Site icon Sanchika

గురుపౌర్ణమి

[dropcap]“య[/dropcap]తి హాస్తి తదన్యత్ర, యన్నే హాస్తి నతత్ క్వచిత్”…. ఇందులో ఉన్నవే అన్నిచోట్ల ఉన్నాయి. ఇందులో లేనిది వేరే ఎచ్చటాలేదు… అని చెప్పి మహాభారతాన్ని విశ్వానికందించిన కృష్ణద్వైపాయసుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారమే. పంచమవేదమని ప్రసిద్ధి చెందిన మహాభారతాన్ని 18 పర్వాలుగా రచించడమే కాక, గాసటబీసటగా ఉన్న వేదాలని ‘చతుర్వేదాలు’ గా విభజించి “ వేదవ్యాసుడ”ని పేరుపొందిన ఆ మహానుభావుడు జన్మించినది “ఆషాఢపౌర్ణమి” రోజున. కనుకనే ఈరోజుని “గురుపౌర్ణమి”, “వ్యాసపౌర్ణమి” అని కూడ అంటారు.

అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలను రచించినా వ్యాసునికి ఏదో అసంతృప్తి, వెలితి! నారదమహర్షి ప్రోత్సాహంతో 12 స్కంధాలుగా శ్రీమద్భాగవతాన్ని రచించి, శ్రీహరి గుణకీర్తనని తనివితీరా వర్ణించి తృప్తిచెందాడు. లోకంలోని అజ్ఞానాంథకారాన్ని భస్మీపటలం చేయగల జ్ఞాన జ్యోతులను అందించిన పరమ పూజ్య గురువు “వ్యాసుడు”. ఆయన జన్మించిన ఆషాఢపౌర్ణమి రోజుని “గురుపౌర్ణమి”గా భావించి గురువులను పూజించుకుంటాం. ఇక్కడ “గురువు” అంటే జీవనభృతి కొరకు, లౌకికంగా గురువులుగా వృత్తిధర్మాన్ని స్వీకరించిన ‘ఉపాధ్యాయులు’ కారు. వారి కొరకు సెప్టెంబర్ 5 ( సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి) ఉన్నది.

ఆధ్యాత్మిక గురువు వేరు. జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తిమార్గాన్ని దర్శింపజేసే ‘గురువు’కి భారతీయ సంస్కృతిలో, హైందవ ధర్మంలో అత్యంత ప్రాధాన్యమివ్వబడింది. బాహ్య ప్రపంచం ద్వారా ఏర్పడిన విఘ్నాలను తొలగిస్తూ, మనిషిని అంతర్ముఖంగా ప్రయాణం చేయడానికి అడుగులు వేయించే తల్లి ప్రేమ గురువుకి ఉంటుంది. తప్పటడుగుల్ని గుండెల్లో పొదుపుకొని, క్రోధరహితమైన చిరునవ్వుతో సరిచేసే తండ్రి వాత్సల్యమూ గురువులో ఉంటుంది. అంతేకాక గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా వర్ణిస్తూ, గురువుని “సాక్షాత్తు పరబ్రహ్మ”గా భావించి, అటువంటి గురువుకి నమస్కారం అంటుంది భారతీయ సంస్కృతి.

గురువులు బోధించే ధర్మాలు అతి సూక్ష్మమైనవి. స్ధూలదృష్టికి గోచరించనివి. ఎవరెవరికి ఉండే యోగ్యత ననుసరించి వారు గ్రహించగలరు. అందునా భారతదేశంలో ఆధ్యాత్మిక గురువులకు లోటులేదు. ఎవరి ధర్మం ఏదైనా, దృక్పథం ఏదైనా చివరికి వారి అన్వేషణ ‘సత్యం’ వైపే. మోక్షం వైపే. విలువలని, ఆదర్శాలని బోధించి, మానసిక ఉన్నతికి సోపానాలు వేసే గురువుల వల్ల భారతీయ సంస్కృతి ప్రపంచాని కంతటికీ మకుటాయమానమై నిలిచింది.

శ్రీరామునికి వశిష్ఠులవారు, శ్రీకృష్ణునికి సాందీపునిలా, ఆధునిక కాలంలో వివేకానందుడికి రామకృష్ణ పరమహంసలా గురువులు కర్తవ్యబోధకు, ఆధ్యాత్మిక సత్యాన్వేషణకు మార్గదర్శకులుగా నిలిచారు. వివేకానందులు పశ్చిమ దేశాలకు పర్యటించి భారతీయ ఆధ్యాత్మిక మరియు యోగవిద్యల గురించి సందేశం ఇచ్చి భారతీయ ధర్మాల్ని పాశ్చాత్యులు నివ్వెరపోయేలా విన్పించారు. ఆధ్యాత్మికతపై ఆధారపడిన వ్యక్తులు భయరహితులు. తాను కేవలం భౌతిక శరీరం కాదు, అనంతమైన ఆత్మయే నని గుర్తించి, ఆ అనుభూతిని పొందుతాడో… అతడు జ్ఞానమార్గంలో కొనసాగుతాడు. బ్రహ్మానందాన్ని నిరంతరం పొందగలుగుతాడు.

వ్యాస భగవానుల జన్మదినమైన ఈ రోజున జగద్గురువులు ఆదిశంకరాచార్య, సర్వ మానవ శ్రేయస్సు కోరిన రామానుజాచార్యుల వంటి గురువులను స్మరిద్దాం…. తరిద్దాం !

Exit mobile version