అభిమానానికీ, వ్యక్తిత్వ విమర్శకూ నడుమ సమతౌల్యం – ‘గురు దత్ – ఓ వెన్నెల ఎడారి’

1
1

[పి. జ్యోతి రచించిన ‘గురు దత్ – ఓ వెన్నెల ఎడారి’ అనే పుస్తకం సమీక్షని అందిస్తున్నాము.]

[dropcap]పి.[/dropcap] జ్యోతి రచించిన ‘గురు దత్ – ఓ వెన్నెల ఎడారి’ అన్న 576 పేజీల పుస్తకం చదవటం, సున్నిత భావాల వెన్నెల తుఫానులో ఉక్కిరిబిక్కిరవుతూ, మానవ సృజనాత్మకత లోని ఔన్నత్యానికి పరమానందాన్ని అనుభవిస్తూ, మానవ మనస్తత్వం లోని స్వీయ నాశనానికి దారితీసే బలహీనతలకు తీవ్రమైన ఆవేదనను అనుభవిస్తూండే ఓ రోలర్‍కోస్టర్‍లో ప్రయాణం లాంటిది

‘సృజన’ అనేది ఒక అత్యంత మృదువైన ప్రక్రియ. సృజనకారుడిది అత్యంత సున్నితమైన స్వభావం. కానీ ఎంతగా సృజన వ్యక్తిగతమైనప్పటికీ, ఆ సృజన ప్రజల ఆదరణ, అభిమానాలు పొందితేనే ఆ సృజనకు సార్థకత, చిరంజీవత్వం లభిస్తుంది. ప్రజల తిరస్కృతికి గురయితే ఎంత గొప్ప సృజన అయితే అంతగా కళాకారుడికి నిరాశ, వేదనలు కలుగుతాయి. అతని భావి సృజనపై ఈ తిరస్కృతి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే కళాకారులు పైకి ఎంతగా కఠినంగా కనిపించినా లోన అత్యంత సున్నిత హృదయులుగా ఉంటారు. అలాంటి కళాకారుల కళను విశ్లేషించటం, ఆ కళాసృజన వెనుక ఉన్న సున్నిత హృదయాన్ని నిష్పాక్షికంగా విశ్లేషించి అందించటం అంటే సామాన్యమైన పని కాదు. ఎందుకంటే కళాకారుడు వేరు, వ్యక్తి వేరు. కళ ఎంత ఉన్నతంగా సృష్టించినా, వ్యక్తిగతంగా మామూలు మనుషులకు ఉండే బలహీనతలన్నీ కళాకారుడికీ ఉంటాయి. కాబట్టి కళ నుండి వ్యక్తిని వేరు చేసి చూడడం, ఆ వ్యక్తి జీవితానుభవాల ప్రభావం ఆయన సృజనపై పడటం వంటి విషయాలను నిష్పాక్షికంగా  విశ్లేషించి విమర్శించగలగటం ఎంతో కఠినమైన పని. ఎంతో గొప్పవారిగా పేరు పొందిన విశ్లేషకులు కూడా కళాకారుడి సృజన  మాయాజాలంలో పడి  వ్యక్తిగా అతడి బలహీనతలను విస్మరిస్తారు. దీపాన్ని చూస్తూ గుడ్డివారై దీపం క్రింద నీడను చూడలేకపోతారు.

ఇలాంటి కఠినతరమైన పనిని ఇష్టంగా, అలవోకగా సాధించారు పి జ్యోతి, ‘గురు దత్ – ఓ వెన్నెల ఎడారి’ పుస్తక రచనలో. గురుదత్ సృజన పంచరంగుల ప్రపంచంలో విశ్లేషణాత్మకంగా,  విమర్శనాత్మక విశృంఖల విహారం చేస్తునే, అతని వ్యక్తిగత బలహీనతలను, లోపాలను నిర్మొహమాటంగా ఎత్తి చూపిస్తూ, అభిమానానికీ, వ్యక్తిత్వ విమర్శకూ నడుమ సమతౌల్యాన్ని సాధించారు. కళాకారుడిగా గురు దత్ సృజన ఔన్నత్యానికి అమితానందాన్ని, మైమరపునూ ప్రదర్శిస్తూ; వ్యక్తిగా గురు దత్ ఆలోచనలు, ప్రవర్తనల్లోని అనౌచిత్యాన్ని స్పష్టంగా ఎత్తి చూపిస్తూ, గురు దత్ గురించి ఇతర ఏ భాషల లోను లేనటువంటి సమగ్రమైన పుస్తకాన్ని అందించారు పి. జ్యోతి. ఇందుకు వారికి అభినందనలతో పాటు కృతజ్ఞతలు కూడా తెలపాల్సి ఉంటుంది.

ఇటీవలే విడుదలైన లతా మంగేష్కర్ జీవిత చరిత్ర ‘సంగీత సరస్వతి లతా మంగేష్కర్’ తో పాటు,  ‘గురు దత్ – ఓ వెన్నెల ఎడారి’ పుస్తకం – తెలుగులోనే కాదు జాతీయస్థాయిలో హిందీ చలన చిత్ర కళాకారుల జీవిత రచనకు ప్రామాణికాలు ఏర్పరచగల ఉత్తమ స్థాయి రచనలు అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఈ రెండు రచనలూ ‘సంచిక’లో ధారావాహికగా ప్రచురితమవటం, తెలుగు సాహిత్య ప్రపంచంలో ‘సంచిక’ ప్రాధాన్యాన్ని, సంచిక  పాటిస్తున్న  ఉన్నత ప్రామాణికాలను స్పష్టం చేస్తాయి.

‘అంకితం’ నుంచీ ఈ పుస్తక రచనలో పి. జ్యోతి తన స్వతంత్రపుటాలోచన పంథాను ప్రదర్శిస్తారు. గురు దత్ గురించి రచించిన పుస్తకాన్ని గీతా దత్‌కు అంకితం ఇవ్వటం సముచితం. 1949, 1950 సంవత్సరాలలో లతా మంగేష్కర్ కన్నా ఎక్కువ పాటలు పాడిన గీతా దత్ 1952లో గురు దత్‌తో విహాహం అయిన తరువాత తుఫాను, వర్షమై, వర్షపు చినుకై, తడి గాలి అయి, పొడిబారి ఆవిరైపోయినట్టు ఆమె కెరీరు ఆవిరై పోవటం గమనిస్తే, కళాకారుడిగా గురు దత్ ఉచ్చస్థాయికి చేరుతున్న కొద్దీ, గాయనిగా గీతా దత్ కెరీర్ పతనమై జీవితం అట్టడుగు స్థాయికి చేరటం గమనిస్తే, గురు దత్‌తో వివాహం ఎంతగా గీతా దత్ జీవితాన్ని ప్రభావితం చేసిందో అర్థమవుతుంది. అందుకే ఈ పుస్తకాన్ని గీతా దత్‌కు అంకితమివ్వటం అంటే దీపం మరింతగా వెలగటానికి తోడ్పడి ఆ దీపం క్రింద నీడలో ఒదిగి చీకటిలో కలసిపోయిన అత్యద్భుత స్త్రీమూర్తిని గుర్తించి గౌరవించినట్లే. అందుకే ఈ పుస్తకంలో ‘గీతా: చెదరిన కల’ అన్న అధ్యాయం ఈ పుస్తకానికే హైలైట్ గా భావించవచ్చు. గురు దత్ గురించి ఇంత వరకూ రాసిన వారు గీతా దత్ గురించి ముక్తసరిగా ప్రస్తావించటమో, గురు దత్‌ని అర్థం చేసుకోలేదామె అని వ్యాఖ్యానిస్తూ, అతని జీవితంలో ఆమె ఓ న్యూసెన్స్ అన్నట్టు తీసిపారేయటమో చేశారు తప్ప గురు దత్‌తో సమాన స్థాయి (ఇంకా ఎక్కువ స్థాయిగా పరిగణించినా సముచితమే) కల కళాకారిణిగా, గురు దత్ వల్ల కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా భ్రష్టమైన వ్యక్తిగా ఆమెను సానుభూతితో అర్థం చేసుకుని సముచితంగా గౌరవించిన ప్రప్రథమ పుస్తకం ఇది!

ఈ పుస్తకం గురు దత్ బాల్యం నుంచి ఆయన వ్యక్తిత్వంపై పడిన ప్రభావాలు, సినిమాలలో అనుభవాల ద్వారా ఎదిగిన వ్యక్తిత్వం, ఆయన సృజనాత్మకత ప్రతిభ వికసించి ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ‘సాహెబ్ బీబీ ఔర్ గులామ్’ వంటి సినిమాలలో సృజనాత్మక ప్రతిభ విశ్వరూప ప్రదర్శనకు దారి తీసిన అంశాలు, ఆయన స్వభావంలోని లోపాలు, బలహీనతలు, పొరపాట్లతో సహా  అనేక అంశాలను సాధికారికంగా, నిదర్శనాలు, నిరూపణలతో వివరిస్తుంది.  గురు దత్ సినిమాలను, ఆయన జీవితానికి, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని ప్రస్తావిస్తూ గురు దత్‌ను విభిన్నమైన కోణాలలో ప్రదర్శిస్తూ, విశ్లేషిస్తూ మనకు చేరువ చేస్తుంది.

గురు దత్ నటించి దర్శకత్వం వహించిన సినిమాలనే కాదు, ఆయన సాంకేతిక నిపుణుడిగా పనిచేసిన సినిమాలు, ఆరంభించకుండా సినిమా తీయాలనుకుని వదిలివేసిన సినిమాలు, కాస్త షూటింగ్ అయి ఆగిపోయిన సినిమాల విశేషాలతో సహా అన్ని అంశాలను పరిచయం చేస్తుందీ పుస్తకం. గురు దత్ సినిమాల పరిచయం, విశ్లేషణలతో బాటుగా, ఆయా సినిమాల నిర్మాణ సమయంలో గురుదత్ మానసిక స్థితి విశ్లేషణ, గురు దత్ జట్టులో సభ్యుల ఎంపికలను సైతం వదలకుండా వివరిస్తుంది. అందుకే పుస్తకం పేజీలు అయిదు వందల పైనే అయినా ఆసక్తిగా చదివే వీలుంటుంది. అంతే కాదు, చర్విత చర్వణమైన విశేషాలు, విశ్లేషణలు కాకుండా ఎన్నెన్నో విషయాలను తెలుపుతూ రచయిత్రి తనదైన స్వతంత్ర విశ్లేషణ ధోరణిని ప్రదర్శించటం ఈ పుస్తకం విలువను మరింతగా పెంచుతుంది. తెలుగులో ఇలాంటి పుస్తక రచయితలు, ఇతర భాషలలోని వారు అందించే సమాచారం ఆధారంగా రచించాల్సి వచ్చినా, ఆ సమాచారాన్ని క్రోడీకరించి అందిస్తూ దాని ద్వారా గతంలో ఎవరూ చూడని కోణాలను చూపిస్తూ, స్వతంత్ర అభివ్యక్తిని, దృక్కోణాన్నీ ప్రదర్శించటం కూడా పుస్తకం విలువను పెంచుతుంది. అందరికీ ఉన్నవి అవే అక్షరాలయినా తనదైన ప్రత్యేక శైలిని, పంథాను ఏర్పరచున్న రచయితనే ప్రత్యేకంగా, విశిష్టంగా నిలుస్తాడు. అలా ప్రత్యేకంగా, విశిష్టంగా నిలుస్తుందీ పుస్తకం.

ఈ పుస్తకంలో ప్రత్యేకంగా నిలుస్తాయి ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ సినిమాలకు సంబంధించిన వ్యాసాలు. పుస్తకంలో సగంపైగా పేజీలు ఈ మూడు సినిమాలకు  సంబంధించిన వ్యాసాలే. ఈ మూడు వ్యాసాలను మూడు చిన్న పుస్తకాలుగా, లేక, ఒక పుస్తకంగా వేయవచ్చు. ఈ సినిమాలను అణువణువూ క్షుణ్ణంగా, తీక్షణంగా పరిశీలించి, పరిశోధించి, విశ్లేషించటంలో ఈ సినిమాలు రచయిత్రికి ఎంత ప్రియమైనవో, ఎంతగా ఆమెపై ప్రభావం చూపించాయో తెలుస్తుంది.

అక్కడక్కడా రచయిత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు, తీర్మానాలతో ఏకీభవించకపోయినా రచనలో రచయిత్రి నిజాయితీ అన్నిటినీ మరపింపచేస్తుంది. మచ్చుకి;  ‘హమ్ ఆప్ కీ ఆంఖోం మే’ పాట ప్రశ్న జవాబు పాట కాదు. అది ప్రశ్నకు ప్రశ్నతోనే సమాధానం ఇచ్చే పాట. నాయకుడు ఒక స్టేట్ మెంట్ ఇస్తే దానిని  నాయిక ప్రశ్నతో తిప్పికొట్టే పాట.  ‘ససురాల్’ సినిమాలోని ‘ఏక్ సవాల్ మై కరూఁ’ పాట పూర్తిగా ప్రశ్నకు ప్రశ్నతోనే సమాధానం ఇచ్చే పాట., అయితే అది ‘హమ్ ఆప్ కీ ఆంఖోం మే’  కన్నా  విస్తృత పరిధి కల పాట. ‘హమ్ ఆప్ కీ ఆంఖోం మే’ పాట చమత్కార భరితమైన  రొమాంటిక్  పాట. సామ్యవాద భావజాలం పాటలా భావించాలంటే నాయికను బూర్జువాలా, నాయకుడిని అణచివేతకు గురయ్యే వాడిలా భావించాల్సి ఉంటుంది.

‘కాగజ్ కే ఫూల్’ సినిమాను పలువురు పెద్దలు క్లాసిక్‌లా పరిగణించినా, ఆ సినిమా పరాజయం పాలయింది. దీనికి కారణం ‘ప్యాసా’, ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ సినిమాలలా అది పటిష్టమైన స్క్రిప్ట్ కల  సినిమా కాకపోవటమే. అయితే ఆ సినిమా గురించి రచయిత్రి విపులంగా రచించిన వ్యాసంలో రచయిత్రి పరిశీలనా శక్తి, సినిమాతో తాదాత్మ్యం చెందటం, సినిమాను అనుభవించటంలో నిజాయితీలు వ్యాసానికి వన్నె తెస్తాయి.

ఈ పుస్తకంలో  ‘చివరగా’ అన్న అధ్యాయం చదువుతుంటే, జీవించినప్పుడు లభించని ఆదరణ, గౌరవం, ఖ్యాతి గురు దత్‍కు మరణించిన కొన్నేళ్ళ తరువాత లభించటం ‘ప్యాసా’ సినిమాలోని ‘యె మహలో’ పాటలోని పంక్తులను జ్ఞప్తికి తెస్తాయి.

‘యె బస్తీ హై ముర్దా-పరస్తోం  కీ బస్తీ
జహాఁ ఔర్   జీవన్ సే హై మౌత్ సస్తీ’

ఈ పుస్తకం మొత్తం చదివిన తరువాత కవి’ పౌల్ వెర్లైన్’ గురించి ‘స్టెఫాన్ జ్వైగ్’ రాసిన మాటలు గురు దత్ కు కూడా వర్తిస్తాయనిపిస్తుంది.

All his creative virtue is reversed strength; it is weakness. Since he could not subdue, the plaint alone remained to him: since he could not mould circumstances, they glimmer naked, untamed, humanly-divine beauty through his work. Thus he has achieved a primaeval lyricism- pure humanity, simple complaint, humbleness, infantile lisping- wrath and reproach, primitive sounds in sublime form, like the sobbing wail of a beaten child, the uneasy cry of those who are lost, the plaintive call of the solitary bird which is thrown out into the dusk   of evening.

ఈ పుస్తకంలో ఒక సందర్భంలో దిలీప్ కుమార్ గుర్తించి చికిత్స తీసుకున్నట్టు గురుదత్ కూడా డిప్రెషన్ కు చికిత్స తీసుకోకపోవటం పట్ల, ఎవ్వరూ గురు దత్ కు ఆ సలహా ఇవ్వకపోవటం పట్ల రచయిత్రి ఆశ్చర్యం, ఆవేదనలు  వ్యక్త పరచారు. మానసిక  సమస్యల చికిత్సలో సమస్య ఉన్న వ్యక్తి తనకు సమస్యవున్నదని గుర్తించి ఆమోదించటంతో సగం సమస్య పరిష్కారమవుతుంది. దిలీప్ కుమార్ తన సమస్యను గుర్తించాడు. ఆమోదించాడు. కానీ, గురు దత్ తనకు సమస్యవున్నదన్న గ్రహింపునే ప్రదర్శించలేదు. అది తన సృజనాత్మక వ్యక్తిత్వ లక్షణం అనుకున్నాడు. అతనికి మానసిక సమస్యవున్నదన్న గ్రహింపు కానీ, గ్రహించినా చెప్పే ధైర్యం కానీ ఎవరికీలేదు. అంత చనువు ఉన్న గీతా దత్ తన స్వీయ సమస్యలలో మునిగివున్నది.  అందరూ గురు దత్ ప్రవర్తనను వహీదాతో సంబంధానికి ముడిపెట్టి ఆ కోణంలో ఆలోచించారు తప్ప, డిప్రెషన్ వైపు ఎవరి దృష్టి పోలేదు.

చివరలో ‘కైఫీ’ గురు దత్‍కు నివాళిగా రాసిన కవిత అనువాదాన్ని పొందుపరచటం ఔచితీమంతంగా ఉంది. ఈ పుస్తకంలో గురు దత్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని పొందుపరచి ‘one stop reference book on Guru Dutt’ గా మలచాలన్న తపన, గురు దత్‍పై అపారమైన అభిమానం పుస్తకం అడుగుడుగునా కనిపిస్తుంది. గురు దత్‌ అభిమానులే కాదు, సినిమా ప్రేమికులందరూ తప్పనిసరిగా కొని దాచుకోవాల్సిన పుస్తకం ఇది.

పుస్తకాన్ని రూపొందించిన విధానంలో కూడా ఎంతో శ్రద్ధ కనిపిస్తుంది. అధ్యాయాలను విభజించే విధానం, ఫొటోలను పొందుపరిచిన విధానం వెనుక కూడా ఎంతో ఆలోచన కనిపిస్తుంది. ఇందుకు ప్రచురణ సంస్థ ‘అనల్ప’కు అభినందనలు. అయితే ఈ పుస్తకంలో గేయ రచయిత మజ్రూహ్ సుల్తాన్‌పురి పేరు ‘మజ్రూ’ గానే అన్ని సందర్భాలలోనూ కనిపిస్తుంది. అతని కలం  పేరు ‘మజ్రూహ్’. ‘రూహ్’ అంటే ఆత్మ. ‘మజ్రూహ్’ అంటే గాయపడిన ఆత్మ లేక ఆత్మకయిన గాయం. మజ్రూ అంటే గాయాన్ని వుంచి ఆత్మను వదిలేసినట్టవుతుంది.  తరువాతి ముద్రణలలో ‘మజ్రూ’ను ‘మజ్రూహ్’గా సరిచేయాల్సి ఉంటుంది.

ఒక ‘Labour of deepest love’ ఫలితం ఎలా ఉంటుందంటే ‘గురు దత్ – ఓ వెన్నెల ఎడారి’లా ఉంటుందని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.

***

గురు దత్ – ఓ వెన్నెల ఎడారి
రచన: పి. జ్యోతి
ప్రచురణ‏: అనల్ప బుక్ కంపెనీ
పేజీలు: 576
వెల: ₹ 695
ప్రతులకు:
అనల్ప బుక్ కంపెనీ
35-69/1, రెండవ అంతస్తు, జి.కె. కాలనీ బస్ స్టాప్,
నేరేడ్‍మెట్ క్రాస్ రోడ్ దగ్గర,
సికిందరాబాద్-500094,
ఫోన్: 7093800303
contact@analpabooks.com
ఆన్‍లైన్‌లో ఆర్డర్ చేసేందుకు
https://www.amazon.in/DUTT-Biography/dp/9393056749

~

శ్రీమతి పి. జ్యోతి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-p-jyothi-gd/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here