గురు బ్రహ్మ

6
1

[dropcap]బ[/dropcap]యట కట్టమింద ఈతసాప పర్సుకోని బజారులైటు యల్తుర్లో హోంవర్కులు సేసుకుంటా వుండాను. సేన్నుంచి వొచ్చిన నాయన – ఎద్దుల్ని గాటికి కట్టేసి జలాట్లేకి పొయ్యి ఆదరా.. బాదరా పెయ్యి మింద నాలుగు సెంబులు ఉడుకు నీళ్ళు సల్లుకోని బైటకొచ్చినాడు. శ్రద్ధతో రాసుకుంటున్న నాతుక్కు(1) సూస్తా నిలబడి, ‘రాసుకునేది అయిపోయింటే లేసిరా నాయనా బువ్వ తిందాం. ఆకలైతుండాదని!’ అని పిలిస్తే, ‘రోంత సేపు తాలు(2) నాయనా! ఈ వొక్క పేజీ రాసేసుకుంటే పూర్తి అయిపోతాద’ని అన్యాను.

‘అట్లేగాన్ల్యా!’ అంటా.. గాడిపాట్లో ఎద్దులకి రొండు పిడికిళ్ళు మ్యాతేసి పొయ్యి ఇంట్లో కుసునుకోని…,

‘ఆ పెదలాలన్న సదువుని పూర్తి సేసి మనలాంటోళ్ళ కోసమే వొచ్చి వూరు సేరుకున్నట్లున్నాడు. ప్రవేటుబడి పెట్టి వూర్లో పిల్లలందర్ని దగ్గరికి సేర్సుకోని నాలుగచ్చరాలు నేర్పి పుణ్యం కట్టుకుంటుండాడు మహానుబావుడు. గొప్పోళ్ళకి గొప్ప బుద్ధులే వుంటాయి. ల్యాకపోతే దుడ్లంటే ఎవునికి సేదు ఈ రోజుల్లోన. యన్ని ఎకరాలున్న ఆసామి కొడుకైతే మాత్రం ఒఠ్ఠి పుణ్యానికి విద్య నేర్పేటోడు పనికట్టుకోని బుడికినా సిక్కుతాడా.. ఈ దుడ్ల కాలంలోన!? పైగా వుండేటోనికే ఇంగా దుడ్లు సంపాదన మింద ఆశ యక్కువ. మనిషికుండే మంచి లచ్చనాలన్ని కలిగినోళ్ళు నూటికో.. కోటికో ఆ సుక్కల్లో శంద్రునిలక్క ఒక్కడుంటాడు. నాకైతే ఆ ఒక్కడు ఇతనేనేమో అనిపిస్తా వుండాది. ఇట్లాంటోడు వూరికొక్కడైనా పుట్టల్ల! అప్పుడు ఈ దేశం బాగుపడతాద’ని, ‘సారు’ మాకు సేస్తున్న ‘మంచి’ని అమ్మతో సెప్పి నెపుకు(3) సేసుకుంటా.. రెండు సేతులు జోడించి, ‘వాళ్ళమ్మ కడుపు సల్లగుండల్ల’ని ఆ ‘పులికొండ రంగస్వామి’ని యేడుకుంటా వుండాడు.

ఇదే తీరున వూరువూరంతా తల్సుకుంటావుంటారు మా ‘సార్’ని. కోతిని కదా హనుమంతునిగా మార్సిన ఆ శ్రీరామునిలక్క వూర్లో పిల్లలందర్ని మంచి విధ్యార్థులుగా తీర్చిదిద్ది, వాళ్ళకో దావ సూపే ప్రయత్నం సేస్తావుండాడని, ఆతని రుణమునిట్లా తల్సుకుంటేనన్న తీరుతాది కదా! అని వాళ్ళ ఆలోసన.

ఓ ఐదారేండ్ల కిందట మా సదువుల సంగతి ఇట్లుండేది కాదుల్యా! ఆ కత యేరే రకంగుండేది. నిద్రలేసింది తడువులేదు జతలు కట్టుకోని సెరువులు, సెట్లు, గుట్లు తిరుక్కుంట నగ్గ (4) సిదుగు సేసేటోళ్ళం. పొద్దున అమ్మానాయనలు సేన్లకి పోతా…పోతా నాలుగు బిస్కత్తులు కొనిచ్చి గవుర్మెంటు బళ్ళో ఇడిసి పెట్టి పోతే; ఆడ యానాడూ కుదురుగుండి అచ్చరాలు దిద్దుకునిందిల్యా! ఒంటికనో రెంటికనో; సెప్పి బళ్ళో నుంచి జారుకునేటోళ్ళం! సారొళ్ళు సింత బర్లతో పెయ్యి సింతపొండు అయ్యేతట్ల కొట్టినా సదువుమిందికి మాత్రం ధ్యాస మళ్ళేది కాదు. యాయాళ పొద్దున ఆ రామప్ప గుట్ట, నల్దొన గుట్ట, సింతమాకులు, పక్కీరమ్మ సెరువు అన్ని… ‘ఆడుకుందాం రాండి..!’ అని సేతులు సాచి పిలుస్తున్నట్ల అనిపించి దాండ్ల మిందికే పెరికేది మనసు.

మాపుసారొచ్చి (5) మా వాలకాన్ని కనిపెట్టి, ‘ఏం నాయనా! ఇయ్యాళ గూడా బడికి ఎగనామం పెట్టినట్లుండావు!’ అని అమ్మానాయనలు అడిగితే, నోటికొచ్చింది యాదో ఒగటి సుల్లాబల్లా (6) సెప్పి, తప్పిచ్చుకునేటోళ్ళం. వాళ్ళగీన నమ్మకం కలగకపోతే ‘సుంకులమ్మవ్వ’ తోడు, అనుమంతరాయుని తోడు అని నెత్తిమింద సెయ్యి పెట్టుకోని నమ్మించేటోళ్ళం. అప్పటికీ ఒగోనాడు నమ్మితే నమ్మేటోళ్ళు లేదంటే నాలుగు దెబ్బలు తగిలిచ్చేటోళ్ళు! ఆ దెబ్బలు తప్పిచ్చుకునే దావలు మనకి తెలిసిందే కద.. అమ్మ కొడితే నాయనొద్దికి, నాయన కొడితే అమ్మొద్దికి వురికి పొయ్యి తలదాసుకోవడం. ఈ రొండు తప్పయితే ఏటు యీపులమింద పడీపడకనే ఊరు ఎత్తకపోయ్యేతట్ల ఏడ్సడం మొదల్పెడితే నలుగుర్లో నగుబాట్లు ఏంటికి తీ! అని వాళ్ళే ఇడిసిపెట్టేటోళ్ళు. ఆ పొద్దుటికి అట్లా గండం గడిసి గట్టెక్కేది.

తిరగ మర్సునాడు పొద్దున బళ్ళోకి ఇడ్సి పెట్టేదానికొచ్చిన నాయన, ‘ఏం సార్! మా వోణ్ణి మధ్యల్లోనే ఇడ్సి పెడుతుండారు..? రోంత బెయం పెట్టి, బళ్ళో కుసునేతట్ల సూడండి సార్! నాకి వీళ్ళమ్మకి పొట్టకోస్తే అచ్చరం ముక్క రాదు; యాదో వీనికన్న నాలుగచ్చరం ముక్కలు నేర్పుకుందామని మా అపలాసన. అంతే సార్! రోంత దయ తల్సండ’ని అంటే, దానికి సారొళ్ళు- ‘ఇంగ యాటికని కనిపెట్టుకోని కట్టడి సేసేమప్పా వాణ్ణి!? రోంత కన్నుతప్పాయంటే అప్పుడే సరోజమ్మొళ్ళ సందులో తేలింటారు వీడు, వీని బ్యాచ్చు. అండిగ (7) ఎక్కువుండాది పిల్లలొద్ద. యంత సేపు యట్ల తప్పిచ్చుకోని బయటపడదామనే ఆలోసనే తప్ప, సదువుకుందామన్న ధ్యాన ఏమాత్రం లేదీ పిల్లలకి. సిన్న పిల్లలు కదా! కొట్టడం తిట్టడం సేసినామంటే దమ్ముల్లో అదురు సచ్చుకోని, బడి అంటే మొకం ఇరిగి, అసల్కే మోసం వొస్తాదనేది మా భయం. తెలివిగ దావకి తెచ్చుకునేదానికి మా ప్రయత్నం మాము సేస్తావుండాం సూడప్పా!అటెంక దేవుండాడ’ని సెప్పేటోళ్ళు.

ఆ మాటకి మా నాయన మొకం సన్నపొయ్యేది. “ఏమోల్యా సార్! యట్లో ఒగట్ల మా శ్యాతనయినకాటికి ఇగ్గిచ్చి సూస్తాము; అటెంక వాని తలరాత యట్లుంటే అట్ల కానిల్యా!” అని, బాధపడిపోతా ‘సదువుకోకుండ యనగొడ్లు కాతామనుకుంటాడో ఏమో మరి ఈ మూడుకాసుల నా కొడుక’ని, కోపంతో నన్ను తిట్టుకుంట, సేనిదావ పట్టేటోడు!

ఈ యప్పకి పొండ్లు వూడిపోయి రెండేండ్లు కావస్తుండిది కదా! అంటే అదొక ఏడు; ఇదొక రెండు, తొమ్మిదేండ్ల వయసోడయినా గూడ సదువు విలువ అర్థం కాకుండా వుండాది వీనికి! అండిగనాయాండ్ల జతగట్టి యాయాళ పొద్దున సెట్లెంట.. గుట్లెంట తిరుక్కుంట ఈ రకంగుండాడే వీన్నెట్ల దావకి తెచ్చుకోవల్లప్పా అని రాత్రుల్లు గూడ అంగలాస్తా వుండేటోళ్ళు అమ్మనాయన. వాళ్ళ బాధ అర్థమైతున్న్యా, సరీగ సదువుకోకపోతే సారొళ్ళు కొడతారనే భయంతోనో, పొద్దున్నుంచి మాసారి వరకు కదిలేకి మెదిలేకి ల్యాకుండ కాళ్ళు సేతులు కట్టేసినట్ల బళ్ళోనే వుండేకి ఇబ్బందిపడో, ఏంటికయ్యేది తెల్దు; మొత్తానికి ‘బడి’కి పోవలంటేనే మొకం ఇరిగి మనసు ఎనికి తొక్కులు తొక్కేది.

ఇట్లాంటి పరిసితుల్లోన- ‘అద్దాల సక్రప్ప’ తాత కొడుకు ‘పెద లాల్ సాబు’ సదువు పూర్తి జేసుకొని వొచ్చినాడ’ని వూరంత అనుకోబట్రి. ‘పాపం సిన్నప్పట్నుంచి నీడపాటున వుండి సదువుకున్నోడు కదా! ‘పెద లాల్ సాబు’కి వుద్యోగం రాకపోతే యట్ల! ఇంగ అతను వూర్లో వుండి ఏం పని సేస్తాడు?! నట్టే సేకి, నాగే(గ)లి పట్టేకి అతని సేతులు తడిసీన్యా! నగలమింద కుసోని బండి తోలేదానికి రాదు.. సేద్యం పని సేసేకి శ్యాత అయితున్నీన్యా అతనికి?!’ ఇట్లా.. సేన్లలో కలుపులు తీసే కాడ, కాయలు తెంపేకాడ, నలుగురు కల్సిన కాడంతా… అతని గురించే మాట్లాడుకోవడం తనకి ఇబ్బందనిపించి, ఈ జనాల పొటుకు తట్టుకోల్యాక, వుద్యోగమొచ్చే వరకు ఏం జేద్దామని తన జతాగాళ్ళు.. రంగన్న, బాలాజీరావులతో ఆలోసన సేసినాడంట.

‘మనూరి బళ్ళో సదువులు అంతంత మాత్రంగానే వుండాయి. అదీగాక ఇండ్లలో పెద్దలు పొద్దననగా సేన్లలో పనులకి పోయి మాసారి పొద్దుమునిగినంక ఇంటికొస్తారు. బడి ఇడ్సినాయాళ్నుంచి పట్టిచ్చుకునే నాథుడు ల్యాక శానామంది పిల్లలు గాలి తిరుగుళ్లు తిరుగుతుండారు. మాకి తెలిసి అన్నిటికంటే ‘శెన్నకేశులు స్వామి గుళ్ళో ప్రవేటుబడి పెట్టి పిల్లలందరికి దినాము మాసారి పూట ఓ రొండు గంటలు సదువు సెప్పినావంటే, వాళ్ళ జీవితాల్ని కాస్తో కూస్తో మార్సినోడివి అయితావు, ఆలోసించుకో’మని సలహా ఇచ్చినారంట!

అది అతనికి నచ్చి, అదే మాట ఇంట్లో వాళ్ళ పెద్దలో సెప్తే, ‘మనూర్లో అందరూ కూలి.. నాలి సేసుకోని ఏదో ఒకపూట వుండి.. ఒకపూట ల్యాక తిని బతికేటోళ్ళే! అట్లాటోళ్ళు; వాళ్ళ పిల్లల్ని నెలా నెలా దుడ్లు కట్టి సదివించుకోగల్గుతారా!’ అన్యారంట. ‘మనకేం ఇప్పుడు తిన్నీకి ల్యాకుండేమి లేదు కదా! లేనోళ్ళకి ఫీజులు ల్యాకుండ సదువు నేర్పితే పుణ్యమొస్తాద’ని సెప్పి, వాళ్ళనొప్పిచ్చినాడంట.

ఈ రకాన మా జీవితాల్లోకొచ్చిన ‘లాల్సబు’ సార్ మమ్మల్లందర్ని దావకి తెచ్చుకునేకి తొలినాళ్ళలో శానా అగసాట్లు పన్యాడు! ‘యక్కన్నుంచి వొచ్చినాడు రా! ఈ ‘కబంధుడ’ని తెగ భయపడిపోయి గు(బ)డి ఎత్తకపోయ్యేతట్ల ఏడుస్తా లగ్గలకి అంటిచ్చేటోళ్ళం. బొంకుల్పెట్టి సెన్లకి పారిపోయేవోళ్ళు కొందరైతే, సిక్కనట్ల సెట్లుగుట్లల్లో దాపెట్టుకునేటోళ్ళు కొందరు! తెలివిగా కడుపో, కాలో నొప్పని అణగపండేటోళ్ళు మరి కొందరు! ఒగోడు ఒగో రకం. పొయ్యిలో మునిగితే పొంతలోన, పొంతలో మునిగితే పొయ్యిలోన తేలినట్లుండి, ముప్పతిప్పలు పెట్టేటోళ్ళం. ఒగోసారి ఈళ్ళతో ఏగడం కష్టమని యాసిరిక్కొనేవాడు.

వారం..పద్దినాలు సూసి, ఇంగ ఈ పిల్లోల్లని మచ్చిక సేసుకోవలంటే ఈ దావ సరైంది కాదని, ఇంగ ఎవుర్తో సదువు.. గిదువు మాటెత్తకుండ; వొచ్చినోళ్లని వొచ్చినట్ల జతలు కట్టిచ్చి; కుంటే ఆట, కోతికొమ్మచ్చి, నాలుగుకంబాలాట, సిల్లేకట్టి, సోజ్జాట (9) గోళీలాట, ఈ(వీ)పుల సెండు, కబాడి, కోకో.. అన్నిరకాల ఆటలు తనే దగ్గరుండి ఆడించేవాడు. ఇండ్లకొచ్చే ముందరకాడ ఓ గడి సేపు గుడి ఎత్తకపొయ్యేతట్ల ఒంట్లు పలికిచ్చి, ‘ఇండ్లకి పాండి’ అనేవాడు. ‘ఓస్! ‘బడి’ అంటే ఇంతేనా’ అని అనుకునేతట్ల సేసి, దినాము ఒగ రకమైన ‘ఆట’. అప్పుడప్పుడు అంత్యాక్షరి, తట్ల(10) పోటీలు, డ్యాన్స్ పోటీలు కూడా పెట్టి అందర్ని ఉల్లాసపరిచేటోడు.

వారం తిరిగేతలకే మాంత్రికుని పాణం సిలకలో వున్యట్ల మా పాణమంతా ఆటపాటల్లో వుండాదని కనిపెట్నాడు సారు. రోజులో అర్ధగంట సదువుకు కేటాయిస్తే మిగతా టైమంతా ఆటపాటలకే సరిపోయేది.

సారు ఉపాయం పారింది(11). పిల్లలమంతా తొట్ట తొలిసారి పెద్దల ప్రమేయాలట్లాటివి ఏమీ ల్యాకుండానే బడికి పోయేకి అలవాటు పన్యాము. రెన్నెళ్ళు గడిసేతలకే మాతోపాటుగ అవతలూరు, అగ్రారం(అగ్రహారం) పిల్లలు కూడా జమవడంతో బ(గు)డి కిటకిటలాడింది. రోజులు ఆనందంగా దొర్లిపోతావుండాయి. మరో రెన్నెళ్ళలో సదువంటే భయం పోయి, అదీ ఆటలో ఒగ భాగమయిపోయింది. క్రమక్రమంగా రోజులో అర్ధగంట ఆట..పాటలకి కేటాయిస్తే మిగతా టైమంతా సదువుకునేదానికి అలవాటు పన్యాము. సదువుతో పాటుగ క్రమశిక్షణతో మెలగడం యట్లో తెలుపుతా వొచ్చినాడు. కోడికూతతో నిద్రలేసి సదుకోవడం, శ్యాతనైన పనిని సేసి అమ్మనాయనలకి కష్టం తప్పీడము, బుక్కులు.. పెన్నులు ఇట్లా యాది అవసరం పన్యా, అమ్మనాయన వొద్ద దుడ్లు వుండేది-లేంది సూసి అడగటం, తల నున్నగ దువ్వుకోవడం, సినిగిపోయిన బట్లనైనా మడ్సానంగ కుట్టుకోని ఏసుకోని టక్కు సేసుకోవడం, అందరు ఐక్యమత్యంగ వుండడం ఇట్లా.. ప్రతీది పూసగుచ్చినట్ల తెలిపి, అదే అలవాటుగ సేసినాడు.

నేర్పేటప్పుడు తెల్లేదుగాని వీటి విలువ! హైస్కూల్ లో సేరినంక, మా నడత.. నడక సూసిన అక్కడ సారోళ్ళు- ‘యా వూరు రా మీది? ఇంతకు ముందు మీకి విద్య నేర్పిన గురువు ఎవర’ని అడిగి వివరం తెల్సుకోని, ‘మంచి ‘సార్’ సిక్కినాడురా మీకు! గొప్ప అదృష్టవంతులు మీరు. మంచి భవిశ్యత్తు వుండి, మీ ‘రాజుల మండగిరి’కి మంచి పేరు తీసుకొస్తారు పోండి’ అని ఆశీస్సులు తెలుపుతుంటే, మా మనసు పోయి యక్కడో వున్న మా గురువు కాళ్ళమింద పడి, ‘ఇదంతా మీ సలవే సార్! అందుకు మనసారా కృతజ్ఞతలు’. అని తెలుపుకుంటున్నట్ల బ్రమ కలిగేది. ఇది యప్పుడో ఇరవై ఏళ్ళ నాటి సంగతైనా, తల్సుకున్నప్పుడంతా కండ్లలో నీళ్ళ సెమ్మ కదలాడుతా గుండె బరువెక్కుతాది.

అర్థాలు:

 1) నా వైపు 2) ఆగు 3) జ్ఞప్తికి, జ్ఞాపకానికి 4) చాలా 5) సాయంత్రం వచ్చి 6) అబద్దాలు 7) అల్లరి 9) దాగుడుమూతలు 10) పొడుపుకథలు 11) పని చేసింది, ఉపయోగపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here