Site icon Sanchika

గుంటూరు జిల్లా వైభవం

[dropcap]ఆ[/dropcap]చార్య నాగార్జునుడి బోధనలు ఆలకించి తరించిన మహిమాన్విత ప్రదేశం!
కవి సార్వభౌముడు శ్రీనాథుడు నడయాడిన చోటు..
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా.. పద్యం పల్లవించిన భూమి!
జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న రావూరి భరద్వాజుడిని కన్న విజ్ఞాన ఘని!
‘అమరేశ్వరుడై’ మహాశివుడు వెలసిన పుణ్యస్థలి!
‘నరసింహుడై’ శ్రీమహావిష్ణువు కొలువైవున్న దివ్యభూమి!
బ్రహ్మకి ఆలయం కలిగిన చేబ్రోలు.. గుంటూరు జిల్లాలోని భాగమే!
చాపకూటి మహా యజ్ఞంతో అశేషజనుల ఆదరాభిమానాలు అందుకున్న పలనాటి బ్రహ్మన్న..
మహిళా రత్నం పల్నాటి నాగమ్మ..
స్వాతంత్ర్య పోరాట ధీరులు వావిలాల గోపాలకృష్ణయ్య,ఆచార్య ఎన్.జి.రంగా..
బుర్రకథా పితామహుడు నాజర్..
ప్రముఖ సినీనటులు జగ్గయ్య,కృష్ణ..
కళాతపస్వి కె.విశ్వనాథ్..
హాస్యనటులు బ్రహ్మానందం..
ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా..
క్రేన్ గ్రంధి సుబ్బారావు వంటి
ఎందరో పేరెన్నిక గన్న గొప్పవారికి జన్మనిచ్చిన సుప్రసిద్ధ భూమి!
ఆకుపచ్చని తివాచీ పరిచినట్టుగా పంటచేలు..
పాడిపంటలతో సంవృద్ధియై..
దేశ అభ్యున్నతికి సంకేతమై గుంటూరు సీమ వర్ధిల్లుతూ విరాజిల్లుతుంటే ..
ఈ మట్టి పరిమళం..
ఈ సీమ సౌజన్యం..
ఈ నేల సౌభాగ్యం..
ఇక్కడి ప్రజల పలకరింపుల మమకారాలు..
ఎన్ని తీరులా వర్ణించినా తక్కువే!
ఈ నేలలో పండే మిర్చి ఘాటు జగద్విదితం!
ఆకుకూరలెన్ని వున్నా
ఆకుకూరల్లో గోంగూర ప్రత్యేకం..
ఈ నేలలో పండిన గోంగూర రుచిలో అమోఘం!
వెలకట్టలేని ఔన్నత్యం..
పౌరుషాల పట్టింపులు..
చేసే ప్రతి పనిలో నైపుణ్యం..
ఆకట్టుకునే ఆహార్యం .. మా గుంటూరు వారికే సొంతం!

Exit mobile version