Site icon Sanchika

గుర్తుకొస్తున్నాయి

[మాయా ఏంజిలో రచించిన ‘Remembering’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(వెంటాడి వేధించే జ్ఞాపకాలను దయ్యాలతో పోలుస్తూ, ఒక అంతర్ముఖీన స్థితిని చిత్రించిన కవిత ఇది.)

~

నేను వాటి బెదిరింపులను తిరస్కరించి
అబద్ధాలతో జవాబు చెప్పిననప్పటి నుంచి
మృదువైన బూడిద రంగు దయ్యాలు
నా భుజాలని పట్టుకు ఊపేస్తాయి
నా కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూస్తాయి..

గంభీరమైన జ్ఞాపకాలు
నా పెదవుల పైన
అలవాటుగా ప్రదర్శితమవుతాయి
అభావంగా నిస్సహాయంగా
అలా పడి ఉంటాన్నేను..

అవి నా ఆత్మని నా నుంచి విడగొడతాయి..

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


మాయావాక్కులు కొన్ని:

  1. నువ్వేదైనా నేర్చుకున్నట్టయితే దాన్ని ఇతరులకు నేర్పించు. నీకేదైనా లభించినట్టయితే దాన్ని ఇతరులతో పంచుకో.
  2. నిన్ను నువ్వు వినడం అలవరచుకో. ఆ నిశ్శబ్దంలో నువ్వు ఆ దైవం స్వరం కూడా వినగలవు.
  3. నా జీవితాన వెనకకు తొంగి చూసుకున్నట్లయితే, జీవితం నాకిచ్చిన సాహిత్యం అనే శక్తిని చూసుకొని మురిసిపోతాను, గర్వపడతాను. ఈ ప్రపంచంలో నేను మళ్ళీ మళ్ళీ తిరిగి కోరుకునేది ఏదైనా ఉందంటే అది పుస్తక పఠనం మాత్రమే. నా తొలి యవ్వనపు రోజులనుంచీ నేను చేసింది అదే.
  4. ఇతరులు తనపై రువ్విన రాళ్ళు ఇటుకలతో – తెలివైన స్త్రీ తన విజయవంతమైన భవిష్యత్తుకి బలమైన పునాది వేసుకుంటుంది.
  5. ఎప్పుడూ నువ్వు అతి సాధారణంగా ఉండేందుకు ప్రయత్నించినట్టయితే, నువ్వెంత అసాధారణంగా కనిపిపిస్తావో నువు ఊహించను కూడా లేవు.
  6. గతానికి సంబంధించిన నకారాత్మక ఆలోచనలన్నిటినుంచి విముక్తనయ్యాను. భవిష్యత్తును గురించిన భయాలన్నింటినీ వదిలేసాను.
Exit mobile version