[dropcap]జ[/dropcap]న్మించిన దగ్గర నుండీ నిత్యం మనల్ని అనేక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని పనులు ఎన్నిసార్లు ప్రయత్నించినా పూర్తికావు. కానీ కొన్ని పనులు మాత్రం అప్రయత్నంగానే కలసి వస్తాయి. అలాగే విజయవంతమౌతాయి కూడా. అలాంటప్పుడు మనం విసిగిపోకూడదు. నిరసించిపోరాదు.
ఏది ఏమైనా అర్థంకాని జీవితం గురించి అతిగా ఆలోచించటం, తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటం వ్యర్థమే కదా మరి! మనలో ఉత్సాహం ఉరుకులు, పరుగులు తీయాలంటే జోకులు, చలోక్తులు చదివి తీరాలి మరి! ఈ తరుణంలోనే బ్రహ్మానందంతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం కోసం తక్షణమే మనకు ‘హాస్య తరంగిణి’ అమృతంవలే పనిచేస్తుంది. ‘హాస్యం అమృతం విచారం విషం’. ఈ అమృతాన్ని మీరు సేవించి, అందరికీ పంచండి.
51. డ్రామా డ్రస్ రిహార్సల్స్
తమ్మయ్య: అరే! నువ్వు ఇంట్లో కూడా డ్రామా డ్రస్సుల్లో రిహార్సల్స్ చేస్తున్నావే!
తిమ్మయ్య: ఇది డ్రామా డ్రస్ రిహార్సల్స్ కాదు నాయనా! నా ఇంటికి సున్నం వేస్తున్నా! నా ఖర్మ బాబు!
52. కరోనా మటాష్
కైలాసం : కోయ దొరా! నా జాతకం ఎలా ఉంది? (చేయి చూపిస్తూ)
కోయదొర: చేతులు కడిగి, కడిగి నీకు కరోనా రాలేదు కానీ దరిద్రం వచ్చేసింది నీకు. నీ అరచేతుల్లోని రేఖలన్నీ మటాష్ అయిపోయాయి. నీకు ఉద్యోగం రాదు, పెళ్ళి కూడా కాదు.
కైలాసం: అయితే నా వంద నాకిచ్చేయ్ దొరా!
53. లిక్విడ్ క్యాష్
మమ్మీ: బంటీ! ఇదేమిటిరా! డబ్బుల్ని ఇలా నీళ్లల్లో పెట్టావ్?
బంటీ: మమ్మీ! నిన్న నువ్వే కదా మనకు ‘లిక్విడ్ క్యాష్’ కాడా కావాలని చెప్పావు. అందుకనే ఇలా చేశా! నన్ను వెరీగుడ్ బాయ్ అని చెప్పమ్మా!
54. శాంతి మంత్రాలు
నాయకుడు: ఈయనెవరయ్యా? చర్చల కోసం వచ్చి మంత్రాలు చదువుతున్నాడు?
కార్యకర్త: ఇవి మామూలు మంత్రాలు కావు సార్! ఇవి శాంతి మంత్రాలు!
55. కలం పేరు
స్వప్పశ్రీ: నా ఖర్మకాలి, బుద్ధి గడ్డితిని వెరైటీగా ఉంటుందని నా కలం పేరుగా అమ్మాయి పేరు పెట్టుకుని అనుభవిస్తున్నానురా.
రామరుద్రయ్య: ఇంతకీ ఏమైందిరా?
స్వప్పశ్రీ: నేనే అమ్మాయిననుకొని లవ్ లెటర్లు టన్నులకొద్దీ రాసిపడేస్తున్నారురా అబ్బాయిలు.
56. ప్యారాచూట్ గొడుగులు
కమ్యూటర్: ఇదేమిటయ్యా! ఎమర్జన్సీ లాండింగ్‌లో ప్యారాచూట్లకి బదులు గొడుగు లిస్తున్నారేమిటి?
పైలట్: మా విమానాలు లాస్‌లో నడుస్తున్నాయని ముందే చెప్పాం కదా! పైగా టికెట్ రేటు తక్కువ!
57. నో సీట్
ప్రిన్సిపల్: మీరు మరీ బక్కగా ఉన్నారు! మీ అబ్బాయికి మా స్కూల్లో సీట్ ఇవ్వటం కుదరదు!
పేరెంట్: నేను బక్కగా ఉంటే మా అబ్బాయికి సీటెందుకు ఇవ్వరూ?
ప్రిన్సిపల్: మరి రోజూ వాడి స్క్లూ బ్యాగులు మీరే కదా మొయ్యాలి.
58. షుగర్ ఫ్రీ
డింగరి: అర కిలో స్వీట్ ఇవ్వండి సార్!
షాప్ వాడు: ఇదిగో మీరడిగిన స్వీటు.
డింగరి: మరి దీనితోపాటు షుగర్ ఫ్రీగా ఇవ్వలేదేమిటి?
షాప్ వాడు: నేనేమైనా పిచ్చివాడినా! అయినా నీకు షుగర్ ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి?
డింగరి: మీరే కదా! షుగర్ ఫ్రీ స్వీట్లు అని బోర్డు పెట్టారు!
59. పాన్ ఇండియా
ప్రొడ్యూసర్: ఏమయ్యా డైరక్టరూ! సినిమా ఏంటి ఇలా తీశావ్?
డైరక్టర్: ఎలా తీశాను?
ప్రొడ్యూసర్: ఏందీ? ఈ హీరో పాన్లు తింటూ, ఉమ్ములేసుకుంటూ ఇండియా అంతా పళ్లు ఇకిలించుకుంటూ ఇకారంగా తిరుగుతున్నాడు?
డైరెక్టర్: మరి పాన్ ఇండియా సినిమా తియ్యమన్నావుగా! తీశాను అంతే.
60. రైలు ప్రయాణం
వెంకప్ప: నాకు రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం తెలుసా?
నూకరాజు: ఎందుకు?
వెంకప్ప: ప్రయాణంలో హాయిగా నిద్రపోతాను.
నూకరాజు: అలాగని రోజూ రైల్లో ప్రయాణం చేస్తావా?
వెంకప్ప: మా ఇంట్లో ఫ్యాన్ ఉంది కదా! దానికి సౌండ్ కూడా రైలు సౌండే కదా!
(మళ్ళీ కలుద్దాం)