Site icon Sanchika

“గుథ్థి” ఒక చిక్కు ముడి

[box type=’note’ fontsize=’16’] “చాలా విషయాల్లో నిరాశ పరచినా సస్పెన్స్ ఎలిమెంట్ కు గాను చూడొచ్చు. ఓ పదిహేడు నిముషాలు వెచ్చించ గలిగితే” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘గుథ్థి’ లఘుచిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]ఈ[/dropcap] వారం కొన్ని అవార్డు పొందిన లఘు చిత్రాలు చూశాను, కానీ ఏదీ నన్ను ఆకట్టుకోలేదు. ఒక దాంట్లో bright camaramanship వుండి కథ నమ్మశక్యంగా లేకపోతే, మరొకటి మరో కారణం చేత నచ్చలేదు. ఈ “గుథ్థి” అన్నది మూడో లఘు చిత్రం ఈ రోజు చూసినది. చాలా విషయాల్లో నిరాశ పరచినా సస్పెన్స్ ఎలిమెంట్ కు గాను చూడొచ్చు. ఓ పదిహేడు నిముషాలు వెచ్చించ గలిగితే.

వారం నుంచి రచయిత (రత్న శేఖర రెడ్డి) గదిలో కంప్యూటర్ ముందు అలా ఖాళీ వర్డ్ ఫైల్ ని చూస్తూ కూర్చున్నాడు. ఎన్నో సిగరెట్లు, మందులు, జుట్టు పీక్కోవడాలు అయ్యాక కూడా కథా ప్రారంభమే అతనితో దాగుడు మూతలాడుతుంది. కథంటూ మొదలైతే దానంతట అదే ముందుకెళ్ళిపోతుంది రైలు బండిలా. సమస్యల్లా ఈ writers’ block తోనే. అతను ఆలోచనల్లో వుండగా బెల్లు మోగుతుంది. తీస్తే సఫాయి కర్మచారి ఖలీల్(నరేన్ యాదవ్), చెత్త డబ్బా తీసుకెళ్ళడానికి వచ్చాడు. లోపలినుంచి చెత్త డబ్బా బయటకు తీసుకు వెళ్తే అక్కడ ఖలీల్ మరొకరి చెత్తబుట్టలో ఏదో ఏరుకుంటూ వుంటాడూ. ఇతన్ని చూసి తడబడతాడు. ఇక ఇతని దగ్గరినుంచే తనకు కథ దొరకనుంది అని చెప్పి అతనితో మాట కలిపి దగ్గరవుతాడు. తన గదిలో కూర్చోబెట్టుకుని అతనితో మాట్లాడుతూ వుంటాడు. ఖలీల్ కొన్నేళ్ళుగా ఆ అపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు. అదనంగా ఎవరన్నా ఏదన్నా తెచ్చి పెట్టమంటే ఆ పని చెయ్యడం, కుర్రాళ్ళు గంజాయి తెచ్చి పెట్టమంటే తెచ్చి పెట్టడం చేస్తుంటాడు. కాని వీటన్నిటికంటే వో విచిత్రమైన హాబీ వుంటుంది. అందరి చెత్త బుట్టల్లో చూసి ఆయా ఇంట్లో ఎలాంటి బాగోతాలున్నాయో అని వూహించడం. ఒక సారి ఓ జంట ఫొటో ను రెండు ముక్కలుగా చింపి పడేసుంటే, మరో దాంట్లో కండోం కవరుంటుంది. ఒక ఫ్లాట్‌లో యువతికి వొకతనితో రహస్య సంబంధం వుంటే, అతనికి చర్మ వ్యాధి వుందని ఖలీల్ చేత మందులు తెప్పించుకుంటుంది. మరో రోజు అవే మందుల ఖాళీ అట్ట పెట్టెలు వేరే ఫ్లాట్ చెత్త బుట్టలో కనిపిస్తాయి. ఇలాంటి తన కథనాలు ఖలీల్ చెబుతాడు. గంజాయి నింపిన సిగరెట్టు అందిస్తే రచయిత తీసుకోడు. గంజాయి దమ్ము లాగి చనిపోయినవారెవరూ లేరు సార్ అంటాడు ఖలీల్. అవునవును అందులో సోడియం థయోపెంటల్ కలిపి వుంటే తప్ప అంటాడు రచయిత. ఇలా వాళ్ళిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా మాట్లాడుకుంటూ వుంటారు. ఒకసారి ఖలీల్ కథ చెబితే మరోసారి రచయిత చెబుతాడు. ఇది కథకు మొదలు. దీని తర్వాతి కథ చెప్పడం సస్పెన్సును బహిర్గతం చెయ్యడమే. కాబట్టి వ్రాయను. మీరే యూట్యూబ్ లో చూడండి.

లఘు చిత్రం ఎలా వుంది? బాగుంది. అంటే ఇదివరకు అపన (అపరాధ పరిశోధన) పుస్తకాలు, కొమ్మూరి సాంబశివరావు నవలలు వచ్చేవి కదా, అలా ఉత్కంఠ భరితంగా వుంది. బాలేదు. ఎందుకంటే ఒక మంచి కథను, మంచి నిర్మాణాన్ని నటుల బలహీనత వల్ల పాడు అయ్యింది. రచయిత ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషనూ వుండదు. పెద్ద పెద్ద డైలాగులు కూడా వార్తలు చదివినట్టు చదువుతాడు, ఎలాంటి భావోద్వేగమూ లేకుండా. ఖలీల్‌గా చేసిన నరేన్ నయం. ఇద్దరిదీ హైదరాబాదీ పలుకే అయినా ఖలీల్ చక్కగా చెబుతాడు. అతని ఎక్స్ప్రెషన్స్ కూడా బానే వున్నాయి. ఇక కొన్ని చోట్ల అనవసర circular movements, shaky handheld shots, సరిగ్గ కుదరని లైటింగు వగైరా బడ్జెట్ కారణంగా కూడా కావచ్చు. కథ, మాటలూ, దర్శకత్వమూ అభిషేక్ చటర్జీవి. అతని దర్శకత్వమూ కథా బాగున్నాయి. సంభాషణలు bookish గా అనిపించాయి, లేదా ఆ నటుల ఉచ్చారణ వలన అలా అనిపించిందేమో తెలీదు. ఇతని నుంచి మంచి చిత్రాలు ఆశించవచ్చు. సినిమా కథనం పరంగా అతని శిల్పం బాగుంది. పొడుపు కథల్లో వొక్కో ముడి వీడుతూ. అలాగే కొన్ని జోకులు మనం చదివి వుంటాం, పైనుంచి కిందకి చదువుకుంటూ పోతే వొకలా, కింది నుంచి పైకి చదువుకుంటూ పోతే మరొకలా అర్థం అవుతాయి. దాదాపు అలాంటి ప్రక్రియ వొకటి ఇందులో వాడాడు. ఒక సారి చూడొచ్చు.

Exit mobile version