హాస్య తరంగిణి-8

0
2

[dropcap]జ[/dropcap]న్మించిన దగ్గర నుండీ నిత్యం మనల్ని అనేక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని పనులు ఎన్నిసార్లు ప్రయత్నించినా పూర్తికావు. కానీ కొన్ని పనులు మాత్రం అప్రయత్నంగానే కలసి వస్తాయి. అలాగే విజయవంతమౌతాయి కూడా. అలాంటప్పుడు మనం విసిగిపోకూడదు. నిరసించిపోరాదు.

ఏది ఏమైనా అర్థంకాని జీవితం గురించి అతిగా ఆలోచించటం, తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటం వ్యర్థమే కదా మరి! మనలో ఉత్సాహం ఉరుకులు, పరుగులు తీయాలంటే జోకులు, చలోక్తులు చదివి తీరాలి మరి! ఈ తరుణంలోనే బ్రహ్మానందంతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం కోసం తక్షణమే మనకు ‘హాస్య తరంగిణి’ అమృతంవలే పనిచేస్తుంది. ‘హాస్యం అమృతం విచారం విషం’. ఈ అమృతాన్ని మీరు సేవించి, అందరికీ పంచండి.

71. శ్రీఖండ్

గురువు: శిష్యా ‘ఖండము’ అనే పదముతో ఏవైనా వాక్యమును జెప్పుము.

శిష్యుడు: శ్రీఖండ్ తినుటకై ఒక తిండిపోతు ‘ఉత్తరాఖండ్’ వెళ్లెను గురువుగారు.

72. మారు వడ్డన

బాలాజీ: అదేమిటయ్యా స్వీట్లూ, హాట్లూ మారు వడ్డించకుండా ఒకసారి చూపెట్టి మరీ తీసుకెళ్ళి పోతున్నవ్!

గోవిందం: పంక్తిలో వారందరికీ స్వీటూ హాటూ మళ్ళీ ఒకసారి చూపించండి అని మా ఆవిడగారు చెప్పినారు సార్!

73. నీరస గళం

పిచ్చయ్య: ఎందుకని నేను సినిమా డబ్బింగ్‌కి పనికి రానంటున్నారు?

డైరక్టర్: నీది నీరస గళం. నువ్వు రాజకీయాలలో రాణిస్తావు.

74. మోడరన్ టి.వి.

అమ్మమ్మ: ఒసేయ్ మనవరాలా! మన టి.వి. పాడైపోయిందా?

చిట్టి: పాడైపోవటం ఏమిటి? ఇది లేటెస్ట్ మోడరన్ టి.వి. అమ్మమ్మా!

అమ్మమ్మ: మరి! టివిలోంచి మాటలు, పాటలు రాకుండా, మన సోఫాల వెనక నున్న స్పీకర్ల నుండీ వస్తున్నాయేమిటి? ఎంతైనా మా కాలంలోని టి.వీలే నయం.

75. వ్యసనం

గురువు: వ్యసనములు ఎన్నియో చెప్పుము శిష్యా?

శిష్యుడు: ఎనిమిది గురుగారూ!

గురువు: ఒరేయ్ శుంఠా! వ్యసనములు ఏడే కదా! ఈ ఎనిమిదవది ఏమిటిరా?

శిష్యుడు: సెల్ ఫోన్ గురూజీ.

76. సెల్ చూపులు

మామాజీ: కాబోయే పెళ్లి కూతురా! మా అబ్బాయి నచ్చాడా?

అమ్మాయి: పెళ్ళి చూపుల్లోనే సెల్లు చూస్తూ, సొల్లు కారుస్తూ అసలు నన్నే చూడలేదు. ఇక నాతో కాపురం ఏం చేస్తాడు మీ అబ్బాయి?

77. ఏకాంబరం – దిగంబరం

టీచర్: అదేమిటిరా! రోజూ ఒకటే డ్రస్సుతో స్కూలుకొస్తున్నావ్? నీకు వేరొక డ్రస్సులేదా?

ఏకాంబరం: సార్! నా పేరు ఏకాంబరం కదా! అందుకనే ఇలా వస్తున్నాను.

టీచర్: ఇంకా నయం! నీ పేరు దిగంబరం అని పెట్టలేదు!

ఏకాంబరం: సార్! మా తమ్ముడి పేరు దిగంబరం. వాడు వచ్చే సంవత్సరంలో మన స్కూల్లోనే జాయిన్ అవుతున్నాడు.

78. కరకట్టలు

డాక్టర్: కాలనీలో పర్మిషన్ అడిగితే కాలవగట్టున కిడ్నీ హాస్పటల్ కట్టమంటారెందుకు సార్?

అధికారి: ఈ మధ్య తరచుగా వరదలు వస్తున్నాయ్ కదా ఇక్కడ మీరు కిడ్నీ హాస్పటల్ కడితే ఆ వచ్చే కిడ్నీ రాళ్లతో కరకట్టలు ఈజీగా కట్టేయచ్చన్నది మా ప్లాన్!

79. అల్ బిత్తరగాడు

గురువు: అల్ బిత్తర్ అంటే ఎవరురా?

శేషు: అత్తరు రాచుకొని కూడా, అయోమయంతో బిత్తర చూపులు చూసేవాడినే ఆల్ బిత్తర్ గాడు అంటారు స్వామి.

80. నిఘంటువు ఫ్రీ

అప్పన్న: ఒరేయ్! ఈ సినిమా టైటిల్ అర్థమవటం లేదు. ఈ సినిమా చూద్దాం అంటామేమిటిరా?

చిన్నబాబు: టైటిలే కాదురా పాటలు, మాటలూ కూడా అర్థం కావట! అవి అర్థం చేసుకోటానికే ఒక నిఘంటువుని ఉచితంగా ఇస్తున్నారు. అది తీసుకొని హాయిగా ఏసీలో నిద్రపోదాం!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here