[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
హాస్య లహరి
నవ్వు – అచ్చమైన తెలుగుమాట. నవ్వు అన్న పదంతో మనకు ఎన్నో రకాల పలుకుబడులూ, నుడికారాలూ, సామెతలూ ఉన్నాయి. నవ్వులాట, నవ్వుకోలు, నలుగురూ నవ్విపోతారు, నవ్విన నాపచేనే పండింది, నవ్వు నాలుగు విధాల చేటు.. ఇలా అనేకం. “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు” అంటుంది ఒక భావకవి వాక్కు.
పాపో, బాబో పుట్టాక మనం నేర్పే తొలివిద్య నవ్వడమే. “చి..చీ..” అంటూ బుగ్గలు పుణికేస్తాం. చిటికలు వేసేస్తాం. పాపను నవ్వించే ప్రయత్నంలో ఎన్నో వేషాలు వేస్తాం. వేసి పకపకా నవ్విస్తాం. పెద్దయ్యాక కూడా ఎవరైనా తెలిసినవారు ఎదురైనప్పుడు పలకరించేదీ నవ్వుతోనే. తెలియనివారిని పరిచయం చేసుకునేదీ చిరునవ్వుతోనే. పేరుకు మాత్రమే అది ‘చిరు’ నవ్వు గానీ… అది అచిరకాలం అక్షయంగా కొనసాగాలని కోరుకునే నవ్వు. ఆ నవ్వులోనూ ఎన్నో రకాలు… చిరునవ్వు, పసినవ్వు, ముసిముసి నవ్వు, మురిపెపు నవ్వు, మంచి నవ్వు, మందహాసం, వెకిలి నవ్వు, వెటకారపు నవ్వు, అట్టహాసం, వికటపు నవ్వు, వికటాట్టహాసం.. ఇలా ఎన్నో ఉన్నా ప్రస్తుతం అన్నిరకాల నవ్వులూ తగ్గిపోవడం ఆందోళనను కలిగిస్తోంది.
ఎందుకంటే – నిజమైన నవ్వు మన మనస్సును ఉల్లాసపరుస్తుంది. మనసు మీది బరువుని, ఒత్తిడినీ తగ్గిస్తుంది. తీవ్రతను, వ్యగ్రతను విరిచేస్తుంది. గాంభీర్యాన్ని పలుచబరుస్తుంది. ప్రముఖ హాస్య రచయిత, సినీ దర్శక నిర్మాత, జంధ్యాల గారు చెప్పినట్లు – నవ్వడం ఒక ‘భోగం’; నవ్వించడం ఒక ‘యోగం’, నవ్వలేకపోవడం ఒక ‘రోగం’..!!
వీలౌతుందని నిరూపించింది యువభారతి. ప్రాచీన సాహిత్యం లోని హాస్య విశేషాలను సమీక్షించడమే కాక, ఆధునిక సాహిత్యంలో వెలువడిన ప్రముఖ రచయితల హాస్య రచనలను వివరిస్తూ, వారి 38వ వార్షికోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఉపన్యాస లహరీ కార్యక్రమం ‘హాస్య లహరి’ ద్వారా.
మొక్కపాటి నరసింహశాస్త్రి, భమిడిపాటి రాధాకృష్ణ, మునిమాణిక్యం నరసింహారావు, ముళ్ళపూడి వెంకటరమణ, గోరా శాస్త్రి, శ్రీ రమణ, భానుమతీ రామకృష్ణ, సోమరాజు సుశీల వంటి ప్రముకుల హాస్య రచనల్లో రెండు విధాల హాస్య ప్రవృత్తులు విడివిడిగానూ, కలగలుపు గానూ అనుభవంలోకి వస్తాయి. విశ్వనాథ, బుచ్చిబాబు, శ్రీశ్రీ వంటివారు ‘హాస్య రచయితలు’ గా ప్రసిద్ధులు కాకున్నా వారి రచనల్లో – నవలలు, నాటకాలు, వ్యాసాలూ మొదలైన వాటిలో – విలక్షణ హాస్యం లాస్యం చేస్తూనే ఉంటుంది.
హాస్యరసం మీద సంపూర్ణమైన అవగాహన కలగాలంటే – ఈ క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ చిన్న పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఈ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.