Site icon Sanchika

ప్రాంతీయ సినిమా -16 : స్వయంకృషితో గాలీవుడ్

[box type=’note’ fontsize=’16’] “కొత్త తరహా సినిమాలతో ముంబాయి మల్టీప్లెక్సుల్లో కూడా స్థానం సంపాదించుకుంటున్న యువతరం కళాకారులు, ఖాయిలా పడ్డ గాలీవుడ్‌ని స్వయంకృషితో పునరుద్ధరించుకుని, ఎందరికో ఉపాధి కూడా కల్పిస్తున్నారు” అంటూ గుజరాతీ సినిమాలను విశ్లేషిస్తున్నారు సికందర్. [/box]

[dropcap]దే[/dropcap]శంలోనే అతి పెద్దదైన ప్రాంతీయ సినిమారంగం గాలీవుడ్ (గుజరాత్), సినిమా వ్యాపారంలో మాత్రం అతి చిన్న రంగంగానే కొనసాగుతోంది. ఒకవైపు మరాఠీ, పంజాబీ సినిమాలు నూరు కోట్లు, యాభై కోట్లు వసూలు చేసే స్థాయికి చేరుకుంటే, గుజరాతీ సినిమాలు ఇంకా 20 – 30 కోట్ల దగ్గరే వున్నాయి. పదేళ్ళ క్రితం ఇది కూడా లేదు. చారిత్రకంగా చూస్తే, మూకీల దగ్గర్నుంచీ 85 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం సాగిస్తూ వచ్చిన గాలీవుడ్, వెయ్యి వరకూ సినిమాలని నిర్మించిన ఘనత మాత్రం సాధించింది. అసలే ధనిక వ్యాపారుల రాష్ట్రం, అందునా పార్సీలూ ఓ చెయ్యేశారు. ఇక విరివిగా సినిమాలు తీశారు. వెయ్యి వరకూ తీసి ఔరా అన్పించుకున్నారు. కానీ పదేళ్ళక్రితం యువతరం ప్రవేశించి, నవతరం సినిమాలు తీయడం మొదలెట్టాకే వసూళ్ళ స్థాయి 20, 30 కోట్లకి చేరుకోగల్గింది.

          1919 – 31 మధ్య మూకీల కాలంలోనే ఇరవై ముప్పై సినిమా కంపెనీలు, స్టూడియోలు వెలిశాయంటే ఇది రికార్డు. ఇవి ఎక్కువగా ముంబాయి కేంద్రంగానే ఉండేవి. ఈ కాలంలోనే 40 మంది పేరు పొందిన దర్శకులుండే వాళ్ళు. ఇది కూడా రికార్డే. 1919లో ఒక మూకీతో  సినిమా నిర్మాణం ప్రారంభమైనా నిర్మించింది గుజరాతీ సినిమాకాదు. బెంగాలీ సినిమా. తొలి బెంగాలీ సినిమా (మూకీ) నిర్మాణం జరిగింది గాలీవుడ్ లోనే. ఆ తర్వాత గుజరాతీ సినిమాలు నిర్మించడం ప్రారంభించారు. పైగా ఆ బెంగాలీ మూకీకి  గుజరాతీ కథతో పార్సీయుడైన గుజరాతీయే దర్శకత్వం వహించాడు. నిర్మాణం మాత్రం కోల్‌కతకి చెందిన ఎలిఫెంస్టన్ బయస్కోపిక్ కంపెనీ చేపట్టింది. గుజరాతీ రచయిత చంప్షీ ఉదేశీ రాసిన ‘బిళ్వమంగళ్’ అనే కథని ఆధారంగా చేసుకుని, ఇదే టైటిల్‌తో రుస్తుం ధోతీజీ దర్శకత్వం వహించాడు. బిళ్వమంగళ్ అనే కథానాయకుడు చింతామణి అనే నాట్యగత్తె వలలోపడి ఎలా పతనమయ్యాడనేది కథ. దోరాబ్జీ మేవావాలా, మిస్ గౌహర్ హీరో హీరోయిన్లుగా నటించారు. దీన్ని12000 అడుగుల నిడివితో, రెండు గంటల 12 నిమిషాల పూర్తి స్థాయి సినిమాగా (మూకీగా) నిర్మించడం కూడా రికార్డే. ఇతర వ్యాపారాల్లో చూపే ప్రతిభ, ఆ కాలంలోనే సినిమాలతో కూడా నిరూపించుకున్నారు గుజరాతీలు.

          అప్పుడు 1920లో ‘నర్సింహ మెహతా’ తొలి గుజరాతీ మూకీగా నిర్మించారు.15 వ శతాబ్దపు గుజరాతీ అది కవి, వైష్ణవ కవిత్వ భక్తుడు, సాధువు నర్సింహ మెహతా జీవితాన్ని ఇందులో చిత్రించారు. మాస్టర్ మన్హర్ నటించాడు. చతుర్భుజ్ దోషీ రచన చేస్తే, నానూ భాయ్ వకీల్ దర్శకత్వం వహించాడు. చిమన్ భాయ్ దేశాయ్ నిర్మాతగా వ్యవహరించాడు. దీని విశేషమేమిటంటే, ఈ మూకీలో పాట పెట్టారు. మూకీల కాలంలో శబ్ద గ్రహణమే లేనప్పుడు పాటెలా పెట్టారంటే, మూకీని ప్రదర్శిస్తూంటే సంగీత బృందమే, స్వయంగా ప్రేక్షకులే, ఆ సందర్భం వచ్చినప్పుడల్లా వాయిస్తూ పాడేవాళ్ళు. ఆ పాట ప్రసిద్ధ గుజరాతీ గీతం, మహాత్మా గాంధీ కిష్టమైన   ‘వైష్ణవ జనతో’… ఈ మూకీ విమర్శల నెదుర్కొంది. ఇందులో నర్సింహ మెహతా చేసే మహాత్మ్యాలు చూపించక పోగా, మహాత్మా గాంధీ దృష్టికోణంలో చిత్రించారని వీధికెక్కారు.

ఈ మూకీల కాలంలోనే ఇంకో చారిత్రాత్మక ఘట్టముంది. మొత్తం భారత దేశంలో నిషేధించిన మొదటి సినిమాగా 1921 లో తీసిన మూకీ ‘భక్త విదుర్’ నమోదైంది. స్వాతంత్ర్యోద్యమం మీద తీసిన ఈ మూకీని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1919 నుంచి 31 వరకు సాగిన ఓ పన్నెండేళ్ళ  గుజరాతీ  మూకీల యుగంలో, మొత్తం 44 మూకీలు తీసి రికార్డులు బద్దలు కొట్టారు. ఇతర భాషల్లో మూకీలు తయారుగా వున్న కథలతో పౌరాణిక నాటకాలుగా వేసి, వాటినే చిత్రీకరిస్తే, గుజరాతీలు మాత్రం స్వయంగా సామాజిక కథల్ని కష్టపడి రచించి, చిత్రానువాదం చేయడం నేర్చుకుని, మూకీలు తీశారు. ఎంతైనా గాంధీ పుట్టిన గడ్డ కదా. ఆయన ఉద్యమాల ప్రభావం ఎక్కువుంటుంది.

          1931 తో ప్రారంభమైంది గుజరాతీ టాకీల యుగం. ఇంకా దేశంలో మొట్ట మొదటి టాకీ ‘ఆలం ఆరా’ 1931 మార్చి,14న విడుదల కాకముందే,1931 ఫిబ్రవరి 4న తొలి గుజరాతీ టాకీ ‘చావ్ చవనో మురబ్బా’ విడుదలైంది. దేశంలో తొలి టాకీ పాట – మనే మంకడ్ కర్డే (కీటకం కుట్టింది)- ఇందులోనే వుంది. 1931 – 47 మధ్య కాలాన్ని తొలి గుజరాతీ టాకీల కాలమంటారు. ఈ కాలంలో 12 సినిమాలే తీశారు. అవన్నీ సతి, సాధువు, బందిపోటు, పౌరాణిక, జానపద కథలతో తీసినవే. 1950 – 60 ల మధ్య సాహిత్యం ఆధారంగా తీయడం మొదలెట్టారు. 1960 – 70 లలో కూడా ఇదే ఒరవడి కొనసాగింది. ఇక సినిమా పరిశ్రమ వన్నె కోల్పోవడం ప్రారంభించింది. 2000 వరకూ కూడా ఏటేటా ఇరవై నిర్మించడం గగనమై పోయింది. 2000 తర్వాత నరేంద్రమోడీ ప్రభుత్వమే రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చింది. గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటూ చాలా అన్నారే గానీ,  సినిమా మోడల్ అభివృద్ధి గురించి చేసిందేమీ లేదు – వినోద పన్ను రద్దు చేయడం తప్ప. ఇది కూడా 2017 వరకే కొనసాగింది. ఎప్పుడైతే ఇటీవలి కాలంలో సినిమాలు కళకళ లాడడం మొదలెట్టాయో,ఇక ప్రభుత్వం వినోపన్ను రద్దు ఎత్తేసి పన్నులు వసూలు చేసుకోవడం మొదలెట్టింది. 1980 లలో అప్పటి ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించింది గానీ, ఆ సబ్సిడీని అందుకోవాలంటే ప్రభుత్వ యంత్రాంగంతో తలప్రాణం తోక కొచ్చేది నిర్మాతలకి.

        గత దశాబ్ద కాలంగా తిరిగి గాలీవుడ్ కళకళ లాడడం ఎందుకు ప్రారంభించిందంటే, టెక్నాలజీ చవకై పోవడంతో యువతరం రంగంలోకి దిగడం, బాలీవుడ్ బాటలో నవతరం సినిమాలు తీయడం, గ్రామాలు కూడా ప్రపంచీకరణ ఫలాలతో కొత్త పుంతలు తొక్కుతూ ఈ కొత్త సినిమాలని ఆదరించడం వగైరా జరుగుతూ వుండి – ఇప్పుడు గాలీవుడ్ సినిమాల వ్యాపారం పెరిగింది. రిలయెన్స్ సంస్థ కూడా గుజరాతీ సినిమాల నిర్మాణంలోకి దిగింది. ఇలా కాలం కలిసి వచ్చి గాలీవుడ్ గాడిలో పడుతోంది. కొత్త తరహా సినిమాలతో ముంబాయి మల్టీప్లెక్సుల్లో కూడా స్థానం సంపాదించుకుంటున్న యువతరం కళాకారులు, ఖాయిలా పడ్డ గాలీవుడ్‌ని స్వయంకృషితో పునరుద్ధరించుకుని, ఎందరికో ఉపాధి కూడా కల్పిస్తున్నారు.

Exit mobile version