ్! మెట్లు చాలా ఉండే కోటలు స్కిప్ చేద్దాం. ఎక్కలేం ఈ వయసులో!”

యోగాగాడు నవ్వుతూ చూస్తున్నాడు. బక్కవెధవ! నాకంటే వెయ్యి రెట్లు నయం వాడు.

డ్రైవర్ అన్నాడు “మీకేం సార్! ఈ వయసులో ఇంత దూరం వచ్చి అన్నీ తిరుగుతున్నారు. మీ ఇద్దరికీ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయా?”

“నాకు అరవై ఆరు. వీడు నా కంటే రెండేళ్లు పెద్ద.”

డ్ర్రైవర్ ఆశ్చర్యపోయాడు. “నిజమేనా సార్! ఆ లెక్కన ఫిట్‌గా ఉన్నట్లే!” నేను గర్వంగా మా మిత్రుడి వైపు చూశాను. వాడు ఒకటే నవ్వు!

“ఎందుకు రా ఆ నవ్వు?” అన్నా కోపంగా.

“అతనేదో మెరమెచ్చులకంటే.. నీవు నిజంగానే ఫిట్ అనుకొని..” ఇంకా నవ్వుతున్నాడు రాస్కెల్!

కోట లోపలికి వెళ్లాము. ఇంటీరియర్స్ అద్భుతం. చుట్టూ నగషీలు చెక్కిన స్తంభాలతో సభాభవనం, మూల మూలల సజీవంగా ఉన్నాయేమో అనిపించే ఏనుగులు, సింహాల బొమ్మలు. బురుజుల పక్కన ఫిరంగులు మోహరించి ఉన్నాయి. క్రింద పరచిన బండలు పాలిష్ చేయని మార్బుల్ అనుకుంటాను చల్లగా ఉన్నాయి.

ఒక మూల పక్కా రాజస్థానీ దుస్తుల్లో ఉన్న ఒకతను ఒక సంగీత సాధనాన్ని ఊదుతున్నాడు. ‘నాగిన్’ లోని హిందీ పాటగా లీలగా అర్థమౌతుంది.

అతని ముందు ఒక వెదురు బుట్ట ఉంది. తెరచి ఉన్నా దానిలో, తళ తళ మెరుస్తూన్న నల్ల త్రాచు ఒకటి పడగ విప్పి నాట్యం చేస్తూంది. అతని ప్రక్కన నిలబడి, పాముతో బాటు ఫోటో తీసుకున్నాము. అతనికి పది రూపాయలిచ్చాం. పాము చాలా చురుగ్గా ఉంది. కాని బుట్టలోంచి బయటకి రావడం లేదు. కోటలో ఒక అరగంట గడిపి కారు పార్కింగ్ దగ్గరికి వస్తూండగా పురావస్తు శాఖవారి బోర్డు కనబడితే, దాన్ని ఆసాంతం చదివాము.

కోట ఉన్న ప్రాంతాన్ని ఆమెర్ అంటారుట. ఆంబెర్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఇది జైపూర్‌కు పదకొండు కి.మీ. దూరంలో ఉంది. ఈ నగరాన్ని (ఆమర్) కోటను మినాస్ వంశీయుడైన, చందావంశానికి చెందిన, రాజా అలన్ సింగ్ చందా నిర్మించాడు. ఇది కూడ యూనెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ సైటే!

రాజ్‌పుట్, మొగల్ నిర్మాణ శైలుల సంకలనం ఈ కోట. రెండు సభా మందరాలను చూశాము లోపల. ఒకటి దివాన్-ఇ–ఆమ్, అంటే ప్రజలు సమావేశం అయ్యేది. రెండోది దిమన్-ఇ-ఖాస్. ఇందులో రాజవంశీయులు, ఆధికార్లు, పురప్రముఖులు సమావేశమౌతారు. లోపల ఒక జలాశయం ఉందిట (దాన్ని మేం చూడకుండా వచ్చేశాము). కోట అంతా రెడ్ స్టోన్, మార్బుల్ వాడారు, నిర్మాణంలో.

ఒక హిందీ సినిమా ఘాటింగ్ కోసం కోటనంతా పాడు చేశారట. ఎవరో కోర్టుకు వెళితే, రాజస్థాన్ హైకోర్టు ఘాటింగ్‌ను నిలిపేయమని ఆర్డర్ ఇచ్చింది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగేపోయింది. 2005 లెక్కల ప్రకారం కోటలో 87 ఏనుగులుండేవట. పోషకాహర లోపం, వాటి దుర్వినియోగం (రవాణా కోసం) వల్ల చాలా మటుకు చనిపోయాయి.

కోటలోకి ఎంట్రీ ఫీజు యైభై రూపాయలే. విదేశీయులకైతే 550 రాపాయలు. భారతీయ విద్యార్ధులకైతే పది రూపాయలు. కోటను 1592లో నిర్మించారు. చాలా సార్లు renovation జరిగింది. గోడలు, పై కప్పులపై హిందు దేవతల శిల్పాలు చెక్కారు. ప్రముఖ బాలీవుడ్ సినిమాలు జోధా అక్బర్, బాజీరావ్ మస్తానీ, భూల్ భులయ్యా లాంటి వాటిల్లో ఈ కోట ఉంటుంది.

అక్కడ నుంచి ‘హథీ అడ్డా’ కు వెళ్లాము. ఊరంతా ఏనుగులు, ఒంటెలు తిరుగుతున్నాయి. అంత ట్రాఫిక్‌లో కూడ అవి బెదరడం లేదు. వాటి పైన ఉన్నవారు పెద్దగా వాటిని అదుపు చేస్తున్నట్లుగా కూడ మాకనిపించలేదు. దాన్ని ‘గజశాల’ అనే వారట. అక్కడ నాలుగు మహాగజాలున్నాయి. ఐదువందలు కట్టించుకొని వాటికి పెట్టడానికి పెద్ద బుట్ట నిండా అరటి పళ్లు, చెరుకు ముక్కలు, తొక్కతీయని పైనాపిల్ ముక్కలు ఇచ్చారు.

ఏనుగులకు బాగా టూరిస్టులు అలవాటయినట్లుంది. ఇచ్చినవి తొండంతో తీసుకొని నోట్లో పడేసుకుంటున్నాయి. వాటి కాళ్లు స్తంభాల్లా ఉన్నాయి. మావటీలు ఆ కాళ్ల మధ్యన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక ఏనుగయితే, దాని కెంత బద్ధకమో మరి! తొండం చాచదు. నోరు తెరుస్తుందంతే! డైరెక్ట్‌గా నోట్లో వేయించుకుంటుంది! అక్కడ ఎలిఫెంట్ సఫారీ కూడ ఉంది. సఫారీ ఏనుగులు వేరే. వాటిని అందంగా అలంకరించారు.

ఆ ప్రాంతాన్ని ‘హాధీగావ్’ అంటారట.

అక్కడి నుంచి ‘అల్బర్ట్ మ్యూజియం’కు వెళ్లాం. అది ఒక పురాతన కళాత్మక కట్టడం. దాని ముందు విశాలమైన లాన్స్, ఫౌంటెన్స్, వృక్షాలున్నాయి. మెయిన్ రోడ్ లోనే ఉందది. అక్కడ రాజవంశీయులు వాడిన దుస్తులు, ఆయుధాలు ఉన్నయంతే! మాకు అందులో నచ్చినవి మధ్యలో పైకప్పు నుంచి వేలాడదీసిన అది పెద్ద గాజు షాండెలియర్లు. అవి చాలా బాగున్నాయి. మధ్యలో లైట్లు వెలుగుతున్నాయి.

ఆ ప్రాంతాన్ని బిరేశ్వరిని, రామ్ నివాస్ గార్డెన్ అనీ అంటారు. భవన నిర్మాణ శైలి ఇండో – శారాసనిక్. 19వ శతాబ్దంలో (1887) ఏర్పాటయింది. 2008లో రిన్నోవేట్ చేశారట. దీన్ని రూపకల్పన చేసిన వారు శామ్యూయల్ స్వింటన్ జాకబ్. కాని రాజపుట్ నిర్మాణ ప్రభావమే ఎక్కువగా ఉంది.

రెండో అంతస్తులో గుప్తుల, కుషానుల, ఢిల్లీ సుల్తానుల, మొగలుల, భ్రిటిష్ వారి కాలం నాటి పెయింటింగ్స్, జ్యూవలరీ, కార్పెట్స్, దంతపు సామాగ్రి, క్రిస్టల్ సామాగ్రి కలెక్షన్స్ ఉన్నాయి. విశేషం ఏమిటంటే మ్యూజియంలోని వస్తువుల వివరాలన్నీ ఒక పెద్ద లెడ్జర్‌లో ఎంటర్ చేసి ఉండటం. కల్నల్ ధామస్ హెచ్ హెండ్లీ అనే ఆయన మ్యూజియం క్యూరేటర్‌గా, దీన్ని బాగా అభివృద్ధి చేశారు.

మేము మా మోహిత్ ప్యాలెస్ చేరుకొనే సరికి సాయంత్రం ఏడు అయింది. హాయిగా స్నానాలు చేసి లుంగీలు కట్టేసుకున్నాము. డ్రైవర్ మమ్మల్ని దించి వెళ్లిపోయాడు. మేము ఇటినరీలో లేనివి ఏమున్నాయో గూగుల్‌లో చూశాం. గణేశ్ మందిర్, బిర్లా మందిర్ ఉన్నాయి. బిర్లామందిర్‌ను రాత్రి పూటే చూడాలట.

సరిగ్గా ఎనిమిదికి, ఒక ఆటో మాట్లాడుకొని బిర్లామందిర్ వెళ్లాము. దగ్గరే! మూడు కిలోమీటర్లు ఉంది. 50 రూపాయలు తీసుకున్నాడు. పాపం అత్యాశ లేదు! బిర్లామందిర్ పూర్తి పాలరాతి భవనం. చుట్టూ డూమ్ లైట్లతో మెరిసిపోతోంది. చాలా విశాలమైన ఆవరణ. లోపల గర్భగుడిలో లక్ష్మీనారాయణుల విగ్రహాలు మధుర మోహనంగా ఉన్నాయి. జీవకళ తొణికిసలాడుతూంది. గర్భగుడి ముందున్న హాలు, శిల్పకళాకృతులతో శోభిల్లుతూంది.

దర్శనం అద్భుతంగా జరిగింది. పెద్దగా జనం లేరు బయట. ఒక మంటపంలో శివపార్వతుల విగ్రహాలు కనువిందు చేశాయి. బిర్లా మందిర్ మెయిన్ రోడ్డు మీదే ఉంది. దాన్ని ‘జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్’ అంటారట. దీనిని బి.ఎం.బిర్లా ఫౌండేషన్ వారు 1988లో నిర్మించారు.

ఎంట్రీ ఫీజు లేదు! అక్కడికి అతి దగ్గరలోనే గణేశ్ మందిర్ ఉంది. అది జైపూర్‌లో చాలా ప్రసిద్ధి చెందింది. వినాయకుడి విగ్రహం చాలా పెద్దది. పది పన్నెండు మెట్లెక్కి లోపలికి వెళ్లాం. స్వామికి దట్టంగా సిందూరం పూశారు. ఆయనకు మోతీడుంగ్రీ గణేశ్‌జీ అంటారు. చిన్న గుట్ట మీద ఉంది గుడి. దీనిని 1761లో నిర్మించారు. సిధ్ జయరామ్ పాఠీవాల్ దీని స్థాపకుడు. బిర్లా మందిర్, గణేశ్ మందిర్ రెండూ పక్కప్కనే ఉంటాయని చెప్పవచ్చు. వెనుక పెద్ద పర్వతం, దాని మీద కూడా ఏదో గుడి ఉంది.

తొమ్మిదిన్నరైంది. ఆకలి! ఎన్ని విశేషాలు చూసినా మనసు నిండుతుంది కాని కడుపు నిండదు. భోజనం చేసే మూడ్ లేదు. “ఏదైనా మన టిఫిన్ దొరుకుతే బాగుండురా యోగా” అన్నాను.

“అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు” అన్నాడు.

కాని బిర్లామందిర్ క్రింద, మెయిన్ రోడ్ మీద, చాలా మొబైల్ క్యాంటిన్లు ఉన్నాయి. పానీపూరీ, చాట్, కూల్ డ్రింక్స్, న్యూడుల్స్, పరోటా ఇలా చూసుకుంటూ వెళుతున్నాం. ఒక చోట ఒక వ్యాన్! మా కళ్లను మేమే నమ్మలేదు ‘సౌత్ ఇండియన్ టిఫిన్స్’ అని ఇంగ్లీషులో రాసి ఉంది. మా మనస్సు ఉత్సాహంతో ఉరకలు వేసింది.

వ్యాన్ చుట్టూ స్టూల్స్ వేసి ఉన్నాయి. పొగలు కక్కే ఇడ్లీలు! స్టాండ్ నుంచి అప్పుడే తీసి, హాట్ ప్యాక్‌లో వేస్తున్నాడు. పెద్దవే! తలా రెండు ఇమ్మన్నాము. కప్పుతో వేడి వేడి సాంబార్, కొబ్బరి చెట్నీ, అల్లం చెట్నీ. వ్యాన్ మీద సుబ్రమణ్యస్వామి బొమ్మ, తమిళ్ అక్షరాలు కనబడ్డాయి. బహుశా తమిళనాడు నుంచి వచ్చి ఉంటారనుకున్నాం. తర్వాత బట్టర్ మసాలా దోశ చెప్పాము. అది అద్భుతంగా ఉంది. అతని దగ్గర చక్కని ఫిల్టర్ కాఫీ కూడ ఉంది. ఎడారిలో ఒయాసిస్ కనబడినట్లయింది మాకు! చాలా హ్యాపీగా అనిపించింది. మేం మోహిత్ ప్యాలెస్ చేరేసరికి పదింబావు! హాయిగా పడుకున్నాము.

(ఫోటోలు – కొన్ని ఇంటర్‍నెట్ నుంచి సేకరణ, కొన్ని రచయిత తీసినవి)

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here