గుండె గృహంలో నెత్తుటి దీపం

0
2

[dropcap]అ[/dropcap]తడు నా మిత్రుడు విశాల్.

అతని మనసు సువిశాలం.

అతని గుండె గృహం పుష్పకవిమానం.

ఆ గృహంలోకి వస్తూపోతూ… పోతూ వస్తూ ఎందరో

అందులో శాశ్వతంగా కొందరికే స్థానం.

ఆ కొందరిలో…

సంతోషానికి కరకట్టలేసేవాళ్ళు

బాధించేవాళ్ళు, వేధించేవాళ్ళు

కష్టాలు, నష్టాలు కలిగించేవాళ్ళు…

వాళ్ళతో ఖేదం… ఖేదాశ్రువులు

మరికొందరు…

ఆనందానికి… అత్తరద్దేవాళ్ళు

మమత, మమకారం పంచేవాళ్ళు

ఆత్మీయత పంచేవాళ్ళు

వీళ్ళతో మోదం… మోదాశ్రువులు

కొందరితో ఖేదం… కొందరితో మోదం

మోదం… ఖేదం… మోదశ్రువులు… ఖేదాశ్రువులు

ఖేదం నరకం… స్వర్గం

అదే జీవితసత్యం

అతనిది సామాన్య సామాజికం… పేద సామాజికం…

సున్నిత మనసుపొర… అరకొర జీవితం…

ఎన్నో కష్టాలు – కన్నీళ్ళు… నిత్యసమస్యల సమన్లతో పరిష్కార

న్యాయస్థానంలో హాజర్లు…

అతని గుండె గృహం గోడలు సున్నితమైన రక్తకణాలు కాంక్రీట్‍తో నిర్మితం. చిన్నగాలివానలకే ఊగిపోయి అలసిపోయి నిరసిస్తాయి. కాస్తంత ఎండకే వాడిపోయి వేడెక్కుతాయి.  ఆ వేడికీ, ఆ వాడికీ అతని కళ్ళు కార్చిన అడ్డుకోలేని జలప్రవాహం… అతని నయనాలలోని అదృశ్య అఘాధ సముద్రం.

అమర్త్యులు కాని వారి అసంఖ్యాక నయనసమూహాల వెనక తడి ఆరని చెలమల్లా మరెన్నో జలాలు.

అవి అనాదికాలం నుంచీ అశ్రుధారలతో నిండుతూనే వున్నాయి. నరవానర కాలంనుంచీ కార్చిన నయనధార లెక్కపెట్టనలవికానంత మానవమందలు, సీతా ద్రౌపదులు, శకుంతలలు, నలుల హరిసోమక్షత్రియ పుత్రుల అక్షయ అక్షిధార. యుగయుగాల సామాన్యుల సులోచనాల సుజనధార, నయనధార… చెలమల కోనేరు… తడిఆరని కోనేరు ఊట… నర్మదా ప్రవాహమే!

కాని ఆ జలం…

కష్టాల కొలిమి వేడికి ఆవిరై, ఆశ్రుమేఘలై వర్షంగా రూపం మార్చుకున్న ఉష్ణోదకం.

అది అతని దేహంతర్వాహినియై, అతని సువిశాల గుండె గృహంలోకి జారి, కరిగి జిగటగా మారి గోడలకంటుకుంది. గుండెగదుల్లోనుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిన వారి చిత్రపటాలకు గమ్ముగా మారిపోయింది.

దాన్ని వదిలించడం ఎవరికి సాధ్యం?

నేను నాలుగో క్లాసు చదివే రోజుల్లో అతని గుండె గృహంలోకి వడ్డించిన పాయసంలా, అప్రయత్నంగా దొరికిన లిబ్బిలా చాలా సునాయాసంగా ప్రవేశం దక్కింది.

ఆ గృహమంతా హ్యూమన్ సెంటిమెంట్ సెంటువాసనలతో నిండివుంది. దానికున్న రెండు ద్వారాలకు స్నేహామ్ర పల్లవతోరణాలు వ్రేలాడుతున్నాయి. మరో రెండు కిటికీలనుంచీ అహరహాలు స్వేచ్ఛామారుతాలు నునువెచ్చని మిత్రసుధాకిరణ మాధుర్యాన్ని మోసుకొస్తున్నాయి. ఆ అందమైన రెండు గదుల గృహమంతా సుగుణభూషితాలంకారాలే.

అందులోకి ప్రవేశించడం పరమ అదృష్టం.

అతను తక్కువ మాట్లాడుతాడు.

తక్కువ వింటాడు.

తక్కువ నవ్వుతాడు.

ఆ కారణంగా విశాల్‍కు, నాకు మొదట అంత సాన్నిహిత్యం లేదు.

మామూలుగా ఎండకాసే ఒకరోజు… ఎండాకాలం రోజు ఊరిముందున్న అయ్యన్నగారి కపిలబావిలో ఈత నేర్చుకోవడానికి ఉత్సాహరెక్కల్ని తగిలించుకుని చాలామంది పిలకాయలు వచ్చి గింజలు వేస్తే చేరిపోయే కోడిపిల్లల్లా చేరిపోయారు. అప్పటికే నాకు బాగా ఈత వచ్చు. విశాల్ మునగతుండ్ల రెక్కలొకసారి, కలబంద మునగతుండ్ల రెక్కల్ని ఒకసారి నడుముకు కట్టుకుని ఈతకొచ్చేవాడు. ఆ రోజు మునగతుండ్ల రెక్కల్ని మొలిపించుకొని మరీ వచ్చాడు. నీళ్ళలో దిగి ఈత నేర్చుకుంటున్నాడు. నేను బావిలో ఈదులాడుతున్నా. ఎవరి ఈత వారిది. ఎవరి ఆట వారిది. పిల్లలకోడి తన పిల్లల్ని తన రెక్కల క్రింద దాచుకున్నట్లు బావితల్లి ఈతకొట్టే వాళ్ళనందర్ని దరువుల మాటున నీళ్ళపైన దాచుకుంది. ఒకరిపైన ఒకరు నీళ్ళు చల్లుకోవడాలు, నవ్వులు, అరుపులు, కేరింతలు… బావంతా కోలాహలంగా ఉంది. ఆ సమయంలో దరువు పైనుంచి కుప్పిలించి నీళ్ళల్లోకి దూకాడు విశాల్. బావినీళ్ళు అల్లకల్లోలమైపోయాయి. గబుళ్ళున దూకడంతో… తుండ్లు రెక్కలు తెగిపోయాయి. విశాల్ గుండె గుబిళ్ళుమంది, అతనికింకా ఈత రాలేదు. జన్మతః ఈత వచ్చిన చేప గట్టునెట్లో ఈతరాని విశాల్ నీళ్ళలో అలా… గట్టున చేప నీళ్ళలో విశాల్ విలవిలా…

మునుగుతూ తేలుతూ ఊపిరాడక నీళ్ళుతాగుతూ ఉక్కిరిబిక్కిరిగా… వలలో చిక్కిన చేపలా… నీళ్ళలో చిక్కిన విశాల్.

ఎవ్వరూ అతన్ని గమనించడం లేదు.

నేను గమనించి, వెనుకనుంచీ అతని మొలతాడు పట్టుకొని పైకి లేపి గట్టుకు చేర్చాను.

’హమ్మయ్య’ బతికాను’ అనుకున్నాడు.

అదిగో అప్పటినుండి అతని హృదయ భవంతిలో నాకు శాశ్వతంగా చోటు కల్పించబడింది. ఆ విశాల్ విశాల క్షేత్రంలోకి ఎందరో వస్తున్నారు, పోతున్నారు.

ఒకసారి తొక్కుడు కోసం వెంపర్లాడే నెమకిన పూలపూల కోడిపెట్టలా నవ్వుల జుట్టును ముడివేసుకుని క్కో క్కో క్కో అంటూ వచ్చి వాలింది ఒక పాప. అతను దాన్ని ముదిగారం చేశాడు… మురిసిపోయాడు. కొన్నిరోజుల తర్వాత అదీ ఎగిరిపోయింది. మరోసారి పెట్టకోళ్ళ వెంటబడి కొటకరించే నల్లకోడి పుంజులా… ఎర్రటి జుట్టును కదిలించుకుంటూ తుఫాను కాలపు ఈదురుగాలిలా ఒకతను అందులోకి దూసుకొచ్చాడు… వాడి ఊపుకి గుండె ఇంటిగోడలు అటూ ఇటూ ఊగిపోయాయి. హృదయకంపం వచ్చిందేమోనని అందులోవున్న వాళ్ళందరూ అరిచారు. హాహాకారాలు చేశారు. ‘వాడికి తొక్కల్లక్షణం ఎక్కువ. తోలేయి బయటికి’ అని ఘీ పెట్టారు. ఆ గోల వినలేక వచ్చినవాడు వచ్చినట్లే పారిపోయాడు.

ఇలా ఎందరో ఆగమనం…. తిరిగి వెలిగమనం…

ఆగమనం…. వెలిగమనం….

ఇలాంటి పనికిమాలిన మరిన్ని మానవపక్షులు గుండె కుడ్యాలపై వాలి ఎగిరిపోయాయి.

అక్కడ శాశ్వతంగా తిష్టవేసిన అతని తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, అయినవాళ్ళు, పోయినవాళ్ళు అక్కడే వున్నారు.

అందరితో సందడిగా, సంతోషంగా, వేడుగ్గా, ఆనందదీపాల వెలుగులతో ప్రతిహృదిగది ప్రశాంతంగా వుంది.

ఆ గుండె ఒక ప్రపంచ బంతి. గ్లోబల్ హౌస్.

అందులో రెండే అరలు. ఏ అరలోనూ అరమరికలు లేవు.

అందులో చేరిన ప్రతిఒక్కరికీ… ప్రతి అరా ఒక వరం… ఒక్కో అర ఒక్కో కాంతి కత్తికి వర. ప్రతి గది ప్రేమ పెన్నిధి.

ఆ గుండె క్షేత్రంలో నిరంతర హర్ష వర్షం. హర్ష వర్ష వసంతం.

ఆ హృది వీథి అంతా.. శాంతి, శాంతి, ప్రశాంతిః.

ఆ ప్రశాంతిని అశాంతిని చేసే ఓ బొమ్మ కొత్తగా వచ్చి చేరింది.

అది పెట పెటలాడుతూ వచ్చి వాలిన పాలపిట్ట. ఆలోచనల గుట్ట… ఆవేశాల పుట్ట…

విశాల్ విశాల హృదయంలోకి వచ్చి చేరిన జీవితభాగస్వామి.

అదొక అందమైన రెక్కల గుర్రం. ఎర్రగా… బుర్రగా… ఎదగని బుర్రతో… దిగువ మనసుతో… హృదయ లోకంలో స్వేచ్చగా విహరించి, హృదయ సింహాసనాన్ని ఆక్రమించి, అధికారాన్ని చేజిక్కించుకుంది.

“ఈ ఇల్లు నాది. ఇందులో ఎవ్వరికి చోటు లేదు. వుంటే చేటు మీకే. పొండి” అంటూ అరవసాగింది. తరమసాగింది.

అరవడం…. తరమడం…. తన్ని తగలేయడం…

హృదిగదుల్లో క్రూరంగా, కఠినంగా వ్యవహరిస్తూ… వీథిలో కొచ్చినపుడు మాత్రం. అర్దూలం పూసుకుని, గొప్ప యేసికం వేసుకున్న వీధినాటకంలో పాత్రలా… స్వార్థం, ఈర్ష, ద్వేషం రంగుల్ని కప్పి పుచ్చుకుని ఉత్తమ ఇల్లాలిగా, ఒక సీతలా… ఒక సావిత్రిలా… సతీసుమతిలా… సతీసావిత్రిలా…  తెగ నటించేసేది.

వీధిలో వీధి నాటకం.

హృదిలో నిజస్వరూపం.

రానురాను ఆమె పెత్తనమే పెద్దతనాన్ని సైతం పాతిపెట్ట సాగింది. చేతిలో కూసిగా చెక్కిన కోలకట్టెతో కొడుతూ ఆడబిడ్డల్ని ఆడిపోసుకుని తన్ని తరిమేసింది.

విశాల్ అన్నదమ్ముల వీపుల్ని కూసి కూసి కోలకట్టెతో… మడకెద్దుల ముడ్డుల్ని పొడిచినట్టు పొడిచి పొడిచి, రక్తగాయాలు చేసి ఆ ఇంటివైపైనా చూడని రీతిలో, హింసించి, తరిమేసింది. ఇంకా పోని బంధుగణాన్ని, మిత్రబృందాన్ని గట్టిగా చెవులు పగిలిపోయేలా అరచి అరచి భయపెట్టి బయటికి తోలేసింది.

ఆమె ఈ గదిలోకి వస్తే నేను ఆ గదిలోకి, ఆమె ఆ గదిలోకి వస్తే నేను ఈ గదిలోకి… ఓ మూలకు దేక్కొని దేక్కొని జరిగి, దాక్కొని దాక్కొని అప్పుడప్పుడు బయటికొస్తూ పోతూనే వున్నాను. చివరికి అందులో శాశ్వతంగా తిష్టవేసి ఆ హృదినిధికి నిజమైన యజమానురాలైపోయి నియంతలా మారిపోయిందితను.

ఆ చిన్న రాజ్యానికి ఆమే ఏకైక రాణి. ఏకైక రాజు. రాణీ… రాజూ… మంత్రి… గింత్రీ… అన్నీ ఆమే.

అందులోకి అడుగుపెట్టిన వారిని కట్టె పట్టుకుని తరిమి తరిమి కొడుతూ గుండెకోట ప్రధానగుమ్మంలోనే కూర్చుంది – పద్మవ్యూహంలోకి అడ్డుగా నిలబడ్డ సింధురాజులా…

అతను సైంధవుడు… ఆమె సైంధవి.

ఆమె దెబ్బకెందరో పరుగు లంఘించుకున్నారు.

మరెందరో క్షతగాత్రులై పారిపోయారు.

పరుగు లంఘించడం – పారిపోవడం.

నేనెలాగో తప్పించుకుంటూనే వున్నాను.

ఆమె కంట పడకుండా… ఈ గదిలోనుంచి ఆ గదిలోకి…  సూపర్ మాన్‍లా ఇక్కడ మాయమై అక్కడ… అక్కడ అదృశ్యమై ఇక్కడ… అలా ఎన్ని రోజులు…?

వెళ్ళిపోయినవారి చాలామంది చిత్రపటాలు గోడలకు అతుక్కుని వున్నాయి. ఆ చిత్రపటాల్లో నేనూ ఒక్కడిగా నిలచిపోవాలనుకున్నాను. చిన్నగా… చెన్నైకి వెళ్ళిపోయాను.

అక్కడే నాకు ఉద్యోగం సద్యోగం.

ఉత్… సత్… యోగం….

ఆ యోగంలో… విశాల్ గుండె గృహానికి రావడం… పోవడం…. రెంటి మధ్య ఎక్కువకాలం…

అయినా నాకు బదులుగా… గోడకు నా చిత్రపటం… నవ్వుతూ… వ్రేలాడుతూ… అక్కడి పరిస్థితులకు సాక్షిగా… ఇప్పుడా యింటికి ఎవ్వరూ రావడం లేదు… అంతా శూన్యం… శూన్య సామ్రాజ్యం… రక్తసింహాసనం పైన… ఆమె… హాసనం… సింహాసనం… అంతే…

ఆమె తప్ప… ఏ మనిషి జాడా లేదు.

“మనుషులే లేనప్పుడు ఆ చిత్రపటాలు మాత్రం దేనికి?” అనుకున్నది. అనుకున్నదీ ఆలస్యం.

పైకి లేచింది. చేయిని గాలిలోకి లేపింది.

ఆ మధ్య చనిపోయిన ఓ సన్యాసి ‘ఓం’ అంటే చేతిలోకి శివలింగాలు వచ్చినట్టు అమె చేతిలోకి ఇనుపగోకుడు బిల్ల ప్రత్యక్షమైంది. గుండె గదుల గోడలకంటుకుని ఉన్న చిత్రపటాలను గోకడం ఆరంభించింది.

మొదట విశాల్ అన్నదమ్ములు, చుట్టాల చిత్రపటాలు కర్రుకర్రున గోకింది. ఎడతెరిపి లేకుండా గోకింది. రేయింబవళ్ళు రెచ్చిపోయి గోకింది.

గోకేకొద్ది హృదిగది గోడలు పలుచబడుతున్నాయి. చిత్రపటాలు చెత్తగా మారి… కిందపడుతున్నాయి. ఆ తుక్కంతా కిటికీల కడ్డుపడి గాలీ వెలుతురు మూసుకు పోయింది.

ఇప్పుడవి కిటికీలు కావు… కంపుకొట్టే కటకటాలు.

కిటికీలు… కటకటాలు… వాటి చువ్వలు కొరగాని గవ్వలు…

“గవ్వకు సాటిరాని పలుగాకుల మూకలకు ఈ గదులు కాకూడదు స్థావరాలు” వంటివి ఆమె భావాలు. అవి స్వార్థానికి భావాలు…. అహంభావాలు… భీషణ దూషణాలు… కిటికీల సడలిన కీలు… దెబ్బకు రాలు.

మరికొందరి చిత్రపటాలను గోకింది. ఆ గోకుడు… గుండె గృహముఖ ద్వారాలకడ్డు పడుతోంది. గోకీ… గోకీ…ఆమె అలసిపోయింది.

అయినా… మరికొన్ని చిత్రపటాలను ఎంత గోకినా అలాగేవున్నాయి… పోవడం లేదు… వాటిలో విశాల్ జన్మకారకుల చిత్రపటాలు నవ్వుతున్నాయి. ఆమె గోకే కొద్దీ… మిగిలినవీ పకపకా… ఆమె మనసు వికవికా…

పకపక… వికవిక… గుండెగృహమంతా అవే నవ్వులు.

శ్రీమతి విశాల్ మతి చెదిరిపోయింది.

“ఎంతగోకినా ఈ పాడు బొమ్మలు పోలే” అనుకుని ఇంకా గట్టిగా… రెచ్చిపోయి గోకసాగింది. చేతుల్లో సత్తువ కోల్పోయేదాకా గోకింది. ఆమె గోకుడుతో సన్నబడిపోయిన ఆ యింటిగోడలు పెచ్చులూడిపోయి, ఎప్పుడు పడిపోతాయోనన్న స్థితికి చేరుకున్నాయి.

“కర్రు…కర్రు….”

గోకుడు శబ్దం… పెచ్చుమోరిన కోపం…

ఎర్రెర్రగా మారిన ఆమె నయనం.

ఎంతగోకినా పూర్తిగా పోని చిత్రపటాలు… ఇంకా… ఇంకా నవ్వటాలు…

“మమ్మల్ని తరిమేశావ్! మా బొమ్మల్ని పీకలేవు…” అంటూ అత్త ముఖం… వికట్టాటహాసం చేసింది.

ఆమె గుండె మండిపోయింది.

“ఈ హృది గదికుడ్యాలు రాలిపోయేంత వరకు మమ్మల్ని గోకలేవు…పో…”

ఛాలెంజ్ విసిరింది మామ ముఖం.

ఇక తట్టుకోలేకపోయింది తను.

గోకుడుబిల్లను మామ ముఖాన… గోడకేసి కొట్టింది.

అది టింగున ఎగిరి ప్రధాన ద్వారంలో పడింది. అదీ అడ్డంగా పడింది. వచ్చే కాస్తంత వెలుతురు గాలి సన్నగిల్లింది.

ఆమె చేయి పైకిలేచింది.

ఈసారి ఓ గునపం ప్రత్యక్షమయింది.

గునపంతో “పోండి” అంటూ అత్తామామల బొమ్మల గుండెలకేసి పొడిచింది.

అంతే……

***

నాకు ఫోన్.

నీ మిత్రుడికి సీరియస్.

వాట్సప్ మెసేజ్.

“నీ మిత్రుడు హాస్పిటల్లో”

ముఖపుస్తకం ప్రతిపేజీలోనూ

“స్టార్ట్ ఇమిడియట్‍లీ”

‘అయ్యో! విశాల్‍కు ఏమైందో’ని

నాలో కంగారు.

చాలారోజుల తర్వాత మళ్ళీ ఆ గృహంలోకి…

ఊఁహుఁ నా వల్ల కాలేదు.

ద్వారం దగ్గర సైంధవి. అన్నిదారులు, కిటికీలు… మూయబడి ఉన్నాయి… చెత్తాచెదారంతో పేరుకుపోయిన గోకుడు తుక్కుతో నిండిపోయిన గుండె గౄహం మాత్రం….

లోపలికి నాస్తి పథం….

లోదారి? వెలిదారి?

లేనిలోదారి… రాని వెలిదారి… మూతబడిన నరాల రహదారి… ఆ దారిలో సన్నగా వెలుగుతున్న నెత్తుటిబుడ్డే… పోటు… గుండెపోటు…

ఆసుపత్రిలో విశాల్… సర్జరీకి సిద్దంగా ఉన్నాడు…. అయినా అతనిగుండె గృహంలోకి తిరిగి ప్రవేశించాలన్న నా ప్రయత్నం… సాగుతూనే వుంది… నిర్విరామంగా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here