Site icon Sanchika

హరివిల్లు

 

[box type=’note’]విశ్వనాథ విరచిత రామాయణ కల్పవృక్షం పద్యాల ఆధారంగా సీతారాముల కళ్యాణ సమయంలో పరశురాముని ఆగమన నిర్గమనాల ఆంతర్యాన్ని హృద్యంగా ప్రదర్శిస్తుందీ మైథిలీ అబ్బరాజు వెలయించిన రమ్య కథా జల్లు – ” హరివిల్లు”.[/box]

మొన్నమొన్ననే మిథిలలో శివుని విల్లు విరిగిపోయింది. అప్పటినుంచీ అదేమిటో – అక్కడ తమస్సు లేదు. శుక్లపక్షపు తొలినాళ్ళైనా,చంద్రుడితో సంబంధం లేకుండా రాత్రులు వెలిగిపోతున్నాయి. కారణం ఆ రంగుల రత్న దీపాలో, అవతలి చీకట్లను మింగిన రోచిస్సో – తెలియదు. ఫెళ్ళున పొంగిన ఉత్సాహం అంతటా. ఆ కిందటి రాత్రికి అయోధ్య నుంచి తరలి వచ్చిన పెళ్ళివారు చేరుకున్నారు. సీరధ్వజ జనక మహారాజు కుదుటపడ్డాడు అప్పటికి, తెల్లారితే లగ్నం. మహా ధానుష్కులైన రఘువంశీయులకు గౌరవం గా , అర్థరాత్రి దాటినప్పటినుంచీ మిథిలలో వంద ధనుస్సులు ఆగకుండా ధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ టంకారం ఆకాశం నిండా ఆవరించుకుంది – వాటి వెనకన ఇంకేదో రవం ఉదాత్త స్వరం తో నేపథ్యగీతం గా నిలిచి వినిపిస్తోంది… కొన్నాళ్ళ కిందటిదయీ ఇంకా అంతరించని హరుని వింటి చప్పుడు. అది విరుగుతున్నదిలాగా లేదు, పెరుగుతున్నదల్లేనే ఉంది.

అంతా చేరారు ఒక్కచోటికి. రెండు పరివార పారావార ప్రవాహాలు. వెయ్యి అనుకూల పవనాలు. అంతలో ఉరుములు. ముందు అందరూ ఆ ధానుష్కుల విద్యదే అనుకొన్నారు – కాదు. అంతకంతకూ చెవులకు చేరువవుతూన్న కరకుదనం , ఎక్కడిదో. ఆకాశం లో పక్షులు గుంపుల గుంపుల వలయాలయి కొట్టుకున్నాయి, భూమి మీది జంతువులు నోళ్ళు తెరిచి విలవిలమన్నాయి. అప్పుడింక నిజంగానే గట్టి మబ్బులు కమ్ముకొచ్చాయి. అవి గర్జించి చీలుతూ వెంటవెంటనేమెరుపులు. పెనుగాలి. రేగే ధూళి. ఇళ్ళూ వాకిళ్ళూ కకావికలం. గజశాలలో ఏనుగులది పెద్ద పెట్టు ఘీంకారం. గుర్రాలు కట్లు తెంచుకు ముట్టెలు నిక్కిరించాయి- కల్లోలం. అంతా క్రమంగా శమించింది. పక్షులు సౌమ్యం గా కూయటం మొదలైంది. వర్షం వెనుకనే మింటిలో శరత్తూ ఒత్తుకొని వచ్చినట్లైంది.

దశరథుడి గుండె గుబగుబలాడిపోయింది- శుభమా అని కొడుకు పెళ్ళి పెట్టుకుంటే ఇదేమిటిలాగా అని వశిష్ట విశ్వామిత్రులకు మొర పెట్టుకున్నాడు.

“ప్రళయమనిపించిది గానీ రాలేదుగా , మహారాజా ! తేలిపోయింది అట్లాగే తేలిపోతుంది ఊరుకో ”

ఆ నిశ్శబ్దం లోంచి – లోకం లోని ఘోరమైన ధ్వనులన్నిటినీ మేళవించుకు మోగినట్లొక అతిభీకర నాదం – వాకిట్లో.
ఎర్రటి చీకటి. అందులోంచి ఒక ఆకృతి. నొసటిమీదన బ్రహ్మ తేజస్సు. కళ్ళ నిండా ఘోర క్షాత్రం. అడుగు తీసి అడుగు వేస్తూంటే భువనాలు దద్దరిల్లుతున్నాయి. రెండు చేతుల తోనూ పూని ఉన్నది – ఉగ్ర పరశువు. మూపుపైన కొండంత విల్లు. చండమారుతం తో ప్రజ్వరిల్లిపోతున్న కాలాగ్ని – భార్గవరాముడు. తాటిచెట్టంత దేహం, జటలనిండా సాగరాల నురగలు, ఒంటినిండా రుద్రాక్షలు – కదిలించలేనట్టి కైలాసగిరి తాను కదలి వచ్చి అక్కడ కదలినట్లు.

కళ్ళెత్తి చూసేందుకెవ్వరికీ ధైర్యమే రాలేదు – అక్కడొక మహా విద్యుత్స్రవంతి. ఎక్కడి వారి ప్రాణాలక్కడ కుంగిపోయినాయి.ఆ బిక్కచచ్చిపోవటం చూసి అంతటి రౌద్రమూర్తికీ సన్నగా నవ్వు వచ్చింది, ఆ నవ్వులో ప్రసన్నత లేదు. చేతిలోని ధనుస్సును కాస్త లాగి వదిలితే వచ్చిన వింత ధ్వనికి – చిత్రం గా జనానికి ఒళ్ళు తెలియటం మొదలైంది. ఎవరో మొదలెట్టారు – ” అర్ఘ్యం ” అని, ఇంకొకరు ” పాద్యం ” అని. ఆదరాబాదరా అవి సిద్ధమైనాయి- స్వీకరించి , జనకుడు చూపిన మాణిక్య పీఠం పైన ఆ పెద్దమనిషి కూర్చున్నాడు- అప్పటికి అందరికీ కాస్త ఊపిరాడింది. కూర్చున్నాకూడా , ఇంతెత్తున, ఆనుపీటని దాటిపోయి ఉన్నాడు… నరుడా ఆయన ? నారాయణుడో నారసింహుడో – అవి ఏమి ముఖరేఖలది ఎక్కడి వాలకం ?

గళం విప్పాడు – ”ఎవడురా వాడు? లోకేశ్వరుడి ధనువును విరిచేంత మగతనం ఎవడిది? ప్రమథ గణాధిపతి వెలవెలబోయేటంత అఘాయిత్యమెవడిదిరా? ఎంతటివాడూ పట్టని స్కందుడు ఆరుజతల కన్నులు విప్పి కాంచుతూన్నదెవరినిరా ? అభ్యాసం చేస్తూ చేస్తూ నా తుంటరితనాన అప్పుడు కూర్చున్న కొండలను శరాలతో దడదడలాడించే నాడూ వాల్లభ్యాన్ని వీడదు అమ్మ మొగమావిడ బొమలు ముడిపడేటంత కలతను తెప్పించిన మదమెవ్వరిదిరా ? స్వర్గమూ మరింకేదీ లెక్కలేని ఉద్దతులా ప్రమథులందరి నోటివెంటా ‘ వద్దు వద్ద ‘ నిపించినదెవడు? త్రిలోచనుడి మహాధనువును ఎత్తినదెవడు?  దాన్ని పువ్వు కింద ముక్కలు చేసినదెవడా క్షత్రియుడెవడు? వాడినీ వాడికి వత్తాసు పలికిన వాళ్ళందరినీ – మహాగ్నిమధ్యంలోదహించివేస్తానిదిగో!! అప్పుడు నా తండ్రి ఋణాన నానా క్షత్రియ రక్తంతో తర్పణాలిచ్చానిప్పుడు గురువు మహేశ్వరుడి ఋణాన్ని తప్పకుండా తీరుస్తాను , అట్లాగే అప్పటిలాగే – రాజ భార్యలందరివీ మాంగల్య సూత్రాలు తెగిజారి పోవుగాక వారి పురాలపై పిండాలకు కాకులెగురుగాక…”

ఆ తాండవం ఇంకెంతదూరం పోయేదో గాని – అగ్నిమధ్యం లోంచి మలయమారుతం వీచినట్లు రామచంద్రుడు ముందుకొచ్చాడు –
”రాముడిని. మీరు భార్గవరాములని తెలిసింది. అంజలి ఘటిస్తున్నాను. హేరంబుడిని కలతపెట్టినవాడినీ అమ్మవారి నొసలు చిట్లింపచేసినవాడినీ శివద్రోహానికి ఒడిగట్టిన వాడినీ – నేనే – ఆ కుర్రవాడిని ”

ఆ మెత్తని మేఘనాదం ఆమృతమయి, అందరికీచెవులలోకి.
అంతరోషమూ ఎందుకో చప్పున తగ్గింది భార్గవుడికి , చిందులేస్తున్నవాడల్లా ఆగి నిలిచాడు- కూర్చున్నాడు. పడుచువెన్నెలల ప్రోవైన పదహారేళ్ళ బాలాకుమారుడిని చూస్తూ – ”నీవటోయి?  మంచివాడిలాగే ఉన్నావే?  నీవా శివధనుసును వంచినది?  నువ్వు తాకితేనా అంతటిదీ వెదురుబద్దలాగా విరిగింది?  ఎట్లా?  చెప్పు చెప్పు వింటాను? పనిగట్టుకుని విరగ్గొట్టావా?  ముట్టుకోగానే విరిగి పోయిందా?  ఉత్తినే పట్టుకున్నావా? ఎక్కుపెట్టావా?  సంధించావా?  బాణం వదిలావా?  అది దేన్ని వెళ్ళి తాకిందంటావు ? ”

”అయ్యో, చెట్టంత విల్లు అది, మునివరేణ్యా, చేతిలో ఒదిగేనా ? దాన్ని ఎక్కుపెట్టటం కూడానా ? పెట్టెలోంచి కాస్త గట్టిగా లాగాను కాబోలునంతే ”

పరశురాముడికి నివ్వెరపాటు. ”అవునా, ఎక్కుపెట్టనేలేదా? అంత గట్టివాడివా! పాత వస్త్రంలాగా విచ్చిపోయినది.  దాని విషయం వదలివేద్దాం, ఇంకొక ధనుస్సును నేను తెచ్చాను , చూడు దీన్ని ఎక్కుపెట్టి బాణం విడవాలి మరి – అప్పుడు నీకు ద్వంద్వయుద్ధాన్ని అనుగ్రహిస్తాను ”

కన్నతండ్రి పేదగుండె ఆవురుమంది. ఆనాడెప్పుడో ఈయన విజృంభణాన అంతఃపురంలో దాగి బతికిపోయినవాడు, ఆ ఒక్కమాటా వదిలితే అసమాన శూరుడూ దేవదానవ యుద్ధాలలో ఇంద్రుడికి విజయం తెచ్చిన మహారథీ – దశరథుడు , దీనంగా వినతి చేశాడు.

”ఆ విల్లు ముందే పుచ్చిపోయిఉంటుంది, ఏనాటినుంచో పెట్టె లోనే ఉండినది కాదా? పసివాడిమీద ఈ విరోధం వద్దు,  న్యాయం కాదు జమదగ్ని తనయా, అభయం ప్రసాదించు – నా వంశం నీ దయాధీనం…”
వశిష్ఠుడు మందలించాడు –  ”స్వాధ్యాయ పరమపండితుడవు,  ఋభు రాజు సాక్షిగా శస్త్రాన్ని విడిచిపెట్టిఉన్నావు –  భార్గవమునీంద్రా, ఇప్పుడు తిరిగి పట్టరాదు ”

జనకుడు హితవు చెప్పాడు – ”క్రోధాన్ని వదిలి, గెలిచిన వసుధను కశ్యపుడికి ధారపోసి, కిందకంటూ దిగకుండా మహేంద్రగిరిపైనే ఆనాటినుంచీ నివసిస్తున్నావు కదా, ఇప్పుడు తిరిగి ఈ ఆగ్రహమెందుకు? ”

లక్ష్మణుడు బుసలుకొట్టాడు – ”విల్లు ఎవరు విరిస్తే వారికి కూతురిని ఇస్తానని జనకరాజు చాటించినప్పుడే రావాల్సింది నీకు కోపం. ఇప్పుడేమిటీ గొడవ? ”

భార్గవుడెవ్వరినీ లెక్కచేయక బాల రాముడి దిక్కుకే చూస్తుండిపోయాడు.
”అయ్యో , ఇక రాముడు లేడు, మేమెవ్వరమూ లేమ ‘ ని దశరథుడు మూర్ఛ పోయాడు.

”బాలుడివా? మొనగాడివా? చూద్దాంపద.. ఇది విష్ణుధనుస్సు – శివధనుస్సుతో సమానమైనది, మా ఇంటి సొత్తు. అసలీ రెండూ ఎక్కడివో ఏమిటో ఎరుగుదువా? చెబుతా విను. ఊసుపోని కొందరు దేవతలొకనాడు శివుడెక్కువా? విష్ణువు ఎక్కువా? అని సందేహం పుట్టి ఇద్దరిమధ్యనా కయ్యం తెచ్చారు. శివధనుస్సు త్రిపురాసుర వధకు వాడి ఉన్నది – బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొనిఉండిపోయి అది అక్కడక్కరకు రాక , శివుడు విసిగి దాన్ని ఈ విదేహుల పూర్వుడు దేవరాతుడికి ఇచ్చేశాడు. ప్రాణమైన రుద్రుడితోటి పోరు తెచ్చిన తన ధనుస్సుపైన, చికాకు పుట్టి విష్ణుమూర్తి, మా తాత ఋచీకుడిని పట్టుకుపొమ్మన్నాడు. మా నాయనమ్మ సత్యవతి ఈ విశ్వామిత్రుడికి అక్కగారు. ఆవిడా మా అమ్మ రేణుకా ఇద్దరూ క్షత్రియలే – నేనచ్చంగా బ్రాహ్మణుడిని కాను లే….ఇదిగో ఈ వింటితోనే ఇరవై ఒక్కమార్లు క్షత్రియులను నిర్మూలించి మా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చాను. నా కథ తెలుసునా నీకు?” – ఆ సంగతంతా ఏకరువు పెట్టుకొచ్చాడు. ”నన్నంతా కోపిష్టి అంటారు గాని, నిస్సహాయగా నా తల్లి నన్ను ఇరవై ఒక్క మార్లు రామా రామా అని ఎలుగెత్తి పిలిచిందే నా తండ్రిని నరుకుతుంటే – నాకు ఎంత కోపం రావచ్చు, చెప్పు? ఎందరిని విరగనరికితే అది చల్లారగలదు, చెప్పు? ” – తనదచ్చంగా దౌష్ట్యం కాదని చెప్పుకుంటున్నాడు, ఈ పసివీరుడికి. ఎందుకనో !

“సరేలే, చూడు ఇప్పుడు – ఈ విష్ణుధనుస్సును ఎక్కుపెట్టావా, నీవెవరో అర్థమవుతుంది. నీ బాణానికి గురిగా ఏదవాలో ఆపై మాట ” – సామరస్యంగా, వైనంగా – ఏ తమ్ముడితోనో బావమరదితోనో మాట్లాడుతున్నట్లే ఉన్నది భార్గవుడి ధోరణి. రాముడు మెదలకుండా వింటూండిపోయాడు.

విష్ణుధనుస్సు.
దానిపైన ఆనినాయి -ఇస్తూన్న చేయి, గ్రహిస్తూన్న చేయి.
అక్కడిది అంశతేజం. ఇక్కడిది అర్ధభాగం.
తలపడకపోతే ఏమో , తూగినప్పుడు బరువొకవైపే.
ఉదాత్త అనుదాత్తాలు రెండూ శృతిమంత్రమే..
విడినప్పుడు స్థాయీభేదం.
తప్పదు.
అది ముగిసిపోయిన కార్యం.. ఇది వలసి ఉన్న కారణం.
నలుపులోంచి ఎరుపుకు విరిగే జామదగ్నిఅటు , రేణుకా సంతతి.
నీలి నుంచి తెలుపుకు తిరిగే దాశరథిఇటు, కౌసల్యా సుప్రజ.
కనపడేఏడురంగులకి చెరొకవైపూ
ఆవలివి -మానవనేత్రాలకి అందని
అదృశ్య రక్త కిరణాలూ అతినీలలోహితాలూ.
విడివిడిగా. కలగలుపుగా. ఒక్క ధారగా.
వింటితోబాటు ఇంకేదో చాలా – ఘన తపఃఫలమో మహా విష్ణుత్వమో – ప్రసరించించిందొక్కవైపుకే.
ఇవ్వటం లో ఉన్న సౌఖ్యం, బరువు దిగుతూ ఉన్న తేలిక-
తెలిసిపోయింది.
చూసేందుకు బ్రహ్మాది సురలు పైన నభస్సులో గుమిగూడారు.
బాణం సంధించాడు మానవేంద్రుడు రాఘవుడు.
రెక్కలు వీడిన పర్వతం లాగ నిలుచుండిపోయినాడు భార్గవుడు
”ఎక్కుపెట్టిన బాణాన్ని వెనక్కి తీయని వ్రతముంది నాకు. చెప్పండి బ్రాహ్మణోత్తమా,మిమ్ము చంపరాదు – మీ పాదాలా, మీరా ర్జించిన పుణ్యమా ? ”
పరశురాముడికి కొంత దిగులు. కొంత ముచ్చట.
”క్షత్రియజన్మ ఎత్తావు వాసుదేవా, తగినట్లే పలుకుతున్నావు. పాదాలపైన కొట్టకు , పుణ్యమేదైనా ఉంటే – తీసుకో లే, దానికేమి’’
నిబ్బరం.
అక్కడా తానే, తనకింకొన్ని రెట్లు.
శాంతమందహాసం తో ఒగ్గాడు సుకృతాన్ని. ఎందుకక్కరకొచ్చేనో, ఏమో …
ముగ్గురు మహా బలవంతులు – అహంకారులు,అనంతరం
లోకపీడకులు – అందరిలో గొప్ప కార్తవీర్యుడే, మడిసినది తన చేతిలో. రావణుడు మిగిలాడు. తర్వాత ఆ కోతి, వాలి మిగిలాడు- తానైతే పూనుకోడు.పరమేశ్వరుడికి పరమభక్తుడూ అద్దానా ఔద్ధత్యం ఇంకొంత పెరిగినవాడూ దశకంఠుడు…ఇప్పటికిట్లా శైవాన్ని వైష్ణవం అధిగమించి కనిపించటం – అవసరమే.
కాలం ఒకటి. దానికి బద్ధులే , భూమిపైన తానూ అతనూ సైతం – ఉన్నంతకాలం.
ద్వంద్వయుద్ధం మాటలేదిక. రామబాణం కన్నా ముందుగా
అతి త్వరగా మహేంద్రగిరికి , నిర్గమనం.
దిక్కులు తెప్పరిల్లాయి. తేటపడ్డాయి.
” పరశురాములు వెళ్ళిపోయారు ” – దశరథుడి ప్రాణాలు లేచి వచ్చాయి.
వాళ్ళూ వీళ్ళూ –
”నాయన్నాయన, ఎంత గండం గడిచిందయ్యా – పెళ్ళిపీటల మీద ”
”భార్గవరాముడికి క్షత్రియుల శౌర్యం నిరూపించావు, జయించావు ”
శ్రీరాముడు ముక్కున వేలుంచి తల అడ్డంగా ఊపాడు. ” గెలిచానా, ఇంకా నయం. ఆయనెందుకో లొంగాడంతే. ద్వంద్వయుద్ధమని ఉంటేనో ? ”
జడివాన వెలిసింది. లే ఎండ కాసింది.
అందులో హరివిల్లు – మిథిల పైనంతా.
మేడమీంచి చిన్న జానకి నవ్వింది.
[కవిసమ్రాట్ విశ్వనాథసత్యనారాయణ గారి శ్రీ మద్రామాయణ కల్పవృక్షం – బాలకాండం, ధనుష్ఖండం లోని పద్యాల ఆధారంగా]

 

Exit mobile version