[ప్రఖ్యాత కవి గుల్జార్ చిన్న కవితలను అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి.]
1
నీ జ్ఞాపకాల ఉదయాలను నా తోనే ఉండనివ్వు..
ఎవరికి తెలుసు.. ఎప్పుడు.. ఏ వీధి మలుపులో జీవితం అస్తమిస్తుందో..?
***
2
ప్రేమించు కానీ తిరిగి ఏమీ ఆశించకు.
దుఃఖం ప్రేమించడం మూలాన్న కలగదు..
తిరిగి ప్రేమని ఆశిస్తావు చూడూ, అప్పుడు కలుగుతుంది.
***
3
నీతో విసిగి వేసారి పోయామన్న వారిని వదిలివేయి.
భారంగా మిగలడం కన్నా జ్ఞాపకంగా మిగిలి పోవడమే మంచిది.
***
4
దోస్త్.. గుర్తుంచుకో! కాలం గడిచేకొద్దీ నేనేమీ అందరిలా మారిపోతాననుకోకు!
నిన్నెప్పుడు కలిసినా.. గతంలో లాగే ఉంటుంది నీతో నా వ్యవహారం!
***
5
నేను అమాయకుడినే కావొచ్చు కానీ, నేనెలాంటి వాడినో తెలియదు నీకు!
నీ సంతోషం కోసం వంద సార్లైనా సరే విరిగి ముక్కలవగలను!
~
మూలం: గుల్జార్
అనుసృజన: గీతాంజలి
గుల్జార్ ప్రఖ్యాత కవి, చలనచిత్ర పాటల రచయిత. ఆయన 18 ఆగష్టు 1936న ప్రస్తుత పాకిస్తాన్ లోని దినాలో జన్మించారు. దేశవిభజన తరువాత వారి కుటుంబం ఢిల్లీకి వలస వచ్చింది. గుల్జార్ అసలు పేరు సంపూర్ణసింగ్. హిందీ, ఉర్దూ, పంజాబీ భాషలలో రచనలు చేసి ఖ్యాతి పొందిన గుల్జార్‌కు 2004లో పద్మభూషణ్ అవార్డు, 2002లో సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. 2009 సంవత్సరానికి గాను బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ‘జై హో’ అనే పాటకి ఆస్కార్ అవార్డును పొందారు.