గుండె నిండా జీలుబండనే

1
14

[dropcap]గు[/dropcap]డిపల్లిలో మాదిగ్గేరి ఆగ్నేయం దిక్కున విసిరివేసినట్టు ఉన్నది. ఏ హక్కుల్లేక మొన్నమొన్నటి దాక మెతుకుల్లేక ఆకలి చేసిన దాడిలో ఓటమిపాలైన వాళ్ళే మాదిగోళ్ళు. అంటరాని మట్టిమిద్దెలు మొత్తం యాభై, అరవైదాకుంటాయి. మల్లా ఆ యిండ్లల్లో ఎత్తపొళ్ళు, కొడిదలోల్లు అని రెండు గోత్రాలుంటాయి. ఈ మాదిగొల్లు సూడసక్కగా ఒకే దండం మీది తుంకల్లాగా ఉంటారు. ఏమాటైన, ముచ్చటైన, యిసమైన, అమృతమైన, ఆకలైనా, అనారోగ్యమైనా, బాధయినా, భారమైనా కల్సె పంచుకుంటారు. ఎవ్వరికి కష్టమొచ్చిన సర్వశక్తులు వొడ్డి ఆదుకుంటారు. వీళ్లను జయించటం ఎవరికైనా ఓ పట్టాన వొశం కాకుంటది. గీళ్లకు రెండు ఎల్లమ్మ గుళ్ళుంటాయి. వొటి కొడిదలోల్ల ఎల్లమ్మైతే, ఎత్తపోళ్ల ఎల్లమ్మ ఇంగొక్కటి. ఈ రెండు ఎల్లమ్మలకు ఒకేసారి సాక వొస్తరు, నైవేద్యం పెడ్తరు. గాడిబాయికి నీళ్లకెల్ల దీస్తారు. గీళ్ల కర్రగల్లా (లందా)లు వేరు. వాళ్ల కర్రగల్లాలు వేరు. అయిన కల్సె ఉంటారు. ఊర్లో అగ్రకులపొల్ల గొడ్డు సస్తే వొంతుల వారిగా సెర్మం వొల్చి, గొడ్డు మాంసాన్ని కుప్పలేసుకొని సమానంగా పంచుకుంటరు. వొలిసిన సెర్మంకు సున్నం, తంగేడు సెక్క యింకేవో దినుసులు పట్టించి ముద్దుగా మురిగేసి, మురుగంతా కనుమరుగైనాక తోలు తీసి ఆరుబయట ఆరేసి, తోలు సాగేటందుకు చేతులతో లాగేవారు. తోలు ఆరినంకా పన్రాయి మీదేసి సాగేటట్లు గూటంతో గుద్ది, మొదటగా అచ్చులు కోసి తరువాత చెప్పుకప్పల ముక్కారులు కోసి, సక్కని చెప్పుల్జతల్జేసి పెద్ద కులపొల్లకు ఇస్తుండ్రి. వోలిచ్చే గింజలు దీస్కొని బతుకును తోలు సాగదీసినట్లు సాగదీసి బతుకుతుండ్రి!

కొందరు మ్యాతరి తనం చేసి, ఇంకొందరు రెడ్లతోని గాసం ఉంటుండ్రి. గాలికక్కయ్య వుఠ్ఠి అమాయకుడు. రెడ్డితో గాసం ఉన్నడు. పొద్దంతా ఎద్దు వోలే పనిజేస్తడు. రెండెడ్లను అలవగొడడు. సక్కగా స్కేలు దీస్కొని గీత కొట్టినట్లు సాలు తోలుతడు. సేను సెల్కలంటే యమ ప్రేమ. రోజు ఆ ఎడ్లను సూడకపోతే కక్కయ్యకు కడుపుల మసివోసినట్లు ఉంటది. రెడ్డి కాపురం అంతా తన కాపురం కన్నా ఎక్కువనుకొని లీనమై పన్జేస్తడు.

***

ఆ రోజు తెల్లవారుజామున సెట్టు సెరిసగం పొద్దైంది. సందికంత దిక్కు, పీతిగుండు తిక్కు కుక్కలు మూతి మీన్కెట్టి కుయ్… మంటు మొర్గుతున్నవి. ఊరగుట్టకాడ నక్కలరుస్తున్నవి. గాలికక్కయ్య పొర్లుక లేసిండు. గొంగడి కొప్పెర పెట్టి సేతుల కిందికి ముసురుకున్నడు.

సల్లసలికాలం కావటంతో సేతులు వొన్కుతుండవి. మా శేరి సందుగుంట గాలి ఎక్కడ పోలేక జుయ్ జుయ్‌మని శబ్దమొస్తుంది. రెండు పిల్లులు కొట్లాడ్తూ చిన్నపిల్లలు ఏడిసినట్లే అరుస్తున్నవి. ఇవేవి పట్టించుకోక గాలి కక్కయ్య శేరిసందు గుండా నర్సిరెడ్డి ఇంటికి పోతున్నడు. ఇంటి కోయటాలకు కర్రెకుక్క గుర్తుపట్టి తోకనూపుతూ కుయ్ కుయ్ మన్కుంట దగ్గరికొచ్చింది. రెండు కాళ్లు లేపి తొడలకు ఆనిచ్చింది. కర్రెకుక్కను చ్చో..చ్చో.. చ్చో అన్నడు. సేతితో నిమిరి ఎడ్లగాటి కాడికి పోయి ఇంత బుడ్డ కట్టేసిండు. కొంత సేపు ఆగినాక ఇడి నీళ్లు దాపి ఎద్దుల మూతులకు దుసరితీగల బుట్లు పెట్టిండు. కొమ్ములకు పగ్గాలు కట్టి ఆండ్రె, దుకిమోకు నాగలి మేడితోకకు గట్టిండు. కాడిమాకుకు బ్యారాలు కట్టి లొటుక్కొడితే ఎద్దులే కొమ్ముల్లో మెడల మీద పెట్టుకున్నవి. సక్కగా ఒయరాల సెల్కులకు వోయి నాగలికి యాటబెట్టిండు. ముల్లు కట్టె తీస్కొని కోండ్రలు వేసి తెల్లాటాలకు ఎకరం దుక్కి ఇరువాలుతో దున్నిండు. అంబటాలకు అంతా ఖతం చేసిండు.

అంబటాల తరువాత పటేలు పంచె పైకెట్టుకోని సెల్కదిక్కొచ్చి “ఏరా! గాలిగా! అప్పట్నుంచి యిదే దున్నినావురా?” అని ఓర సూపు సుసుకుంట అడిగిండు. ‘ఇంగెప్పుడూ కుంటి పటేలా’ అని నవ్వుతూ సెప్పిండు గాలికక్కయ్య. పటేలా అని నెత్తి గోక్కుంటు అనంగానే ‘బీడీలు లేవయ్య’ అని ‘ఆ యిగ నీ కష్టానికి బీడీలు కూడా’ అని రెండు బీడీలు ఇస్తే దోసిలి పట్టుకోని తీసుకున్నడు. ఎంటనే బీడి ముక్క తీస్కోని చెకుముకి రాయి మీద దూది పెట్టి కొట్టి ఉంగులంతో బీడీ ఎలిగించి రుమాలు కట్టుకోని మల్లా నాగలిపట్టిండు. రెండు కోండ్రలు దున్నినాక మా కర్రెమ్మ పిన్ని గంప నెత్తిన పెట్టుకోని చేతుల్తో పట్టుకోకుండా నెత్తితోనే బ్యాలెన్స్ చేస్తూ దున్నిన దుక్కిలవట్కా వొచ్చి మొత్క సెట్టు దగ్గర అంబలి వెట్టి ఒక కూతవెట్టి “ఇగో సిగిరె మురలాయది నాటువెటనీకే గుత్తకు పట్కున్నం నేను వోతుండా అంబలి తాగు” అని చెప్పి వొడుపు మీద పరుగుతో వెళ్లిపోయింది.

మా వాడలో కర్రమ్మసిన్నిని సూస్తే మృగం సహితం కొత్త సాధు జీవితం ప్రారంభిస్తది. వైరాల్లేని, నేరాల్లేని కొత్త జీవితం నేర్పుతది. పొర్లుక పొద్దున్నే లేసి ఊరగుట్టకు, పెద్దగట్టుకు మూలసింతకు, గండ్లి సెలుకలకు ఎల్లి పొడుగైన తంగేడు మోపులను తెస్తది. ఇంతంతా అంబలిలో పచ్చి నిరుపకాయ కోరి తిన్కుంటా అంబలి తాగి గూటందిస్కోని తంగేడు కట్టెలు గొట్టి, చెక్క తీసి ఆరబెట్టేవారు. కుల్యాల అయ్యెటాలకు మల్ల ఎక్కువొల్ల సెల్కలకు కూలిపోయేది.

***

స్వాతంత్ర్యం తొలి దినాళ్లల్లో వొంటి పై అంగిబట్టా లేని దళితులు మా వెలివాడలో దీనంగా బతుకుతున్నారు. సామ్యవాద తరహా స్వాతంత్ర్య భావనలో మాదిగలకు అప్పుడెప్పుడో ఎనబైయ్యేవ దశకంలో కొన్ని రాళ్లు, బండలతో కూడిన ఇనాం భూములు, పోరంబోకు భూములిచ్చింది గౌవిరిమెంట్. ఇచ్చినప్పుడే నట్లతో కూడిన భూములు, ఇసుక భూములు, బండ భూములు మరి ప్రత్యేకంగా మాదిగోల్లకే ఏరికోరి ఎనకముందు సూడకుండా పంచేసిండ్రు. అందుట్లో కొన్ని సవుడు భూములు కూడా ఉన్నై. ఈ సవుడు భూముల్లో సవుట పూల గడ్డి తప్ప సేను మొలువదు. అ సవుట పూలగడ్డిని పసులు కూడా మురుకసూసి తినకుండా వదిలేస్తవి. అసోంటి భూములు పంచి పనైందనిపించింది గౌవిరిమెంటు.

పసురంలాగ పనిచేసే మాదిగలు వొంటి పై కురుపుల వలె చెలుకలపై ఉన్న ‘నట్ల’ను తవ్వి భూమంతా సదును చేసింది. పలుగురాళ్ల పుట్టలను తవ్వి చెమట సుక్కలను గింజల్లాగ సల్లి భూములను సదును చేస్తుంటే అగ్గి వర్షం కురిపించే మండే సూర్యుడు పక్కకు వోయిండు, మేఘాల సాటుకు జరిగిండు.

ఆడోళ్లందరు పెండ తట్టలు దీస్కొని పలుగురాళ్లను ఏరిండ్రు. వీళ్ల సెల్కలకు ఆన్కోని ‘జీలుబండ’ ఉంటది. అది కొండంత అండ వీళ్లకు. తెల్లగా పరుచుకొని పడుకుంది. ఎంతో కష్ట నిష్ఠూరాలకోర్చి ఎరువు కుళ్ళు, కుంటలోని వొండు కొట్టి పొలాలను సారవంతం చేసుకున్నరు. ‘కొత్త చెలుక’లో పండే పంటను జీలుబండ ఎప్పుడు నవ్వుతూ పిలిచి తన ఒంటి పై పొతం చేస్కోని పోమ్మని కాపుదన పొల్లని పిల్చి మేలు చేస్తుండే జీలుబండ.

గాలికక్కయ్య గాసం ఉండుడు బంజేసిండు. గౌరిమెంట్ ఇచ్చిన కొత్త చెలుకలో భూమి దున్నుకుని బతుకుతుండు. గాలికక్కయ్య బండంటే ‘గుండె’లాగా సుసుకుంటడు. బండ పై కంకో, కాయొ బంతిగట్టి సెత్తంతా బండ పై వోదిలేస్తే కస్కున కసురుకుంటడు. వో దినం గాలికక్కయ్య గడెం ఇడ్సి పలుపులు సుట్టి బండమీద వెట్టి ఎద్దులను మోత్కల కుంట్లకు తీస్కోని పోయి నీలుదాపి కొంచెం సేపు నర్లెంగ పెట్టుకు కట్టేసిండు. ఇంతంతా మజ్జివోటు అంబలిలో కలిపి సింతకాయ తొక్కును సప్పరించి సింత బిచ్చను బయటికి ఊసేశిండు. కొంచేపు తరువాత ఎడ్లను యిడిసిండు. అవి జీలుబండ సుట్టు మేస్తుంటే దుసరి తీగలను తెంపిండు. రెండు దుసరితీగ కడాలను సుట్టి, తీగలతో ఎద్దు బుట్లను అల్లుతూ రాగమై రాలుతుండు. బండ పై ఎల్లెలుకలా పడుకోని “సిన్నంట్ల దీపం లేదు, పెద్దింట్ల దీపం లేదు లంజింట్ల లైటు రన్నో నా కొడుక రాములన్న” అంటు పాటెత్తుకున్నాడు.

***

జొన్న మొల్కలు, కంది మొల్కలు బురుక పిట్టోలే గుబురుగా పెరిగినవి. మొల్కలన్ని పరమటి గాలికి ఊగుతుంటే పాటకు నాట్యం చేస్తున్నట్లు ఉంటూ, సుస్తున్నంగానే జొన్న సేళ్లు పొట్టతో ఉండవట్టె. ఈ యేడు ఎంతలేదన్న రెండు పుట్ల జొన్న గింజలు పంతాయని ఆనందంతో మాదిగోళ్లంతా పొంగిపోవట్రి. సంకరాతిరి రానేవచ్చె. సేను కోతలకొచ్చింది. ఎల్లమ్మకు మొక్కి ఓ మంచి దినం సుస్కోని మొగోళ్లు సేనుకొస్తే ఆడోళ్ళు జొన్నకంకి గంపల్లకు తెంపిండ్రు. నిండిన గంప నిండినట్లు జీలుబండ పైకి తెచ్చి కుప్పలుగా పోస్తుండ్రు. రెండ్రోజులు సేనంతా కోసిండ్రు. మరో రెండ్రోజులు దంతెలు తీస్కోని కంక్యంతా పలుగనూకి ఎండకు ఆరబెట్టిండ్రు. ఎన్నెల కాంతి జలజలా రాలుతుండే. నలబైగడాల ఎద్దుల లెంకలు నర్లెంగ చెట్లకు కట్టేసిండ్రు. కొన్నింటిని బండ గుండ్లకు కట్టిండ్రు. రేపు కంకి బంతి కట్టాలని అందరు అనుకున్నరు. ఆ రాత్రి అందరు తినేటాలకు పదయింది. జీలుబండపై ‘దోనె’లో నీళ్లు నిలువుండే ‘సర్కె’ ఉంది. అందులో నీళ్లు టెంకాయపాల వలె ఉంటాయి. అందుట్లో వొంగి సూస్తే ఎవ్వరి మొకంవాలకు అద్దములాగ కనవడది. అందరు ఆ నీళ్లు తాగిండ్రు.

సన్నబాలీగాడు శ్యానాసరదా మనిషి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటాడు. తప్పెట గొట్టడం, కోలాటమేయడం, ఎల్లమ్మ ఆటలోని పాటలు పాడటం శ్యానా యిష్టం. సన్నవాలిగాడు సద్ది తిన్నడు. ఎవ్వరి కుప్పలకాడ వాళ్లు కుసున్నది సూసిండు. ఇది నచ్చలేదు. ఎంటనే ‘పోషన్నా… ఓ పోషన్న’ అని పిలువవట్టె. ఏందిరా బాలిగా అని పోషన్న పలికిండు. ఏం చేస్తున్నరే అని అడిగిండు. ఏం చేయాలిరా యిప్పుడు పానవంతా అలీసింది అని సుట్ట తాగుతు చెప్పిండు. కోలాటమేతం రాండ్రే అని, అట్లా ఒక్కొక్కరిని పిలుచుకుండ్రు. కోలాటం ఉదులు పట్టి కంచులాంటి కంటాలెత్తిండ్రు. పాటకనుగుణంగా కట్టెలసప్పుడు దరువు పడుతుంది. ఆ పాటలకు పశువులు తలలూపుతున్నవి. పాటకు పరవశించి దుమ్ము గాలిలో నాట్యమాడుతుంటే “వొద్దుర సుమ్మి ఓ మాదిగన్నా, రావొద్దు నావాడకు నల్లనివాడ నా మాదిగన్న రావొద్దు నా జాడకు” అని పాడుతుంటే చెట్ల కొమ్మలు తలలూపినవి.

***

‘బండ’ ఆటకు పాటకు ఆధారమైంది. కష్టానికి సుఖానికి వేదికయింది. కంకికి, సుంకుకు కళ్లం అయింది. ఎద్దులకి, గొగ్గికి అడ్డగా మారింది. గింజలకు, గంజికి గుమ్మిగా మారింది. ఏటికి వెన్నెలకు నెలవైంది. మాదిగోళ్లకి బతుకైంది. బరోషైంది. కష్టానికి, సమిష్టికి దరువైంది. జానా పాటలకు ఆదెరువైంది.

పిల్లలకు జారుడుబండైంది. జొన్న గింజలు, కంకులు ఆరేసుకునే ఆధారమైంది. పిండోలే ఎన్నెల కురిస్తే, ఎన్నెల పావురాలు మా జొన్న గింజల పై వాలిపోతుండేవి. మా తైదకంకుల పై, జొన్న కుప్పలపై ఎన్నెల కాంతులు ఎలిగిపోతుండేయి. పోషన్న కాళ్లు రత్నాల రాశుల్లో నాగటి సాళ్లలాగా జొన్న గింజలను దున్నేవాడు. జొన్న గింజల కాంతిని సూసి ఎన్నెల సిన్నబోయింది. జొన్నరాశుల కావలి ఉంటు ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రేమ సముద్రమై, పూలమాలలై నవ్వేవారు. చల్లని సహ సంబంధాలను అల్లుకోని ఆయిగా కుట్రల పుట్రలు లేకుండా నవ్వేవారు. శాంతికి సహనానికి చిహ్నమైంది బండ. వాళ్లకు ‘గుండె నిండా జీలుబండనే’.

బండ మాదిగ జాతికి అండగా ఉండే తీరు రాజారెడ్డికి, రాంరెడ్డికి, గోపాల్ రెడ్డికి నచ్చలేదు. కళ్లంలో గింజలను సూసి ఓర్వలేనివాళ్లు. ఒకప్పుడు బండించు భూములనిచ్చి, ఇప్పుడేమో ఇచ్చినందుకు మోసపోయామని బాధపడ్తుండ్రు. ఈ బండను ఎటైన మాదిగోళ్లకు ఉపయోగపడకూడదని ఇసారించుకొన్నరు. ఒకనాడు రెడ్లంతా కలిసి జడ్చర్లకు పోయిండ్రు. అక్కడ హన్మంతరెడ్డి కంకర మిషేను ఏస్తడని వాళ్లకు తెలుసు. హన్మంత్ రెడ్డి వొరుసకు బంధువే అయితడు. ఎట్టనన్నా మీరు మా ఊరి బండమీద కంకర మిషెను వేయాలని గీంవులాడిండ్రు. హన్మంత్ రెడ్డి అంగీకరించిండు.

రెడ్లంతా కలిసి గుడిపల్లి పట్వారీ మోహిని దగ్గరికోయిండ్రు. నీకు యాభైవేల రూపాయలిస్తం నీవు మాదిగోల్ల భూములను బండతో కలిపి మా పేర పట్వా సేయమని అడిగిండ్రు. మోహిని ఇబ్బందైతది నేను చేయనన్నడు.

ఎంటనే ఎమ్మార్వో ఎంకటేశ్వర రావు దగ్గరికి పోయిండ్రు.

ఎస్సై సాబ్‌ను కూడ కల్సుకున్నరు. వీళ్లకు ఇంతంతా యిచ్చిండ్రంటా. ఇట్లా ఓ దిక్కు పైరవీ చేసుకుంటనే పరిమిషన్ రాకముందే బండమీద హన్మంత్ రెడ్డి కంకర మిషెన్ వేసిండు.

ఎన్కసిరి ఏమైన అయితే సూస్కుందమని ఎనక ముందు సూడకుండా ఏసిండ్రు. ఇది సూసి మాదిగోళ్లు ఏందబ్బా యిదేందో మీ షెనేస్తుండ్రు మా బండమీద అని అనుకున్నరు.

కాని మిషెను ఏసినంత వరకు ఏమీ అనలేదు. ఒకపూట మాదిగోళ్లందరు రచ్చకట్ట దగ్గర మర్రి సెట్టు కింద కూసున్నరు.

బండ పైన మిషెను ఎందుకేసిండ్రు అని అడగనీకే బండకాడికి పోయిండ్రు.

బండ ఎందుకేసిండ్రు పటేలా అని అడిగిండ్రు.

అప్పుడు గోపాల్ రెడ్డి ఈ భూములు ప్రభుత్వపు భూములు. ఇవి మీకు పట్ట భూములు కావు. ప్రభుత్వమే ఏస్కోమంటే, మేం వేస్కున్నాం అని సెప్పిండ్రు. అప్పుడు మాదిగోళ్లంతా నాగకర్నూల్ ఎమ్మార్వో సాబ్ ను కల్సిండ్రు. అప్పటికే రెడ్లంత ఆయనను కల్పిండ్రు. ఎమ్మార్వో గారు ఏంది చెప్పుండ్రి మీ సమస్య అని అడిగిండు. మా ఇనాం భూముల్లో హన్మంత్ రెడ్డి కంకర మిషెను వేసిండ్రు సారూ అని చెప్పిండ్రు. అప్పటికే రెడ్లు ఎమ్మార్వోకు యాభైవేల రూపాయలిచ్చిండ్రు. కాబట్టి అప్పుడు ఎమ్మార్వో వో లాజిక్కుతో మాట్లాడిండు. “సూడండి మీకు ప్రభుత్వం దున్నుకోమని భూములు మాత్రమే ఇచ్చింది, బండ ఇవ్వలేదు” అని చెప్పిండు. మీకు హక్కు గిక్కు ఉంటే భూమి పైననే గాని బండ పై మాత్రము గాదు అని చెపుండు.

రోడ్డు డెవలప్ చేయాలని ప్రభుత్వమే మీ బండ పై మిషెన్ వేయించింది. కంకర కావాలిగా మరి అని అన్నాడు. మేం ఒప్పుకోం అని మాదిగోళ్లంతా మేం కలెక్టర్ ఆఫీసు ముందర ధర్నా చేస్తాం అంటే భయపడిండ్రు ఎమ్మార్వో గారు. మళ్లోసారి కల్సి నిదానంగా మాట్లాడుకుందాంగాని ఓ వారం తరువాత రాండ్రి అని అన్నడు.

ఈ వారం లోపల కొంతమంది మాదిగోళ్లని విడదీయడానికి ప్రణాళిక వేసిండ్రు. ఇందులో తాగుడుకు లొంగేవాళ్లను రెడ్లంతా ఎంచుకున్నరు. మాదిగోళ్లు రెండు పార్టీల్లో ఉన్నరు. పచ్చ పార్టీలో కొందరు, ఎర్ర పార్టీలో కొందరు. పచ్చ పార్టీ మాదిగోళ్లకి కుట్రతో నయానో బయానో ఇచ్చిండ్రు. సిన్నగా ఒక వర్గపు మాదిగోళ్లని బండను ఇవ్వడానికి ఒప్పుకునేటట్లు చేసిండ్రు. వీళ్లకు ఇరవై వేల రూపాయలిచ్చిండ్రు. ఎర్ర మాదిగోళ్లు ఇవ్వొద్దని, పసుపు మాదిగోళ్లు ఇవ్వాలని పట్టుపట్టిండ్రు. తాగినోళ్లకు ముద్దుగా మందు, మటన్ తినవెట్టి తాగిచ్చిండ్రు. తాగిన తరువాత ఒక వర్గం వారు ఇష్టముతోనే బండను ఇచ్చినట్లు పత్రాలపై సంతకాలు పెట్టిండ్రు. ఇగ మాదిగ్గేరిలో రడేం రాజుకున్నది. ఎప్పుడూ ఒకటిగా ఉండేవాళ్లు, కలహించుకొన్న ఒక్కటైయ్యే వాళ్ళు, విడిపోయినట్లనిపించినా విడిపోని వాళ్లు, పెనుగులాడిన ఒకరినొకరు ప్రేమించుకునే వార్లు, ముక్కలైనా ముద్దోచ్చేవారు, ఒక్కటౌవ్వడానికి చిక్కులు తొలగించుకోని దిక్కులు చూపేవారు నేడు రెడ్ల దెబ్బకు దడుసుకోని ఒకరినొకరు ద్వేషించుకొని సీకటిని ప్రేమిస్తున్నారు. ఒకరినొకరు తన్నుకుంటున్నారు. పచ్చ పార్టీ రెడ్డిలు పచ్చ పార్టీ మాదిగోళ్లని రెచ్చగొడితే గేరిలో మాదీగోల్లంతా గుండం నిప్పులాగా మండుతున్నారు. ఒకరి పైనొకరు సెగలు కక్కుతున్నారు. తగువులాడు కున్నరు. తన్నుకున్నరు.

హన్మంత్ రెడ్డి సిన్నగా కమ్యూనిస్టు నర్సిరెడ్డిని కూడా తన వైపునకు తిప్పుకున్నడు. కమ్యూనిస్టు నర్సిరెడ్డిని హన్మంత్ రెడ్డి ఎట్లోనో వరుస కలుపున్నడు. సిన్నగా నర్సిరెడ్డి స్వరం మారుతున్నడు. కమ్యూనిస్టు మాదిగోళ్లని బండ ఇచ్చేటందుకు ఒప్పించిండు. కడాకు వీళ్లు ఒప్పుకున్నరు. సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చేటట్లు ఒప్పుకోని సంతకం పెట్టిండ్రు. ఆ ఇరువై వేలు తీస్కొని పాడువడ్డా రెండు ఎల్లమ్మ గుళ్లను బాగు చేయించుకోని పండుగ జేస్తే ఖతమైపోయినాయి. ఇప్పుడు బండ.. రెడ్డిబండయింది. తాతల కాలం నాటి జ్ఞాపకాల జీలుబండ, జ్ఞాపకాల మసకల్లోకి జారిపోతున్నది. యికసించిన పువ్వోలే నవ్వే బండ యిప్పుడు వాడుపట్టిన పువ్వోలెయ్యింది.

***

హన్మంతరెడ్డి నాలుగు ట్రాక్టర్లు తెచ్చిండు. వో కంప్రీషన్ తెచ్చిండు. బండపై డైరుమెంట్ రోజు పేల్చుతున్నడు. బండనిండా డైరుమెంట్ తొల్లు గొడుతుంటే, ఏసుక్రీస్తును సిలువపై సీలలతో గుద్దినట్లు అన్పిస్తుండే. మురగసిర కార్తెచ్చింది. ఎప్పటిలా మాదిగోళ్లు గింజలేసిండ్రు. గుబురుగా మొల్కలు మొలుస్తు రెండు మారాకులేసాయి. మొల్కలన్ని పెద్దగవుతున్నవి. హన్మంత్ రెడ్డి బండ నిండా తొల్లు గొట్టి పెద్ద డైరుమెంటు లేపిండు. ఈక్విడార్ లోని కోటపాక్షి అగ్నిపర్వతం, జపాన్ ఫ్యూజియమా అగ్ని పర్వతం పేలితే ఎగిసిపడే బ్లో అవుట్ వోలే బండపై దుమ్ముతో పాటు రాళ్లు ఎగిరిపడుతుండె. డైరుమెంట్ పేల్చితే సెలనిండా ఉల్కలు రాలిపడ్డటు సనసన్నని రాళ్లు లేసిపడుతుంటే కంజు పిట్టోలో ఉన్న మొక్కలన్ని తలలిరిగి, గిలగిల కొట్టుకొనే కోడి వలే ఎగిరిపడుతుండే. ఇట్లా పది రోజులకు వోసారి డైరుమెంట్ పెట్టి బండంతా పలగదీసిండ్రు. సెల్కలనిండా రాతిదుమ్ము పడి మొల్కలన్ని సచ్చిపోతుండే. కాపుదనం సేయడం కష్టమైంది. ఎవసాయం దండగైంది. బండ వాడి పండగైంది. ఎవసాయం బంజేసి అందరు బండ మీదికే కంకర కొట్టనీకే పనికొస్తున్నరు. రోజుకు యాభై రూపాయల కూలిచ్చి హన్మంతరెడ్డి అందరిని పంపించేస్తుండు. దొడ్డు కంకర, సన కంకర అమ్ముకొని రెడ్డి కోటీశ్వరుడైతే బండ యిచ్చిన మాదిగోళ్లు బికారులైనారు.

సానమంది మాదిగోళ్ళు పంటలు పండక భూములిడ్సి దేశాలు పోయిండ్రు. వాండ్ల యిండ్లు మూతపడినవి. వాకిళ్లు పొక్కిల్లేసినాయి. ఇడుపుల కుండే ఎర్రమన్ను పెచ్చు పెచ్చులు వూడిపోయింది. కొన్ని కొంపలకు కంపేసిండ్రు. వాకిట్లో ఎంపలల్లం మొలిచింది. చావున ఎతుక్కుంటు ఎన్నో మైళ్ల దూరం పొట్ట సేతబట్టుకోని పోయిందే పోకడా మల్లి తిరిగొస్తే ఒట్టు.

కొంతమంది ఎన్ని కష్టాలున్న సీకు చింతలను లెక్కచేయక మీసాల బిగుకు ఉన్న ఊరును, కన్నతల్లిని వోదలలే. బండ పైననే హన్మంతరెడ్డితో గాసం ఉన్నరు. కొన్ని రోజులకు ఊరిగట్టుకు ఆనుకోని రిజర్వాయర్ పడ్డది. భూములల్లా పెద్ద కాల్వలు తీస్తుండ్రి. పట్ట భూములకైతే పైసలు కట్టిస్తుండ్రి. మాదిగోళ్లవి ఇనాం భూములు కాబట్టి వీళ్ల చెలకల నుండి కాలువ పోయినా ఒక్క రూపాయ రాలేదు.

జీవితపు బరువును మోయలేక పైకెళ్ళే వారు వెళ్లిండ్రు. దేశంబోయి శవాలైన వారు కొందరు. ఉన్న వూరిలోనే హక్కుల్లేని కూలీలై కొందరు. ముసలి బర్రెలాగ జీవితాన్ని నిరాశతో గడుపుతున్నారు. కొద్ది రోజులకే ఊరంతా ఎండిన చెట్టులా, ఆకురాలిన చెట్టులా, కొమ్మలు నరికిన చెట్టులా, గుశికాడికి వేర్లు తీసిన చెట్టులా తయారైంది మా ఊరు. క్రమంగా అందరు దేశాలు పోయిండ్రు. వలసెల్లిండ్రు. తిరిగి తెల్లటి బట్టల్లో శవాల మూటలై వొచ్చిండ్రు.

సిగ్గులేని రోజులు. మాదిగోళ్లు లేని ఊర్లో చెమట వాసన లేదు. మట్టిన వాసన లేదు. మనిషి వాసన లేదు. ఆఖరికి ఊరు ఊరంత గత్తర వాసన. ఒకనాడు వానకెదురు సూసిన మాదిగోళ్లు నేడు సావుకెదురుసూస్తుండ్రు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here