[dropcap]జ[/dropcap]న్మించిన దగ్గర నుండీ నిత్యం మనల్ని అనేక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని పనులు ఎన్నిసార్లు ప్రయత్నించినా పూర్తికావు. కానీ కొన్ని పనులు మాత్రం అప్రయత్నంగానే కలసి వస్తాయి. అలాగే విజయవంతమౌతాయి కూడా. అలాంటప్పుడు మనం విసిగిపోకూడదు. నిరసించిపోరాదు.
ఏది ఏమైనా అర్థంకాని జీవితం గురించి అతిగా ఆలోచించటం, తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటం వ్యర్థమే కదా మరి! మనలో ఉత్సాహం ఉరుకులు, పరుగులు తీయాలంటే జోకులు, చలోక్తులు చదివి తీరాలి మరి! ఈ తరుణంలోనే బ్రహ్మానందంతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం కోసం తక్షణమే మనకు ‘హాస్య తరంగిణి’ అమృతంవలే పనిచేస్తుంది. ‘హాస్యం అమృతం విచారం విషం’. ఈ అమృతాన్ని మీరు సేవించి, అందరికీ పంచండి.
1. గ్రహణ ప్రేమికుడు
డింగరి: ఏరా! ఈ మధ్యన గ్రహణలు అసలు రావడం లేదు. ఎందుకని?
పండరి: అయినా గ్రహణాలను ఒఠి మూఢ నమ్మకాలంటావుగా నువ్వు. వాటితో నీకేం పని?
డింగరి: నా ఆకలిని తీర్చేవి గ్రహణాలేరా! గ్రహణం సమయంలో ఉచితంగా భోజనాలు, బిర్యానీలు పెడతారు కదా! అవి కడుపు నిండా తినొచ్చని!
2. వివాహ వ్యవస్థ
గురువు: మన వివాహ వ్యవస్థ మీద ఒక చమత్కారము చెప్పుము శిష్యా.
శిష్యుడు:
వివాహము వినోదానికి కళ్లెం
ఆనందానికి గొళ్లెం
అదే వివాదాల పెళ్ళాం
3. ధనాధన్
టీచర్: ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు ధనాధన్ అని జవాబు చెప్పాలి, తెలిసిందా?
కిట్టూ: అడగండి సార్! చెప్పేస్తా.
టీచర్: లాఫింగ్ గ్యాస్‍ని కనిపెట్టింది ఎవరు?
కిట్టూ: ధనాధన్ సార్!
4. పంచె – కండువా
నాయకుడు: నువ్వేమిటయ్యా? ఇలా టవల్ కట్టుకుని, భుజంపై కండువా వేసుకొచ్చావ్?
కార్యకర్త: అయ్యా! మీరు నాకు కేవలం కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఒకవేళ మీరు పంచె ఇస్తే అది కట్టుకుని వచ్చేవాడిని.
5. సీన్లు లాగటం
డైరక్టర్: మరి నువ్వు మా నాటకంలో పనిచేయాలంటే ‘సీన్లు లాగటం’లో అనుభవం ఉండాలి, తెలుసా?
చిట్టిరాజు: రోజూ నేనే మా ఆవిడ బట్టలన్నీ దణ్ణెం మీద ఆరేస్తున్నాను సార్!
6. సాహితీ దిగ్గజం
అచ్చకవి: ఇదేమిటయ్యా? కవి సమ్మేళనానికి ఇలా ఏనుగు మీద ఎక్కి వచ్చావు?
బుచ్చకవి: అయ్యా, నేను పెద్ద సాహితీ దిగ్గజాన్ని. అందుకే ఇలా వచ్చా!
7. రౌండ్ టేబుల్
కార్యకర్త: సార్! మీరు ఇంత అర్జెంట్‍గా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయకండి.
నాయకుడు: ఎందుకని?
కార్యకర్త: అసలు మన ఆఫీసులో రౌండ్ టేబుల్ లేదు కదా!
8. శుంఠలు
శిష్యుడు: గురువుగారు! శుంఠలు అంటే ఎవరో కొంచెం వివరంగా తెలియజేస్తారా?
గురువు: వంటలు చేయటం రాని వాళ్ళనే శుంఠలంటారు శుంఠా!
శిష్యుడు: అయితే రోజూ నేనే కదా మీకు వంట చేసి పెడుతున్నాను. మరి మీకు వంట రాదు కదా! అంటే మీరే..
9. కాస్ట్ నో బార్
సుబ్బరాజు: కాస్ట్ నో బార్ అంటే అర్థం తెలుసా నీకు?
గంగరాజు: ఏ కాస్ట్ వారైనా బారుకు వెళ్ళి మత్తుగా మద్యాన్ని సేవించవచ్చునని అర్థం.
10. బీహార్‍గ్రామ్
వెంగళప్ప: నాకు ఒక కిలో బీహార్‍గ్రామ్ ఇవ్వండి.
షాప్ వాడు: అసలు అలాంటి గ్రామ్ లేదయ్యా.
వెంగళప్ప: మరి ఇప్పుడే కదా ఆయనకు బెంగాల్‍గ్రామ్ ఇచ్చారు. అలాగే బీహార్‍గ్రామ్ కూడా నాకు ఇవ్వండి.
(మళ్ళీ కలుద్దాం)