సున్నితాంశాలను స్ఫురణకు తెచ్చే ‘గులాబో-సితాబో’

1
2

[dropcap]జీ[/dropcap]వితంలో ఎదురయ్యే మామూలు సంఘటనలను, మనుషులను విశ్లేషించే ప్రయత్నం సినిమా తక్కువ చేస్తుంది. ఎక్కువగా జీవితం పరిధి పెంచేసి చూపటానికి దర్శకుడు, రచయిత ప్రయత్నిస్తుంటారు అదీ కారణం.

సీదాసాదా కథలో కేవలం పాత్రలు ప్రధానంగా ఉండి స్టార్లు కూడా పాత్రలుగా మారిపోయేలా చేయటం దర్శకుడు సుజీత్ సర్కార్‌కు ఇష్టం.

లాక్‌డౌన్ నేపథ్యంలో OTT ప్లాట్‌ఫారం ద్వారా వెలుగు చూసిన ‘గులాబో-సితాబో’ చిత్రం. ఈ చిత్రం గురించి ఎక్కువగా ఊహించుకున్నవారిని నిరుత్సాహ పరుస్తుంది. అందులో అమితాబ్, ఆయుష్మాన్ లాంటి నటులు పాత్రలుగా మాత్రమే కనిపించటం రచయిత్రి జుహూ చతుర్వేది కలం బలమనే చెప్పాలి.

లక్నో నగరంలో ఫాతిమా మహల్ అనే పురాతన భవనంలో ఉండే కిరాయిదారులకీ, మీర్జా(అమితాబ్) అనేటటువంటి యజమానికీ మధ్య జరిగే కీచులాటలు ఇతివృత్తం… అందులో ఒక కిరాయిదారుడు బాంకీ(ఆయుష్మాన్ ఖురానా) అతని కుటుంబం ముఖ్యపాత్ర పోషిస్తుంటూ ఉంటుంది. మీర్జా బేగం ఫాతిమా ది ఆ హవేలీ… ఆవిడ పోతే హవేలీ తనదవుతుందని మీర్జా ఆశగా చూస్తుంటాడు.

సినిమా నడక నెమ్మదిగా సాగుతుంది. సుజీత్ సర్కార్ చాలా చాలా చిన్నఅంశాలను చక్కగా పేర్చుతూ నడుపుతాడు. అలా అందమైన దృశ్యకావ్యంగా రూపొందేందుకు ఛాయాగ్రాహకుడు, సంగీతదర్శకుడు ఇరువురూ బాగా తోడ్పడ్డారు దర్శకుడికి. లక్నో పరిసరాలను లక్నవీ భాషను జాగర్తగా తెరకెక్కిస్తాడు. ఉర్దూలో ఉండే మన్నన మనలను అబ్బురపరుస్తుంది..

ఇక అమితాబ్ ఆహార్యం… వంగుతూ నడిచే మీర్జా బిగుసుకుపోయిన గొంతు, గొణుగుతూ మీర్జా ప్రకటించే అసహనం.. అమితాబ్ తనదైనశైలిలో ప్రేక్షకులకు దగ్గరవుతాడు.

తన బాధలకో పరిష్కారం చూపుతాడని మిత్రుడు పాండే దగ్గర వాపోయే మీర్జాలో మనకు వృద్ధాప్యంలో భార్యాభర్తల మధ్య ప్రేమరాహిత్యమెంత ప్రమాదమో చూపుతుంది. స్త్రీ పాత్రలన్నీ ముందుచూపుతో ఉంటాయి. బాంకీ(ఆయుష్మాన్ ఖురానా)కి ముగ్గురు చెల్లెళ్లు ఉంటారు. ఆ ముగ్గురు బాగా చదువుతుంటారు. బాంకీకి చదువబ్బదు. చదువుతో స్మార్ట్‌నెస్ వస్తుందని రచయిత్రి ఆ పాత్రలను బాగా రాసుకుంది. బాంకీ స్నేహితురాలు కూడా జోక్ చేస్తుంది. ‘నీకు చదువేకాదు తెలివి కూడా లేద’ని వెక్కిరిస్తుందొకచోట.

అలాగే మీర్జాకి డబ్బాశ. కాస్త జిహ్వచాపల్యమూ ఎక్కువే. నియంత్రించుకోలేక ఏదో ఒకటి కొట్టేసి అమ్మేయటం అతని బలహీనత. అదే బేగం ఫాతిమా జీవితంలోని ఆ క్షణాన్ని ఆస్వాదించటమే ముఖ్యమనుకుంటుంది. మీర్జా హవేలీ అమ్మేయాలనుకుంటాడు. హవేలీయే తన జీవితమనుకుంటుంది బేగం. ఇక బాంకీ తనున్న పోర్షన్ అద్దె ఎలా ఎగ్గొట్టాలా అని చూస్తుంటాడు. ఇది హెరిటేజ్ బిల్డింగ్ అంటూ ఫాతిమా మహల్‌ని కొట్టేయాలని ప్రయత్నించే పురాతత్వ శాఖ అధికారులు, లాయర్లు, బిల్డర్లు.. ఇలా విభిన్న మనుషులు, ఆలోచనల ప్రతిరూపంగా ‘గులాబో-సితాబో’ నిలుస్తుంది.

తోలుబొమ్మలాట పాత్రలు ‘సితాబో-గులాబోలు’ ఎలా ఒకరిమీద ఒకరు పైచేయి సాధిద్దామని  ప్రయత్నిస్తారో తోలుబొమ్మలాట కళాకారుడు చెప్పే కథతో మొదలుపెట్టి మళ్ళీ ఆ కథతో ముగిస్తాడు దర్శకుడు.

జీవితమంటే అంతేనా.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించటమేనా.. కాస్త ఆలోచించండి.. అని చెప్పడమే సుజీత్ సర్కార్ చేసిన ప్రయత్నం.

‘గులాబో- సితాబో’ ద్వారా ముస్లిం కమ్యూనిటీని కాస్త అనుమానంగా చూసే కాలంలో సమాజంలోని విభిన్న వర్గాల మధ్య సమన్వయ అవసరాన్ని కూడా గుర్తుచేస్తాడు దర్శకుడు.. ఇల్లు అనే ప్రపంచం ఒక్కో మనిషికి ఒక్కోలా ఉంటుంది..అలా అనేక పాత్రల ఆంతరంగిక స్పర్శ ఈ సినిమా..

మెలోడ్రామా కన్నా monotony లో దాగుండే వైవిధ్యాన్ని పట్టుకుంటుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here