[dropcap]హై[/dropcap]దరాబాద్‌లో స్పెషల్ ట్రైనింగ్ క్లాసులకి హాజరయ్యి, నాలుగు రోజుల తరువాత ఈ రోజు ఉదయమే స్టేషన్ లోకి అడుగు పెట్టాను. ‘సత్యమేవజయతే’, ‘ఏలూరు పట్టణ టూటౌన్ సీఐ వారి కార్యాలయం’ అనే బోర్డు స్వాగతం పలుకుతోంది నాకు.
చిన్నతనం నుండీ గురువులు, తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణ, దైవచింతన వలన, అలాగే విధి నిర్వహణలో కూడా చాలా ఖచ్చితంగా ఉండడం వలన నాకు డిపార్ట్మెంట్‌లో చాలా మంచి పేరుంది.
ఆఫీసు రూమ్ లోకి రాగానే ఒకసారి అందరి దేవతలకు మనసులో నమస్కరించి, సీట్లో కూర్చుని, టేబుల్ మీద ఉన్న ఫైల్స్ చూస్తున్న నా దగ్గరకు వచ్చాడు, ఎస్సై వేణుగోపాల్. వస్తూనే సెల్యూట్ చేసి,
“గుడ్ మార్నింగ్ సార్, మన జిల్లాలో పెట్రేగి పోతున్న ఆ నకిలీ నోట్ల చలామణిలో అసలు సూత్రధారిని నిన్న మన పెదవేగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సార్. అతని వలన మోసపోయిన వారు ఎవరైనా ఉంటే, మన స్టేషన్లో కంప్లైంట్స్ చేయమని పేపర్ ప్రకటన కూడా ఇచ్చాం సార్. మీరు ఒకసారి ఈ ఫైల్ చూసి, ఓకే చేస్తే….” అంటూ ఆ ఫైల్ టేబుల్ మీద పెట్టి బయటకు నడిచాడు ఎస్సై వేణుగోపాల్.
అన్యమనస్కంగా ఆ ఫైల్ చూస్తూ, అందులో ఉన్న ఫొటో చూసిన నేను ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాను. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చెప్మా అని ఆలోచిస్తూ, అతని పేరు చూసాను.
మోహన్ చంద్ర. ఔను. నో డౌట్, అనుమానం లేదు, ఈయన మా చంద్రం మేష్టారు. వయసు మీద పడడంతో మొహంలో కొంచెం మార్పు వచ్చింది అంతే.
రౌతులపూడిలో ఆరవ తరగతిలో తమకు పాఠాలతో పాటు ఎన్నో నీతి సూత్రాలు, జీవిత సత్యాలు చెప్పిన చంద్రం మాస్టారు. కానీ ఈయన దొంగ నోట్ల కేసులో ఎందుకు పట్టుపడ్డారు.
కళ్లు మూసుకుని, ఓ పాతిక సంవత్సరాల క్రితం జ్ఞాపకాలను ఓ సారి మననం చేసు కున్నాను.
***
నాన్నగారి హఠాన్మరణం, దానికి తోడు మా ఊరి పాఠశాలలో కేవలం ఐదవ తరగతి వరకే ఉండడంతో, నా ఆరవ తరగతి చదువు మా పిన్ని గారి ఊరైన రౌతులపూడిలో సాగింది.
ఆ రోజు నాకు బాగా గుర్తు. ఊరు కొత్త. పాఠశాల కొత్త. తరగతి కొత్త. బిక్కుబిక్కుమంటూ మొదటి వరుస చివర బెంచీలో కూర్చున్నా. అదిగో, సరిగ్గా అప్పుడు క్లాసులకి వచ్చేరు, దబ్బపండు రంగు ఛాయ, తెల్లటి ఫాంట్, మోచేతులు వరకూ మడత పెట్టిన తెల్లటి చొక్కా, కొనదేరిన ముక్కు, సన్నటి మీసకట్టు, నల్లటి ఉంగరాల జుట్టుతో, సినిమాహీరో హరనాథ్‌లా ఉన్న చంద్రం మాస్టారు.
తరగతి గదిలోకి వచ్చీ రాగానే, నేరుగా నా దగ్గరకు వచ్చి,
“ఒరే, కరణంగారి తోడల్లుడు గారి అబ్బాయి ఈశ్వర్ అంటే నువ్వేనా?” అని అడిగారు.
“ఔనండీ” అని చెప్పగానే, నన్ను దగ్గరకు తీసుకొని,
“నీ గురించి మీ బాబాయ్ గారు అన్నీ చెప్పారురా! ఏమీ బెంగపెట్టుకోకు. ధైర్యంగా ఉండు. ఏ సందేహం వచ్చినా నన్నడుగు.” అంటూ భుజం తట్టారు.
ప్రతీరోజూ పాఠాలతో పాటు, చివర్లో భారత, భాగవత, రామాయణాలనుంచి ఏదో ఒక నీతి కథ, వాటితో పాటు ‘సత్యమేవ జయతే’, ‘అహింసో పరమధర్మ’, ‘ఆడి తప్పరాదు,పలికి బొంకరాదు’ లాంటి ఎన్నో సూక్తులు ఉదాహరణలతో సహా వివరించేవారు. ఆ రోజుల్లో ఆయన చెప్పిన వాక్యాలు, తరువాత రోజుల్లో నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసాయి.
***
అలా ఆనందంగా ఓ ఏడాది పాటు సాగిన మా గురుశిష్య సంబందానికి ఆ రోజు ఆఖరి రోజు. ఆ రోజుతో మా పెద్ద పరీక్షలు ముగిసాయి. నేను చంద్రం మాస్టారు వద్దకు వెళ్ళి,
“మేష్టారండీ, ఈ రోజు సాయంత్రం రాజమండ్రి మా అక్కగారింటికి వెళ్లి పోతున్నా. ఏడవ తరగతి అక్కడే చదవాలిట. మళ్లీ మిమ్మల్ని ఎప్పడు చూస్తానో?” అంటూ ఏడుస్తూనే, ఆయన కాళ్లకు నమస్కరించా.
“ఒరే ఈశ్వర్, నీ క్రమశిక్షణ, పట్టుదల, మంచితనం, వినయం చూస్తూంటే తప్పకుండా నువ్వు ఓ పెద్ద ఆఫీసర్‌వి అవుతావన్న నమ్మకం నాకు ఉంది. ఎప్పుడైనా ఇక్కడికి వస్తే నన్ను కలు.” అంటూ మనసారా ఆశీర్వదించారు.
***
అయితే, నేను ఏవైనా శెలవులు వచ్చినప్పుడు రౌతులపూడి వెళ్లినా, ఆ శెలవుల్లో ఆయన కూడా వాళ్ళ ఊరు వెళ్లడం వలన, మళ్లీ ఆయనను కలవడం కుదరలేదు. ఆ తరువాత రోజుల్లో ఆయన కూడా ఆ ఊరు నుంచి వెళ్లిపోయారని తెలిసింది.
మళ్ళీ ఇన్నాళ్ళకు ఇలా ఆయనను చూడడం చాలా బాధగా అనిపిస్తోంది నాకు.
సరే, ఏదైనా ఆయన అసలు ఎందుకు ఈ నకిలీ నోట్లు వ్యవహారంలో చిక్కుకున్నారో తెలుసుకుని నాకు తోచిన సహాయం చేయడానికి నిశ్చయించుకుని, పెదవేగి స్టేషనుకు బయలుదేరాను.
***
నా ఆదేశాల ప్రకారం, నేను స్టేషన్‌కు వెళ్లే సమయానికే మాస్టారుని లాకప్ నుంచి బయటకు తెచ్చి వేరే గదిలో ఉంచారు. నన్ను చూడగానే లేచి నిలబడ్డారు మాస్టారు. నా ఊహ కరెక్ట్. ఆయన చంద్రం మాస్టారే. రూపంలో ఏమీ మార్పులేదు. కొంచెం జుట్టు, మీసం నెరవడం తప్ప.
“కూర్చోండి మాస్టారూ! నన్ను గుర్తు పట్టలేదా?” అడిగాను, నేను కూడా ఆయన పక్కన కూర్చొని.
“లేదు బాబూ! జ్ఞాపకం రావడం లేదు.” అన్నారు నన్ను పరకాయించి చూస్తూ.
“నేనే మాస్టారూ! ఈశ్వర్‌ని. రౌతులపూడిలో మీ పాత విద్యార్థిని. సార్, మీ గురించి ఆ తర్వాత రోజుల్లో చాలా మందిని వాకబు చేసా, కానీ మీ విషయాలు ఏవీ నాకు తెలియలేదు. సరే కానీ, మీరేమిటి మాస్టారూ! ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు?”
“ఏమీ అనుకోకు బాబూ! గుర్తు పట్టలేక పోయా! నా శిష్యుడు ఇలా ఓ పెద్ద పోలీసు ఆఫీసర్ అవ్వడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది నాయనా. ఇక, నువ్వన్నట్టు ఈ ఫీల్డ్ లోకి నేను రాలేదు బాబూ! నన్ను ఇరికించారు.” అంటూ చెప్తూ బుర్ర దించుకున్నారు.
“నేనూ అదే అనుకున్నాను మాస్టారూ! ఎందుకంటే మాకు ఎంతో క్రమశిక్షణ, నీతి, నిజాయితీ గురించి నేర్పిన మా చంద్రం సార్ ఇలాంటి అనైతిక పనులు చేయరని! ఎవరు ఇరికించారో కొంచెం వివరంగా చెప్పండి. వీలైనంత సహాయం చేస్తా.” ధైర్యం చెప్పాను మాస్టారుకి.
చెప్పడం మొదలెట్టారు మాస్టారు.
***
“నాయనా, ఈశ్వర్ నువ్వెళ్లిన రెండు సంవత్సరాలు తర్వాత రౌతులపూడి నుంచి వేరే ఊరుకి నన్ను బదలీ చేసారు. ఓ నాలుగు సంవత్సరాలు తర్వాత, అక్కడ ప్రెసిడెంట్ గారి అబ్బాయిని కొట్టేనని ఇంకో ఊరికి బదిలీ! ఇలా పిల్లలని మందలించడం, పెద్దలు కలగచేసుకుని నన్ను బదలీలు చేయడం జరిగేది. అయితే, నా జీవితం నాశనం చేసిన సంఘటన మటుకు ఓ పది సంవత్సరాల క్రితం జరిగింది.”
“ఏమిటి మాస్టారూ! ఏం జరిగింది?” ఎంతో ఆదుర్దాగా అడిగాను.
“నేను పనిచేస్తున్న ఆ పాఠశాలలో, నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, ఇందులో ఓ ప్రజాప్రతినిధి, మా ప్రధాన ఉపాధ్యాయుని పాత్ర ఉందని నిరూపించే పూర్తి ఆధారాలు సేకరించి, నా పై అధికారికి తెలియచేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ ఇరువురు ఆ రాత్రి కొన్ని నకిలీనోట్లు ఉన్న ఓ కవర్ మా ఇంటిలోకి విసిరేసి, పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి, వాళ్ళ పలుకుబడితో నన్ను ఆ దొంగనోట్ల కేసులో అన్యాయంగా ఇరికించారు బాబూ! అదిగో అక్కడ నుంచి ఎక్కడ నకిలీ నోట్లు దొరికినా నన్ను ఇరికిస్తున్నారు బాబూ!” అంటూ చెప్పి కళ్ళు తుడుచుకున్నారు మాస్టారు.
“మీకు చాలా అన్యాయం జరిగింది మాస్టారూ! అయితే మీరు నిజాయితీగా ఉండడం వలనే మిమ్మల్ని ఇరికించారన్న మాట.” అడిగాను కొంచెం సందేహంగా.
“ఔను బాబూ! సరిగ్గా చెప్పావు. నా అదృష్టం బాగుండి నువ్వు దేవుడిలా వచ్చావు. ఎలాగైనా నన్ను ఈ అక్రమ కేసుల నుంచి తప్పించు బాబూ! ఇదే నాకు నువ్వు ఇచ్చే గురుదక్షిణ అనుకో.” అంటూ నా రెండు చేతులు పట్టుకున్నారు మాస్టారు.
“భలేవారే మాస్టారూ! నా ప్రయత్నం నేను చేస్తా. మీరు చిన్నతనంలో చెప్పినట్లు తప్పకుండా న్యాయమే గెలిచి తీరుతుంది.” అని ధైర్యం చెప్పి బయటకు వచ్చాను.
జీపు ఎక్కుతూ, “వేణూ! ఏం చేద్దాం మాస్టారు కేసుని? పాపం చాలా మంచి వారయ్యా!” అంటూ మా ఎస్సైని అడిగాను.
“నాకూ ఏమీ పాలుపోవడం లేదు సార్. ఇప్పటివరకూ పదకొండు మంది ఈయన మీద కంప్లైంట్ చేసారు సార్. వీలైతే ఓ సారి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుందాం సార్.” అని చెప్పడంతో అక్కడ నుంచి బయలుదేరాను.
***
మర్నాడు ఉదయం, బెడ్ రూమ్‌లో ఫోన్ మాట్లాడుతున్న నాకు, బయట ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్న శభ్దం వినపడింది.
తలుపు తీసివచ్చిన నా భార్య,
“ఏమండీ, మీ కోసం ఎవరో వచ్చారు. హాలులో కూర్చోపెట్టా.” అని చెప్పడంతో, ఫోన్ మాట్లాడిన ఓ ఐదు నిమిషాల తర్వాత హాల్ లోనికి వచ్చాను. ఎదురుగా సోఫాలో చంద్రం మాస్టారు, ఆయన పక్కనే మా ఎస్సై వేణుగోపాల్.
“మాస్టారూ, ఇప్పుడే మీ గురించే మా అడ్వకేట్ గారితో మాట్లాడుతున్నా. ఈ లోగా మీరు వచ్చేరు. సరే కానీ, వేణుగోపాల్ నువ్వు మధ్యాహ్నం ఓ సారి మన ఫ్లీడరు గారిని కలుసుకో. ఆయన మన మాస్టారు కేసు విషయంలో సలహా ఇస్తారుట.” అని చెబుతున్న నన్ను మధ్యలో అడ్డుకున్నారు మా మాస్టారు……
“వద్దు బాబూ! అలాంటి ప్రయత్నం చేయకు. అది చెప్పడానికే వచ్చా. ఎందుకంటే, నువ్వు అనుకుంటున్నట్లు వాడు మీ చంద్రం మాస్టారు కాదు. వాడి పేరు మోహన్ చంద్ర. నా పేరు చంద్రమోహన్. నేను మీ చంద్రం మాస్టారుని. మేమిద్దరం కవలలం” చెప్పారు మాస్టారు, ఆశ్చర్యపోతున్న నా వంక చూస్తూ.
“ఔనా సార్. ఇద్దరూ ఒకేలా ఉన్నారు. అసలు గుర్తు పట్టడం చాలా కష్టం.?” ఇంకా ఆశ్చర్యంలోనే కొట్టుమిట్లాడుతూ అడిగాను.
“ఔను బాబూ! ఇద్దరూ ఒకేలా ఉంటాము. నేను ముందు. వాడు తరువాత. మా అమ్మ మమ్మల్ని చాలా గారంగా పెంచింది. కానీ వాడు చిన్న తనంలోనే పెడతోవ పట్టేడు. వ్యసనాలకు బానిస అయ్యాడు. కొంచెం పెద్ద అయ్యాకా నా పేరు చెప్పుకుని కొంత మంది వద్ద డబ్బులు కూడా తీసుకుని పారిపోయేవాడు. తర్వాత ఈ విషయం తెలిసి వాళ్లకి నా స్వంత డబ్బులు ఇచ్చేవాడిని. ఇలా వాడి వల్ల నేను చాలా నష్టపోయా.” బాధ పడుతూ చెప్పారు మాస్టారు.
“మరి మీకు ఎలా తెలిసింది ఈ అరెస్టు విషయం?” అడిగాను.
“అనారోగ్యం కారణంగా నేను ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రస్తుతం ఇక్కడే ఏలూరు లోనే మా అమ్మాయి ఇంట్లో ఉంటున్నాం. నిన్న పేపర్లో మీ ప్రకటన, అందులో ఉన్న మా వాడి ఫొటో చూసి ఈ రోజు మీ స్టేషన్‌కి వచ్చేను. అక్కడ నీ పేరు, ఫొటో చూసి ఎక్కడో చూసినట్టుంది అనుకున్నా. ఈ లోగా మీ ఎస్సై వేణుగోపాల్ నన్ను చూసి ముందు కొంత కంగారు పడినా, నా అభ్యర్ధన మేరకు మీ ఇంటికి తీసుకు వచ్చారు. ఈ హాలులో నీ చిన్నప్పటి ఫొటోలు చూసిన తర్వాత నాకు పూర్తిగా అర్థమయ్యింది, నువ్వు రౌతులపూడిలో నా ప్రియశిష్యుడవని. చాలా గర్వంగా ఉంది నాయనా, నిన్ను చూస్తూంటే.” అంటూ ఆప్యాయంగా కౌగలించుకున్నారు మాస్టారు. ఆయనకు పాదాభివందనం చేసి,
“అయితే, మాస్టారూ, కస్టడీలో ఉన్న ఆయన చెప్పినవన్నీ అసత్యాలేనా?” అంటూ నిన్న జరిగిన సంభాషణ అంతా చెప్పాను.
“చూసావా బాబూ, వాడి తెలివితేటలు. నువ్వు చెప్పిన దానిని బట్టి చూస్తూంటే.. వాడంతట వాడు ముందు ఏమీ చెప్పలేదు. కానీ, నువ్వు చెప్పిందంతా విని అప్పటి కప్పుడు వేగంగా ఓ కథ అల్లేసాడు. వాడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం. ఇంకో విషయం చెబుతా విను. వాడు ఎంత నీచుడంటే… పోనీ పెళ్లి చేస్తే బాగుపడతాడేమోనని మా అమ్మగారు, మా అక్క కూతురిని ఇచ్చి వివాహం జరిపించారు. కానీ తన అక్రమ సంబంధానికి, అనైతిక పనులకు అడ్డు వస్తోందని ఆ అమ్మాయిని రైలు కిందకు తోసేసి, ప్రమాదంలా చిత్రీకరించాడు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది అని అందరం మౌనంగా ఉండిపోయారు. అఫ్ కోర్స్ ఇది జరిగి పది సంవత్సరాలు అయ్యిందనుకో. అదిగో అప్పటినుంచి వాడు ఎక్కడ ఉన్నదీ మా ఎవరికీ తెలియదు. ఇదిగో మళ్లీ ఇన్నేళ్లకు ఇలా..” అంటూ నిట్టూర్పు విడిచారు మాస్టారు.
“సరే, మాస్టారూ, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? చెప్పండి.” సందేహిస్తూ అడిగాను.
“వాడి మీద దయ చూపకు. నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. అందుకే ఆ భగవంతుడు నిన్నూ, నన్నూ మరోసారి కలిపాడు. లేకపోతే నా మీద అభిమానంతో ఈ పాటికి వాడిని కేసులోంచి తప్పించే ప్రయత్నంలో ఉండేవాడివి. ఎంతోమందిని తన అనైతిక పనుల ద్వారా మోసం చేసి తప్పించి తిరుగుతున్న ఆ నీచుడికి శిక్షపడవలసిందే. ఎప్పటికైనా సరే దుష్ట సంహారం జరగవలసిందే. అదే నేను నీ గురించి కోరుకునే గురుదక్షిణ……” ఆవేశంతో చెబుతున్న మా..స్టారు, మా చంద్రం మాస్టారు, అర్జునుడుకి ఉపదేశం చేస్తున్న గీతాచార్యుడులా కనపడ్డారు నా కంటికి.
మనసులోనే మా గురువుగారికి మరోసారి వందనం సమర్పిస్తూ, రెట్టించిన ఉత్సాహంతో లేచాను. నన్నూ, మా గురువుగారిని మోసం చేయడానికి ప్రయత్నించిన ఆ నీచుడిని శాశ్వతంగా కటకటాల్లోకి నెట్టడానికి.