గుండె గోదారిలా

0
2

[శ్రీ చేకూరి రామలింగరాజు రచించిన ‘గుండె గోదారిలా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“ధ[/dropcap]విళేశ్వరంలో ఒదిలేరంట కాలవలకు నీళ్ళు, నాల్రోజుల్లో మన పెద్దకాలవకు వచ్చేస్తాయి. ఈలోపల బోదులు మెరక తీసుకుని, మడిగట్లు బలం చేసుకుంటే, నీరు పొడవగానే దమ్ము పట్టెయ్యొచ్చు” చీకటితోనే మెలుకువొచ్చిన సూరిబాబుకి రాత్రి సీతారావుడు గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. లేచి మంచమీంచి దిగుతుంటే ఆ కదలికకు ప్రక్కన పడుకున్న భార్య నాగమణికి కూడా మెలుకువొచ్చింది,లేచి కూర్చుని

“పొలం బయదేల్తన్నావా?” అని అడిగింది.

“ఊఁ” అన్నాడు.

“టీ పెట్టనా! పుచ్చుకుని ఎల్తావా!” అడిగిందామె.

“ఒద్దే! ఆలస్యం అయిపొద్ది, పొద్దునమటేల కరంటు తీసేత్తన్నాడు, నారుమడికి నీరెట్టాలి” చెప్పాడు.

పెరట్లోకి వెళ్ళి గోళెంలో నీళ్ళతో మొహం తొలుపుకుని, దండెం మీదున్న కండువాతో తుడుచుకున్నాడు. మధ్య గదిలోకి వచ్చి గూట్లోని బ్యాటరీలైటు తీసుకుని, వీధివాకిలి వైపు వెళుతుండగా లేచిన నాగమణి గుమ్మం దాకా వస్తూ

“ఏంటొ బాబూ, చీకటితో ఎల్తావు, మళ్లీ పొద్దోయాకా ఒత్తావు. అందరూ ఎవసాయాలు చేత్తన్నారుగాని! నీ అంత కట్టబట్టం ఎక్కడా సూళ్లేదు. పోనీ, ఏవఁన్నా పొగెట్టావా,అంటే అదీలేదు” అంది కాస్త నిష్ఠూరంగా. ఆమె మాటలకు నవ్వేసి

“ఓ పదిరోజుల్లో తీరుబడి అవుతుంది. అప్పుడు నీ ఇష్టం, నీతోనే ఉంటాలే!” చెప్పాడు సూరిబాబు మునివేళ్లతో ఆమె బుగ్గను పట్టుకుంటూ.

ఆమె ఎవరైనా చేస్తున్నారేమో అని కంగారుగా అటూ ఇటూ చూసి “సర్లే ఎల్లిరా!” అంది మురిపెంగా నవ్వుతూ.

వాకిట్లోకి వచ్చి స్కూటర్ స్టార్ట్ చేసుకుని బయలుదేరాడు. పెద్ద రోడ్డు మీద కొంత దూరం వెళ్ళి, చిన్న కాలవగట్టు వైపుకు తిరిగి ముందుకు వెళ్ళి ఆగాడు. చీకటి తొలగలేదింకా. అక్కడినుండి పొలానికి నడిచి వెళ్ళాలి. స్కూటరు మదుం దగ్గర స్టాండు వేసి బ్యాటరీలైటు వేసుకుని బోదెగట్టున నడవసాగాడు. అలవాటయిన దారే కావడంతో అలవోకగా సాగిపోతున్నాడు. అతని అడుగుల చప్పుడుకి చేనుగట్టున చుట్టుకుని పడుకున్న పామొకటి మెల్లగా చేలోకి జారిపోయింది. పొలం మధ్యలో ఉన్న కళ్ళం కాడికి చేరుకున్నాడు. తీరికగా కూర్చుని నెమరువేసుకుంటున్న పశువులు ఒకేసారి తలలు తిప్పి చూశాయి. పశువులశాలలో ఉన్నపంపు స్విచ్చి వేసాడు. నీళ్లు తోడుతున్న శబ్దం మొదలైంది. నారుమడి నాలుగువైపులా నీరు పారుతున్నదో లేదో చూసుకున్న తర్వాత పశువులకు గడ్డి వేసాడు.

వెలుతురు పరుచుకుంటోంది. ఎక్కడినుండో తెల్లటి కొంగలు రెక్కలార్చుకుంటూ వచ్చి చేలో వాలి. మట్టి పైకొచ్చిన పురుగుల్ని ఏరుకు తింటున్నాయి. వాటిలో అవి ఏవో పరాచికాలాడుకుంటూ పలారం చేస్తున్నాయి.

దూరంనుంచి చేనుగట్టున వస్తూ కనిపించారు సీతారావుఁడు గారు. ఆయనే తన యజమాని. లుంగీ పైకి మడిచి కట్టుకుని గబగబా నడిచి వస్తున్నారు. కళ్ళం కాడికి వచ్చేసరికి ఎదురెళ్ళి, ఆయన చేతిలోని పాల తపాళా, ప్లాస్కూ అందుకున్నాడు. దూరం నుంచి నడిచి రావడం వల్లనేమో కొంచెం ఒగుర్పొస్తోందాయనకు. పశువులశాల వారగా ఉన్న పొడవాటి చెక్కబల్లమీద కూర్చున్నారు. ఇంటి నుంచి ప్లాస్కులో టీ తీసుకువచ్చి సూరిబాబుతో కలిసి తాగడం అలవాటాయనకు. పాతికేళ్ళ అనుబంధం వాళ్ళిద్దరిదీ.

సూరిబాబు తండ్రి మాణిక్యం సీతారావుడుగారి పొలం పనులు చూసేవాడు. సూరిబాబు పదేళ్ళ వయసులో ఉండగా అతడు చనిపోతే సూరిబాబు పోషణా, చదువూ బాధ్యత సీతారావుడుగారు తీసుకున్నారు. తన కొడుకులు శ్రీనివాస్, శ్రీధర్ లతో పాటు స్కూలుకు పంపించి వాళ్ళతో సమానంగా చూసుకున్నారు.

సీతారావుడి గారికి అప్పట్లో ఆస్తి బాగానే ఉండేది. ఉమ్మడి కుటుంబంలో పదెకరాలు వాటా పంచుకున్నారు. రాను రానూ వ్యవసాయానికి గడ్డురోజులు రావడంతోనూ, ఈయనది కూడా పరిస్థితులకు అనుగుణంగా మారే నైజం కాకపోవడంతోనూ ఆ నష్టాలొచ్చి ఒక్కో ఎకరం భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది. చివరకు రెండున్నరెకరాల చిన్నరైతుగా మిగిలిపోయారు. అదృష్టవశాత్తూ పిల్లలిద్దరూ బాగా చదువుల్లో బాగా రాణించారు. ఊళ్ళో చదువులైన తర్వాత పట్నం చదువులకు వెళ్ళారు.

వ్యవసాయ పెట్టుబడులకు డబ్బు సరిపోక అప్పులు చేస్తున్నారు సీతారావుడుగారు. ఇంటిలో నగలూ, వస్తువులు కూడా గుట్టుగా తాకట్టుపెట్టి నెట్టుకు వస్తున్నారు, వ్యవసాయంలో కూలీలకు ఎక్కువ ఖర్చు అవుతుందని తాను కూడా వాళ్ళలో ఒకడిగా కష్టపడుతున్నారు.

ఇదంతా గమనిస్తున్న సూరిబాబు ఆయనకు భారం కావడం ఇష్టంలేక, కావాలని పరీక్ష తప్పి చదువు మానేసాడు. మీకు తోడుగా ఉంటానంటూ ఆయనతోపాటు పొలం పనులకు వెళ్ళసాగాడు.

***

“టీ పుచ్చుకుని ఎల్దువుగాని రారా సూరీ!” అంటూ పిలిచారు సీతారావుడుగారు. దూడలకు గడ్డికొసి వేద్దామని కొడవలి తీసుకుని బయలుదేరిన సూరిబాబు “అలాగేండి” అంటూ వచ్చి పాల తెపాళలో ఉన్న స్టీలు గ్లాసులు రెండూ తీసి బల్లమీద పెట్టాడు. ఆయన వాటిలో టీ పోసారు. చెరో గ్లాసూ తీసుకుని టీ తాగుతూ పొలం కబుర్లు చెప్పుకోసాగారు. మాటల్లో చెప్పారాయన “పెద్దోడు శ్రీనివాసు, చిన్నోడు శ్రీధరు ఇద్దరూ, మనూళ్ళో పొలం కొందాం, ఎక్కడైనా పొలాలు ఉంటే చూడండి, డబ్బులు పంపుతామని అంటున్నార్రా సూరీ!” అని.

“అలాగేనండి? మంచి పొలం చూసి కొందాం” అన్నాడు సూరిబాబు సంతోషంగా.

ఇన్నాళ్ళకు అయ్యగారికి కష్టాలు పోయి మంచిరోజులొచ్చాయి. ‘శ్రీనివాస్, శ్రీధర్‌లు బాగా చదువుకుని విదేశాలలో మంచి జీతాలతో ఉద్యోగాలు చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. అయ్యగారినీ, అమ్మగారినీ బాగా చూసుకుంటున్నారు’ అనుకున్నాడు.

టీ తాగడం అయ్యాకా సూరిబాబు చేతిలోని ఖాళీ గ్లాసును కూడా సీతారావుడుగారే తీసుకుని కడగడానికి వెళుతుంటే, వద్దని వారించినా వినిపించుకోరని వదిలేసాడు. తాను యజమానిని అన్న తలంపే ఉండదాయనకు. సూరిబాబు వెళ్ళిన గడ్డి కోసుకువచ్చేలోపు సీతారావుడుగారు గేదె పాలు పితికారు. సూరిబాబు మావిడి చెట్టున పరువుకొచ్చిన కాయలుంటే కోసి, బెండమొక్కల నుండి కొన్ని కాయలు కోసాడు. తరువాత తన మొబైల్ ఫోన్లో మరునాటికి అవసరపడే కూలీలను పురమాయించాక అన్నీ తీసుకుని ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకునేసరికి అమ్మగారు రమాదేవిగారు దేవుడి పూజ ముగించుకుని బయటకు వచ్చారు. ఆవిడ తెచ్చిన హారతిని కళ్ల కద్దుకున్నారు సీతారావుడుగారూ, సూరిబాబు.

“సూరీ! బొప్పాయి కాయలు ముగ్గినట్టున్నాయి కోసిపెట్టరా!” అడిగారావిడ.

“అలాగేనమ్మా!” అంటూ పొలం నుంచి తెచ్చినవి అక్కడ పెట్టి పెరట్లోకి వెళ్ళాడు. బొప్పాయి చెట్టుకు పండిన కాయని కాకులు పొడుస్తున్నాయి. సూరిబాబు వాటిని అదిలిస్తుంటే,

“పాపం వాటిని తిననివ్వారా! అవి వదిలేసి పరువుకొచ్చినవికొయ్యి” చెప్పారు సీతారావుడుగారు. బొప్పాయి కాయలుకోసి అక్కడపెట్టి ఇంటికి తన వెళ్ళాడు సూరిబాబు.

***

ఊర్లో ఏవైనా భూములు అమ్మకానికి ఉన్నాయేమో భోగట్టా చేస్తున్న సూరిబాబుకి, ఎవరిదో భూమి అమ్మకానికి ఉందని కబురు వచ్చింది. సీతారావుడి గారిని తీసుకుని వెళ్ళి పొలం చూపించాడు. పదెకరాల ఏకపొలం. నలువైపులా తిరిగి చూసుకున్నారు. అంతా నచ్చడంతో, ఆ రైతు దగ్గరకు వెళ్ళి ధర మాట్లాడుకుని కొంత డబ్బు భజానాగా ఇచ్చారు. ఏకపట్టున అంత దూరం తిరగడంతో బాగా ఆయాసం వచ్చింది సీతారావుడు గారికి. ఆయన బాగా నిస్సత్తువుగా ఉండటం చూసి. “ఈ మద్దిన బాగా నీరసంగా ఉంటన్నారు అయ్యగారూ మీరు. రేపు ఓసారి డాక్టరు గారి దగ్గరకు ఎల్దావండి!” అన్నాడు సూరిబాబు “అలాగే వెళదాం!” అన్నారాయన.

మరునాటి ఉదయమే సీతారావుడు గార్ని తీసుకుని, దగ్గరలోని పట్నంలో ఆసుపత్రికి వెళ్ళాడు సూరిబాబు. డాక్టరు పరీక్షచేసి పొట్టలో గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా ఉందనీ, దానివల్లనే అలా ఆయాసం, నిస్సత్తువ వస్తుందని చెప్పి మందులు వ్రాసిస్తూ, “వేళకు భోజనం చెయ్యండి, కొద్ది రోజులు విశ్రాంతిగా ఉండండి” చెప్పాడు. బయటకు వచ్చి ఆ మందులు కొని తీసుకువస్తూ “మిమ్మల్ని కాస్త నిమ్మళంగా ఉండండీ అంటే ఇనరూ!” అన్నాడు సూరిబాబు చిరుకోపంతో.

“డాక్టర్లు అలాగే చెబుతారు లేరా! నాకేం అవుతుందీ, అన్నీ అవే సర్దుకుంటాయి” చెప్పాడాయన ధీమాగా. “అన్నట్లు ఈ విషయం అమ్మగారికీ, మావాళ్ళకీ చెప్పకు, అనవసరంగా కంగారుపడి పనులు మానుకుని వచ్చేస్తారు. మన పనులు కూడా పాడవుతాయి” చెప్పారాయన.

“అలాగే చెప్పనులెండి” అని అన్నాడు సూరిబాబు.

ఎండాకాలమని నిలిపివేసిన నీటిని, అదను రావడంతో తిరిగి కాలువలకు వదిలారు. ఎండిపోయిన గోదారి కాలవలలోకి నీటి ప్రవాహం చేరుకుంటోంది. అక్కడక్కడా పల్లాల్లో ఉన్న నీటిగుంటల్లో ఊపిరితీసుకుంటూ బతుకుతున్న చితికచేపలు, కొత్తనీరు వచ్చిపడటంతో సంతోషం పట్టలేక ఎగిరెగిరి పడుతునాయి. ఊర్లో అడవాళ్ళంతా వస్తున్న నీట్లో కాస్త పసుపూ కుంకుమా చల్లి కొబ్బరికాయలు కొట్టి గంగమ్మ తల్లికి దణ్ణవెట్టుకుంటున్నారు

పొలంలో మడులన్నిటికీ నీరు పొడవడంతో, ట్రాక్టరు పురమాయించి దమ్ము చేయిస్తున్నారు సీతారావుడుగారు, సూరిబాబు. గట్లెంబడి నాలుగెంపులా తిరుగుతూ అన్ని మూలలా దమ్ము అవుతుందో చూసుకుంటున్నాడు సూరిబాబు. వేసవి ముగుస్తున్నా వానలు పడకపోవడంతో ఎండ ఇంకా గట్టిగానే ఉంది. కళ్ళం గట్టున నుంచొని చూస్తున్న సీతారావుడుగారు హఠాత్తుగా చతికిలబడటం కనిపించింది దూరం నుంచి చూస్తున్న సూరిబాబుకి. పరుగుపరుగున ఆయన దగ్గరకు చేరుకున్నాడు. వెనక్కుపడబోతున్న ఆయనను ఒడిసిపట్టుకన్నాడు. “ఏవైంది అయ్యగారూ!” అన్నాడు ఆందోళనగా!

“నొప్పిగా ఉందిరా!” అన్నారు ఛాతిపై రుద్దుకుంటూ. గొంతు లోతుల్లోనుంచి వస్తునట్టుంది మాట. చెమటలు పట్టి ఒళ్ళంగా చల్లగా తగులుతోంది. ఆయనకు గుండెనొపి వచ్చిందని అర్థమయ్యి “ఓరే! సత్తులూ, ఎంకన్నా బేగా రండిరా!” అని పనోళ్ళని కేకపెట్టి, ఆయనను రెండు చేతుల్తో ఎత్తుకుని మడులకు అడ్డంపడి పరుగెత్తసాగాడు. నిమిషాల్లో పెద్దరోడ్డు కాడికి వచ్చేసారు. ముందు పరుగెట్టుకెళ్ళిన ఎంకన్న రోడ్డువార ఉండే సుబ్బన్నగారి వీధి అరుగుమీద మంచవేస్తే దానిమాద పడుకొబెట్టారాయనను. ఈలోగా సుబ్బన్న కొడుకు తన సెల్ నుంచి హాస్పిటల్‌కి ఫోన్ చేశాడు. తామున్న ప్రాంతం చెప్పడంతో ఆంబులెన్స్ పంపిస్తామని చెప్పారు వాళ్ళు. సూరిబాబు వెంటనే శ్రీనివాస్‌కి ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. శ్రీనివాస్ మ్రాన్పడిపోయాడు. వెంటనే తేరుకుని చెప్పాడు. “నాన్నకు గుండెమీద ఒత్తిడి చేస్తూ, శ్వాస ఆడేలా చేస్తూ ఉండు. ఈలోగా నేను డాక్టరును పంపిస్తాను”

శ్రీనివాస్ చెప్పినట్లు చేస్తూ “అయ్యగారూ! మీకేం కాదు, కంగారుపడకండి” అని సీతారావుడి గారికి ధైర్యం చెబుతున్నాడు. ఈ అంతలో ఆంబులెన్స్ వచ్చేసింది. శ్రీనివాస్ చెప్పిన మీదట ఒక డాక్టరు కూడా వచ్చారు అందులో. సీతారావుడు గారిని ఆంబులెన్స్‌లో ఎక్కించి ముక్కుకు ఆక్సిజను గొట్టం తగిలించారు. డాక్టరుగారు శ్రీనివాస్తో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. “వెంటనే సిటీలో పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. లేకపోతే ప్రమాదమే” చెప్తున్నారు డాక్టరు. “అలాగే వెంటనే తీసుకువెళ్ళండి డాక్టర్” అని శ్రీనివాస్ చెప్పడంతో ఆంబులెన్స్ బయలుదేరింది. తరువాత సూరిబాబు సీతారావుడి గారింటికి వెళ్ళేసరికి విషయం తెలిసిన బంధువులు, ఊళ్ళో ఇరుగుపొరుగు వాళ్ళు వచ్చి ఉన్నారు. బాధపడుతున్న రమాదేవి గారిని సముదాయిస్తున్నారు. తరువాత బంధువులెవరో ఆమెను కూడా కారులో సిటీకి తీసుకువెళ్తారు. కాసేపు అక్కడ ఉండి ఇంటి భద్రత చూసుకుని తన ఇంటికి వెళ్ళాడు సూరిబాబు.

ఒళ్ళంతా మట్టికొట్టుకొనిపోయి, నిస్సత్తువగా ఇంటికి చేరిన భర్తను చూసి “ఏవైందీ!” అడిగింది నాగమణి కంగారుపడుతూ. సీతారావుడి గారికి గుండెనొప్పి వచ్చిన సంగతి చెప్పాడు. “అయ్యో! ఎంత పనయిందీ!”  అంది నొచ్చుకుంటూ. సూరిబాబు స్నానంచేసి వచ్చాకా అన్నం పెట్టింది. ఆ రాత్రి నిద్రపోయేముందు “సూరీ! అయ్యగారికి ఏమయినా జరిగితే మనం ఏ ఆధారం లేనివాళ్ళమయిుపోతామేమోనని భయంగా ఉంది!”  అంది నాగమణి ఆందోళనగా “ఊరుకో! అయ్యేం మాటలూ, అయ్యగారికి ఏమీ కాదు. శుభ్రంగా వచ్చేస్తారు” చెప్పాడు. భర్త గుండెలమీద చెయ్యివేసుకుని నిద్రలోకి జారిపోయింది. ‘నేనంటే ఎంతిష్టం నాగమణికి, నా వెనక ఏమీ లేదని తెలిసి కూడా ఇష్టపడి పెళ్ళిచేసుకుంది.’ అనుకున్నాడు ప్రేమగా ఆమెను దగ్గరగా హత్తుకుంటూ.

మరునాడు శ్రీనివాస్ ఫోన్ చేసి , సీతారావుఁడు గారికి ఆపరేషన్ జరిగిందని, క్షేమంగానే ఉన్నారని చెప్పాడు. ‘దేవుడి దయవలన గండం గట్టెక్కింది’ అంటూ కళ్ళుమూసుకుని దణ్ణవెట్టుకున్నాడు సూరిబాబు.

సీతారావుడుగారు కూడా లేకపోవడంతో ఒంటిచేత్తో పనులు చేయిస్తున్నాడు. కూలీలతో నారు ఊడ్పిస్తున్నాడు సూరిబాబు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

వెళ్ళిపోయాయనుకున్న ప్రాణశక్తులను ఒక్కొక్కటిగా కూడగట్టుకుని కోలుకుంటున్నారు సీతారావుడు గారు. కొడుకులు శ్రీనివాస్, శ్రీధర్, ఇద్దరూ ఉద్యోగాలకు సెలవుపెట్టి, దగ్గరుండి చూసుకుంటున్నారు. “సమయానికి సపర్యలు చేసి త్వరగా ఆసుపత్రికి పంపించడం వల్లే ప్రాణాలు కాపాడగలిగాం. లేకపోతే ప్రాణాలు దక్కేవి కావు” చెప్పాడు శస్త్రచికిత్స చేసిన డాక్టరు. సూరిబాబును తలచుకుని మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు సీతారావుడుగారు.

ఇంతలో ఓ రోజు నాగమణి తనకు ఒంట్లో బావుండటం లేదు అంటూ ఉంటే ఆసుపత్రికి తీసుకువెళ్ళి చూపించాడు సూరిబాబు. డాక్టరు పరీక్ష చేసి ఆమె గర్భవతి అని శుభవార్త చెప్పాడు. అది విని దంపతులిద్దరూ ఆనందభరితమయ్యారు.

పూర్తిగా నయమయ్యాకా ఊరికి వచ్చారు సీతారావుడు గారు. ఆయనను చూసి చాలా సంతోషించాడు సూరిబాబు. ఆయనకేమీ శ్రమ కలగకుండా కంటికిరెప్పలా చూసుకోసాగాడు.

కొత్తగా కొన్న పొలం రిజిస్ట్రేషను ఉందని కారు మాట్లాడుకుని రిజిస్త్రారు ఆఫీసుకు వెళ్ళారు. సీతారావుడు గారు. సూరిబాబుని తోడు తీసుకుని. ఆ రిజిస్ట్రేషన్ వ్యవహారానికి సాక్షి సంతకాలు కావాలని సూరిబాబుతో సంతకాలు పెట్టించారు సీతారావుడుగారు.

తరువాత ఒక రోజున “ఒరేయ్! సూరిబాబూ! తండ్రివి కాబోతున్నావటగా! ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషంరా! మీ ఇద్దరూ రేపు మా ఇంటికి భోజనానికి రండి” అన్నారు రమాదేవిగారు.

“అవన్నీ ఇప్పుడెందుకమ్మగారూ!” అన్నాడు మొహమాట పడిపోతూ సూరిబాబు. “ఇప్పుడు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్నీ పాడయిపోతాయి” అన్నాడు.

“అబ్బా! పనులు ఎప్పుడూ ఉండేవేలే, నీకూ, మీ అయ్యగారికి! అదేం కుదరదు రావలసిందే” చెప్పారావిడ పట్టుపడుతూ. “ఓసారి తీసుకుని రారా! నాకూ ఎన్నాళ్ళనుంచో కోరిక మీ ఇద్దరికీ భోజనం పెట్టాలని” అని సీతారావుడుగారు కూడా అనడంతో సరేనన్నాడు సూరిబాబు.

ఆ మరునాడు తమ ఇంటికి వచ్చిన సూరిబాబు, నాగమణిలతో పాటు భోజనాలు చేసారు సీతారావుడు, రమాదేవి గారు. భోజనాలు అయింతర్వాత సూరిబాబుకి, నాగమణికి కొత్తబట్టలు పెట్టారు. సూరిబాబు ఎంతో మొహమాటపడుతూనే అందుకుని అయ్యగారి పాదాలకు దణ్ణంపెట్టుకున్నాడు. ఇచ్చిన బట్టల్ని సంచిలో పెట్టుకుంటూ ఉండగా ఏవో కాగితాలు కనపడితే తీసి “అయ్యగారూ! ఏవో కాగితాలున్నాయండి!?” అన్నాడు ఆయనకు చూపిస్తూ. “అవి నీవేరా!” అన్నారాయన నవ్వుతూ. వాటిని తీసి చదువుతూ ఆశ్చర్యానికి గురయ్యాడు. అవి తన పేరుమీద రెండున్నర ఎకరాల భూమి వ్రాసిన దస్తావేజులు అవి. సూరి ఏదో మాట్లాడబోతుంటే ఆయనే అన్నారు – “నాకు ఏమైనా అయితే చూసుకోవడానికి కొడుకులున్నారు. నీకెవరున్నారు. అన్నీ నేనే కదా! ఆ రోజు నేను ఆసుపత్రికి చేరేదాకా ప్రాణాలు నిలబెట్టింది నీవేరా సూరీ!” నీళ్లు నిండిన కళ్ళతో.

“ఊరుకోండి అయ్యగారూ! ఇందులో నేను చేసినదేముంది” అన్నాడు అయన చేతులు పట్టుకుని.

“నువ్వే లేకపోతే నేను ఈసరికి నేను ఎక్కడుండేవాడినో, అందుకే నాకు తోచిందిలా చేసాను” చెప్పారాయన కృతజ్ఞత నిండిన గొంతుతో. సీతారావుడుగారి కళ్ళలో నీళ్లు చూసిన సూరిబాబు బాధతో కదిలిపోయాడు.

కాస్త తేరుకున్న తర్వాత ఆ దస్తావేజులు, రమాదేవిగారి చేతిలో పెడుతూ “అమ్మగారూ! నాకీ కాయితాలవీ ఎందుకమ్మా మీ దగ్గరుంచండి” అన్నాడు సూరిబాబు.

ఆవిడ అవి తీసుకుని నాగమణి చేతిలో పెడుతూ “నీకేమీ అక్కర్లేదుగాని, దీని కడుపున ఉన్న బిడ్డకు కావాలి కదా! నీకూ మీ అయ్యగారికి పనుంటే చాలు అన్నం కూడా అక్కర్లేదు” అన్నారు నవ్వుతూ.

ఆనందంలో తడిసి ముద్దవుతున్న నాగమణిని చూసి నవ్వేసాడు సూరిబాబు. ఆడవాళ్ళిద్దరూ పెరట్లో మామిడిచెట్టు దగ్గరకు వెళ్ళి అందిన మామిడికాయలు కోసుకుంటుంన్నారు. అరుగుమీద కూర్చీలో కూర్చున సీతారావుడుగారు స్తంభానికి చేరబడి కూర్చుని నూరిబాబు చెబుతున్న కబుర్లు వింటున్నారు. మూసిన ఆయన కనుల వెనుక ఓ సంతృప్తి దాగివుంది. గుండె గోదారిలా మనసు మడుల్ని తడుపుతూ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here