Site icon Sanchika

హాస్య తరంగిణి-2

[dropcap]జ[/dropcap]న్మించిన దగ్గర నుండీ నిత్యం మనల్ని అనేక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని పనులు ఎన్నిసార్లు ప్రయత్నించినా పూర్తికావు. కానీ కొన్ని పనులు మాత్రం అప్రయత్నంగానే కలసి వస్తాయి. అలాగే విజయవంతమౌతాయి కూడా. అలాంటప్పుడు మనం విసిగిపోకూడదు. నిరసించిపోరాదు.

ఏది ఏమైనా అర్థంకాని జీవితం గురించి అతిగా ఆలోచించటం, తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటం వ్యర్థమే కదా మరి! మనలో ఉత్సాహం ఉరుకులు, పరుగులు తీయాలంటే జోకులు, చలోక్తులు చదివి తీరాలి మరి! ఈ తరుణంలోనే బ్రహ్మానందంతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం కోసం తక్షణమే మనకు ‘హాస్య తరంగిణి’ అమృతంవలే పనిచేస్తుంది. ‘హాస్యం అమృతం విచారం విషం’. ఈ అమృతాన్ని మీరు సేవించి, అందరికీ పంచండి.

11. విల్లా విలాపం

ధీరజ్: అదేంటిరా? మొన్నటి వరకూ హాయిగా విశాలమైన విల్లాలో ఉండేవాడివి. మళ్ళీ ఇలా చిన్న ఇల్లు కొన్నావేమిటి?

మనోజ్: విల్లా విశాలంగా ఉందని, అటు చుట్టాలు, ఇటు స్నేహితులూ నెలల తరబడి తిష్ట వేస్తున్నారురా! అందుకనే.

12. ఆర్గానిక్ యూత్

అనిల్: వాడేంటి? ఎప్పుడు చూసినా ఆర్గానిక్ యూత్ అని గొప్పలు చెప్పుకుంటాడు?

ప్రవీణ్: ఓ అదా! వాడిలో ఏ మాత్రం కల్తీ లేదట. అదే వాడి బడాయి.

13. బావ – బామ్మర్ది

బామ్మర్ది: బావా! మొత్తానికి నువ్వు బంగారు ఆభరణాలు అద్దెకిచ్చే బిజినెస్ చేస్తున్నందుకు అభినందనలు. మరి తీసుకున్న ఆభరణాలు వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే ఏం చేస్తావ్?

బావ: వాళ్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా నాకే లాభం. అవి రోల్డ్ గోల్డువే కదా!

14. చెప్పులకు ప్రాణం

నందు: తాతయ్యా! నువ్వు అన్నీ అబద్ధాలే చెప్తున్నావు.

తాతయ్య: నేనెప్పుడు చెప్పానురా?

నందు: చెప్పులకు ప్రాణం ఉండదని చెప్పావా, లేదా?

తాతయ్య: ఔను! చెప్పాను.

నందు: ఇక్కడ చూడు, నా కొత్త చెప్పులు ఎలా కొరికేశాయో నన్ను.

15. జోకులు పండాలంటే

జోకుబాబు: స్వామీ! నేను చెప్పిన జోకులు బొత్తిగా పండటం లేదంటున్నారు జనాలు. దీనికి నేనేం చేయాలి?

నవ్వుల స్వామి: నీకు జోకు చెప్పి ఒక పండును కూడా వారికి ఇస్తే అప్పుడు జోకులు బాగా పండుతాయిరా!

16. Passive Smoker

Doctor: (At a medical checkup) Are you a smoker?

Patient: No, I am not a smoker. But I am a regular passive smoker.

17. పోస్ట్ బాక్స్

ప్రభు: ఒరేయ్! నీ పెళ్ళికి కనీసం వెడ్డింగ్ కార్డు కూడా ఇవ్వనే లేదు. ఇస్తే మేము వచ్చేస్తామనా?

కిషన్: అదేం కాదురా! వెడ్డింగ్ కార్డు పోస్టు చేద్దామంటే పోస్టు బాక్సులో పట్టలేదురా!

ప్రభు: అంత గ్రాండ్‌గా చేసుకున్నావా పెళ్ళి?

కిషన్: లేదురా! కేవలం వెడ్డింగ్ కార్డు మాత్రమే పెద్దదిగా వేయించి, పెళ్ళి సింపుల్‍గా చేసుకున్నానులే!

18. పించన్ల జాతర

ఉమాపతి: ఇదేమిటి? ఇక్కడ కాఫీ హోటళ్ళు వెలిశాయి, డాక్టర్లు సెలైన్ బాటిళ్ళతో తిరుగుతున్నారు?

బిక్షపతి: ఈ రోజు పించన్లు ఇస్తున్నారు కదా!

19. కోటీశ్వరుడు

నాగబాబు: వీడెవడురా? ఎప్పుడూ చూసినా అండర్‍వేర్ వేసుకుని తిరుగుతున్నాడు?

సూరిబాబు: వాడు కోటీశ్వరుడు, తెలుసా?

నాగబాబు: మరి అలా బిచ్చగాడిలా ఉన్నాడేమిటి?

సూరిబాబు: కోటి రూపాయలు అప్పుజేసి, ఇల్లు కొన్నాడులే! అప్పటి నుండీ అలా అయిపోయాడు.

20. భావకవిత్వం

మాస్టారు: అమ్మాయ్! అనసూయ, భావకవిత్వం గూర్చి తెలియజేయి.

అనసూయ:

మా బావ అందగాడు

నా బావ ఐస్‍క్రీం కొనిచ్చాడు

నా బావ పీచు మిఠాయి కూడా

తినిపిచ్చాడు మాస్టారూ.

మాస్టారు: అయితే రేపు వచ్చేటప్పుడు మీ నాన్నగార్ని స్కూలుకి తీసుకురా తల్లీ.

అనసూయ: ఎందుకు మాస్టారూ?

మాస్టారు: వెంటనే నీకు మీ బావతో పెళ్ళి చేసెయమ్మని చెబుదామని.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version