గుణం ప్రధానం

0
2

[box type=’note’ fontsize=’16’]2019 దీపావళికి సంచిక ప్రచురించదలచిన ‘కులం కథలు’ సంకలనంలో ప్రచురణకై అందిన కథ ఇది. ‘కులం కథ’ పుస్తకంలో ఎంపిక కాలేదు, సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవుతోంది.[/box]

[dropcap]ఇం[/dropcap]టి ముందు ఆటో దిగి, అక్కడే బట్టలు యిస్త్రీ చేసుకుంటున్న వాచ్‌మన్‌ని పిలిచి “బాబూ పెద్దవాళ్ళం కదా, కాస్త యీసామాన్లు లిఫ్ట్‌లో పెట్టు డబ్బులిస్తాం” అంది విజయ. ఏమీ బదులివ్వక, తన పనిలో తానుండిపోయాడు ఆ వాచ్‌మన్.

“పదండమ్మా” అంటూ ఆటో వాలా ఆ సామాన్లను తీసి లిఫ్ట్‌లో పెట్టి, ఆమె డబ్బు లివ్వబోతుంటే “ఫర్వాలేదు” అంటూ వెళ్ళిపోయాడు.

మూడో ఫ్లోర్‌లో దిగి, తమ కొడుకు వుండే ప్లాట్ ఆ ప్రక్కదే కావడంతో మెల్లగా యింట్లోకి చేర్చారు తమ సామాన్లు.

“రండత్తయ్యా నేనింకా… మీ ట్రయిన్ లేట్ కాబోలు అనుకుంటున్నాను” అంటూ లోపలికి వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చి అందించింది కోడలు సమీర. తను కూడా సోఫాలో కూర్చుంటూ “అరే ధనుష్ త్వరగా రా, నిన్ను స్కూలుకి తీసికెళ్ళాలి కదా” అని కొడుకుని పిలిచి “ఏమిటో అత్తయ్యా పొద్దున్నే సిలిండర్ ఖాళీ అయింది. సమయానికి మీ అబ్బాయి వూళ్ళో లేరు. నేను వీడిని స్కూల్‌లో దింపి ఆ తర్వాత సిలిండర్ కోసం ట్రై చేసి వస్తాను. పదరా వెళ్దాం” అంటూ వెళ్ళిపోయింది ఆ కోడలు.

అరగంట గడిచినా సమీర రానే లేదు. విజయకీ, రామచంద్రానికీ స్టేషన్‌లో కాఫీ నచ్చదు. అందుకే తిన్నగా యింటికి వచ్చేశారు. ముందు రోజు ఫోన్ చేసి కోడలితో యిలా వస్తున్నట్లుగా చెప్పాం కదా అని అనుకున్నారు. ప్రతీ సంక్రాతికీ కొడుకూ, కోడలూ మనవడూ తమ దగ్గరికే వస్తుంటారు. ఎప్పుడో రెండేళ్ళ క్రితం ఒక్కసారి వచ్చాం గనుక, యిల్లు సులువుగానే గుర్తుపట్టచ్చు గనక బయలుదేరి వచ్చేశారు. పోస్టాఫీస్‌కి ఎదురుగా వున్న యిల్లే గనుక యిబ్బంది వుండదనుకున్నారు.

“సరే కోడలు మన కోసం డికాషన్ వేసి వుంటుందిగా…. సిలిండర్ ఐపోతే, ఆమె మాత్రం ఏం చేస్తుందిలే. ఆ డికాషన్‌లో కాసిన్ని పాలో, నీళ్లో కలిపి యివ్వు అదే కాస్తంత తాగుదాం” అన్నాడు రామచంద్రం.

ఫ్రిజ్‌లోగానీ, కిచెన్‌లో గానీ ఎక్కడా డికాక్షన్ గానీ, పాలు గానీ కన్పించనే లేదు. రామచంద్రం డయాబటిక్ కావడంతో క్షణక్షణానికీ నీరసపడిపోతున్నాడు. ఏం చెయ్యాలో తోచడం లేదు విజయకి. ‘దేముడా నీదే భారం’ అని దండం పెట్టుకుంది.

అంతలో “సమీరక్కా” అంటూ లోపలికొచ్చిందొక అమ్మాయి.

“సమీర పిల్లాడిని స్కూల్లో దింపటానికి వెళ్ళిందమ్మా. అమ్మా, సమయానికి దేముడిలాగా వచ్చావు. రాత్రెప్పుడో ఏడు గంటలకు తిన్న భోజనం కదా, అసలే మావారు షుగర్ పేషంట్. తీరా వస్తే, యిక్కడ సిలిండర్ కాస్తా అయిపోయిందట. ఆ వాచ్‌మన్ చూస్తే పలికేలా లేడు. దగ్గర్లో కాఫీ ఎక్కడ దొరుకుతుందో చెప్తే, కాఫీ, టిఫిన్ తెచ్చుకొస్తాను” అడిగింది విజయ.

“అయ్యో అదేంటి ఆంటీ, మీరు వెళ్ళి తేవడం ఏమిటీ…. ఉండండి. అయిదు నిమిషాల్లో వస్తాను” అని చెప్పి వెళ్ళింది.

కాస్సేపట్లోనే బాక్స్‌లో ఆరు యిడ్లీలూ, చట్నీ, వేరే స్టీల్ డబ్బాలో దద్ధ్యోజనం, నిమ్మకాయ పచ్చడీ, వేడివేడి కాఫీతో ఫ్లాస్క్‌నీ తెచ్చి అక్కడ పెట్టింది. మళ్ళీ వెంటనే, “సారీ ఆంటీ మాది మీ కులం కాదుకదా కానీ, అంకుల్ వీక్ అయిపోతున్నారన్పించి ఆ తొందరలో తీసుకొచ్చేశాను. రండి, ఇక్కడికి దగ్గరలోనే ఉడిపి హటల్ వుంది. మీకు చూపిస్తాను” అంది.

వెంటనే విజయ ఆమెని వారిస్తూ “వద్దులేమ్మా నువ్వుతస్తే మాత్రం ఏమైందీ, ముందు ఆయన కాస్తంత స్థిమితపడితే అదే చాలు” అంది.

“ఆంటీ యివి నేను కాలేజ్‌కి తీసికెళ్తామని సర్దుకున్నాను. ఇప్పుడు యిడ్లీలు తినండి. లంచ్‌లోకి మా ఫ్రెండ్స్‌కి యిష్టం అని దద్ధోజనం ఎక్కవే పెట్టాను గనుక, మీ యిద్దరికీ సరిపోవచ్చు. సాయంత్రానికి యీ బిస్కట్ పాకెట్ వుంచుకోండి. నేను రాగానే టీ చేసి యిస్తాను. బై” అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపయింది.

అతనికి ప్లేట్‌లో యిడ్లీలూ, చట్నీ వేసి అందిస్తూ, “అయ్యో ఆ అమ్మాయి పేరైనా అడిగాను కాదూ” అంటూ తనూ యిడ్లీలు తెచ్చుకొని తినసాగింది. అవి తిని కాస్తంత కాఫీ త్రాగాక, ప్రాణం కుదుట పడ్డట్లయింది ఆ దంపతులకి.

“ప్రవీణ్ ఏ వూరు వెళ్ళాడో ఏమో, ఎప్పుడొస్తాడో… కాస్త ఫోన్ చేసి కనుక్కోండి” అని విజయ చెప్పడంతో, వెంటనే కొడుక్కి ఫోన్ చేశాడు రామచంద్రం. ‘అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా’ అని వచ్చింది. అంతలో సమీర ఫోన్ చేసింది.

“అత్తయ్యా! సిలిండర్ రావడానికి యింకా నాలుగు రోజులు పైగా పడుతుందన్నాడు. ఇక్కడ వీడి స్కూల్‌లో పేరెంట్-టీచర్ మీటింగ్ వుందట. అది అవగానే వస్తాను లెండి” అంటూనే, తమ సమధానం కోసం కూడా ఎదురు చూడకుండా, వెంటనే ఫోన్ పెట్టేసింది ఆ కోడలు గారు.

మాంచి ఆకలి మీద ఆ టిఫిన్ తిని, కాఫీ త్రాగడం వలన కాబోలు, వాళ్ళిద్దరికీ నిద్ర ముందుకు వచ్చేసింది. రెండు బెడ్ రూములకీ తాళాలు పెట్టి వుండడంతో, అతను పెద్ద సోఫాలోనూ, ఆమె నేల మీదా నిద్రపోయారు. ఐదు గంటలవుతుండగా, సమీర ధనుష్‌ని తీసుకొని వచ్చింది.

వస్తూనే, “అయ్యయ్యో! మీరిలానే నిద్రపోయారా… సారీ! ఏంటో ప్రవీణ్ వూరెళ్ళినప్పుడల్లా బెడ్ రూమ్‌లకి కూడ తాళాలు పెడ్తుంటానుగా… అలా… అలా… అలవాటుగానే తాళాలు పెట్టి వెళ్ళిపోయాను” అందే కానీ, ఆ బెడ్ రూమ్‍లకి తాళాలు మాత్రం తీయలేదు.

అంతలో నాలుగు కప్పుల్లో టీ, ఒక కప్పులో ధనుష్‌కి బోర్నవీటా తెచ్చింది ఆ అమ్మాయి.

“సరోజా! నీకీ పూట యీ శ్రమెందుకు! అయినా అత్తయ్యా, మామయ్యా నువ్విస్తే తాగరులే” అంది సమీర. చిరు దరహాసం చిందించింది సరోజ.

“ఫర్లేదులే అక్కా! పొద్దున్న నే వచ్చేసరికి అంకుల్ నీరసంతో పక్కకి వాలిపోతున్నారు. నేనే, అలా వుంచడం మంచిది కాదని వాళ్ళకి నచ్చజెప్పి, నా టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ అవీ వాళ్ళకిచ్చి, కాఫీ కలుపుకుని వచ్చి వాళ్ళని బ్రతిమాలి తినమని చెప్పాను. నేను మా క్యాంటిన్‌లో తిన్నానులే ఇవాళ్టికి” అంది సరోజ.

“తాగండి ఆంటీ!” అంటూ వాళ్ళకీ కప్పులు అందించి, “రాత్రికి నేను చేయలేనులే గానీ సమీరక్కా! నువ్వే వచ్చి మా ఇంట్లో రోటీలు కూరా వంటివి చేసుకొని తెచ్చుకోవచ్చు. సరేనా?” అంది సరోజ.

వెంటనే, “ఫర్వాలేదులే, నాతో చెప్పకుండానే, నన్నడకుండానే పొద్దున్న అన్నీ తినేసారుగా! ఇంక ఈ పూట మాత్రం ఎందుకు లాగించరూ?” వ్యంగ్యంగా అంది సమీర. మనసుని బాధ మరీ మెలిపెడుతుండగా, ఆ వృద్ధ దంపతులు మిన్నకుండిపోయారు.

కాలింగ్ బెల్ మోగడంతో బైటకి వెళ్ళింది సమీర.

“మేడమ్! నిన్న వచ్చిన కొత్త సిలిండర్‌ని మా ఇంట్లోనే వుంచమన్నారుగా! కానీ, మా వాళ్ళెవరో పోయారని ఫోనొచ్చింది, మేం వూరెళ్ళిపోతున్నాం. అందుకని మీ సిలిండర్‌ని మీకు ఇచ్చేద్దాం అని తెచ్చాను. ఇదిగో” అంటూ వాచ్‌మన్ కొత్త సిలిండర్‌ని తెచ్చి లోపల వంటగదిలో పెట్టి వెళ్ళాడు.

అందరు తన వంక విచిత్రంగా చూస్తుంటే- తడబడిన సమీర, “అదీ… ఆ సిలిండర్ నేనింట్లో లేనప్పుడు వచ్చింది కాబోలు” అంది సర్దిచెబుతున్నట్లుగా! ధనుష్ కూడా తల్లి వంక ఆశ్చర్యంగా చూశాడు.

అంతలో ఫోన్ రింగ్ అయింది. రామచంద్ర ఫోన్ ఆన్ చేశాడు. అమెరికా నుంచి రెండో కొడుకు ప్రజయ్ లైన్‍లో వున్నాడు.

“హలో ప్రజయ్! ఎలా వున్నావ్? ఆదివారం శలవు కదా! ఇప్పుడే లేవలేదేమో, కాసేపాగి చేద్దాం అని అనుకుంటున్నాంరా” అన్నాడు రామచంద్రం ఆప్యాయంగా. ఆ ఆప్యాయత చూసి అలిగిందో, ఏమో, లేక అనుకోకుండా తన బండారం వాచ్‌మన్ ద్వారా బయటపడిందనో, అలిగి బయటికి వెళ్ళిపోయింది సమీర. ధనుష్ ఆటకి వెళ్ళాడు.

‘హలో ప్రజయ్!’ అన్న రామచంద్రం పిలుపుని వినగానే, సరోజ బుగ్గల్లో మెరుపులూ, కళ్ళల్లో సిగ్గులూ దోబూచులాడటం విజయ గమనించి, “ఏమ్మా! మా ప్రజయ్‌ని చూశావా? నీకు తెలుసా?” అని అడిగింది. చిరునవ్వుతో తలాడించింది సరోజ. వెంటనే భర్త చేతి లోంచి ఫోన్ లాక్కొని, “అరే ప్రజయ్! ఎలా వున్నావురా? నేనిక్కడ నీకొక పెళ్ళి సంబంధం చూశాను తెలుసా?” అంది ఆనందంగా.

“అమ్మా, ఎవరా అమ్మాయి… నీకిష్టమైన మన కులం అమ్మాయేనా?” అడిగాడు ప్రజయ్ కంగారు పడ్తూన్నట్లుగా!

“లేదురా! అప్పట్లో యీ కులాలూ, గోత్రాలూ అంటూ పట్టింపులు పెట్టుకుని, మీ నాన్నగారు చెప్పినా వినకుండా, నా కొడుకులకి మన కులం అమ్మాయిలనే వెదికి మరీ చేద్దాం అని పట్టుబట్టానుగ్రా! కానీ యిప్పుడు ‘కులం కంటే గుణం ప్రధానం’ అనేది తెలుసుకున్నానురా! అదీ కాక మనం యిష్టపడే వాళ్ళని కాదూ, మనల్ని యిష్టపదే వాళ్ళనే యీ తరం అబ్బాయిలు పెళ్ళాడుతున్నారని కూడా తెలిసింది. అందుచేత నిన్ను మనసులో నింపుని, కళ్ళలో ఆనందాన్నీ, పెదాలపై చిరునవ్వునీ చిందించే, యీ సరోజని నీకిచ్చి చేద్దాం అనుకుంటున్నానురా! అదీ నీకూ, సరోజకి యిష్టమైతేనే” అని నవ్వుతూ, సరోజ తల నిమిరింది విజయ.

కళ్ళలో చిందే సిగ్గుల మొగ్గల్ని దాచలేక, నవ్వుకుంటూ లేచి తన యింటికి తూనీగలా వెళ్ళిపోయింది సరోజ.

“వూర్నించి మీ అమ్మా నాన్నా వచ్చాక, మేం మాట్లాడుతాం లే!” వెనుక నుంచి సరోజతో అంది విజయ.

“నిజంగా సరోజ సార్థక నామధేయురాలు రా! మానవతా విలువల్ని చక్కగా పాటించే అమ్మాయి కూడా! నీకిష్టం అయితే, నాకూ, మీ అమ్మకీ ఏ అభ్యంతరమూ లేదు. సరేనా?” అన్నాడు రామచంద్రం.

“మీ ఇష్టమే మా యిష్టం నాన్నా” ఇంత సులువుగా తల్లిదండ్రుల అనుమతి లభిస్తుందని ఊహించని ప్రజయ్ ఉబ్బితబ్బిబ్బవుతూ అన్నాడు.

“సరోజా కళ్యాణ ప్రాప్తిరస్తు!” అని రామచంద్రం అంటుంటే, ఆనంద తరంగాలలో తేలిపోయింది విజయ మనసు. ఆ వృద్ధ దంపతులు హాయిగా మనసారా నవ్వుకున్నారు నిండుగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here