Site icon Sanchika

హంస దౌష్ట్యం

[dropcap]‘ఎ[/dropcap]వరిది ఈ నంబర్? ఇప్పటికి నాలుగైదుసార్లు ఇలా సింగిల్ రింగ్ ఇచ్చి వదిలేసారు. పోనీ నేనే మాట్లాడి చూస్తే పోలా’ అనుకుంటూ చేస్తున్న వర్క్‌ను పక్కనపెట్టి ఆ నంబర్‌కి తిరిగి కాల్ చేసాడు విశ్వనాథ్.

“హెలో!” అట్నుంచి స్వీట్ హస్కీ వాయిస్.

సీట్లో కొంచెం సర్దుకుని కూచుంటూ చుట్టూ చూసాడు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు.

ఫోన్లో మాటలు బయటకు వినపడకుండా… లో టోన్‌లో మాట్లాడుతూ ఫోనుకి చెయ్యి అడ్డుపెట్టి… “హలో! అటువైపు ఎవరు? గంటలో నాలుగు సార్లు మీ నంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. కానీ ఎందుకో ఒక్క రింగుకే కట్ చేస్తున్నారు. ఇంతకీ మీరెవరు?” కుతూహలంగా అడిగాడు.

“నా పేరు హంస! మీతో కొంచెం మాట్లాడాలి. బిజీగా ఉన్నారేమోనని ఫోన్ కట్ చేస్తున్నాను.”

పిల్ల తిమ్మెరలు మొహాన్ని తాకినట్టు, వీణ మీటినట్టున్న సన్నటి గొంతు తియ్యగా మరోసారి హృదయాన్ని తాకింది.

స్థిమితంగా కూర్చోలేక ఒకసారి లేచి నుంచుని, మళ్లీ కూర్చున్నాడు విశ్వనాథ్.

అతని అవస్థని పసిగట్టినట్టు అటువైపునుంచి మరోసారి మంద్రమైన నవ్వు.

ఇంకెవరైనా అయితే విసుక్కుని ఫోన్ పెట్టేసేవాడే… కానీ ఎందుకో, ఆమె నవ్వు వినేకొద్దీ వినాలనిపిస్తోంది.

క్యాలండర్‌లో డేట్లు మారుతున్నాయి. విశ్వనాథ్ ఫోన్‌లో కాల్ డేటా పెరుగుతూ వచ్చింది.

రోజులు… నెలలు దొర్లుతున్నాయి. ఆఫీస్‌లో అందరూ విశ్వనాథ్ పెళ్లి కార్డ్ ఎప్పుడిస్తాడా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

హంస పేరు మీద ఫ్లాట్ రిజిస్టర్ చేయించిన విశ్వనాథ్ హీరోలా ఫీలయ్యాడు. వారం రోజుల్లో హంసతో పెళ్లికి లగ్గం పెట్టేసుకోడానికి నిశ్చయించుకున్నాడు. ఇంట్లో అందర్నీ అతి కష్టం మీద ఈ పెళ్లికి ఒప్పించాడు.

“మా ఇంట్లో కులాంతరం ఒప్పుకోవట్లేదు, నీకు దూరంగా ఉండేకంటే చచ్చిపోవడం మేలు” చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది హంస.

“కంగారు పడకు. అన్నీ అవే సర్దుకుంటాయి. ఇలా ఫోన్లలో వద్దు. ముందు మీ ఇంటికి వెళ్లి మీ అమ్మా, నాన్నలతో మాట్లాడు. అవసరమైతే నేనూ వస్తాను” ధైర్యం చెప్పి హంసని వాళ్ళింటికి వరంగల్ పంపించడానికి రైలెక్కించాడు విశ్వనాథ్.

పదిరోజులైనా హంస దగ్గరనుండి ఫోన్ లేదు. “ఏమయ్యుంటుంది? హంస ఆత్మహత్య చేసుకోలేదు కదా!” ఆందోళనతో ఎన్నిసార్లు ఫోన్ చేసాడో తనకే తెలీదు. స్విచ్ ఆఫ్ రావడమే తప్ప, ఏమయ్యిందో తెలీకపోవడంతో పిచ్చిపట్టినట్లయ్యింది విశ్వనాథ్‌కి.

మాసిన గెడ్డం, నలిగిన దుస్తులతో చివరకు పిచ్చివాడిలా, కళావిహీనంగా తయారయ్యాడు.

***

“సర్! మీరు రాసిన కథ ఈవారం పత్రికలో చదివాను. ఎక్సలెంట్ థీమ్ సర్. వండర్‌ఫుల్… వండర్‌ఫుల్ కాన్సెప్ట్” గలగలా మాట్లాడేస్తోంది హంస.

“మీరింత అభిమానంతో ఫోన్ చేశారు చాలు. నేనేమంత పెద్ద రచయితను కాదండీ” ఇబ్బందిగా ఫీలవుతూ ముక్తసరిగా సమాధానమిచ్చాడు… ఆడవాళ్ళతో పెద్దగా పరిచయాలు లేని విక్రమ్.

“భలేవారే! మీరు పట్టున్న కథలు రాయాలే కానీ… త్రివిక్రమ్ గారిని మించిపోతారు” పొగడ్తలతో ముంచెత్తుతూ హస్కీగా హృదయాన్ని మీటుతోంది హంస.

అంత వరకూ సినీ ఫీల్డ్ మీద పెద్దగా ఎలాంటి అభిప్రాయాలూ లేని విక్రమ్‌కి హంస మాటలతో తాను గొప్ప రచయితను కాగలనన్న నమ్మకం కలిగిoది.

తాను రాసిన ప్రతీ కథనూ ఆమెకు పంపించి సలహాలు తీసుకునేవాడు. అర్థరాత్రి పన్నెండయినా ఎంతో ఓపిగ్గా కథల గురించి డిస్కస్ చేసేది హంస.

సినిమా వాళ్ళతో తనకున్న పరిచయాలను అడ్డం పెట్టుకుని, అద్దంలో మిఠాయి చూపించి ఊరించినట్టు విక్రమ్‌ని, ఫోన్లలో పెద్ద పెద్ద డైరెక్టర్లకి పరిచయం చేసింది.

కలల్లో తేలిపోయిన విక్రమ్… ఆమె అడిగినప్పుడల్లా ఆమె అకౌంట్ కి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసేవాడు.

***

“నువ్వు ఇల్లమ్మి డబ్బులిస్తావా లేదా? నీ కొడుకు పెద్ద హీరో అయితే నీకేకదా గర్వంగా అనిపించేది. నిన్ను చంపయినాసరే కాయితాలమీద సంతకం పెట్టిస్తాను” ఉన్న ఒక్కగానొక్క కొడుకూ రాక్షసుడిలా మీద పడి గద్దిస్తుంటే తట్టుకోలేని ముసలి గుండె ఆగిపోయింది.

తండ్రి దహన సంస్కారాలు కూడా పూర్తి కాకుండానే ఉన్న వంద గజాల స్థలంలోని ఇల్లూ బేరం పెట్టేసి, వారం రోజుల్లో చెన్నైలో ఉంటానని హంసకి ఫోన్ చేసాడు హరీష్.

రోడ్ల పక్కన పెద్ద పెద్ద హోర్డింగుల్లో తన బొమ్మను ఊహించుకుంటూ… గ్రాండ్ సరాయ్ హోటల్ ముందు కారు దిగాడు హరీష్.

“నో, నో… నిన్నిప్పుడు కలవడం కుదరదు. నేను షూటింగ్ స్పాట్ లో ఉన్నాను. ఒక పనిచెయ్యి. నా పేర్న టూ డేస్ కి ఆ హోటల్ లో రూమ్ బుక్ చెయ్యి. సాయంత్రం ఆరు కల్లా నీముందుంటాను” మత్తుగా నవ్వుతూ చెప్పింది అసిస్టెంట్ డైరెక్టర్ హంస.

“పెళ్లికాని పిల్ల… ఆమెతో కలిసి రూంలో ఉండడం ఎలా?” పరిపరివిధాల పోతోంది హరీష్ మనసు.

“ఆమె వయసు పాతిక, ముప్పయి సంవత్సరాల మధ్య ఉంటుందా?” ఆలోచిస్తూనే విజిటర్స్ గ్యాలరీ లోని సోఫాలో కూర్చుని నిద్రలోకి జారుకున్నాడు హరీష్.

“హలో!” భుజాలు పట్టి కుదుపుతున్న అప్సరసలాంటి ఆమె అందానికి ముగ్ధుడై చూస్తుండిపోయాడు.

నవ్వుతూ గలగలా మాట్లాడుతున్న హంసతో డిన్నర్ షేర్ చేస్కోవడం… మాహారాజ ప్యాలస్‌లో విందు భోజనం ఆరగించినంత తృప్తిగా అనిపించింది హరీష్‌కి.

కొసరి కొసరి తినిపిస్తూ… కవ్విస్తూ మాట్లాడుతున్న ఆమె సాంగత్యం కోసం తపించసాగాడు. తాను తెచ్చిన డబ్బంతా ఆమె చేతిలో పోసాడు.

“ఉదయం ఎనిమిది గంటలకల్లా రెడీగా ఉండు. నేను రిసెప్షన్ దగ్గరకే వచ్చేస్తాను మౌళి గారి సినిమాలో హీరో ఛాన్స్ నీదే! వారిని రేపు కలుస్తున్నాం” గాల్లోకి ముద్దు విసిరి, మత్తెక్కించే కళ్ళతో గుడ్ నైట్ చెప్పింది హంస.

“హూ…! అంటే నేను ఆమెతో ఈ రాత్రికి ఈ హోటల్ రూంలో వుండట్లేదన్నమాట!” గట్టిగా నిట్టూర్చి… మరో లాడ్జిలో తక్కువ ఖరీదులో రూమ్ ఏదైనా దొరుకుతుందేమో వెతకడానికి బయల్దేరాడు హరీష్.

తెల్లారి ఏడున్నర గంటలకల్లా గ్రాండ్ సరాయ్ హోటల్లో ఉన్నాడు.

“సర్, ఆమె గంట క్రిందటే రూమ్ వెకేట్ చేసి వెళ్లిపోయారు. మీరు వస్తే ఎం.జి.ఆర్ మార్గ్‌కి రమ్మన్నారు” అడ్రస్ కాగితం చేతిలో పెడుతూ చెప్పాడు హోటల్ రిసెప్షనిస్ట్.

హంస ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చేసేదేమీ లేక ఆమె ఇచ్చిన అడ్రస్‌కి క్యాబ్ బుక్ చేసుకున్నాడు హరీష్.

ఒకటి కాదు… రెండు కాదు… నాలుగు వారాలు తిరిగినా  చెన్నైలో హంస అడ్రస్ పట్టుకోలేకపోయాడు.

***

మనీ లాండరింగ్ కేసులో బడా బాబుల్ని సైతం బురిడీ కొట్టించిన ముఖేష్ మల్హోత్రా… అతని ప్రియురాలు హంసానందిని ప్రైవేట్ ఫ్లైట్‌లో ముంబయికి పారిపోయి అజ్ఞాతంలో దాక్కున్నారని టీ.వీ.లో పెద్ద పెద్ద అక్షరాలతో స్క్రోలింగ్ వేస్తూ బ్రేకింగ్ న్యూస్‌లో చూపిస్తుంటే… హంస చేతిలో మోసపోయిన సదరు బుద్ధిమంతులందరూ నోళ్లు వెళ్ళబెట్టుకుని, టీ.వీ.ల వంక రెప్ప వెయ్యకుండా చూస్తున్నారు.

కట్ చేస్తే….

ఏలూరు చింతా వారి వీధిలో పంచముఖాంజనేయస్వామి గుడిలో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోడానికి వచ్చిన బ్రహ్మచారి ‘చారి’ కళ్ళు… భుజాల నిండుగా పైట కప్పుకుని, ఆంజనేయస్తోత్రం పఠిస్తూ… దణ్ణం పెట్టుకుని ప్రదక్షిణాలు చేస్తున్న హంసవాహినిని చూసి సంభ్రమంతో మతాబుల్లా వెలిగాయి.

“ఎంత సాంప్రదాయంగా ఉంది? చూడ్డానికి చాలా బుద్ధిమంతురాలిలా ఉంది” అనుకుంటూ హంసతో మాటలు కలపడానికి ఆమె వెనకే నడిచాడు చారి.

గల గలా నవ్వుతూ… కొబ్బరి చెక్క ముక్కలు కొట్టి నోటికి అందిస్తున్న ఆమె చేతిని సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు చారి.

“పొండీ!” హస్కీగా ముద్దుగా విసుక్కుంటూ, చేతుల్లో ముఖాన్ని దాచుకుంటూ సిగ్గుపడుతూ నవ్వుతోంది హంస.

ఒక్క క్షణం కూడా ఆలశ్యం చెయ్యకుండా… ఆమె మాటల గలగలలకి తాళం వేస్తున్నట్టున్న గాజుల చేతులకు చటుక్కున బేడీలు తీసి తగిలించాడు… మఫ్టీలో ఉన్న క్రైమ్ బ్రాంచ్ సి.ఐ. రాఘవాచారి. ఆమె వెనుకనే నుంచున్న ముగ్గురు కానిస్టేబుల్స్ వలయాకారంగా చుట్టుముట్టి నుంచోవడంతో, జరిగిందేమిటో అర్థం కాక బిత్తరపోయి చూస్తుండిపోయింది ఒకప్పటి హంసానందిని… ఉరఫ్ నేటి హంసవాహిని.

అంతకు ముందురోజు హంసానందినిని పోలిన అమ్మాయి గుడికి వచ్చిందని, రేపటి రోజున విశేషపూజలు చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి పంపించేశానంటూ…. గుడి పూజారి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌కి అలెర్ట్ అయ్యాడు చారి.

ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఆమెకు బేడీలు తగిలించి, స్టేషన్‌కు తీసుకువెళుతూ పూజారి కేసి చూసి బొటనవేలు పైకెత్తి చూపుతూ ధన్యవాదాలు తెలియజేశాడు.

తనదైన స్టైల్‌లో హంసని  ఇంటరాగేట్ చేసి, ముఖేష్ మల్హోత్రా ఆచూకీ వివరాలు రాబట్టగలిగాడు చారి. ఇంతమందిని మోసం చేసిన కిలాడీ లేడీ హంసను చాకచక్యంగా పట్టుకుని, కేసుని ఛేదించిన ‘చారి’ కోసం కమీషనర్ ఆఫీసులో టేబుల్ మీద ప్రమోషన్ ఆర్డర్స్ ఎదురుచూస్తున్నాయి.

Exit mobile version