[box type=’note’ fontsize=’16’] మే 16 అన్నమయ్య జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీ కె. హరి మధుసూదన రావు. [/box]
[dropcap]‘అ[/dropcap]ల వైకుంఠపురంబులో వెలసిన శ్రీమహావిష్ణువు వద్ద సుస్థిర స్థానాన్ని పొందినవాడు అన్నమయ్య’ అని తాళ్ళపాక అన్నమయ్య కుమారుడు పెద్ద తిరుమలాచార్య కీర్తించాడు. కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరుని కీర్తించడానికే ఇతడు అవతరించాడనడానికి ప్రబల నిదర్శనంగా స్వామిని దర్శించినది మొదలు రోజుకొక సంకీర్తనకు తక్కువ కాకుండా దాదాపు ముప్పైరెండువేల సంకీర్తనలను రచించి సంకీర్తనాచార్యుడుగా పేరుపొందాడు అన్నమయ్య. కర్ణాటక సంగీత పితామహుడైన పురందరదాసు అన్నమయ్యను హరి అవతారమని ప్రస్తుతించాడు. ‘నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం’, సమస్త పాపరాశినీ ధ్వంసం చేయగలిగేది నామ సంకీర్తనం. ఎవరినైనా పొగడడాన్ని కీర్తన అంటారు. సమ్యక్ కీర్తనం సంకీర్తనం, లయబద్ధంగా కీర్తించడాన్నిసంకీర్తన అంటారు.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మ నివేదనం
వేద వ్యాసుడు భాగవతంలో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం భక్తులు నవ విధి భక్తి మార్గాలుగా అసుసరిస్తారని చెప్పాడు. పోతనామాత్యుడు దీనిని తెలుగులో ఇలా వ్రాశాడు.
తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బనునీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁదలతున్ సత్యంబు దైత్యోత్తమా
భక్తి మార్గాలైన ఈ తొమ్మిది మార్గాలతో సర్వాంతర్యామి అయిన శ్రీహరిని పూజిస్తూ ఉత్తముడిగా జీవించుటే సత్య మార్గమని తెలిపాడు. సంకీర్తన ఒక్కటి చాలు భవ బంధాలను దాటడానికి నావ వంటిదని చెబుతూ అన్నమయ్య ఇలా అన్నాడు.
IIపల్లవిII
చాలదా బ్రహ్మ మిది సంకీర్తనం మీకు
జాలెల్ల నడఁగించు సంకీర్తనం
IIచరణంII
సంతోష కరమైన సంకీర్తనం
సంతాప మణఁగించు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం
సంతతముఁ దలచుఁడీ సంకీర్తనం (సామంత రాగం, 1 – 143)
అన్నమయ్య జీవిత చరిత్రను అతని మనుమడు తాళ్ళపాక చిన వేంగళ నాథుడనే చిన్నన్న ద్విపద కావ్యంగా వ్రాశాడు.
అన్నమయ్య పూర్వీకుల చరిత్ర :
క్రీ.శ. 10 వ శతాబ్దిలో కాశీ క్షేత్రమంతటా తీవ్రమైన క్షామం అలముకొంది. ఇప్పటి కర్నూలు జిల్లా నందవరం ప్రాంతాన్ని పాలిస్తున్న నంద రాజు ఆహ్వానం మేరకు కాశీ నుండి కొంతమంది బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చారు. వీరిని నందవరీకులుగా పిలిచేవారు. వీరు క్రమేణా కర్నూలు, కడపలలోని వివిధ ప్రాంతాలకు విస్తరించారు. నారాయణయ్య అనే బ్రాహ్మణునికి చదువు సరిగ్గా వంటబట్టక పోవడం చేత ఖిన్నుడై ఆత్మహత్య చేసుకుందామని ఊటుకూరులోని చింతలమ్మ ఆలయంలోని పుట్టలో చేయి పెట్టాడు. చింతలమ్మ ప్రత్యక్షమై ‘చెన్నకేశవస్వామి అనుగ్రహంతో నీకు వేద విద్య ప్రాప్తిస్తుంది. నీ మనుమని రూపంలో మహా భక్తుడు జన్మిస్తాడు.’ అని వరం ప్రసాదించింది. నారాయణయ్య తాళ్ళపాక వచ్చి స్థిరపడ్డాడు. కడప జిల్లా లోని పొత్తపినాడు ప్రాంతంలోని తాళ్ళపాక అనే గ్రామానికి అన్నమయ్య పూర్వీకులు వచ్చి స్థిరపడటం చేత వీరికి తాళ్ళపాక వంశ నామధేయ మయ్యింది. వీరు ఋగ్వేదానికి చెందిన ఆశ్వలాయన సూత్రులు, భారద్వాజ గోత్రీకులు. నారాయణయ్య కుమారుడు నారాయణ సూరి.
నందకాంశంలో అన్నమయ్య జననం :
నారాయణ సూరికి యుక్త వయస్సు రాగానే లక్కమాంబతో వివాహమయ్యింది. సంతానం కలగక పోవడంతో తిరుమల చేరుకొని ధ్వజస్తంభం వద్ద సాష్టాంగ ప్రణామం చేసి వేడుకున్నాడు. ఆ రోజు రాత్రి లక్కమాంబ గర్భంలోకి శ్రీనివాసుని నందకాంశం ప్రవేశించడం స్వప్నంలో సాక్షాత్కార మయ్యింది. తాళ్ళపాక చేరుకున్న ఆ దంపతులకు సర్వధారి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు విశాఖ నక్షత్రంలో 1408 మే 9 వ తేదీన పుత్రుడు జన్మించాడు. ‘అన్నం బ్రహ్మతీ యజునాత్’ అనే వేదోక్తిని అనుసరించి అన్నమయ్య అని ఆ బాలునికి నామకరణం చేశాడు. వేంకటేశ్వరుని ప్రసాదం అంటేనే ఏదైనా తినేవాడట. తిరుమల రాయని పాట పాడందే నిద్ర పోయేవాడు కాదట. తండ్రి వద్దనే విద్యాభ్యాసం ప్రారంభించాడు.
తిరుమల పయనం :
దర్భ కోసం అడవికి వెళ్లి కోస్తుంటే చేయి కోసుకుని రక్తం బొటా బొటా కారుతోంది. వేదన నుండీ ఒక రాగం ఉద్భవించింది. శ్రీనివాసా గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా! అంటూ గోవింద నామాలు పాడుతూ తిరుమల వెళుతున్న పల్లె భక్త బృందాన్ని ఆనుసరించాడు. ఈనాటికీ అన్నమయ్య కాలిబాటలో రాజంపేట తాలుకా నుండి తిరుమలకు ఎందరో భక్తులు కాలినడకన చేరుకుంటున్నారు. తిరుపతిలో మొదట గంగమ్మను దర్శించాడు. అళిపురి సింగరి, తలయేరు గుండు, పెద యెక్కుడు, కురువ మండపం, కపురంపు కాలువ దాటి మోకాళ్ళ పర్వతం చేరుకున్నాడు. ఆహారం లేకపోవడం చేత, నెమ్మదిగా నడచడం చేత పల్లె భక్త బృందం నుంచి వేరయ్యాడు. అలిసి పోయి కళ్ళు తిరిగి పడిపోయాడు. కొంతసేపటికి ఒక ముత్తయిదువ వచ్చి స్వామి ప్రసాదం ఇచ్చింది. ఈ కొండ సాలగ్రామ మయమని చెప్పులను విడిచి ఎక్కమని సలహా ఇచ్చి అదృశ్య మవడంతో అలమేల్మంగమ్మే వచ్చిందని తెలుసుకున్నాడు.
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం :
అన్నమయ్య మొదట స్వామి పుష్కరిణిలో స్నానం ఆచరించాడు. స్వామి పుష్కరిణిలో స్నానం అత్యంత దుర్లభమని వరాహ పురాణంలో ఇలా ఉంది.
స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోః పాదసేవనం
ఏకాదశీవ్రతం చాపి త్రయ మత్యంత దుర్లభం
స్వామి పుష్కరిణిలో స్నానం, సద్గురుని పాద సేవ, ఏకాదశీ వ్రతం పాటించడం వంటి మూడు పుణ్యకార్యాలూ ఆచరించటం అత్యంత దుర్లభం. ముందు వరాహ స్వామిని దర్శించి, వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాడు. సమయం మించి పోవడంతో గుడి వాకిళ్ళు మూసివేశారు. వేంకటేశ్వర శతకాన్ని ఆశువుగా చెప్పాడు.
తాళ్ళపాక నుండి దర్శనార్థంబు
వచ్చినట్టి నన్ను వలదటంచు
గుడికి తలుపుమూసి కూర్చుండగా లోన
న్యాయ మగునె! తలుపు దీయవయ్య
అని అన్నమయ్య చెప్పగానే స్వామి గుడి తలుపులు తెరుచుకోవడంతో అక్కడి అర్చకులు ఆశ్చర్యపడి స్వయంగా స్వామి దర్శనం చేయించారు. స్వామిని దర్శించిన అన్నమయ్య ఇలా పాడాడు.
అదివో అల్లదివో హరివాసము
పదివేలు శేషుల పడగల మయము (శ్రీరాగం – 1 – 23)
శ్రీవారి పాదాలను దర్శించి
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మ దానెనీపాదము (ముఖారి – 1 – 131)
స్వామి వారి అభయ హస్తాన్ని చూసి
ఇందరికి నభయంబు లిచ్చుఁజేయి
కందువగు మంచి బంగారు చేయి (సామంతం – 1 – 334)
చక్రాన్ని వీక్షించి
చక్రమా హరి చక్రమా
వక్రమైనా దనుజుల వక్కలించవో (పాడి – 1 – 183)
అని తన్మయత్వంతో గానం చేశాడు. తిరుమల లోని ఘన విష్ణువు అనే యతీశ్వరుని వద్ద పంచ సంస్కారాలు అనబడే సమాశ్రయం పొందాడు. తిరుమల చుట్టుపక్కల ప్రాంతాలను దర్శిస్తూ కొంత కాలం ఉన్నాడు. నారాయణ సూరి, లక్కమాంబ తిరుమలకు వచ్చి అన్నమయ్యను ఒప్పించి తాళ్ళపాకకు తీసుకువెళ్ళారు. ఎప్పుడూ దండె చేత బట్టి పాటలు పాడుకుంటూ తిరుగుతున్న అన్నమయ్య దృష్టి మరల్చడానికి ఒక శుభ ముహూర్తాన తిమ్మక్క, అక్కమాంబలతో వివాహం జరిపించారు.
అహోబల క్షేత్రంలో ఆదివన్ శఠగోప యతి వద్ద విశిష్ఠాద్వైత అభ్యసన :
వేదాంత రహస్యాలను తెలుసుకోవడానికి అహోబల మఠ ప్రతిష్ఠాపనాచార్యుడైన ఆదివన్ శఠగోప యతి వద్దకు వచ్చాడు. వీరి వద్ద విశిష్ఠాద్వైతాన్ని అభ్యసించాడు. వీరు వడకలై శాఖకు చెందిన వారు. శ్రీమద్రామానుజుల తరువాత విశిష్ఠాద్వైతం తెంగలై, వడకలై అనే రెండు శాఖలుగా విడిపోయింది. తెంగలై శాఖకు పిళ్ళై లోకాచార్యులు, వడకలై శాఖకు వేదాంత దేశికులు నేతృత్వం వహించారు. తెంగలై శాఖ వారు నాయిలార దివ్య ప్రబంధాన్ని అనుసరిస్తే, వడకలై శాఖ వారు శ్రీభాష్యాన్ని అనుసరిస్తారు. తెంగలై శాఖ వారు భక్తుని పట్ల భగవంతుని కృప నిర్హేతుకమని భావిస్తే, సహేతుకమని వడకలై శాఖ వారు భావిస్తారు. వడకలై శాఖకు చెందిన ఆదివన్ శఠగోప యతి వద్ద విశిష్ఠాద్వైతాన్ని అభ్యసించినా అన్నమయ్య తెంగలై సాంప్రదాయాన్ని పాటించాడు అనడానికి నిదర్శనంగా ఈ కీర్తన నిలుస్తోంది.
నిరుహేతుక దయానిధివి నీవు
కరుణించు నీకు నొక్కటి విన్నపము (ముఖారి – 2 – 106)
శ్రీ రామానుజాచార్యుల మతమే అనుసరించాడు అనడానికి
సహజ వైష్ణవాచార వర్తనుల
సహవాసమె మా సంధ్య
అనే కీర్తనలో
మతి రామానుజ మతమే మాకును
చతురత మెఱసిన సంధ్య (సామంతం – 1 – 10)
మరో కీర్తనలో
IIపల్లవిII
గతులన్ని ఖిలమైన కలియుగ మందును
గతి ఈతఁడే చూపె ఘనగురు దైవము
IIచరణంII
ఈతని కరుణనేకా ఇల వైష్ణవుల మైతి
మీతని వల్లనే కంటి మీ తిరుమణి
యీతఁడే కా ఉపదేశ మిచ్చె నష్ఠాక్షరిమంత్ర
మీతఁడే రామానుజులు యిహ పర దైవము (దేసాళం – 2 – 372)
వంటి కీర్తనలు నిదర్శనములు.
సాళువ నరసింహ రాయలతో :
టంగుటూరు దండనాథుడైన సాళువ నరసింహ రాయలు అన్నమయ్య కవితా వైభవాన్ని తెలుసుకొని తన కొలువుకు పిలిపించుకొన్నాడు. అన్నమయ్య ఆశీర్వాదం వల్ల అనేక రాజ్యాలను గెలిచి విజయనగరాధీశుడై తన రాజధానిని పెనుగొండకు మార్చాడు. ఒక రోజు రాజు కొలువులో అన్నమయ్య ఈ శృంగార కీర్తనను ఆలపించాడు.
ఏముకో చిగురుటధరమున యెడనెడఁ కస్తూరి నిండెను
భామిని విభుఁనకు వ్రాసిన పత్రిక కాదు గదా (నాదరామక్రియ – 5 – 82)
అమ్మవారిని ఆట పట్టిస్తున్న చెలికత్తెల వర్ణన చూసి ముగ్ధుడైన సాళువ నరసింహ రాయలు తనపైన కూడా ఒక కీర్తన వ్రాయమని ప్రాధేయ పడ్డాడు. ఆ మాట విన్న అన్నమయ్య ‘హరి! హరి!’ అని చెవులు మూసుకొని హరిని కీర్తించే నోటితో నరుని కీరించ జాలనని రాజు కోరికను తన సంకీర్తన ద్వారా ఇలా నిరాకరించాడు.
IIపల్లవిII
తలగరో లోకులు తడవకురో మమ్ము
కలిగినదిది మా కాఁపురము
IIచరణం 1 II
నరహరికీర్తన నానిన జిహ్వ
ఒరుల నుతింపఁగ నోపదు జిహ్వ
మురహరు పదములు మొక్కిన శిరము
పరుల వందనకుఁ బరగదు శిరము (లలిత – 2 – 144)
అని అనగానే సాళువ నరసింహ రాయలు కోపోద్రిక్తుడై అన్నమయ్యకు సంకెళ్ళు వేయించి కారాగారంలో బంధించాడు. అర్థ బేధం లేకుండా తాత్పర్య భేదంతో ఒక పదము ప్రయోగించిన లాటాను ప్రాస అలంకారంలోని ఈ పాట వినిన మనకు తప్పక సహజ కవి బిరుదాంకితుడైన పోతనామాత్యుని పద్యము గుర్తుకు తెస్తుంది.
కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మ్రొక్కు శిరము శిరము (భాగవతం 7 – 169 సీ)
అర్థపరంగా తీసుకుంటే త్యాగయ్య కళ్యాణీ రాగంలో పాడిన కీర్తన ఒకటి గుర్తుకొస్తుంది.
IIపల్లవిII
నిధి చాల సుఖమా రాముని స
న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా
త్యాగరాజు గురుదేవులు శొంఠి వెంకటరమణయ్య ఆజ్ఞతో తంజావూరుకు వెళ్లి పండితుల సభలో ఎందరో మహానుభావులు అనే కీర్తన పాడి వారి మన్ననలు, గురువుల ఆశీస్సులు పొందాడు. ఈ విషయం తెలుసుకున్న తంజావూరు మరాఠా యోధుడైన శరభోజీ మహారాజు త్యాగయ్య ఇంటికి ధనమును, బంగారాన్ని పంపుతాడు. కానీ రాజు పంపిన బహుమతులను తిప్పి పంపుతూ సంపద కన్నా భగవంతుని పై భక్తి ప్రధానమని తెలిపాడు.
బందీగా ఉన్న అన్నమయ్య ‘నన్ను కాపాడుకోవడం నీ బాధ్యత కాదా?’ అని వేంకటేశ్వరుని తన కీర్తనతో ఇలా వేడుకుంటూ ఉన్నాడు.
IIపల్లవిII
ఆఁకటి వేళల నలపైన వేళలను
తేకువ హరినామమే దిక్కు మఱిలేదు అనే కీర్తనలో
IIచరణంII
సంకెళఁ బెట్టిన వేళ చంపఁ బిలిచిన వేళ
అంకిలిగా నప్పులవారాఁగిన వేళ
వేంకటేశునామమే విడిపించ గతిగాక
మంకుబుద్ధిఁ బొరలిన మరి లేదు తెఱఁగు (ముఖారి – 1 – 158)
ఇలా పాడగానే వేంకటేశ్వరుని మహిమ వల్ల అన్నమయ్యకు వేసిన ఇనుప సంకెళ్ళు ఊడి పడ్డాయి.
అపరాధి నపరాధి నన్నమాచార్య
కృపజూడు నను నీవు కృపణశరణ్య
అని అంటూ తన తప్పు తెలుసుకున్న నరసింహ రాయలు పశ్చాత్తాపముతో అన్నమయ్యను క్షమాపణలు వేడుకొన్నాడు. హరి భక్తులను ఎన్నటికీ బాధలకు గురి చేయవద్దని రాజుకు అన్నమయ్య చెప్పాడు.
అన్నమయ్య దర్శించిన వివిధ క్షేత్రాలు :
తిరుమలతో పాటుగా అనేక క్షేత్రాలకు అన్నమయ్య వెళ్లి భక్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అన్నమయ్య దేశ సంచారం చేస్తూ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని చాటాడు. రామానుజ మత ప్రచారకుడిగా అనేక క్షేత్రాలను సందర్శించాడు. కొన్ని క్షేత్రాలలో దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే కొన్ని క్షేత్రాలు నేడు శిధిలమయ్యాయి. కొన్నింటి పేర్లు మారిపోయాయి. అన్నమయ్య కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, బళ్ళారి, నెల్లూరు, గుంటూరు, తంజావూరు, తిరుచినాపల్లి, చెంగల్పట్టు, ఆర్కాడు, కంచి, శ్రీరంగం, చిదంబరం మొదలగు ప్రాంతాలలో పర్యటించాడు.
కడప జిల్లాలో :
దేవుని కడప : తిరుమలకు వెళ్ళే ముందు గడపగా భావించి దేవుని కడపలోని వేంకటేశ్వర స్వామిని దర్శించడం ఆనవాయితీగా వస్తోంది.
కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ
గన్నె నాఁడె యేలితివి కడపరాయ (సామంతం – 18 – 472)
దేవుని కడపలో జరిగే రథోత్సవంలో పాల్గొన్న అన్నమయ్య ఈ విధంగా కీర్తించాడు.
కన్నుల పండుగాలాయె గడపరాయని తేరు
మిన్ను నెల శృంగారము మితి మీరినట్లు (సాళంగనాట – 3 – 93)
ఇంకొక కీర్తన
కడపరాయఁడు నీకు కప్పురమందిచ్చీ వాఁడె
మడిచియ్యవే కు మనసిచ్చి నతఁడు (దేసాళం – 25 -476)
దేవుని కడప వేంకటేశ్వరుని చెలువ రాయుడుగా ఇలా కీర్తిస్తున్నాడు.
IIపల్లవిII
సిగ్గరి పెండ్లి కొడుక చిలువరాయ నన్ను
వెగ్గళించ కిక నీవు వెసఁ జెలువరాయ
అనే కీర్తన చివరి చరణంలో ఇలా అంటున్నాడు.
IIచరణంII
చెప్పరానితమకపు చేలువరాయ నన్నుఁ
జిప్పిలఁ గుడితివిగా చెలువరాయ
యిప్పుడే శ్రీవేంకటేశ యేకతము కడపలోఁ
జెప్పితిఁగా అలనాఁడే చెలువరాయ (భైరవి – 22 -108)
నందలూరు :
నందలూరులో వెలసిన సౌమ్య నాధుని చొక్క నాథునిగా అన్నమయ్య పిలిచి ఈ కీర్తన పాడాడు.
చుల్లరవెట్టుఁ జేతల చొక్కనాథఁడు
వుల్లములో నీ నెలఁదలూరి చొక్కనాథఁడు (మలహరి – 10 -20)
మరొక కీర్తనలో ఇలా చెప్పాడు.
IIపల్లవిII
ఏలరా యింతవలపు యేమిబాఁతి నే నీకు
సోలి నాపె నొరగేవు చొక్కనాథ లేలే (దేశాక్షి – 20 -175)
గండికోట :
గండికోటలోని మాధవరాయ స్వామిని అన్నమయ్య చెన్నకేశవునిగా పిలిచాడు.
చేపట్టుఁ గుంచమనై చేరి ఇట్టె నాతోను
కాఁపురము సేయ వోయి గండికోటకేశవా (సామంతం – 18 – 367)
ఇంకొక కీర్తన లో ఇలా అన్నాడు.
చెయ్యరానిచేఁతల వోచెన్నకేశ్వరా
చేయం టేవు గండికోటచెన్నకేశ్వరా (సామంతం – 23 – 323)
మరొక కీర్తన
IIపల్లవిII
చీరలియ్యఁగదవోయి చెన్నకేశవా! చూడు
చేరఁడేసి కన్నుల వో చెన్నకేశవా!
IIచరణంII
గరిమ నందరి నొక్కగాఁడిఁగట్టి కూడితివి
శిరసుపూవులు రాల చెన్నకేశవా
ఇరవై శ్రీ వేంకటాద్రి యిదియంటాఁగూడితివి
గొరబు చేఁతలఁ గండిగోట చెన్నకేశవా (సామంతం – 27 – 314)
గండికోటలో శ్రీ రాముని పై కీర్తన వ్రాశాడు. కానీ నేడు ఆ రాముని దేవాలయం అక్కడ లేదు.
IIపల్లవిII
రాజపు నీకెదురేది రామచంద్ర
రాజీవనయనుడ రామచంద్ర
IIచరణంII
నావంటిసీతను నాఁగేటికొనఁ దెచ్చితి
రావాడితమకముతో రామచంద్ర
యీవేళ శ్రీ వేంకటాద్రి నిరవై నన్నుఁ గూడితి
చేవదేర గండికోట శ్రీరామచంద్ర (దేవగాంధారి – 19 – 165)
నల్లబల్లె :
ముద్దనూరు దగ్గరలోని నల్లబల్లెలో పూర్వం చెన్నకేశవుని ఆలయం ఉండేది, కానీ నేడు దాని ఆనవాలు దొరకడం లేదు.
భావ మెఱిఁగిన నల్లబల్లి చెన్నుఁడా
నావద్దనే వుండుమీ నల్లఁబల్లి చెన్నుఁడా (దేవగాంధారి – 13 – 329)
మరో కీర్తన :
చేకొనుమీ నల్లఁబల్లి చెన్నకేశవా
యీకడ నీ కిన్నిటికినిదవో మొక్కేను (రామక్రియ – 7 – 534)
ఇంకొక కీర్తన:
నల్లఁబల్లి చెన్నుఁడు నాపాలిటి వెన్నుఁడు
యెల్ల జీవులకు మరి యిన్నిటాఁ బ్రసన్నుడు (శ్రీరాగం – 4 – 168)
మరొక కీర్తనలో
IIపల్లవిII బాపు బాపు మాతోనే పంతమేలోయి
చేపట్టితి వింతలోనే చెల్లునోయి
IIచరణంII నగు శ్రీవేంకటగిరి నల్లఁబల్లి చెన్నుఁడా
యెగసక్కె మిఁకనేల ఇందు రావోయి
తగుఁదగు నీకు నాకు తనిసితి నిఁక నోయి
చిగురుఁజేవనుకొంటి చిత్తగించవోయి (బౌళి – 24 – 161)
గొడుగుమర్రి : ప్రొద్దుటూరు తాలుకా రాజుపాలెం మండలంలోని టంగుటూరు గ్రామం సమీపంలో గొడుగుమర్రి చెన్నకేశవుని పై ఒక శృంగార కీర్తన పాడాడు.
చిత్తగించు నీ వాపెను చెన్నరాయ! యీపె
చిత్తిణి గొడగుమఱ్ఱి చెన్నరాయ (సామంతం – 27 – 328)
చింతకుంట :
చింతకుంటలోని నరసింహ స్వామి పై కీర్తన ఒకటి చేశాడు. అయితే నేడు అక్కడ చెన్నకేశవుని ఆలయం ఉంది.
ఘనుఁడవు చింతకుంటకంభమురాయ మముఁ
గనుఁగొని రక్షించు కంభమురాయ (సామంతం – 23 – 209)
పులివెందుల :
పులివెందులలోని రంగనాయక స్వామి ఆలయాన్ని రామానుజాచార్యులు ప్రతిష్ఠించారు. రైల్వే కొండాపురం వద్ద గల ముచ్చుమర్రి అనే గ్రామంలోని పెద్ద రంగడు, చిన్న రంగడు అనే రజక సోదరుల స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఏటిలో ఉన్న నన్ను పులివెందులలో ప్రతిష్ఠించవలసిందిగా అజ్ఞాపించారట.
IIపల్లవిII ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము
వంకలొత్తకిఁక మఱి వద్దు వద్దు ఇపుడు
IIచరణంII వెలినవ్వేల పదారువేలఁ బెండ్లాడితివి
బలిమికాఁడవు గావా భావించినదే
చెలఁగి పులివిందల శ్రీరంగదేవుఁడ వని
కలసితి మిదె శ్రీ వేంకటరాయ నేము (మలహరి – 14 – 15)
ప్రొద్దుటూరు :
ప్రొద్దుటూరులోని చెన్నకేశవ స్వామి పై ఒక శృంగార కీర్తన వ్రాశాడు.
కరుణించవయ్య యిఁక కడు జాణవౌదువు
వొరసేరింతులు పొదటూరిచెన్నరాయా (శుద్ధవసంతం – 7 – 537)
చిన్న మండెం :
చిన్న మండెంలో వెలసిన నరసింహ స్వామిపై అన్నమయ్య వ్రాసిన కీర్తన.
IIపల్లవిII చెవులారా వినేఁగాని చెప్పుమా నాకాసుద్ది
జవళి వలపు లిట్టే చల్లుదురా
IIచరణంII ఎమ్మెలతో నేరుపులెంతునంటానాడేవు
కొమ్మలతోడుత నట్టే కొనేడుదువా
మమ్ము శ్రీ వెంకటేశ మండెమురాయఁడవై
సమ్మతిఁ గూడితి విట్టే చనవిత్తువా (పాడి – 7 – 491)
మరొక కీర్తన
IIపల్లవిII అందులోనే వున్నవి ఆయములెల్ల
మందలించనివాఁడవా మతకరివి
IIచరణంII కోరిక నీవుగూడిన కూటములకే కదా
చూరలైన రతులను చొక్కితినిట్టే
యీరీతి శ్రీవెంకటేశ యేలితివి నన్నునిట్టే
మారునితండ్రివి నీవే మండెమురాయఁడవు (కేదారగౌళ – 7 – 513)
ఇంకొక కీర్తన
IIపల్లవిII ఎంచినట్టు వడునా యెన్నికె లెవ్వరికైనా
దించని తమకమున తేరి నవ్వే నేను
IIచరణంII కులికి కులికి నిన్ను గోరఁ జిమ్మేనని వచ్చి
నలి నలి మేను చూచి నవ్వే నేను
చెలఁగి మండెములోన శ్రీ వేంకటేశ కూడితి
నలువంక చెలులతో నవ్వేనేను (వరాళి – 27 – 360)
పెద్దముడియం : జమ్మలమడుగు తాలుకా పెద్దముడియంలో వెలసిన నరసింహ స్వామి పై వ్రాసిన కీర్తన.
జయ మాయ నీకు నాపె సరసములూ
నయగారి ముడుయము నారసింహా (సాళంగనాట – 11 – 139)
మేడిదిన్నె :
పెద్దముడియం మండలం లోని మేడిదిన్నె గ్రామంలోని ఆంజనేయ స్వామిపై వ్రాసిన కీర్తన. ఈ మేడిదిన్నెను పూర్వం మేడిగుడిదిన్నెగా పిలిచేవారు.
చెల్లె నీచేఁతలు నీకే చేరి మేడెగుడిదిన్న
నల్లదె కంటిమి నిన్ను హనుమంతురాయ (సామంతం – 4 – 413)
వెయ్యినూతుల కోన :
నందిమండలం దగ్గరలోని పాలకొండల్లోని వెయ్యినూతుల కోనలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది. వెయ్యి నూతులు అంటే వెయ్యి బావులు అని అర్థం. ఇక్కడ ఉగ్ర నరసింహ స్వామిపై లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాన్ని వాల్మీక మహర్షి ప్రతిష్ఠించాడట.
ఔభలేశ వోఁగునూతులౌభలేశ
శోభనము నీకు నాకు జోడుగూడెఁగాదా (సాళంగనాట – 26 – 3)
మరొక కీర్తన
IIపల్లవిII ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ
వేడుకఁ బరుషలెల్ల వీధినుండరమ్మా
IIచరణంII అల్లదివో వోఁగునూఁతులౌభళేశుపెద్దకోవ
వెల్లి పలనీటిజాలు వెడలేసోన
చల్లనిమాఁకులనీడ సంగడిమేడలవాడ
యెల్లగాఁగ నరసింహుఁడేగీ నింతితోడను (సామంతం – 4 – 375)
పొట్లదుర్తి :
యఱ్ఱగుంట్ల మండలం పొట్లదుర్తి చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామి చుట్టూ దశావతార శిల్పాలు మకరతోరణంలా ఉంటాయి.
IIపల్లవిII అప్పు డెట్టుండెనో చిత్త మయ్యో యెఱఁగనైతి
చెప్పుడుమాటలకే నేఁ జేరనైతిఁగా
IIచరణంII వేగమే నీవు గూడితే వెస భ్రమసితిఁగాని
చేగలనీమేను పచ్చిసేయనైతిఁగా
భోగపుశ్రీవేంకటేశ పోట్లదొరితిలోన-
నీగతిఁ జెన్నుఁడవైతే నెనసితిఁగా (భైరవి – 21 – 499)
పెద్దచెప్పలి : కమలాపురం మండలంలోని పెద్దచెప్పలిలో వెలసిన చెన్నకేశవునిపై శృంగార కీర్తన రచించాడు.
IIపల్లవిII వరుకు మాపటంత వచ్చేఁ గాని
గెరసు దాఁటకువోయి కేశవరాయ
IIచరణంII కాఁగిలిదే చాలదా కన్నుల మొక్కఁగనే
నాఁగువారే ననుపుల ననుఁబోఁటికి
ఆఁగి కూడితివి నన్ను అలసితి రతులలో
వీఁగేవు చెప్పల్లి శ్రీవేంకటరాయా (శంకరాభరణం – 7 – 307)
సంబటూరు :
కమలాపురం మండలంలోని సంబటూరులోని చెన్నకేశవ స్వామి ఆలయం దర్శించి అన్నమయ్య ఈ కీర్తన వ్రాశాడు.
చక్కని యీ వెన్నుఁడూ సంబటూరి చెన్నుఁడూ
అక్కడ నిక్కడ చూపి ఆసలు రేఁచీని (లలిత – 11 – 162)
మరొక కీర్తన
ఎంతవాఁడవయ్యా నిన్ను నేమనేము
సంతకూటములవాఁడ సంబటూరి చెన్నుఁడా (సామంతం – 23 – 245)
దాసరి పల్లె :
కమలాపురం మండలంలోని దాసరి పల్లెలోని సీతారాములపై రచన.
IIపల్లవిII సీతారమణ వో శ్రీరామచంద్ర దా-
దాత లక్ష్మణుఁడదే తగు రామచంద్ర
IIచరణంII చేవదేరిన సిగ్గుల శ్రీరామచంద్ర
శ్రీవేంకటాద్రిమీఁది శ్రీరామచంద్ర
యీవల దాసరిపల్లె నిరవుకొని మీ-
సేవకుల మమ్మునేలే శ్రీరామచంద్ర (శంకరాభరణం – 3 – 157)
మాచనూరు : పెండ్లిమర్రి మండలంలోని చెన్నకేశవస్వామిని కీర్తిస్తూ పాడిన కీర్తన.
IIపల్లవిII కేరడమాడఁగలనా కేశవరాయా
చూరగొని మర్మములు సోఁకింతుఁగాక
IIచరణంII కాఁగిలించితే నిన్నుఁ గాదనఁగఁగలనా
లోఁగి యందులకే చొక్కి లోనౌదుఁగాక
నాఁగులెల్లఁ దీర మాఁచనవోలిచెన్నుఁడవై
మూఁగితి శ్రీవేంకటేశ మోవి యిచ్చేఁగాక (గుండక్రియ – 21 – 495)
వత్తలూరు :
పుల్లంపేట మండలంలోని వత్తలూరులోని చెన్నకేశవ ఆలయం ఉంది. ఇందులో విగ్రహం బదులుగా స్వామి వారి ఆయుధాలు ఉండటం విశేషం.
వత్తలూరికేశవా వన్నె లీడఁ జేసేవా
బత్తిగలవాఁడవౌదు పట్టకువయ్యా (బౌళి – 22 – 106)
మూడుపూరు :
అట్లూరు మండలంలోని ముడుపురు గర్భాలయంలో చెన్నకేశవునితో పాటూ నారాయణస్వామి, మాధవరాయలు ముగ్గురు మూర్తులు కొలువై ఉండటం ఇక్కడి విశేషం.
చేరియందెల మోతతో చెన్నకేశవా
యీరీతి మాఁడుపూరిలో నిట్లాడేవా (పాడి – 3 – 179)
పాలగిరి :
వీరపునాయునిపల్లె మండలంలోని పాలగిరి గ్రామంలో వెలసిన చెన్నకేశవుని గురించి అన్నమయ్య శృంగార కీర్తన చేశాడు.
కంటిరా నీగుణమెల్ల కడగడనే
పంటమోవితేనెకాఁడ పాలగిరిరాయఁడా (శంకరాభరణం – 24 – 182)
కర్నూలు జిల్లా :
అహోబిలం :
నరసింహ స్వామి పై అన్నమయ్య అనేక కీర్తనలు చేశారు.
అనిశముఁ దలఁచరో అహోబలం
అనంతఫలదం బహోబలం (సామంతం – 3 – 520)
ఎగువ అహోబిలం :
అహోబిలం కొండపైన ఉన్న ఉగ్ర నరసింహునిపై కీర్తన.
IIపల్లవిII మలసీఁ జూడరో మగ సింహము
అలని మీఱిన మాయల సింహము
IIచరణంII అదివో చూడరో ఆదిమపురుషుని
పెదయౌభళము మీఁది పెనుసింహము
వెదకి బ్రహ్మాదులు వేదాంతతతులు
కదిసి కానఁగలేని ఘనసింహము (శంకరాభరణం – 1 – 13)
దిగువ అహోబిలం :
ఇక్కడ వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి పై అన్నమయ్య వ్రాసిన కీర్తన.
IIపల్లవిII ఱట్టుసేయ కిఁక నీవు ఇట్టె రాఁగదే
పట్టపుదేవులవైన బలవంతురాలవు
IIచరణంII పొంది వొక్కచోఁ దరితీపులు వుట్టించేవేమే
ముందుముందే తీపులు నీమోవి నుండఁగా
అందపుశ్రీవేంకటాద్రి నహోబలమునను
ఇందిరపు నీకు నేనే ఇరవైవుండఁగను (రామక్రియ – 24 – 482)
నవనారసింహులపై :
అహోబిల క్షేత్ర సమీపంలోని తిమ్మిది నరసింహక్షేత్రాలు వెలిశాయి.
జ్వాలా అహోబిల మాలోల క్రోద కారంజ భార్గవ
యోగానంద క్షాత్రవత పావన నవ మోర్థ్యః
జ్వాలా నరసింహ, అహోబిల నరసింహ, మాలోల నరసింహ, వరాహ నారసింహ, కారంజ నరసింహ, భార్గవ నరసింహ, యోగానంద నరసింహ, క్షాత్రపత నరసింహ, పావన నరసింహఅనే తొమ్మిది క్షేత్రాలను ఎవరైతే ఒక్కరోజులో చుట్టి వస్తారో వారికి పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.
IIపల్లవిII నవనారసింహ నమో నమో
భవనాశితీర యహోబలనారసింహ
II చరణం 1 II సతతప్రతాపరౌద్రజ్వాలానారసింహ
వితతవీరసింహవిదారాణా
అతిశయకరుణ యోగానంద నరసింహ
మతి శాంతపు కానుగుమాని నారసింహ
II చరణం 2 II మరలి బీభత్సపుమట్టెమళ్ల నరసింహ
నరహరి భార్గోటి నారసింహ
పరిపూర్ణ శృంగార ప్రహ్లద నరసింహ
సిరుల నద్భుతపు లక్ష్మీ నారసింహ
II చరణం 3 II వదనభయానకపు వరాహ నరసింహ
చెదరని వైభవాల శ్రీనరసింహ
అదన శ్రీవేంకటేశ అందు నిందు నిరవైతి
పదివేలురూపముల బహునారసింహ (నాట – 1 – 453)
వెలుగోడు :
వెలుగోడులో వెలసిన చెన్నకేశవునిలో కృష్ణుని దర్శించిన అన్నమయ్య చేసిన కీర్తన చూడండి.
IIపల్లవిII కేవల కృష్ణావతార కేశవా
దేవ దేవ లోకనాథ దివ్య దేహ కేశవా
IIచరణంII కింకర బ్రహ్మాది గణ కేశవ నా –
మాంకిత శ్రీ వేంకటాద్రి కేశవ
కుంకుమాంకవక్ష వెలిగోట కేశవ సర్వ
శంకా హరణ నమో జగదేక కేశవా (రామక్రియ – 4 – 391)
చాగలమర్రి :
చాగలమర్రిలోని చెన్నకేశవ స్వామి శృంగార కీర్తన లో ఇలా అంటున్నాడు.
ఇచ్చలోనిదాన నేను ఇన్నిటా నీకు
గచ్చు లేమిటికిరా చేఁగలమఱ్ఱిచెన్నుఁడా (భైరవి – 19 – 162)
ఒంటిమిట్ట :
ఒకే శిలపై సీతారామ లక్ష్మణులు ఉండటం చేత ఒంటిమిట్టను ఏకశిలా పురము అని పిలిచేవారు. ఇక్కడి రఘురాముని వీర రఘురామునిగా కీర్తించడం ఈ కీర్తన విశేషం.
ఇందులోనే కానవద్దా యితఁడు దైవమని
విందువలె నొంటిమెట్ట వీరరఘురాముని (నాట – 1 – 477)
సోమశిల కనుమ :
నాయక సౌందర్యాన్ని వర్ణించడానికి అన్నమయ్య తాను తిరిగిన కనుమలను కవితా వస్తువుగా తీసుకున్నాడు.
సొంపుల నీ వదనపు సోమశిల కనుమ
యింపులెల్లఁ జేకొనఁగ నిల్లు నీపతికి (వరాళి – 5 – 115)
నెల్లూరు జిల్లా :
గండవరం :
కొవ్వూరు దగ్గరలోని గండవరం వేణు గోపాలకృష్ణునిపై లాలి పాట వ్రాశాడు.
లాలనుచు నూచేరు లలనలిరుగడల
బాలగండవర గోపాలనినుజాల (అన్నమాచార్య చరిత్ర పీఠిక – పేజీ సంఖ్య-61)
ఉదయగిరి :
ఉదయగిరిలో వెలసిన శ్రీకృష్ణునిపై అన్నమయ్య వ్రాసిన కీర్తన.
విచ్చనవిడినీ యాడీ వీఁడె కృష్ణుఁడు
వొచ్చములేనివాఁడు వుద్దగిరికృష్ణుఁడు (దేవక్రియ – – 172)
మరో కీర్తన
ఉద్దగిరి కృష్ణుఁడు వుబ్బరికాఁడు వీఁడు
ముద్దులు చూపుతానే ముసుఁగులు దీసేనే (శంకరాభరణం – 19 – 174)
వేంకటగిరి :
వేంకటగిరి అనంతుని పై అన్నమయ్య కీర్తన.
ఎదుటినిధానమ వెటుచూచిన నీ-
వదె వేంకటగిరియనంతుఁడా (శద్దవసంతం – 1 – 344)
చిత్తూరు జిల్లా :
తిరుపతి లోని గోవింద రాజుల స్వామి పై కీర్తన.
కొమ్మలాల యెంతవాఁడే గోవిందరాజు
కుమ్మరించీ రాజసమే గోవిందరాజు (దేసాళం – 7 – 470)
మరో కీర్తన
కొలువై వున్నాఁడు వీఁడె గోవిందరాజు
కొలకొలనేఁగి వచ్చె గోవిందరాజు (శంకరాభరణం – 13 – 168)
తిరుపతిలోని హనుమంతుని పై కీర్తన :
మగటిమిగల హనుమంతరాయ
దిగువపట్టణములోని దేవ హనుమంత (రామక్రియ – 2 – 250)
శ్రీనివాస మంగాపుర హనుమంతునిపై కీర్తన :
మంగాంబుధి హనుమంతుని శరణ
మంగవించితిమి హనుమంతా (సామంతం – 4 – 444)
వాయల్పాడు :
వాయల్పాడులో వెలసిన పట్టాభి రాముడి కీర్తన.
IIపల్లవిII రాజీవనేత్రాయ రాఘవాయ నమో
సౌజన్యనిలయాయ జానకీశాయ
IIచరణంII హతరావణాయ సంయమినాథవరదాయ
అతులితాయోధ్యాపురాధిపాయ
హితకర శ్రీవేంకటేశ్వరాయ నమో
వితతవావిలిపాటి వీరరామాయ (శ్రీరాగం – 2 – 275)
వావిల్పాడులోని సీతమ్మ పై కీర్తన :
IIపల్లవిII సిగ్గరి పెండ్లికూఁతుర సీతమ్మ
దగ్గరి సింగారబొమ్మ తలవంచకమ్మా
IIచరణంII కంకణదారాలు గట్టి కాలుదొక్కతివి మీరు
పొంకాన బువ్వ మందరో పొత్తుల నమ్మ
వుంకువ వావిలిపాట నుండి శ్రీ వేంకటగిరి
తెంకుల నిన్నుఁ గూడి తిరమాయనమ్మా (సాళంగనాట – 26 – 40)
అనంతపురం :
గుత్తి :
గుత్తి లోని రఘురాముని పట్టాభిషేక సమయంలో ఈ కీర్తన పాడాడు.
సౌమిత్రిసహోదర దశరథరామా
చేముంచి గుత్తిలో వెలసిన రఘురామా (పాడి – 3 – 499)
కదిరి :
కదిరిలో వెలసిన లక్ష్మీ నరసింహ స్వామిపై కీర్తన.
కదిరి నృసింహుఁడు కంభమున వెడలె
విదితముగా సేవించరొ మునులు (నాట – 4 – 32)
మరో కీర్తన
నవమూర్తులైనట్టి నరసింహము వీఁడె
నవమైన శ్రీకదిరి నరసింహము (వరాళి – 4 – 182)
ఇంకొక కీర్తన
తన దాసునికొరకు ధరియించె నీరూపము
దిన దిన వేడుకఁ గదిరి నారసింహుఁడు (సాళంగనాట – 10 – 37)
కర్నాటక రాష్ట్రము :
మతంగాద్రి :
హోస్పేట వద్ద గల హంపి దగ్గరలోని మతంగ పర్వతాలలో వెలసిన హనుమంతుడిపై కీర్తన.
IIపల్లవిII ఈతఁడువో రాముఁడు యేకాంగవీరుఁడు
యేతలఁజూచినఁ దానే యిరవుకొన్నవాఁడు
IIచరణంII రావణ కుంభకర్ణాది రాకాసుల బరిమార్చి
యీవల నయోధ్యపట్న మేలినవాఁడు
శ్రీవేంకటాద్రిమీఁదఁ జేరి మాల్యవంతమున
వేవేలు చందములను వెలసినవాఁడు (రామక్రియ – 29 – 6)
మరో కీర్తన
మతంగపర్వతమాడ మాల్యవంతము నీడ
అతిశయిల్లిన పెద్ద హనుమంతుఁడితఁడా (శంకరాభరణం – 2 – 223)
మతంగ పర్వతముపై వెలసిన వేంకటేశ్వరునిపై కీర్తన :
మతంగపర్వతము మాల్యవంతము నడుమ
సతమై శ్రీవేంకటేశ్వరుడున్నవాఁడు (లలిత – 4 – 165)
కలశాపురము :
హంపి వద్దగల కలశాపురములో వెలసిన హనుమంతుడిపై కీర్తన.
పదియారు వన్నెల బంగారుకాంతుల తోడ
పొదలిన కలశాపుర హనుమంతుఁడు (వరాళి – 4 – 167)
ఇంకొక కీర్తనలో ఇలా అన్నమయ్య అంటున్నాడు.
వీఁడివో కలశాపుర వీరహనుమంతుడు
వాఁడిమి మెరసినట్టి వజ్రపాణి యితఁడు (బౌళిరామక్రియ – 4 – 525)
మరో కీర్తన
అవధారు చిత్తగించు హనుమంతుఁడు వీఁడె
భువిలోన గలశాపుర హనుమంతుఁడు (మాళవిగౌడ – 4 – 490)
హంపి – విజయనగరం :
విజయనగర రాజుల రాజధాని వెలసిన హంపీలోని హజారా రామస్వామిపై కీర్తన.
IIపల్లవిII రాముఁడు రాఘఁవుడు రవికులుఁ డితఁడు
భూమిజకుఁ బతియైన పురుషనిధానము
IIచరణంII వేదవేదాంతములందు విజ్ఞానశాస్త్రములందు
పాదుకొనఁ బలికేటి పరమార్థము
పోదితో శ్రీవేంకటాద్రిఁ బొంచి విజనగరాన
ఆదికి ననాదియైన అర్చావతారము (పాడి – 4 – 169)
ఇంకొక కీర్తన
రాముఁడు లోకాభిరాముఁడు
ఆముక విజనగరమందు నున్నవాఁడు (రామక్రియ – 3 – 233)
తమిళనాడు రాష్ట్రము :
చిదంబరం :
ఆర్కాట్ జిల్లా లోని చిదంబరం లోని తిల్లె గోవిందరాజ స్వామిపై కీర్తన.
అమ్మలాల అక్కలాల అతివలాల
దిమ్మరి గదవే వీఁడు తిల్ల గోవిందరాజు (మేచభవుళి – 14 – 143)
శ్రీరంగం :
తిరుచినాపల్లి సమీపంలో విరజానది సమీపంలోని శ్రీరంగంలో వెలసిన శ్రీరంగనాథునిపై వ్రాసిన కీర్తన.
IIపల్లవిII అన్ని చోట్లఁ పరమాత్మ నీవు
యిన్నిరూపుల భ్రమయింతువుగా
IIచరణంII కైవల్యముననుండి కమలజలోకాన
మోవఁగ శ్రీరంగమున నుండి
యీవల నావల నుండి యీవేంకటాద్రిపై
నీవే నీవే వచ్చి నెలకొంటిగా (ముఖారి – 1 – 278)
మహారాష్ట్ర :
పండరీపురము :
పండరీపురము నందు వెలసిన విఠలుని ఈ విధంగా కీర్తిస్తున్నాడు
అడుగడుగుకు నీ వాడఁగాను మా-
బడలికంతయుఁ దోయ పండరంగిరాయ (సామంతం – 5 – 219)
మరొక కీర్తన
వసుధఁ జూడ బిన్నవానివలె నున్నవాఁడు
వెస నన్నివిద్యలాను వెలసె విట్ఠలుఁడు (బౌళిరామక్రియ – 2 – 217)
విభిన్న కీర్తనల రచన :
అన్నమయ్య తిరుమల స్వామి వారి వద్ద సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు ఉంటూ అనేక కీర్తనలను రచించాడు. మేలుకొలుపు నుంచి పవ్వళింపు వరకూ జరిగే అర్చన, నైవేద్యం, కల్యాణం, ఊంజల సేవల వంటి నిత్య కైంకర్యాలతో పాటూ, తిరుమలలో జరిగే ఉత్సవాలలో, బ్రహ్మోత్సవాలలో వాహనాల పైన విహరించే మలయప్ప స్వామి పై అనేక కీర్తనలు వ్రాశాడు. అన్నమయ్య సంకీర్తనలు కొన్ని జానపద బాణీలలో ఉంటే మరికొన్ని శాస్త్రీయ బాణీలో ఉన్నాయి. దేశి మార్గ కవితా పద్ధతులు రెండూ కలిసి ఉన్నాయి. ఇవి భజన సాంప్రదాయానికి అనుకూలంగా ఉన్నాయి. అన్నమయ్య ఉగ్గు పాటలు, లాలి పాటలు, చందమామ పాటలు, హారతి పాటలు, పవ్వళింపు పాటలు, జాజర పాటలు, కోలాటం పాటలు, శోభనపు పాటలు ఇలా అనేక రకాల పాటలను వ్రాశాడు.
మేలుకొలుపు పాటలు :
సుప్రభాత వేళల స్వామిని పవ్వళింపు నుంచి మేలుకొల్పడానికి పాడే పాటలు.
మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా
సన్నల నీ యోగనిద్ర చాలు మేలుకోవయ్యా (భూపాళం – 1 – 374)
మేలుకో శృంగారరాయ మేటిమదనగోపాలా
మేలుకోవే నా పాల మించిననిధానమా (భూపాళం – 15 – 215)
విన్నపాలు వినవలె వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా (భూపాళం – 6 – 25)
ఉగ్గు పాటలు :
వేంకటేశ్వరుని బాలకృష్ణునిగా చేసుకొని యశోదమ్మ ఇలా ఉగ్గు పెడుతోంది.
ఉగ్గు వెట్టరే వోయమ్మా చె
య్యొగ్గీనిదె శిశువోయమ్మా (భైరవి – 5 – 97)
శిన్నెక్కా పాటలు :
పాట పల్లవిలో లేదా చరణం చివరిలో శిన్నెక్కా అని ఉంటుంది.
శిఱుత నవ్వులవాఁడు శిన్నెకా వీఁడు
వెఱపెఱఁగడు సూడవే సిన్నెకా (ఆహిరి – 5 – 182)
చెలువపు సేఁతల శిన్నెకా పెద్ద
వలపువేదనల వాడీనయ్యో (సామంతం – 5 – 261)
లాలి పాటలు :
ఇవి ఉయ్యాలలో పెట్టి పవళింపు సేవ చేసేటప్పుడు పాడే పాటలు.
ఉయ్యాలా బాలునూఁచెదరు కడుఁ
నొయ్య నొయ్య నొయ్యనుచు (శంకరాభరణం – 5 – 246)
కళ్ళు తెరుచుకొనే ఉండడంతో ఉయ్యాల ఊపి ఊపి వేసారిన భామలు పాడిన పాట.
ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి
ముయ్యదించుకయు రెప్ప మూసినాఁ దెరచును (కాంబోది – 5 – 172)
జాజర పాటలు :
గంధం, కస్తూరి, జవ్వాజి పొడి చల్లుకుంటూ పాడే పాటలు ఇవి.
జగడపుఁ జనవుల జాజర
సగినల మంచపు జాజర (హిందోళవసంతం – 5 – 274)
చాలుఁ జాలు నీ జాజర నన్ను
జాలిఁ బరచె నీ జాజర (ముఖారి – 5 – 332)
జాజరవలపు జాణఁడే
వోజ దప్పఁడుగా నోయమ్మా (సాళంగనాట – 10 – 113)
చందమామ పాటలు :
ఇవి చల్లని వెన్నెలలో చందమామను చూస్తూ పాడే పాటలు.
సందెకాడఁ బుట్టినట్టి చాయలపంట యెంత –
చందమాయఁ జూడరమ్మ చందమామపంట (రామక్రియ – 4 – 342)
చల్లనై కాయఁగదొ చందమామా నీ
వెల్లగాఁ దిరువేంకటేశునెదుర (సామంతం – 5 – 228)
సారెకు మగనాలి సంగాత మిది ఱట్టు చందమామా, నీవు
చేరి దగ్గరితే చీఁకటితప్పవును చందమామా (ఆహిరి – 17 – 516)
కోలాటం పాటలు :
రెండు చిన్న కట్టెలు పట్టుకుని కాళ్ళకు గజ్జెలు కట్టుకుని నృత్యం చేస్తూ పాడే పాటలు ఇవి. ఈ పాటలో అమ్మాయిలు ఇద్దరు ఏ విధంగా కోలాటం ఆడాలో నేర్పుతున్నాడు.
IIపల్లవిII వేడుక వసంతము వేళ నిదే
వాడలవాడలవెంట వనిత లాడేరు
IIచరణంII కేలుఁగేలుజుట్టిపట్టి కెందామర మోములెత్తి
కోలఁగోలఁ దాఁకఁజేసి గుంపువాయక
చాలుకొని యిద్దరేసి జంటలై సతులు గూడి
వోలి వేరొకతెకోల నొడ్డుతా నాడేరు (వసంతం – 19 – 349)
వసంతము పాటలు : వసంతము జల్లుకుంటూ పాడే పాటలు.
ఆడవయ్య సరిగా నీ వాపెతో వసంతము
వేడుక నవ్వులలోని వెన్నెల వసంతము (హిందోళం – 18 – 389)
వనితకుఁ బతి కిదె వసంతము
దినదినము నమరె తిరుమలమీఁద (హిందోళం – 20 – 49)
నోము పాటలు :
ఆనాటి కాలంలో స్త్రీలు చేసే నోములు, వ్రతాల సమయాలలో పాడుకొనే పాటలు.
భామ నోఁచిన నోము ఫలము సఫలముగాను
కామతాపంబునకు కాండవము నోమె (భైరవి – 5 – 127)
దోబూచి పాటలు :
చిన్నపిల్లలు దోబూచు లాడుకుంటూ ఉంటారు. ఈ కీర్తన బాలకృష్ణుని బాల్య క్రీడా విశేషాలను తెలుపుతుంది.
బండి విరిచి పిన్నపాపలతో నాడి
దుండగీఁడు వచ్చె దోబూచి (దన్యాశి – 5 – 227)
పెళ్లి పాటలు :
వివాహ సమయాల్లో పాడే పాటలు ఇవి.
గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి
పరుష లదివో వచ్చెఁ బైపై సేవించను (రామక్రియ – 3 – 21)
ఇదె పెండ్లిలగ్న వేళ యింటికి నీకు
సుదతిమోవిచిగుళ్ళు సోబనపత్రికలు (ఆందోళి – 16 – 439)
లక్ష్మీకల్యాణము లీలతోఁ బాడే మిదే నేము
లక్ష్మీనారాయణులే లలనయు నీవును (ఆహిరి – 17 – 165)
తలంబ్రాల పాటలు :
ఇవి వివాహ సమయాలలో తలంబ్రాలు పోసుకొనేటప్పుడు పాడుకొనే పాటలు.
పసిఁడి యక్షంత లివె పట్టరో వేగమే రారో
దెసలఁ బేరటాండ్లు దేవుని పెండ్లికిని (సామంతం – 3 – 194)
పిడికిటి తలఁబాల పెండ్లికూఁతురు కొంత
పెడమరలి నవ్వీనె పెండ్లి కూఁతురు (శ్రీరాగం – 5 – 185)
శోభనపు పాటలు :
ఉత్సవాలలో, వివాహ సమయాలలో పాడే పాటలు.
శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి (వసంతం – 5 – 18)
పాడరే సోబనాలు పడఁతులాల
వేడుక లిద్దరికిని వెలసెఁ జూడరే (బౌళి – 18 – 436)
గొబ్బి పాటలు :
ఇవి సంక్రాంతి నాడు ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బిళ్ళు చేసి పూలతో అలంకరించి స్త్రీలు పాడే పాటలు.
కొలనిదోఁపరికి గొబ్బిళ్ళో యదు-
కులము స్వామికిని గొబ్బిళ్ళో (దేసాళం – 5 – 98)
సోది పాటలు :
ఎరుకల సానిచే జోశ్యం చెప్పించుకొనే టప్పుడు పాడే పాటలు. ఎఱుక చెప్పించుకోవటం గ్రామీణ ప్రాంతాలలో నేడు కూడా చూస్తూ ఉంటాము.
ఎరుక చెప్పే నీయిచ్చ యెల్లానెరుఁగుదు
మెరుఁగైన సొమ్ములిచ్చి మెచ్చవయ్య నన్ను (తెలుగుగాంబోది – 7 – 312)
అల్లో నేరేళ్ళు పాటలు :
భామినులు రాత్రి వేళ వెన్నెల్లో విహరిస్తూ పాడుకొనే పాటలు.
నెయ్యములల్లోనేరేళ్ళో
వొయ్యన వూరెడి వువ్విళ్ళో (దేసాళం – 5 – 579)
తందనాన పాటలు :
తంబుర చేత బట్టి తందనాన తందనాన అంటూ పాడే పాటలు.
తందనాన ఆహి తందనాన పురె
తందనాన భళా తందనాన (బౌళి – 2 – 385)
యాల పదాలు :
వీటినే ఏల పాటలు, యాల పాటలు అని కూడా అంటారు. ఇవి యువతీ యువకులు పాడే శృంగారభరితమైన పాటలు.
మేడలెక్కి నిన్నుఁజూచి – కూడేననే యాస తోడ
వాడు దేరి వుస్సురందురా-వేంకటేశ యాడనుంటి విందాకానురా (దేసాళం – 7 – 223)
కోడతిరునాళ్ళ పాటలు :
తమిళంలో కోడై అనగా ఎండాకాలం. ఎండాకాలంలో పాడే పాటలు ఇవి.
శ్రీవేంకటేశ్వరుఁడు శ్రీయలమేల్మంగతోడ
కోవిదుఁడై విహరించీ కోడతిరుణాళ్లు (సాళంగనాట – 14 – 240)
సాస ముఖాలు :
స్వామి వారి అర్ఘ్యపాద్యాచమనాల్లో స్నానాసనం, అలంకారాసనం సమయంలో సాసముఖాలు పాడేవారు.
సందడి విడువుము సాసముఖా
మంధరధరునకు మజ్జనవేళా (ధన్నాసి – 1 – 12)
సింగారమూరితివి చిత్తజగురుడఁవు
సంగతిఁ జూచేరు మిమ్ము సాసముఖా (సామంతం – 2 – 471)
సాసముఖా నడె సాసముఖా
ఆసల పరివారము అవధారు దేవా (బౌళి – 3 – 386)
చాంగుభళా పాటలు :
బాగు, భేషు అనే అర్థంలో అలమేలు మంగమ్మపై శృంగార కీర్తన ఇది.
చక్కని తల్లికి చాఁగుబళా తన-
చక్కెరమోవికి చాఁగుబళా (పాడి – 5 – 107)
జాలి పాటలు :
జాలి అనగా కుచ్చు. గొడుగు చివరి భాగంలో ఉండేది అనికూడా అర్ధం ఉంది. అయితే ఇక్కడ అన్నమయ్య జాలి అని ఊత పదంగా వాడాడు.
లెండో లెండో మాటాలించరో మీరు
కొండలరాయనినే పేర్కొన్న దిదె జాలి (రామక్రియ – 4 – 166)
తాత్విక గేయాలు :
వైరాగ్య పదాలు, తుమ్మెద పదాలు, హంస పదాలు, జీవాత్మ పదాలు, చిలుక పదాలు, మనసు పదాలు ఇలా అనేకమైన రీతులలో ప్రజలకు వేదాంతాన్ని కాచి వడపోసి అందించాడు.
వైరాగ్య పదాలు :
జీవితంపై వారాగ్యంతో పాడే పాటలు.
ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల
కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే (ముఖారి – 4 – 64)
నానాఁటి బదుకు నాఁటకము
కానక కన్నది కైవల్యము (ముఖారి – 3 – 576)
తుమ్మెద పదాలు :
మానవుడిని తుమ్మెదల్లాగానే విషయ వాసనలకు లోనవుతారని ఈ కీర్తనలో వ్రాశాడు.
తొల్లిటివలెఁ గావు తుమ్మెదా యింక
నొల్లవుగా మమ్మునో తుమ్మెదా (శ్రీరాగం – 6 – 9)
హంస పదాలు :
పాలను నీళ్ళను వేరు చేయగలిగేది హంస. మంచి చెడులను వేరు చేయమని చెబుతున్నాడు.
దిబ్బలు వెట్టుచుఁ దేలిన దిదివో
ఉబ్బు నీటిపై నొక హంసా (కాంబోధి – 1 – 16)
జీవాత్మ పదాలు :
జీవాత్మ పరమాత్మ ఒక్కటే నని చెప్పే కీర్తనలు.
ఎవ్వరెవ్వరివాడో యీ జీవుఁడు చూడ-
నెవ్వరికి నేమౌనో యీ జీవుఁడు (నాట – 1 – 97)
ఏలికె విందరికి యీ దేహభూమి నీది
మేలు అన్ని మట్టుపెట్టి మించరాదా జీవుఁడ (రామక్రియ – 3 – 217)
చిలుక పదాలు :
సంసార బంధనాలలో చిక్కుకున్న మానవుని చిలుకతో పోలుస్తున్నాడు.
జీవాతుమై యుండు చిలుకా నీ-
వావలికి పరమాత్ముఁడై యుండు చిలుకా (ఆహిరి – 1 – 50)
మనసు పదాలు :
ఒక చోట నిలవని మనసుకు కళ్ళెం వేసి నిలిపే కీర్తనలు.
పారకుమీ వోమనసా పంతము విడువకు మీమనసా
పారిన నీవే బడగయ్యెదవు చేరువ నాఁడే చెప్పనె మనసా (ఆహిరి – 1 – 188)
ఇందుకంటే మరి యిఁకలేదు హితోపదేశము వో మనసా
అంది సర్వసంపన్నుఁడు దేవుఁడు ఆతని కంటే నేరుతుమా (బౌళి – 3 – 101)
ఎండలోనినీడ యీమనసు
పండు గాయసేయఁబనిలేదు మనసు (ఆహిరి – 1 – 337)
అత్తాకోడళ్ల సంవాదాలు :
లక్ష్మిదేవికి, సరస్వతి దేవికి మధ్య అత్తాకోడళ్ళ సంవాదాన్ని చెబుతున్నాడు.
రావే కోడల రట్టడి కోడల
పోవే పోవే అత్తయ్యా, పొందులునీతోఁజాలును (పాడి – 5 – 313)
బావామరదళ్ళ సంవాదాలు :
బావ మరదళ్ల చిలిపి సరదాలు జానపదాల్లో ఎన్నో చూస్తూ ఉంటాము. అలాంటి బావా మరదళ్ల సరసం చూడండి.
ఏలేయేలే మరఁదలా చాలుఁజాలు చాలును
చాలు నీతోడి సరసంబు బావ (పాడి – 5 – 163)
సవతుల సంవాదాలు :
ఇందులో సవతులు భర్తపై పెత్తనం తనదంటే తనదని తగువలాడుకోవడం చివరికి అక్కాచెల్లెళ్ళం మనకెందుకు ఈ తగువని సర్దుకుపోవడం చాల సరదాగా ఉంటుంది.
నేరుచుకొంటివే మేలు నేఁడే యింతేసి
మేరమీరి సేసినదే మేలుబంతిగాదా (పాడి – 7 – 191)
భార్యాభర్తల సంవాదాలు :
భార్య సందేహాలను భర్త ఎంతో ఓపికగా తీరుస్తున్నాడో చూడండి.
ఆఁపలేక నిను దూరేనంతె గాక
యేఁపుచుఁ గూడేటి పొందులేలయ్య విభుఁడా (ముఖారి – 5 – 111)
నివాళి పాటలు :
పళ్ళెరములో పారాణి నీళ్ళతో దిష్టి తీస్తూ పాడే పాటలు.
నిచ్చనిచ్చఁ జేకొను నివాళి
యిచ్చఁ బేరెవరమోబు ళేశ నివాళి (మలహరి – 22 – 129)
మంగళము పాటలు :
మంగళ నీరాజనాలు ఇస్తూ పాడే పాటలు.
మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును
మంగళము సర్వాత్మకునకు ధర్మస్వరూపునకూ,జయజయ (లలిత – 1 – 46)
మరలి మరలి జయమంగళము
సొరిది నిచ్చలును శుభమంగళము (రామక్రియ – 1 – 448)
జయమంగళము నీకు సర్వేశ్వరా
జయమంగళము నీకు జలజవాసినికి (గుండక్రియ – 2 – 431)
నీరాజనం పాటలు :
అమ్మవారికి, స్వామివారికి పూజ అనంతరం పాడే పాటలు ఇవి.
క్షీరాబ్థికన్యకకు శ్రీ మహలక్ష్మికిని
నీరజాలయమునకుఁ నీరాజనం (మంగళకౌళిక – 20 – 295)
జోల పాటలు :
బాలుడిని నిద్ర పుచ్చడానికి పాడే పాటలు.
జోవచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద (అన్నమాచార్య చరిత్ర పీఠిక – పుట – 61)
జోజో యని మీరు జోల వాడరో
సాజపు జయంతి నేడే సఫల మిందరికి (దేసాళం – 3 – 461)
అన్నమయ్య మహిమలు :
అన్నమయ్య ఇంటిలో నిత్యం ఆరాధించే స్వామి విగ్రహాలను ఎవరో అపహరించారు. ఆనాటి కాలంలో ఏర్పడిన మతకల్లోల పరిస్థితులే దీనికి కారణం. తల్లి కనబడకపోతే విలవిల లాడిన పసిబిడ్డలా అన్నమయ్య పరితపించాడు. చెట్లు, పుట్టలు అంతటా వెతికాడు. ‘ఓ అంజనీ పుత్రా! పాతాళంలోని బంధింప బడ్డ దేవుని వెతికి తెచ్చినవాడివి నా స్వామిని తేలేవా?’ అని మొర పెట్టుకున్నాడు.
ఇందిరారమణుఁ దెచ్చి యియ్యరో మాకిటువలె
పొంది యీతనిఁ బూజించ బొద్దాయనిపుడు (బౌళి – 4 – 430)
అన్నపానీయాలు మాని పిచ్చి పట్టిన వానిలా తిరుగుతున్న అన్నమయ్యను చూసి ఆ స్వామికే మనసు కరిగిందేమో అన్నట్లు ఒక కోతి స్వామి విగ్రహాన్ని పట్టుకొచ్చి అన్నమయ్య పూజాగృహంలో ఉంచి వెళ్ళిపోయింది. హనుమంతుడే ఈ కార్యాన్ని నెరవేర్చాడని భక్తులు అందరూ విశ్వసించారు. ఒక రోజు స్వామి వారికి నైవేద్యంగా పెట్టిన జీడిమామిడి పుల్లగా ఉండటం చూసి ఆ చెట్టును తాకి దీని పళ్ళు తీయగా ఉండాలి అని మనసులో స్వామివారిని తలచాడు. అప్పటినుండి ఆ చెట్టు పండ్లు తీయగా ఉండేవట. ఒక పేద బ్రాహ్మణుడు తన కుమార్తె వివాహానికి ధన సహాయం కోసం ఎలా అని ఆలోచిస్తూ ఉండేవాడు. అతని ఓదారుస్తూ అన్నమయ్య నీకు సహాయం తప్పక అందుతుంది అని చెప్పాడు. అన్నమయ్య వాక్కు ఫలితంగా ఒక రాజు సహాయం చేశాడు. ఇలా అన్నమయ్య ఏది చెబితే అది తప్పక జరిగి తీరేది.
పురందరదాసుల వారిపై అన్నమయ్య ప్రభావం :
పురందరదాసుల వారు అన్నమాచార్యులను దర్శించి సాక్షాత్తు అన్నమయ్య నారాయణుని అవతారమని ప్రస్తుతించాడు. అన్నమయ్య పురందరదాసులను సాదరంగా ఆహ్వానించి ‘స్వామి చేతనే సంధ్య వార్చు కోవడానికి నీరు తెప్పించుకున్న వాడివి, నీవు సాక్షాత్తూ విఠలుని అవతారం’ అని కీర్తించాడు. పురందరదాసుపై అన్నమయ్య ప్రభావం ఉందనడానికి నిదర్శనం ఈ పాట.
శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీపతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకటనాయకా
అని అన్నమయ్య అంటే
పురందరదాసు ఇలా కీర్తిస్తున్నారు.
శరణు శరణు సురేంద్ర వందిత శరణు శ్రీపతి సేవకా
శరణు పార్వతి తనయ మూరుతి శరణు శిద్ధి వినాయకా
ఇంకొక కీర్తనలో అన్నమయ్య నారాయణతే నమో నమో – నారద సన్నుత నమో నమో అని అంటే
పురందరదాసు వారు నారాయణతే నమో నమో భవ – నారద సన్నుత నమో నమో అని అన్నాడు.
శృంగార రచనా శైలిలో అన్నమయ్యను క్షేత్రయ్య కూడా అనుసరించాడు. అన్నమయ్య పద కవితా పితామహుడిగా పేరొందితే క్షేత్రయ్య తన మువ్వ పదాల ద్వారా పద కవితా చక్రవర్తి గా, పద కవితా జనకుడిగా పేరుగాంచాడు.
అన్నమయ్య రచనలు :
అన్నమయ్య కీర్తనలను శృంగార, ఆధ్యాత్మిక కీర్తనలుగా విభాజించవచ్చు. అన్నమయ్య ముప్పై రెండువేల కీర్తనలను రచించాడని చిన్నన్న వ్రాసిన అన్నమాచార్య చరిత్ర ద్వారా తెలుస్తోంది.
యోగామార్గంబున నొక కొన్ని, బుధులు
రాగిల్ల శృంగార రస రీతి కొన్ని
వైరాగ్య రచనతో కొన్ని
సారస నేత్రుపై సంకీర్తనములు
సరసత్వమునఁదాళ సముఖముల్ గాఁగ
పరమ తంత్రములు ముప్పది రెండువేలు
అయితే నేడు మనకు దాదాపు పద్నాలుగు వేల నాలుగు వందల వరకు లభ్యమవుతున్నాయి.
నే నొక్కడ లేకుండితే నీ కృపకు బాత్రమేది
పూని నావల్లనే కీర్తి పొందేవు నీవు
అని అంటూ తన కీర్తనల వల్లనే స్వామికి కీర్తి పొందాడని స్వయంగా అన్నమయ్యే అన్నాడు. పన్నెండు శతకాలు, ద్విపదలో రామాయణం, శృంగార మంజరి అన్న లఘు కృతి రచించాడు. ఇవే కాక సంస్కృతంలో వేంకటాచల మహాత్యం, సంకీర్తనా లక్షణాన్ని రచించి ఉభయ భాషా ప్రవీణుడిగా పేరు గడించాడు. పన్నెండు శతకాలలో ఇప్పుడు లభ్యమయ్యే శ్రీ వేంకటేశ్వర శతకంలో పద్మావతీ శ్రీనివాసుల అలౌకిక శృంగారమే కథా వస్తువు. ఈ శతకంలో రథోత్సవం, గరుడోత్సవం, కళ్యాణోత్సవం వంటి ఉత్సవాల గురించి వర్ణించాడు. ఇది వైష్ణవ శతకాలలో ప్రధమం. భక్తి శృంగార శతకాలలో కూడా ఇది మొదటిది. శృంగార మంజరిలో వసంతోత్సవం, నాయిక విరహ వేదన మొదలగు వర్ణనలు ప్రబంధపు కవులను పోలి ఉన్నాయి. అన్నమయ్య కీర్తనలు తిరుమలలోనే కాకుండా అహోబిలం లోను, తంజావూరు లోను ఇంకా కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా భజన సాంప్రదాయం ఉన్న వారి నుంచి కొన్ని సేకరించారు.
అన్నమయ్య భక్తి తత్పరత :
రాముడైనా-కృష్ణుడైనా, నారాయణుడైనా- నరసింహుడైనా తిరువేంగళనాథునిలోనే చూసుకున్నాడు. శబరి, రాధ, అర్జునుడు, ఆంజనేయుడు, గుహుడు గరుత్మంతుడు, విభీషణుడు, సుగ్రీవుడు ఇలా పరమ భక్తులను తన హృదయాంతరాళంలోకి ఆవాహన చేసి సంకీర్తనలుగా మనకు అందించాడు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అన్నమయ్య పాటలని ఆంధ్ర వేదం అని అన్నారు. భక్తి, ప్రపత్తిలతో నిండిన అన్నమయ్య కీర్తనలు శరణాగతి లో మహోన్నతమైనవి. చిన్నన్న అన్నమయ్య రచనల విధానం గురించి ఇలా చెప్పాడు.
శృతులై శాస్త్రములై పురాణ కధలై సుజ్ఞాన సారంబులై
యతిలో కాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతుల్
కృతులై వేంకటశైలవల్లభు రతిక్రీడా రహస్యంబులై
నుతులై తాళుల పాక యన్నయవచో నూత్నక్రియల్ చెన్నగున్
అన్నమయ్య పద కవితా వైభవం :
అన్నమాచార్యుడు ప్రజల వాడుక భాషకు పట్టం కట్టాడు. అచ్చతెనుగు నుడికారం, దేశికవితా సాంప్రదాయములగు సామెతలు, సిసలైన తెలుగు పలుకుబళ్ళు, జన జీవితాల జాతీయాలు, సామాన్యులు వాడే సామెతలు అనేకం తన సంకీర్తనల్లో నిక్షిప్తం చేశాడు. పద్యం కన్నా ముందు పదము పుట్టింది. పద కవిత ప్రజా కవిత. పద కవిత ద్వారా భావం, భాష, భావ వ్యక్తీకరణ సులభంగా ప్రజలకు చేరుతుంది అని కనిపెట్టిన మహా ప్రతిభాశాలి. సంగీతము, సాహిత్యములలో దిట్ట. తొలి తెలుగు వాగ్గేయకారుడిగా నిలిచాడు. అన్నమయ్య భక్తి, నీతి, వైరాగ్య, తాత్విక చింతన పరంగా ఎన్నో కీర్తనలు రచించాడు. శృంగార రచనలు అభిననయించుటకు వీలైనవని విస్సా అప్పారావు గారు తెలిపారు.
తాళ్ళపాక వంశ కవులు :
అన్నమయ్య భార్య తిమ్మక్క సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రచించింది. ఇది మంజరీ ద్విపదలో సాగే గేయ కావ్యం. ఈమె తొలి తెలుగు కవయిత్రిగా పేరు పొందింది. అన్నమయ్య రెండవ భార్య అక్కమాంబ కుమారుడు తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు వేంకటేశ్వరోదాహరణం, నీతి సీస శతకం, సుదర్శన రగడ, శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్తవం, భగవద్గీతానువాదం, రేఫ ఱ కార నిర్ణయం శృంగారవృత్త శతకం, వైరాగ్య వచన మాలికా గీతములు శృంగార దండకం, చక్రవాళ మంజరి, ఆంద్ర వేదాంతము అని పిలవబడ్డ భగవద్గీత అనే గ్రంథాలను రచించాడు. అన్నమయ్య మనుమడు పెద్ద తిరుమలాచార్యుని పెద్ద కుమారుడు అయిన తాళ్ళపాక చిన తిరుమలాచార్యుడు శృంగార, ఆధ్యాత్మిక కీర్తనలు, అష్టభాషా దండకం వ్రాసి అష్ట భాషా కవి చక్రవర్తి గా పేరొందాడు. తెలుగు సంకీర్తన లక్షణం వ్రాశాడు. పెద తిరుమలాచార్యుని నాలుగవ కుమారుడు తాళ్ళపాక చిన తిరువేంగళ నాథుడిగా పేరున్న చిన్నన్న అన్నమాచార్యుల జీవిత చరిత్ర అనే ద్విపద కావ్యం, పరమయోగి విలాసం, అష్టమహిషీ కల్యాణం, ఉషాపరిణయం గ్రంథాలను వ్రాశాడు. ‘చిన్నన్న ద్విపద కెఱుఁగును పన్నుగఁపెద తిరుమలాచార్య పదమున కెఱుఁగున్’, ద్విపద కావ్య రచనలో మేటి అని తెనాలి రామకృష్ణునిచే పొగడబడ్డాడు.
సంకీర్తన భండారం :
అన్నమయ్య కీర్తనలను తిరుమల ఆలయంలోని భాష్యకారుల సన్నిధి వద్ద ఉన్న ఒక అరలో రాగిరేకులు ఉండేవి. అందుకే దీనికి ‘తాళ్ళపాక అర’ అని పేరు. అన్నమయ్య కీర్తనలను విజయనగర రాజైన అచ్యుత రాయల కాలంలో రాగి రేకులపై వ్రాయించారు. పెద తిరుమలాచార్యుల ఆధ్వర్యంలో ఇది జరిగింది. అన్నమయ్య తన చివరి దశలో ఈ కార్యక్రమ అంకురార్పణ జరిగిందని ఈ సంకీర్తన ద్వారా తెలుస్తోంది. అయితే అన్నమయ్య కాలానికి రాగి రేకులకు బదులు తాళపత్రాలలో ఈ కీర్తనలు ఉండేవి.
IIపల్లవిII దాఁచుకో నీపాదాలకుఁ దగ నేఁ జేసిన పూజలివి
పూఁచి నీకీరితి రూపపుష్పము లివియయ్యా
IIచరణంII వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ
తక్కినవి భండారాన దాఁచివుండనీ
వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము
దిక్కై నన్నేలితివిఁక నవి తీరని నా ధనమయ్యా (గుండక్రియ – 2 – 338)
అన్నమయ్య అవతార సమాప్తి :
అన్నమాచార్యుడు 95 సంవత్సరాల వయస్సులో క్రీ.శ. 1503 లో దుందుభి నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు విష్ణు సాయుజ్యం పొందారని ఈ పెద తిరుమలాచార్యుని ఈ రచన ద్వారా తెలుస్తోంది.
దినము ద్వాదశి నేఁడు తీర్థదివసము నీకు
జనకుఁడ అన్నమాచార్యుఁడ విచ్చేయవే (శ్రీరాగం – 2 – 151)
సంకీర్తనల పరిష్కర్తల కృషి :
తాళ్ళపాక అరలోని రాగి రేకుల గురించి మొదటిసారిగా ఎ.డి.కాంబెల్ అనే విదేశీయుడు క్రీ.శ.1816 లో వ్రాసిన తెలుగులో వ్యాకరణము అనే రచన ద్వారా తెలుస్తోంది. తి.తి.దే. పేష్కారు అయిన శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి గారు 1922 లో ఈ అరలోని కొన్ని రాగి రేకులను తీయించి, దేవస్థానం తెలుగు పండితులు కలబగిరి వెంకటరమణ శాస్త్రి గారిచే పరిష్కరింప చేశారు. కానీ ఆ రాత ప్రతులు దురదృష్టవశాత్తూ కొన్ని కాలిపోయినవి. మిగిలిన వాటిని శ్రీ పండిత విజయ రాఘవాచార్యులచే తాళ్ళపాక కవుల లఘుకృతులు గా మూడు సంపుటాలు దేవస్థానం వారు 1935 లో ప్రచురించారు. 1945 లో తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాచ్య కళాశాల అధ్యాపకులైన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అన్నమాచార్య చరిత్ర పీఠికను ముద్రించారు. శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణమాచార్యులు, శ్రీ ఎ.వి. శ్రీనివాసాచార్యులు, శ్రీ పి.టి. జగన్నాధాచార్యులు, శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ మొదలగు వారు అన్నమాచార్య కీర్తనలకు పరిష్కర్తలుగా కృషి చేశారు.
అన్నమాచార్య ప్రాజెక్టును 1978 లో తి.తి.దే. వారు నెలకొల్పి ప్రముఖ సంగీత విద్వాంసులచే స్వర రచన చేస్తున్నారు. అయితే ఆనాడు అన్నమయ్య ఏవిధంగా పాడాడో, ఏ తాళంలో పాడాడో తెలియడం లేదు. శిష్య పరంపర లేక పోవడం చేత ఆ బాణీలు తెలియడం లేదు. శ్రీ పాద పినాక పాణి, ఓలేటి వెంకటేశ్వర్లు, మంగళంపల్లి బాల మురళీకృష్ణ, నేదునూరి కృష్ణముర్తి, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, నూకల చినసత్యనారాయణ, మంచాల జగన్నాధాచార్యులు, డి.పశుపతి, నాగేశ్వర నాయుడు, పారుపల్లి రంగనాథ్ మొదలగు వారితో పాటూ ఎమ్.ఎస్,సుబ్బులక్ష్మి, శ్రీరంగం గోపాలరత్నం, శోభారాజ్, కొండవీటి జ్యోతిర్మయి వంటి మహిళామణులు కూడా ఈ సంకీర్తన మహా యజ్ఞంలో తమ వంతు కృషి చేశారు.
వేదంబులు పౌరాణిక
నాదంబులు వరకవిత్వ వాణీ వీణా
నాదంబులు కృత సుజనా
హ్లాదంబులు తాళ్ళపాక యన్నయ పదముల్