హరివిల్లుల మెరుపుల్లో అనంతపురం

4
2

[dropcap]వ[/dropcap]ర్షపు చినుకు కోసం సంవత్సరాలు ఎదురుచూసే అనంతపురంలో హరివిల్లులు ఎక్కడివని అనుకుంటున్నారా? రండి రండి చూద్దాం అవి ఏమిటో…

రాయలసీమ ప్రాంతంలో నీటి సమస్యలు, రైతుల ఆత్మహత్యలు వంటివి నిత్యం మనకు కనిపించే వార్తలు. అనంతపురం ఈ సీమ ప్రాంతంలోని పట్టణమే. ఈ ప్రాంతం నుంచి అనేకమంది గొప్ప రచయితలున్నారు. ఎందరో సుప్రసిద్ధ రాజకీయ నాయకులున్నారు. ఉన్నత విద్యాసంస్థలున్నాయి. పట్టణ నడిబొడ్డులో గడియారం స్తంభం ఉంది చరిత్ర, వర్తమానాలను భవిష్యత్తుకు చేరవేసే సాక్షిలా.

‘మా తుఝే సలాం’ అంటూ బడిపిల్లల అల్లరితో పాటు వారి ఆకలి వ్యథల్ని, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన స్త్రీల జీవితాల్లోని పోరాటాల్ని కథలుగా అందించిన ఆర్. శశికళ పుస్తకం ఆమెను పరిచయం చేసింది. పుస్తకాన్ని అనంతపురంలో సద్దాం బాషా గారు నడుపుతున్న ‘క్రిసెంట్ రెయిన్‌బో హోం’ లోని పిల్లలకి అంకితం ఇవ్వటంతో ఆ హోం చూడాలన్న కుతూహలం అప్పుడే మొదలైంది. ఈ పుస్తక పరిచయం జహీరాబాద్ లోని డా. విజయలక్ష్మి ద్వారా జరిగింది. ఏడాది కాలపు పరిచయం వీళ్ళిద్దరితో తెలియని దగ్గరతనాన్ని తీసుకొచ్చింది. రచయిత్రిని కలిసేందుకు అనంతపురం వెళ్ళాలనుకున్నాం డా. విజయ, నేను. ఒక స్నేహం వికసించేందుకు ఏడాది సమయం చాలా ఎక్కువే అనిపిస్తుంది. ఒక్క పలకరింపు, ఒక్క చిరునవ్వు స్నేహ పరిమళాల్ని మనచుట్టూ పరిచే సందర్భాలు ఎవరికి తెలియనివని?!

ఇంతకీ అనంతపురం ప్రయాణం ఎన్నెన్ని కథల్ని చెప్పిందో, ఎందరి జీవితాల్ని పరిచయం చేసిందో మీతో పంచుకోవలన్నదే ఈ ప్రయత్నం. అప్పుడు మీకూ తెలుస్తుంది నేను ఊరించిన హరివిల్లులేమిటో!

కోవిడ్ తాలూకు తీవ్రత తగ్గుముఖం పడుతూండటంతో ఇప్పుడిప్పుడే జనం ఆనందంగా బాహ్య ప్రపంచంలోకి ప్రయాణమవుతున్నారు. ఆ తెలవారుఝామున రైలు దిగేసరికి అనంతపురం స్టేషన్‌లో శశికళతో పాటు అప్పుడే రైలు దిగిన డా. విజయ ఆత్మీయంగా ఎదురొచ్చారు.

ఇంటికి వచ్చేసరికి ఎనిమిదో క్లాసు చదువుతున్న సమత నవ్వుముఖంతో పలకరించింది. గదులు శుభ్రం చేస్తున్న శంకరమ్మ తలెత్తి చిన్న నవ్వునిచ్చింది. కొత్త చోటు, కొత్త మనుషులు అనిపించనేలేదు. కొన్ని సందర్భాలు ఊహించలేం. భలే కుదిరిపోతాయి అలా. కబుర్లు, ఒకటే కబుర్లు…వేడి వేడి తేనీటి సందళ్లు.

కబుర్ల మధ్య రాయలసీమ రాగి ముద్ద తయారు చేసారు శశికళ. ఇంతలో స్నేహితులు జయ, ఆమె కుమార్తె రేష్మ, రచయిత్రి డా. ప్రగతి, ఆమె కుమార్తె చైత్ర వచ్చారు మమ్మల్ని కలుసుకుందుకు. ఆకుకూర పప్పు, కొబ్బరి, వేరుశెనగ పచ్చడి, సాంబారులను ముద్దతో పాటు వడ్డించారు. మొదటిసారిగా తిన్నాం డా. విజయ, నేను. చాలా రుచిగా ఉంది. పుష్టికరమైన ఆహారం అని చెప్పారు.

అందరం తయారై ‘క్రిసెంట్ రెయిన్ బో’ గర్ల్స్ హోం చూసేందుకు వెళ్లాం. ‘భారతమాత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల’ ఆవరణలో మేడపై భాగంలో గత పన్నెండేళ్లుగా నడపబడుతున్న హోం అది. దాదాపు నూట పదిమంది అమ్మాయిలున్నారు. ఆరేళ్ల వయసు నుంచి పద్ధెనిమిదేళ్ల వయసు వరకూ వివిధ క్లాసులు చదువుతున్న పిల్లలు. ఎక్కడెక్కడినుంచో రకరకాల పరిస్థితులు వారిని అక్కడికి చేర్చాయి. తల్లిదండ్రుల సమక్షంలో భద్రంగా పెరిగే పిల్లల్లో కనిపించని ఆత్మ విశ్వాసం వారిలో కనిపించింది. వారిలో చదువుతో పాటు వివిధ అంశాలలో ఉన్న ప్రతిభ అబ్బురమనిపించింది.

అసలు ఈ హోం ఏమిటి? ఎలా మొదలైంది అన్న ప్రశ్నకి నిర్వాహకులు సద్దాం బాషా ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన ప్రస్థానం చిన్నదేమీ కాదు. సాధారణ స్వర్ణకారుల కుటుంబంలో పుట్టి పెరిగిన సద్దాం పెద్ద చదువులు చదవలేకపోయారు. జీవిక కోసం రకరకాల పనులు మొదలుపెట్టారు. అవి తృప్తినివ్వలేదు. చిన్న వయసు నుంచీ చుట్టు ఉన్నవారికి ఏదైనా సాయం చెయ్యాలన్న ఆలోచన ఆయనను వేధిస్తుండేది.

అనంతపురంలో రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన కలిగిస్తూ, రక్త దాన శిబిరాల ఏర్పాటును ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్న తరిమెల అమరనాథరెడ్డి గారి గురించి తెలిసి ఆయనతో కలిసి పనిచెయ్యాలనుకున్నారు సద్దాం. మైనారిటీ వర్గాలనుంచి స్వంతంగా వారినే ఒక ప్రయత్నం చెయ్యమని అమరనాథరెడ్డి గారు సూచించారు. వారి ప్రేరణతో 1997లో ‘ఇస్లాం రక్తదాన కేంద్రం’ ఏర్పాటు చేసి రక్తదాన ఆవశ్యకత పట్ల అవగాహనను కలిగించటం మొదలుపెట్టారు సద్దాం. ఈ ప్రయత్నంలో కేవలం తన వర్గం వారినుంచే కాక అనంతపురం ప్రజలందరి నుంచి మద్దతును సంపాదించగలిగారు. విభిన్న వర్గాలకు, మతాలకు, కులాలకు నెలవైన మన సమాజంలో అందరినీ సమైక్యపరచి, ఒక ఆశయం కోసం పనిచేసేలా చెయ్యటం చాలా పెద్ద విషయం. సద్దాం గారి జీవితానికి ఒక దారి, ఒక ఆత్మ సంతృప్తి అనుభవంలోకి రావటంతో సేవ చెయ్యాలన్న తపన మరింత ఎకువైంది.

2002 సంవత్సరంలో గుజరాత్‌లో గోద్రా అల్లర్లు జరిగి, రెండు వర్గాల మధ్య కలహాలతో మారణహోమం జరిగింది. దానికి మతమో, స్వార్థపూరితమైన రాజకీయాలో కారణాలైనా జీవితాలు అల్లకల్లోలం అయింది, ప్రాణాలను పోగొట్టుకుంది మాత్రం సామాన్యులే. యుద్ధం ఎక్కడైనా, కారణమేదైనా జరిగేది మాత్రం ఇదే. అలాటి సన్నివేశానికి చలించి సద్దాం గుజరాత్ వెళ్లారు. శరణార్థుల శిబిరాల్లో పనిచేసారు. ఆయన కృషికి జాతీయంగా గుర్తింపు వచ్చింది. ఆయనలోని సేవాతృష్ణ పెరుగుతూ వచ్చింది.

‘క్రిసెంట్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ’ అనంతపురంలో 1993లో స్థాపించబడింది. దీని ఆశయం సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావటం. అందుకోసం భావి పౌరులైన బాలల హక్కులు పరిరక్షించి, పోగొట్టుకుంటున్న వారి బాల్యాన్ని వారికి అందించి, అనంతపురం జిల్లాని బాలల అభివృద్ధికి పాటుపడే జిల్లాగా తయారుచెయ్యాలన్నది సంకల్పం. బాలలకు చదువుతో పాటు సంపూర్ణమైన వికాసాన్ని కలిగించే ప్రయత్నం మొదలుపెట్టారు.

ముఖ్యంగా సమాజంలోని అన్నివర్గాల్లోనూ వివక్షకి గురవుతున్న ఆడపిల్లలకోసం ఏదైనా చెయ్యాలన్న ఆలోచనతో ‘క్రిసెంట్ రెయిన్‌బో హోం’ ఏర్పాటుచేసారు. ముఖ్యంగా సంచార జాతులైన షికారీ తెగలో వెనుకబాటుదనాన్ని, పేదరికాన్ని గమనించి ఆ కుటుంబాల్లోని పిల్లలను సంస్కరించాలనుకున్నారు. జిల్లా అంతా తిరిగి ఆ కుటుంబాల పరిస్థితులను అవగాహన చేసుకున్నారు. వారిని ఒప్పించి వారి పిల్లలను హోం సభ్యులను చేసారు. వారిలో ఇరవై మంది అమ్మాయిలను ఇంటర్మీడియట్ పూర్తి చేయించి ‘షికారీ’ తెగలోనే మొదటి జనరేషన్ విద్యావంతులను తయారుచేసారు. ఇది ఏ ప్రభుత్వమూ చెయ్యలేకపోయిన పని.

అలా 2010లో ఒక చిన్న అద్దె ఇంట్లో ఏడుగురు ఆడపిల్లలతో మొదలైంది హోం. తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రులచేత వదిలివేయబడిన పిల్లలు, రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్ లలో, రోడ్డు మీద దిక్కులేక తిరిగే పిల్లలు, ఎయిడ్స్ బారిన పడిన కుటుంబాల నుండి వచ్చినవారు, పిల్లలను రవాణా చేసే సందర్భంలో రక్షించి తెచ్చిన పిల్లలు, బాల్య వివాహాలతో సమస్యల పాలైన పిల్లలు, బాల కార్మికులు, బిచ్చమెత్తుకుని తిరిగే వీధి బాలలు, సెక్స్ వర్కర్ల పిల్లలు హోంలో సభ్యులయ్యారు. కొందరు పిల్లలకి ఇంటి దగ్గర తల్లో తండ్రో ఉన్నారని తెల్సినపుడు వారిని ఆ ఇంటికి చేర్చి, భోజనానికి కావలసిన సరుకులను ప్రతి నెలా వారి ఇళ్లకే అందించటం మొదలుపెట్టారు హోం నిర్వాహకులు.

ఈ హోం ఒక హరివిల్లు. పేరే రెయిన్‌బో హోం! మేము వస్తున్నామని తెలిసి వారి ఆటపాటలను మాకు చూపించేందుకు సన్నద్ధులై ఉన్న ఆ పిల్లల్లోని ఉత్సాహం చెప్పనలవికానిది. ఆరోజు ఆదివారం. పిల్లలకు ఆటవిడుపు. విలువైన తమ సమయాన్ని సంతోషంగా మాకోసం వెచ్చించారు. హోంకి ఎదురైన సవాళ్లను గురించి చెప్పారు. పది పన్నెండేళ్ల వయసులో వారికెదురైన రకరకాల అనుభవాలు, వారిలో ఉన్న అవగాహన, ఎలాటి సమస్యలైనా ఎదుర్కోగలమన్న స్ఫూర్తి! నిజంగా ఒక వ్యక్తిత్వ వికాస పాఠం.

వారి వెనుక తల్లిదండ్రులు, భద్రమైన జీవితం లేవన్నది మన ఆలోచనల్లోని వెలితే. ఆ పిల్లల నుంచి నేర్చుకోవలసింది సమాజానికి ఎంతో ఉంది. ఆ ధైర్యాన్ని, మనోశక్తిని నింపుతూ, సంరక్షణ వరకే పరిమితం కాక ఓర్పుగా వారికి చదువులు, మంచి చెడు విచక్షణ నేర్పుతున్నసద్దాం అభినందనీయులు. పాఠశాల చదువు ముగించి కళాశాల చదువుల్లో ఉన్న పిల్లలు, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి కోర్స్‌లు చేస్తున్న పిల్లలు హోంలో ఉన్నారు. పద్ధెనిమిది సంవత్సరాలు నిండిన వారిని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌కు పంపుతారు. ఆ పిల్లలు సెలవుల్లో హోంకి వస్తుంటారు. ఖరీదైన చదువులు చదివే పిల్లలకు స్పాన్సర్‌షిప్స్ ఉన్నాయి. వారి ఎదుగుదలకు ఆకాశమే హద్దు. పిల్లలకు పౌష్టికాహారం ఇస్తూ నెలకు దాదాపు మూడు లక్షలు ఖర్చుపెట్టగలుగుతోందంటే హోంకి ఉన్న గుడ్‌విల్, దాతల సహకారమే కారణం. అనంతపురం కరువు ప్రాంతం అంటారు. ఇందరు మంచి హృదయమున్న వ్యక్తులున్న అనంతపురంలో దేనికి కరువు అని చెప్తాం? పట్టణంలో ఎందరో తమ ఇంట జరిగే శుభకార్యాలను ఈ హోం పిల్లలను కలుపుకుని, వారి మధ్య జరుపుకుంటూంటారు.

హోం మొదలుపెట్టిన తొలిదినాల్లో ఈ పిల్లలంతా సద్దాం గారింటనే ఉండేవారు. వారి ఆలనాపాలనా ఆ ఇంటి ఇల్లాలు సద్దాం గారి సహచరి సంతోషంగా తీసుకున్నారు. భార్యాభర్తల మధ్య ఎంత చక్కని సమన్వయం! విజయగాథలు ఇలాటి వ్యక్తులనుంచే మొదలవుతాయి కాబోలు.

సద్దాం గారితో పాటు మొదట్లో ఇద్దరు ముగ్గురు టీం మెంబర్లుంటే ఇప్పుడు వారి సంఖ్య పదిహేను. హోం మదర్, టీచర్, ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ వంటి రకరకాల స్థాయులలో పనిచేస్తుంటారు. ఈ హోంలో పెరిగి పెద్దైన ఎంతో మంది పిల్లలు తమ కాళ్లమీద తాము నిలబడి, అప్పుడప్పుడు తమను అమ్మలా అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పిన హోం పట్ల కృతజ్ఞతను వివిధ సేవా రూపాల్లో వ్యక్తం చేస్తుంటారు. ఆదరణ, అవకాశం లేని ఎన్నో జీవితాలను అందంగా తీర్చిదిద్దుతూంది హోమ్. ఇది ప్రారంభించిన తొలిరోజు సద్దాం గారు బహుశా తన ప్రయత్నం ఇందరి జీవితాల్లో వెలుగును నింపుతుందని ఊహించలేదేమో. ఒక మంచిపనికి యావత్తు ప్రపంచం ఎలా చేయూతనిస్తుందో ఇదొక ఉదాహరణ. ‘పాలో కొయిలో’ చెప్పిన మాటలు జ్ఞాపకమొస్తున్నాయి…

“When you want something, all the universe conspires in helping you to achieve it.”

ఎంత సరిగ్గా చెప్పాడు!

ముందుగా ‘ప్రియాంక’ సారధ్యంలో చెక్క భజనతో లయబద్ధంగా అడుగులేస్తూ, రాయలసీమ గ్రామీణ యాసలో పాట పాడుతూ మమ్మల్ని అలరించిన పిల్లలు అది పూర్తయ్యాక ఎంతో పద్ధతిగా ఆయా పరికరాలను వాటి స్థానంలో సర్దేసారు. మనం ఇళ్లల్లో పిల్లలకి ఇలాటి డిసిప్లిన్ నేర్పేందుకు ఎన్ని తంటాలు పడుతున్నామో అందరికీ తెలుసు. వాళ్ల బట్టలు, వస్తువులు శుభ్రంగా, పధ్ధతిగా సర్దుకున్నారు. శుభ్రత, ఆరోగ్యం పట్ల హోం నిర్వాహకులు మంచి ప్రమాణాలను పాటిస్తూ పిల్లలను గైడ్ చేస్తున్నారు. రెయిన్‌బో హోం పిల్లలతో దాదాపు ఒక మూడు గంటలు గడిపి, వారిని విని వారితో కలిసి హోంలో ‘మమత, ఆమె టీం’ తయారుచేసిన రుచికరమైన భోజనం చేసాం. మా మనసులు నిండిపోయాయి. ఆ పిల్లల జీవితాలకు అలవోకగా అందిన అందమైన రహదారుల్ని తలుచుకుంటే ఎంత సంతోషం! భోజన సమయంలో మమ్మల్ని తమకు వడ్డించమని కోరుతూ మమ్మల్ని కూడా భోజనం చెయ్యమని ఆహ్వానించటం ఆ పిల్లలు నేర్చిన సంస్కారం.

ఇప్పటిదాకా ఈ పన్నెండేళ్లల్లో హోం లోని దాదాపు 300 మంది అమ్మాయిలు చదువులు పూర్తి చేసుకుని జీవితాల్లో స్థిరపడ్డారు. పిల్లలను చదివించేందుకు వలంటరీగా వచ్చి బోధించే వారున్నారు. అలాగే పిల్లల ఆరోగ్యాలను పరిరక్షించేందుకు అనేక మంది డాక్టర్లు వలంటరీగా రెగ్యులర్‌గా హోంకి వస్తుంటారు. మెడికల్ కాలేజీలోని జూనియర్ డాక్టర్లందరూ హోంకి స్పాన్సర్లు. సద్దాం గారు 2003 సంవత్సరంలో జాతీయ స్థాయిలో ‘ది ఇన్విజిబుల్ లీడర్స్ ఆఫ్ సొసైటీ’ అవార్డ్, 2013 సంవత్సరంలో ‘నేషనల్ స్టేటస్ అవార్డ్ ఫర్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్’ అవార్డ్ అందుకున్నారు. ఆయన తన కుమార్తెలను ముగ్గురినీ ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వారు తమ తండ్రి చేపట్టి, కొనసాగిస్తున్న పని పట్ల సంతోషంగా ఉన్నారు. సద్దాం గారు సమాజానికి ఒక్క విన్నపం చేసారు, అదేమిటంటే,

“రోడ్డు మీద బిచ్చమెత్తుకుంటున్న పిల్లలకు రూపాయో, అర్ధో ఇచ్చి పుణ్యం సంపాదించాలనుకోకండి. వారిని బాధ్యతగా సంక్షేమ గృహాల్లో చేర్చి, చదివించి భవిష్యత్తు ఇవ్వండి.”

తమ హోం ను రెయిన్‌బో  హోం అని అనటానికి కారణం ఇల్లు లేని పిల్లలకు ఇంటిని సమకూర్చటమే అని. అందుకే దానిని హాస్టల్ అని చెప్పం అంటారు సద్దాం.

మేము హోం కి వెళ్లిన కాస్సేపటికి ‘తరిమెల అమరనాథరెడ్డి’ గారు వచ్చారు. గుర్తున్నారుకదా, ఈ వ్యాసం మొదట్లో మన సద్దాం గారు వీరి రక్తదాన ఉద్యమం ద్వారా స్ఫూర్తిని పొంది తన సేవా జీవితాన్ని మొదలుపెట్టారు.

“తరిమెల” ఇంటిపేరుకు ఒక కథ ఉందండోయ్…

అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు తరిమెల నాగిరెడ్డి గారు. సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, ఆయన తన ఊరి పేరుతోనే ప్రముఖులయ్యారని, మరణానంతరం కూడా తను చేసిన సేవ వల్లనే ప్రజల మధ్య సజీవంగా ఉన్నారన్నది అమరనాథరెడ్డిగారి అనుభవంలో చూసారు. అది మనసులో నాటుకుపోయింది. తరిమెల గ్రామం తన స్వగ్రామం అని గర్వంగా చెప్పుకునే అమరనాథరెడ్డిగారు తన ఇంటిపేరును ‘తరిమెల’గా మార్చుకున్నారు. అదీకాక తను పుట్టిపెరిగిన కుటుంబ వాతావరణం ఆయనకు కమ్యూనిస్ట్ భావజాలం వంటబట్టించింది. అందుకే ఆయన పేదల పక్షపాతి. చిన్నతనం నుంచీ తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తూ అట్టడుగు ప్రజల అవసరాలను, అవస్థలను అర్థం చేసుకున్న మంచి హృదయమున్న వ్యక్తి. అందరూ తనవారన్న భావన ఎంత గొప్పది!

అమరనాథ రెడ్డి గారు సమాజానికి ఏదైనా ఇవ్వాలన్న ఆలోచనతో ప్రాణాల్ని కాపాడే రక్తదానం గురించి ప్రజల్లో అవగాహన కలిగించటం మొదలుపెట్టారు. అదొక ఉద్యమ స్థాయి అందుకుంది. ఆయనతో పాటు, మరెందరినో తనతో నడిపించిన వ్యక్తి ఆయన.  ప్రపంచమంతా డబ్బు, సంపాదన వెనుక పరుగెడుతుంటే తను మాత్రం పుట్టిపెరిగిన గడ్డ మీద మమకారంతో నిస్వార్థంగా ఆపన్నులకు జీవనదానానికి నడుంకట్టారు. అది ఏ డబ్బూ కొనలేని సాయం. ఆయన పనులకు పెద్ద సపోర్ట్ వారి సతీమణి శాంతగారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆమె ఒక మదర్ థెరీసా. ఇంతకంటే గొప్ప ప్రశంస ఏ వ్యక్తికైనా ఏం కావాలి? ఇంటి దగ్గర ఆమె మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించారు.

అమరనాథ రెడ్డి గారు చక్కని రచయిత. నిత్యజీవితంలో ఆయన పరిశీలనలో వచ్చిన సన్నివేశాల్ని, సంఘటనల్ని వివరిస్తూ, వాటిలోని హ్యూమర్ ఎలిమెంట్‌తో జీవితాల్లోని వేదనని తడుముతుంటారు. ఎంతో నిరాడంబరంగా ఉంటూ, తమ రక్తదాన సేవ ద్వారా జీవితాలను కాపాడుకున్న వారి పలకరింపుకే మురిసిపోతుంటారు. ఆయన ప్రారంభించిన రక్తదాన సంస్థకి ‘మానవత’ అనిపేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన అస్తిత్వం ‘మానవత’. ఇరవై ఏడు ఏళ్లుగా ఈ ఉద్యమాన్ని అవిశ్రాంతంగా నడుపుతున్నారు.

2004 సంవత్సరంలో ‘ప్రతిభా రాజీవ్ అవార్డు’ను అందుకున్నారు. అదీ తనతో ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా.

నైసర్గిక కారణాల వలన తమ జిల్లాలో ప్రాణాధారమైన నీటి చుక్కకు కరువైనా రక్తదాతలకి కరువులేదంటారాయన. దానికి కారణం ఆయన మొదలు పెట్టి విస్తరింపచేసిన రక్తదాన వ్యవస్థదే కదా. మూఢనమ్మకాల పైన కూడా ఆయన దృష్టి పెట్టారు. చదువుకున్నవారు, లేనివారు కూడా విశ్లేషణకు అందని గుడ్డి నమ్మకాలను అనుసరించటం చూసి, వారిని విజ్ఞానవంతులను చేసే ప్రయత్నంలో అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ హేతువాదం పట్ల ఒక అవగాహనను కల్పిస్తున్నారు. రక్తదాన ప్రచారంతో పాటు మూఢనమ్మకాలను రూపుమాపే దిశగా ప్రజలకు మార్గదర్శకత్వం చేస్తున్నారు. యువతరంలో చైతన్యం కలిగించేందుకు స్కూళ్లను, కాలేజీలను తన ఉద్యమానికి కేంద్రం చేసుకున్నారు.

ఆ సాయంత్రం శశికళ గారు తన మిత్రబృందంలోని శ్రీను, లక్ష్మిల ఇంటికి తీసుకెళ్లారు. వారిద్దరి ముఖాలు వెలుగుతున్న దీపాల్లా అనిపించాయి. వారి పిల్లలు అదే స్ఫూర్తితో ఉన్నారు. జీవితంలో ఎదురవుతున్న ఛాలెంజ్‌లు ఏవీ కూడా వారి సంతోషాన్ని తగ్గించలేదు. ఒక సానుకూల దృక్పథం ఆ వాతావరణమంతా వ్యాపించి ఉంది. ఇందాక చూసి వచ్చిన రెయిన్‌బో హోం పిల్లలతో పాటు ఇంకా ఇలాటి వారు కదా వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పవలసింది. వీరిని చూస్తే జీవితం పట్ల ప్రేమ కలుగుతుంది ఎవరికైనా. శ్రీను గారు దివ్యాంగుల పట్ల సమాజ వైఖరి మారాలంటారు, తానొక దివ్యాంగుడైన కారణంగా ఎదుర్కొన్న వివక్షలను తలుచుకుంటూ. అదొక్కటే సమాజం పట్ల ఆయనకున్న ఫిర్యాదు. అది మినహా జీవితం అందమైనది అంటారు. చదువు పట్ల అమితమైన గౌరవంతో అధ్యాపక వృత్తిలోకి వచ్చారు. బోధనతో విద్యార్థుల్ని చక్కగా తీర్చిదిద్దటమే తన ఆశయం అంటారు. తనలాగే దివ్యాంగురాలైన లక్ష్మిగారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. పాఠశాల స్థాయి నుంచి సివిల్స్‌కి తయారయ్యే విద్యార్థులతో ఆన్లైన్ పాఠాలతో బిజీగా ఉంటారు. చల్లని ఆ సాయంత్రం వేళ ఆ ఇంటి పెరటి గాలి మమ్మల్ని మంత్రించినట్టు ఏదో తెలియని ఆనందాన్నిచ్చింది. ఇంట్లో వారి మధ్య తిరుగుతున్న గోధుమరంగు పిల్లిపిల్ల మ్యావు మంటూ తన అస్తిత్వాన్ని చెప్పుకుంది. శ్రీను గారు చక్కని పాట పాడారు మాకోసం.

శశికళ గారి మిత్ర బృదంలోని కృష్ణవేణి, శకుంతల గార్లను కూడా కలుసుకున్నాం.

అక్కణ్ణుంచి ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్లాం.  ఐదుగురు గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలకోసం ప్రయత్నించి, ప్రయత్నించి, సఫలం కాక, స్వంతంగా నిలబడాలన్న సంకల్పంతో ఒక చిన్న రెస్టొరెంట్ ను మొదలుపెట్టారు. వారు ఐదుగురూ కూడా మాట, వినికిడి లేని వ్యక్తులు. అయితే ఏం? బ్రతికేందుకు, కొత్త బాటలు వేసేందుకు గుండె నిండా ధైర్యం ఉంటే చాలదా? తమలా ఉద్యోగాన్వేషణలో అలిసిపోయిన వారికి ఒక స్ఫూర్తిగా ఉన్నారు. అనంతపురం సెంటర్‌లో ‘సైన్ విత్ హ్యాండ్స్’ అంటూ వారు నడుపుతున్న రెస్టొరెంట్‌లో నాలుగురకాల చాట్, ఇడ్లీ, దోశె, కాఫీ, టీ తో పాటు పండ్ల రసాలు దొరుకుతాయి. అన్నీ కూడా సరసమైన ధరలకే సుమా. మీరు ఎవరైనా ఎపుడైనా అనంతపురం వెళ్తే ఇక్కడికి తప్పకుండా వెళ్లండి. వారి ప్రయత్నాన్ని అభినందించండి.

అనంతపురం రాష్ట్రంలోనే పెద్దజిల్లా విస్తీర్ణంలో. రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలలాగే వర్షం అతి స్వల్పం. దాని తాలూకు ప్రభావం పంటలపైన, జీవికపైన, జీవితాలపైన స్పష్టంగా ఉంది. ఈ ప్రాంతం ఎందరో గొప్ప వ్యక్తులకు, ఎందరో గొప్పగొప్ప జాతీయ నాయకులకు, ఇంకా ఎన్నో ఉన్నత విద్యా సంస్థలకు కేంద్రం. కోస్తా ప్రాంతపు ఆడంబరం, హడావుడి కనిపించవు. ఎంతో హంబుల్‌గా కనిపించే ఈ పట్టణం అక్కడి వ్యక్తుల్లాగానే గొప్పగా అనిపించింది. సినిమాలు, వార్తాపత్రికలు వంటి మీడియా పుణ్యమాని అవాంఛనీయమైన కారణాలకే సీమ వార్తల్లో ఉంటుంది. అక్కడి రైతుల ఆత్మహత్యలు, నీటి కొరత ఎంతగా ప్రజలని నిస్సత్తువకి గురిచేస్తున్నా ఏ రాజకీయ పార్టీ అనంతపురం అభివృద్ధికి పాటుపడింది లేదు. ఈ వాస్తవం కఠినమైనది.

విశాలమైన జిల్లాలో విశాలమైన మనసులున్నవారు ఎందరో కనిపించారు. వీరిలో సమస్యల పట్ల నిరాశా నిస్పృహలు కాక తోటివారికి ఏదో చెయ్యాలన్న తపన మాత్రమే అనంతంగా కనిపించింది. అది అనంతపురానికి ఒక వరం అనిపిస్తుంది. జీవితం ఎంత విలువైనదో, దానిని ఎంత సంక్షిప్తీకరించుకుని జీవించవచ్చో ఇక్కడివారిని చూస్తే అర్థమవుతుంది.

ఇప్పుడు చెప్పండి, అనంతపురం వైశాల్యంలో మాత్రమే పెద్దది కాదని, అక్కడ వానమబ్బులు కనిపించకపోయినా హరివిల్లులు మాత్రం కనిపిస్తాయని ఒప్పుకుంటారు కదూ. అనంతపురం రమ్మని, ఇంతమంచి అనుభవాన్నిచ్చిన స్నేహితురాలు శశికళకు ధన్యవాదాలతో పాటు ఆ సీమవాసిగా తనకు అభినందనలు కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here