Site icon Sanchika

గల్లి బాయ్: పొరలుపొరలుగా అల్లిన స్క్రీన్‌ప్లే

[box type=’note’ fontsize=’16’] “చాలా సూక్ష్మంగా చూస్తే అబ్బురమనిపిస్తుంది, చాలా తక్కువ ఫుటేజ్‌లో చాలా చెప్పబడిందని” అంటున్నారు పరేష్ ఎన్. దోషిగల్లి బాయ్” చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]జో[/dropcap]యా అఖ్తర్ సినెమాలంటే మిస్ అవకూడని చిత్రాలు అనిపించేలా తీస్తూ వచ్చింది. మొదటి రెండు: లక్ బై చాన్స్, జిందగీ న మిలేగీ దొబారా మాత్రం అద్భుతమైనవి. ఇది అంతగా కాకపోయినా మంచి చిత్రమే. కాకపోతే రెండున్నర గంటలు అంటే ఆవలింతలు తప్పవు. ఆ నిడివి కూడా యెందుకు పెరిగిందంటే జోయా, స్క్రీన్‌ప్లే కలిసి వ్రాసిన రీమా కాగతి (తను దర్శకురాలు కూడా) చాలా విషయాలను కలుపుకుంటూ వచ్చారు. అందుకే కథ కూడా యెన్నో స్థాయిల్లో నడుస్తూ వుంటుంది.

ముందు క్లుప్తంగా కథ చూద్దాం. ముంబై లోని ధారావి ప్రపంచంలోనే అతి పెద్ద స్లమ్. అలాంటి చోటనుంచి వో పేద ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన వాడు మురాద్ (రణబీర్ సింగ్). డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. స్కూల్లో కలిసి చదువుకున్న సఫీనా (ఆలియా భట్) తో ప్రేమలో వున్నాడు. తండ్రి (విజయ్ రాజ్) వొక డ్రైవరు. తల్లి, తమ్ముడు ఇప్పుడు కొత్తగా వచ్చిన తండ్రి రెండవ భార్యలతో వో చిన్న ఇంట్లో వుంటారు. ధారావి అంటే దాని చుట్టూ వున్న రాజకీయ, ఆర్థిక గాథలు, పోరాటాలు అన్నీ మెదులుతాయి. తండ్రి అవన్నీ బహుశా చూసినవాడేమో, యెప్పుడూ తల దించుకుని (low profile) లో చిన్నగా బతికెయ్యాలంటాడు. మురాద్ కేమో పెద్ద పెద్ద కలలు. కాని తాను వుంటున్న పరిస్థితుల కారణంగా వొక రకమైన భయం, అధైర్యం, vulnarability వుంటాయి అతనిలో. అది నెమ్మదిగా ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసుకుంటూ యెలా తన జీవితాన్ని మలచుకుంటాడన్నది కథ. ఇది వొక వ్యక్తి కథ అనుకుంటే, దీనితో పాటే వాళ్ళ ప్రేమ కథను కూడా చాలా అందంగా, ప్రతిబావంతంగా చూపించారు. ఇది రెండవ పొర అనుకుంటే, మొదటి నుంచీ తనకు ఆసక్తి వున్న హిప్ హాప్ రాప్ సాహిత్య సంగీతాలలోనే ముందుకెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఫలితంగా సినెమా అంతా ఆ రాప్ పరచుకుంటుంది. ఇవి ప్రధానంగా వున్నా, చిన్న చిన్న ఉపకథలు చాలా సహజంగా అమిరాయి ఇందులో. పేదరికపు జీవితం మరో ముస్లిం యువకుడిని మోయీన్ (విజయ్ వర్మ : ఇతన్ని పింక్ లో చూశాము ఇదివరకు) కార్లు దొంగలించడం లాంటి అసాంఘిక కార్యకలాపాలలోపాల్గొంటూ వుంటాడు. అది కాక తను చేసే డ్రగ్స్ పనిలో పిల్లల్ని కూడా పెట్టుకుంటాడు. వాళ్ళ జీవితాన్ని యెందుకు ప్రమాదంలో పడేస్తావు అని మురాద్ కోప్పడితే చెబుతాడు, నన్ను కాదు కని చెత్త కుప్పల్లో పారేసిన వాళ్ళ తల్లి దండ్రులనడుగు; నేనైతే వాళ్ళకు రెండు పూటల తిండి పెడుతున్నాను. షఫీనా మెడిసిన్ చదువుతూ వుంటుంది, కాస్త స్థితిమంతులే. కానీ కుటుంబంలో నడిచేవి సాంప్రదాయిక పాత పద్ధతులే. పగలు కాలేజి, ఆ తర్వాత తండ్రి క్లినిక్ లో సాయపడటం ఆ తర్వాత సమయం చేజిక్కించుకుని చాటుగా మురాద్ ని కలవడం. యెందుకంటే ఇంట్లో చెబితే అనుమతించరు. చాలా కోపమూ, తల తిక్కా వున్న షఫీనా ప్రేమలో మాత్రం చాలా పొజెసివ్ గా వుంటుంది. యెంతగా అంటే వేరే అమ్మాయి యెవరన్నా తమ మధ్య రా జూసినా మాడు పగలగొట్టేంత! నిజానికి ఇందులో వొక కథ కాదు, కొన్ని కథల మాలిక వున్నది. కానీ అన్నిటినీ కలిపి కుట్టి చక్కగా మనకందించారు. రాప్ ను ఇష్టపడని వారికి మాత్రం ఆ భాగమంతా బోర్ కొడుతుంది. నాకు రాప్ మీద పెద్ద ఆసక్తి లేదు గాని, ఇందులో కొన్ని నిజంగా చాలా బాగున్నాయి. 2018 లో జింగోస్తాన్, ఆజాది మీదవి ముఖ్యంగా. అవి వింటే ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులు కళ్ళ ముందు మెదులుతాయి. కొన్ని మాత్రం చాలా చిల్లరగా కూడా వున్నాయి showing one upmanship కోసం ప్రత్యర్థిని వెక్కిరించడం లాంటివి.

డివైన్, నాజీ లు నిజజీవితంలో తమ రాప్ నైపుణ్యం కారణంగా అట్టుడుగు నుంచి చాలా పేరు డబ్బు సంపాదించే వరకూ వెళ్ళారు. వాళ్ళ జీవితం మీద కొంత ఆధార పడి మిగతా కథలన్నీ దాని చుట్టూ అల్లారు. వివరించాలంటే ఈ కాలం పరిధి వొప్పుకోదు గాని చాలా చిన్న చిన్న విషయాలున్నాయి. భర్త రెండో భార్యను తెచ్చిన తర్వాత సహించలేని రజియా (అమృతా సుభాష్) ఆ ఇల్లు విడిచి తన తమ్ముడింట చేరుతుంది. చాలా సాంప్రదాయికుడైన అతను తన బావ రెండో వివాహమప్పుడూ, ఇప్పుడు విడిపోతానంటున్న అక్కను సమర్థించ నిరాకరిస్తాడు. రజియా మాత్రం టిఫిన్ల పని తో తన కాళ్ళ మీద నిలబడాలనుకుంటుంది. మరో ఉపకథ అమెరికా నుంచి వచ్చిన వో సంగీత నిర్మాత స్కై (కల్కి కేక్లాఁ) మురాద్ రాప్ కి, మురాద్ కీ ఆకర్షితురాలవుతుంది. వాళ్ళిద్దరి మధ్య వో సారి శారీరిక సంబంధం కూడా యేర్పడుతుంది. ఇది మురాద్ సఫీనా తో యేదో అలా జరిగిపోయింది, సీరియస్ కాదు అని అంటే : సఫీనా అంటుంది అంటే నేను కూడా యెవరితోనన్నా వూరికే కనెక్ట్ అయి పోవచ్చు కదా. ఇలాంటి చిన్న చిన్న మెరుపులు సినెమాలో అనేకం. ఇక స్లమ్స్ లోని జీవితాలు, ముస్లిం కుటుంబాలలోని చిత్రాలు అన్నీ చాలా బాగా చూపించారు. అసలు కథనం కూడా జాగ్రత్తగా గమనించకపోతే తెల్ల మొహం వేయాల్సి వస్తుంది, కొన్ని సారులు. వొక ఉదాహరణ. ఫోన్ వస్తే, విని ఆ వస్తున్నా అని మురాద్ ఇంటికి పరుగు తీస్తాడు. అక్కడ వో కారు వస్తుంది, అందులోంచి విజయ్ రాజ్, అమృతాలు దిగి ఇంటిలో అడుగుపెడతారు. మర్నాడు రజియా యేడుస్తూ తన బట్టలు బయట పారేస్తుంది, ఇంట్లో పెట్టుకోవడానికి జాగా లేదని. ఆ రెండో భార్య భోజనం చేసి ప్లేటుని అక్కడ అలాగే వదిలేసి పనికి వెళ్ళిపోతుంది. ఇవి చాలా సూక్ష్మంగా చూస్తే అబ్బురమనిపిస్తుంది, చాలా తక్కువ ఫుటేజ్ లో చాలా చెప్పబడిందని.

ముందు జోయా-రీమాలను మెచ్చుకున్నాం కదా ఇది చక్కగా వచ్చినందుకు. తర్వాత ఆలియా భట్-రణబీర్ సింఘ్ నటనల గురించి చెప్పుకోవాలి. ఆలియాకి యెంత చిన్న పాత్ర ఇచ్చినా మరచిపోలేని విధంగా నటించి చూపిస్తుంది. ఇందులో కూడా. ఇక రణబీర్ మాత్రం యెక్కడా హీరో లా వుండడు. నంగినంగిగా ఆత్మ స్థైర్యం తక్కువ వున్న యువకుడుగా మొదట, నెమ్మదిగా తను యేమిటో తెలుసుకుంటూ, ధైర్యాన్ని కూడగట్టుకుంటూ చివరికి తెగేసి నా కలలను మాత్రం కురచబారనివ్వను, నా కలలకు తగ్గట్టుగా నా వాస్తవాలను మార్చుకుంటాను గాని అనేంతవరకు యెన్నో షేడ్స్. మనం రొటీన్ చిత్రాలు చూస్తే ప్రత్యేకంగా కనబడే హీరో, అతని చుట్టూ చెంచాల లాంటి మిత్రులు వుంటారు. ఇందులో ఇతర చిన్న పాత్రలన్నీ మురాద్ పాత్రకు సమానంగా వుంటాయి. అలాగే వాళ్ళ నటన కూడా. విజయ్ రాజ్ కోపిష్టి తండ్రిగా, విజయ్ వర్మ అసాహంఘిక పనులు చేసే మిత్రుడుగా, కొత్త నటుడు సిధ్ధాంత్ చతుర్వేది వొక రాప్ కళాకారుడుగా, మురాద్ ను ఉత్తేజపరచి ప్రోత్సహించే వాడుగా, అసంపూర్తిగా మలచిన పాత్రలో కల్కి కేక్లాఁ, తల్లిగా అమృతా ఇలా అందరూ చాలా మంచి నటన ఇచ్చారు. జయ్ ఓఝా చాయాగ్రహణం, విజయ్ మౌర్యా సంభాషణలు బాగున్నాయి.

కొన్ని ఉపకథలు పూర్తిగా మలచలేదు. ఉదాహరణకు తండ్రికి ప్రమాదం జరిగి మంచాన పడ్డప్పుడు అతని బదులు డ్రైవరుగా మురాద్ చేస్తాడు. తను గ్రాడ్యూయేటు, యజమాని కూతురు కూడా. కాని తమ మధ్య ఆర్థిక అంతరాలు దాటలేనివి. వొక మ్యూజిక్ షోలో లోపల ఆమె వుంటే బయట ఇతను మిగతా డ్రైవర్లతో నిలబడివుంటాడు. వాళ్ళు యేవో వంటల గురించి, ఇంటి పనుల గురించి మాట్లాడుకుంటూవుంటే ఇతను గేటు వరకు వెళ్తాడు యేమన్నా వినబడుతుందేమోనని. అతని దుస్తులు చూసే అక్కడి వాచ్మన్ సంజ్ఞతోనే ఇతన్ని తప్పుకోమంటాడు. ఆ అవమాన భారంతో వెనుతిరిగి కారులో కూర్చుని తన మొదటి పాట పాడుకుంటాడు “అపనా భీ టైం ఆయేగా”. కాస్సేపటికి ఆమె యేడుస్తూ వచ్చి కారులో వెనుక కూర్చుంటుంది. మురాద్ మనసులో మరో పాట పుడుతుంది. కావడానికి దగ్గరగా వున్నా తమ మధ్య దూరమే యెక్కువ; ఆమె కంట కన్నీరు తుడవాలని వున్నా తనకా “ఔకాత్” (తెలుగులో ఇంచుమించు స్తోమత/position) లేదు. ఇలా సాగుతుంది పాట. వొక్క క్షణం అనిపించింది ఇదే వేరే సినెమా అయితే డ్రైవర్తో ఆమె అతి చనువుగా వుండేది, డ్రైవరే అయినా హీరో కాబట్టి అతను కూడా ఆమె విషయాల్లో జొరబడి, జోక్యం చేసుకుని over acting చేస్తాడు కదా. సరే చిత్రం మొత్తం ఇలాగే సహజంగా వుంటుంది. ఆ హీరోగిరి చూసి చూసి విసుగొచ్చినవాళ్ళకు కాస్త రిలీఫ్.

Exit mobile version