హాస్య తరంగిణి-9

0
2

[dropcap]జ[/dropcap]న్మించిన దగ్గర నుండీ నిత్యం మనల్ని అనేక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని పనులు ఎన్నిసార్లు ప్రయత్నించినా పూర్తికావు. కానీ కొన్ని పనులు మాత్రం అప్రయత్నంగానే కలసి వస్తాయి. అలాగే విజయవంతమౌతాయి కూడా. అలాంటప్పుడు మనం విసిగిపోకూడదు. నిరసించిపోరాదు.

ఏది ఏమైనా అర్థంకాని జీవితం గురించి అతిగా ఆలోచించటం, తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటం వ్యర్థమే కదా మరి! మనలో ఉత్సాహం ఉరుకులు, పరుగులు తీయాలంటే జోకులు, చలోక్తులు చదివి తీరాలి మరి! ఈ తరుణంలోనే బ్రహ్మానందంతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం కోసం తక్షణమే మనకు ‘హాస్య తరంగిణి’ అమృతంవలే పనిచేస్తుంది. ‘హాస్యం అమృతం విచారం విషం’. ఈ అమృతాన్ని మీరు సేవించి, అందరికీ పంచండి.

81. కొత్త సామెత

టీచర్: పెద్దవాళ్లతో సహా చిన్నపిల్లలు కూడా ఒకే బొమ్మతో ఆడుకుంటారు. ఆ బొమ్మ పేరేమిటిరా?

వినోద్: సెల్ ఫోన్ సార్!

82. ఛానల్ చంటీ

కిశోర్: అతనెవరు? ఛానల్ చంటీ అని పిలుస్తున్నారు? అతను టీవీ ఛానల్ యాంకరా?

నరశ్: అతను రచ్చ రచ్చ ప్రోగ్రాంలో అరుస్తూ, పగలూ రాత్రీ ఛానల్ లోనే పడుకుంటాడు లే!

83. శిల్పం

ఎడిటర్: ఇదేమిటయ్యా! ఈ కథ మధ్యలో శిల్పం బొమ్మ వేశావు ఎందుకు? ఇది కథకు సంబంధించినదా?

కొత్త కవి: కథలో శిల్పం తప్పనిసరిగా ఉండాలని మీరే చెప్పారు కదా సార్!

84. సహజ నటన

అరవింద్: అదేమిటి? ఆ సినిమా డైరక్టర్ అలా గోదావరిలో కొట్టుకు పోతున్నాడు?

సుధాకర్: హీరోగారికి సహజంగా ఎలా దూకాలో చూపెట్టాడు అంతే!

85. బుట్ట

ఆశమ్మ: అదేమిటే పెద్ద బుట్ట కొన్నావెందుకు?

బోశమ్మ: పెళ్ళైన కొత్తలోనే మీ ఆయన్ని బొట్టలో వేసుకోవాలని మా అమ్మ చెప్పిందిలే!

86. ప్రెషర్

మేనేజర్: చూడు మిష్టర్! ఈ ఉద్యోగం నీకు ఇవ్వాలంటే నువ్వు తప్పనిసరిగా ఫ్రెషర్‌వై ఉండాలి! తెలిసిందా?

టెక్కీ: యస్. సార్! నేను చాలా ఫ్రెష్‌గా ఉన్నాను. ఇప్పుడే వాష్ రూమ్ కెళ్ళి వచ్చాను.

87. అంట్లు తోమే మిషన్

మంత్రి: సెగట్రీ! వాళ్లంతా ఎవరయ్యా? కేకలు, నినాదాలు చేసుకుంటూ మన సెక్రటేరియట్ వైపు వస్తున్నారు?

సెగట్రీ: సార్! వాళ్లంతా పని మనుషులు. ఈ మధ్య అంట్లూ తోమే మిషన్లు వచ్చి, బొత్తిగా వాళ్లకు పనిలేకుండా పోయింది!

మంత్రి: దానికి మనమేం చేస్తాం?

సెగట్రీ: వెంటనే సామాన్లు తోమే మిషన్లు రద్దు చేయాలి – పని మనుషులకు పని కల్పించాలని ధర్నా చేస్తున్నారు.

88. చీపురు

టీచర్: ఒరేయ్ బాలాజీ! చీపురు కట్ట యొక్క మూడు ఉపయోగములను తెల్పుము.

బాలాజీ:  ఒకటి, మనము ఇల్లు ఊడ్చుకొనవచ్చును. రెండు, దోశల వేసే ముందు పొయ్యి మీద పెనాన్ని క్లీన్ చెయ్యవచ్చును, మూడు, అల్లరి చేస్తే కొట్టవచ్చును సార్.

89. ఐటికారిడార్

విశాల్: ఒరేయ్! ఈ మధ్య ఐ.టి. కారిడార్ గురించి చాలా చెపుతున్నారు. అసలు ఐ.టి.కారిడార్ అంటే ఏంటిరా?

విక్రాంత్: మన ఇంటి ముందున్న కారిడార్లో ఒక కంప్యూటర్‌ని పెట్టుకొని పనిచేయటాన్నే ఐ.టి.కారిడార్ అంటారురా!

90. ఆత్మ సీత

మాష్టారు: (పిక్నిక్ పార్టీలో) పిల్లల్లారా! మీరంతా దాదాపు గంటసేపు వ్యాయామం చేసి అలసిపోయాక హాయిగా కడుపునిండా పులిహోర తిన్నారుగా! ఇప్పటికైనా మీ ఆత్మారాముడు శాంతించాడా?

సత్తిబాబు: మాష్టారు! అబ్బాయిలకు ఆత్మా రామముడుంటాడు. అదే అమ్మాయిలకైతే ఆత్మ సీత ఉంటుంది. సార్! కొంచం వాక్యాన్ని రిపేరింగ్ చేసి చెప్పండి మరి!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here