Site icon Sanchika

హరిత హర్మ్యాలు

[dropcap]ఆ[/dropcap]కాశాన్ని చేతి వేళ్ళతో
అందుకుంటున్న పావన భావన
చూసే కనులకు కొత్త చూపు తోచే
దారికి ఇరువైపులా పచ్చదనం
పరుచుకున్న ఆకుపచ్చ తివాచీ
నిటారుగా నిలబడిన వేళ్ళు నేలలో
గాలిని ఊపుతున్న విసన కర్రల ఆకులు
సాగిపోయే బాటసారికి
ఒకింత సేదదీర్చగ నీడనిచ్చే
కొమ్మ గొడుగు
ఆకలి తీర్చగా ఆకుకొమ్మల నిండుగ
ఆహార ఫలములు
ఆమ్లజనిని అందించు జీవజాలానికి
జీవక్రియలో ఊపిరి గాలి నిచ్చు
గుల్మమే పొదరింటి పైకప్పుగా మారి
చిరు జీవకోటికి ఆశ్రయమిచ్చు
ఆకుపచ్చని మైదానంలో
హరిత హర్మ్యాలు జీవించి
జీవరాశికి కలిగించు ఉపయోగాలన్నో
జీవించే పచ్చని చెట్లు
హరిత హర్మ్యాలుగా నింగిని చేరు
మబ్బులతో ఆటలాడి
వనమంతా తడి తడిగా
వాన కురియ పులకించు పుడమి
ప్రకృతిలో చెట్లు
ప్రగతికి మెట్లుగా విలసిల్లు
మానవాళికి మరువలేని నేస్తాలు
చెట్టూ చేమ మనిషి బతుకు పుస్తకాలు

Exit mobile version