Site icon Sanchika

గుండె శబ్దం చెవులకి

[dropcap]రో[/dropcap]జూలానే ఆఫీసు నుండి ఇంటికొచ్చాడు శేఖరం. కానీ అతని మనసు మాత్రం ఏ మాత్రం ప్రశాంతంగా లేదు. చాలా గడబిడగా, గందరగోళంగా ఉంది. పసుపు కొమ్ములు మిక్సీలో వేసినట్టూ, గతుకుల రోడ్డుపై డొక్కు స్కూటర్‌ నడిపినట్టూ, గూడ్సు బండి పెద్ద శబ్దంతో కూత వేస్తూ వెళ్తున్నంత గజిబిజిగా ఉంది. కారణం ఈరోజు ఆఫీసులో జరిగిన ఆ విషయo అతని భార్య లలితకి ఎలా చెప్పాలా అని తత్తరపడుతూ భయంతో గుటకలు మింగుతూ ఇంటిలోనికి అడుగుపెట్టాడు. ఇంతగా అతను భయపడి చావడానికి గల కారణం, లలిత కాస్త చెయ్యాడిoపు మనిషీ, కోపిష్టీనూ. ఎంత కోపం అంటే, మొన్నామధ్య ఆమె పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పలేదని కసిగా అతని బుగ్గని గట్టిగా గిల్లింది. గిల్లడం అంటే అలా ఇలా కాదు. తన ఒంట్లో బలాన్నంతా చూపుడు వేలూ, బొటనవేలులోకి తెచ్చుకుని, అతని బుగ్గ బూరెలా వాచి, కమిలిపోయేలాగన్నమాట. అలాగే ఆ తర్వాతోసారి, శేఖరం టి.వి చూస్తూ “ఆ హీరోయిన్ని చూడు చీర ఎంత బాగా అందంగా, పొందికగా కట్టుకుందో. నువ్వూ కడతావ్ అప్పడాల కర్రకి పూతరేకు చుట్టినట్టు” అని శేఖరం నోరు జారి అన్న ఒక్కమాటకి, తల బొప్పి కట్టేలా రెండు మొట్టికాయలూ, ముక్కు పగిలేలా ఓ రెండు పిడిగుద్దులూ గుద్ది తాళి కళ్ల కద్దుకుంది. అందుకే తన భార్యంటే అంత, కాదు కొండంత భయం.

అలా శేఖరం ఇంట్లోకి పిల్లిలా రాగానే, లలితే అతనికి ఎదురొస్తూ, “ఏంటండీ! అలా నీరసంగా తోటకూర కాడలా వాడిపోయి, ఓ పక్కకి వాలిపోయి మరీ వస్తున్నారు” అని ఆమె ఓ వైపు అడుగుతున్నా, అవేవీ పట్టించుకోకుండా, ఆమె వైపు కనీసం సూటిగా కూడా చూడకుండా బాత్రూంలోకి దూరి, ‘ఇప్పుడు ఆ విషయాలు నా ఆలికి చెప్తే, కాళిక అవుతుందేమోనని భయంగా ఉందిరా దేవుడో’, అని తనలో తాను అనుకుని ముఖం, కాళ్లూ చేతులు కడుక్కుని, బట్టలు మార్చుకుని, మళ్లీ అలానే నేల చూపులు చూస్తూ లలితని తప్పించుకుంటూ వస్తుండగా, ఆమె గమనించి, “ఏవండీ, ఓసారి ఇటు వస్తారా?” అనడంతో, “ఆఁ..అలాగే” అని ఓ రెండు గుటకలు మింగి, భయంగా, బెదురుగా ఆమెకి దగ్గరగా నడిచి వెళ్ళసాగాడు.

అసలు శేఖరం ఇంతలా భయపడటానికి గల కారణం ఏవిటంటే, ఈరోజు మధాహ్నం సమయంలో, అతని ఆఫీసులో అందరూ లంచ్ చేయడానికని వెళ్లిపోయారు. సరిగ్గా ఆ సమయంలోనే ఆ కొత్తగా వచ్చిన డేటా ఎంట్రీ చేసే అమ్మాయి తెగ కులుకుతూ, హొయలు పోతూ వచ్చి, శేఖరం పక్కన కూర్చుని బాతాకానీ మొదలెట్టింది. తర్వాత తెగ తియ్యగా మాట్లాడి, మాట్లాడి చెయ్యి సాచి ‘మీకు జాతకం చూడటం వచ్చా’ అని గారం పోతూ అడిగింది. అంత అందమైన అమ్మాయి, పైగా ఆ చేయిని చూసిన ఏ మగాడూ, ఆ క్షణంలో జాతకాలు చెప్పడం తెలీదని చెప్పలేడు. అందుకే శేఖరం కూడా బహీనంగా మారి ‘వచ్చు’ అని ఆ చేతిని చపాతీ ముద్దలా పిసికేస్తూ, జ్యోతిష్యం పేరుతో తనకి తెల్సిన, తెలియని విషయాలు అన్నీ పోగేసి చెప్తూనే మరో పక్క ఆ తమపాకులాంటి చేతిని ఇంకా కక్కుర్తిగా పిసికేసాడు. అలా ఆమె, అతనితో ఆ కొంత సేపు పరిచయానికే ఇరవై వేలు అప్పుగా అడిగింది. సరే లేవనో, తర్వాతిస్తాననో చెప్పకుండా నాలుక మందంతో, అంటే “నువ్వు ఇప్పటిదాకా కులికిందీ, మాట, చేయి కలిపిందీ ఇందుకన్నమాట” అని అతను అనేసరికి, ఆమెకి మంటెక్కిపోయింది. వొంటి కాలిపై లేచింది. “అవసరానికని అడిగితే అసహ్యంగా మాట్లాడతావా” అంటూ రుసరుసలాడుతూ వెళ్లి మేనేజర్‌కి తనతో శేఖరం అసభ్యంగా ప్రవర్తించాడనీ, చేయి పట్టుకున్నాడనీ కన్నీళ్లతో సహా కంప్లైంట్‌ చేసింది. దాంతో అతని ఉద్యోగం ఊడిపోయింది. ఇప్పుడు ఈ విషయం లలితతో ఎలా చెప్పాలి. అసలే ఎప్పుడూ ‘తక్కువ జీతం, బోడి ఉద్యోగం అనవసరంగా మిమ్మల్ని కట్టుకున్నాను’ అని అతనిపై అప్పుడప్పుడూ నసుగుతూ విసుగుతూనే ఉంటుంది. పైగా మొన్న వాళ్ల తమ్ముడు కూర్మారావు ఓ ఎం.ఎఎల్.ఏ. కాళ్లూ, గడ్డాలూ పట్టుకుని ఓ పెద్ద అంకె గల జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తే, పెళ్లాం తరుపువారు ఇప్పిస్తే చేరడమేంటనే అహంతో ‘ఛ వద్దు పో’ అనేశాడు. అలాంటిది ఇప్పుడు ఉన్న ఈ ఉద్యోగం కూడా పోయిందని చెప్తే ఇంకేముంటుంది. తన పీక పట్టుకుంటుంది. పైగా ఈ ఉద్యోగం పోవడానికి ఓ అమ్మాయితో తను చేసిన రాసలీల కారణం అని అసలు విషయం చెప్తే, వామ్మో, పోనీ అబద్దం చెప్తే, అది ఇంకా డేంజరు. ఎందుకంటే లలిత దూరపు చుట్టం, బాబాయి వరస బంధువు అదే సంస్ద వేరే బ్రాంచిలో మేనేజరుగా పని చేస్తున్నాడు. ఇప్పుడు కాకపోయిననా తర్వాతైనా ఈ విషయం వాడి చెవిన పడుతుంది. అతని ద్వారా గానీ లలితకి విషయం తెలిస్తే, తన చీర కొంగుతో అతన్ని ఉరి తీసే ప్రమాదముంది. అవన్నీ ఆలోచిస్తూ భయపడి చస్తూ ఆమె వద్దకు నెమ్మెదిగా నడిచివస్తున్నాడు. అయితే అతని భయానికి మళ్ళీ అతని గుండె వేగం పెరిగి, గుండె శబ్దం అతని చెవులకి విన్పిస్తున్నట్టనిపించిందతనికి.

అంతలో లలితే శేఖరం దగ్గరగా వస్తూ, “ఏంటండీ అలా రెండడుగులు వేసి రబ్బరు బొమ్మలా బిగుసుకుపోయి, శూన్యంలోకి చూస్తూ ఏం ఆలోచిస్తున్నారు” అడిగింది.

ఆమె అడిగిన మాటకీ, చూసిన చూపుకీ తెగ తడబడి పోతూ, నేల చూపులు చూస్తూ, నెమ్మెదిగా ఓ అడుగు వెనక్కి జరిగి, ఊపిరి గట్టిగా పీల్చి, ‘చెప్పేస్తాను. అన్నిటికీ ఆ భగవంతుడున్నాడు’ అని జరిగినదంతా పూసగుచ్చినట్టు ఆమెకి చెప్పేసి, బిక్కు బిక్కుమని ఆమె వంక నెమ్మెదిగా తలెత్తి చూశాడు. కానీ అతని కళ్లని అతనే నమ్మలేకపోయాడు. ఒకసారి నులుముకుని మళ్లీ చూసాడు. తర్వాత తనకి తానే తొడపాశం పెట్టుకుని, ‘వామ్మో’ అనుకుని, ఇది నిజమే అని రూడీ చేసుకున్నాడు. కారణం, ఆమె అంతా విన్నాక కూడా చిరునవ్వు చిందించడమే. కోపంతో తన ముక్కు పగలగొడుతుందేమేనని భయపడ్డాడు. కానీ అలా చేయకపోవడంతో కొంచెం సంతోషం, కొంచెం సందేహంతో అలాగే ఆమె వంక నీళ్లు నములుతూ చూస్తుండిపోయాడు.

అతని సందేహం అర్థం చేసుకున్నదానిలా ఆమే అతనికి దగ్గరగా వచ్చి, “గాబరా పడకండి. మీరు ఇప్పుడు మీ ఆఫీసులో జరిగిందని చెప్పినదంతా నేను ఆడించిన డ్రామానే” చెప్పిందామె.

మళ్లీ ఏం అర్థం కానట్టు చూశాడామెవంక. అయితే ఇప్పుడు అతని ముఖంలో హఠాత్తుగా కొంచెం ప్రశాంతత మాత్రం తొంగి చూసింది.

మళ్లీ ఆమే అందుకుంటూ, “ఏవీ లేదండీ. మరేమో నేను ఎన్నిసార్లు మీరు ఇప్పుడు చేస్తున్న ఈ చిన్న జీతపు ఉద్యోగం మానేసి, వేరే మంచి ఉద్యోగం చూసుకోమని చెప్పినా మీరు ఎప్పుడూ వినలేదు. ఆ ఉద్యోగం మాననన్నారు. అందుకే కొంచెం కొత్తగా ఆలోచించాను. మీ ఆఫీసులో పనిచేసే విమల అనే అమ్మాయితో కల్సి ఇలా నాటకం ఆడిoచి, మిమ్మల్ని వాళ్లంతట వాళ్లే ఉద్యోగంలోంచి తీసేసేలా చేసాను. ఉన్న ఉద్యోగం ఎలాగూ పోయింది కనుక, నన్ను నాలుగు తిట్లు తిడతారు ఆనక. వేరే మార్గం లేక, తప్పక ఈ పెద్ద ఉద్యోగంలో చేరతారనే నమ్మకంతో ఇలా చేశాను. మా మావయ్య ఎంతో కష్టపడి ఈ ఉద్యోగం మీకొచ్చేలా చేశారట. చేరిపోదురూ” చెప్పిందామె బ్రతిమాలుతున్న స్వరంతో. చెప్పి టి.వి ఆన్ చేసింది.

ఆమె మాటలు విన్న శేఖరం, అల్లం, వెల్లులి కలిపి తిన్నంత మంటగా చూస్తూ “ఛీ. అసలు ఇపుడు నీకు ఫ్లాపైన సినిమాని పది సార్లు చూపించాలన్నంత కోపంగా ఉంది నాకిపుడు. నీకేమైనా పిచ్చా. నేనెంత టెన్షను పడ్డానో తెలుసా. హార్టు ఎటాక్ మాత్రం రాలేదంతే. నీ మొగుడు దర్జాగా బతకాలీ అనే సదుద్దేశంతోనే నువ్విలా చేసినా, పద్దతి మాత్రం ఇది కాదు. ఆ టెన్షనులో నాకేమన్నా అయ్యింటే” అని ఆమెని మరింకేదో అనేంతలో ఓ క్షణం ఆలోచనలో పడి, ‘ఔనూ నేను చేయి పట్టుకున్నానని నాపై కంప్లైంట్‌ చేసిన అమ్మాయి పేరు అమల కదా! విమలంటుందేవిటి ఖర్మ. అసలు ఆమెని ఇవాళ నేను కనీసం పలకరించను కూడా పలకరించలేదే. అంటే! నా ఉద్యోగం నా ప్రవర్తన కారణంగానే పోయిందని తెలియక, ఆమె వేసిన ప్లాన్‌ ప్రకారమే, అంటే విమల అనే అమ్మాయితో ఆడిoచిన నాటకం కారణంగానే నా ఉద్యోగం ఊడిoదనుకుంటోంది ఖర్మ. ఒకవేళ ఇప్పుడో, ఎప్పుడో దీనికి అసలు విషయం తెలిస్తే’ అని శేఖరం ఆలోచిస్తుండగానే, మళ్లీ తన గుండె చప్పుడు చెవులకి విన్పిస్తున్నట్టనిపించిందతనికి. అంతలోనే ‘ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక’ అనే పాట మొదలవగానే కసిగా టి.వి కట్టేశాడు. ఆ రిమోట్‌ని నేలకేసి కొట్టేశాడు.

Exit mobile version