Site icon Sanchika

హాస్యరంజని-11

[dropcap]వి[/dropcap]షయ తీవ్రతను తగ్గించేది విషాన్ని సైతం అమృతంగా మార్చేది ‘హాస్యరసం’. ఇది మనందరికీ అవసరం. ఆరోగ్యానికి హాస్యమే ఆహారం. ఆరోగ్యమే మహా సంపద. ‘సాహిత్య శ్రీ’ కొండూరి కాశీవిశ్వేశ్వరరావు గారు అందిస్తున్న హాస్యరంజని (నవ్వుల శతకం) ఆస్వాదించండి.

101. పేరంటం

అమ్మ: మనది సంస్కృతి, సాంప్రదాయాలు గల దేశం. ఒరేయ్ బాబు చదువుతో పాటు, వీటిని గూర్చి కూడా తెలుసుకోవాలిరా.

బాబు: నాకు సాంప్రదాయాల గురించి బాగా తెలుసమ్మా.

అమ్మ: అయితే పేరంటం అంటే ఏమిటో చెప్పు చూద్దాం.

బాబు: స్కూలులో జరిగే పేరెంట్స్ మీటింగ్‌నే పేరంటం అంటారమ్మా!

102. దొంగవేషం

సీతారామ్: మిమ్మల్ని కుక్క కరిచిందటగా!

అవతారం: ఔను! కరిచింది మా కుక్కే.

సీతారామ్: అయినా కుక్కకి రోజూ అన్నం మీరే పెడుతున్నారు కదా! మరి ఎందుకు కరిచింది?

అవతారం: నా ఉప్పు తింటోంది కదా! ఈ కుక్కకి అసలు నా మీద విశ్వాసం ఉందో లేదోనని మారువేషం వేసుకొని ఇంటికొచ్చాను. అంతే! కుక్క కరిచింది.

సీతారామ్: ఇంతకీ ఏ వేషం వేశారేమిటి?

అవతారం: దొంగవేషం వేశా! కుక్కకి దొరికిపోయా, అంతా నా ఖర్మ!

103. జోక్స్ జంక్షన్

నాగబాబు: ఏంటిరా హఠాత్తుగా హనుమాన్ జంక్షన్‌కి మకాం మార్చేస్తున్నావంట! ఎందుకు?

హరిబాబు: జోకులు ఇంకా బాగా రాయాలంటే హనుమాన్ జంక్షన్ – జోక్స్ జంక్షన్‍గా కలిసొస్తుందని ‘వాస్తుశ్రీ’ వామనశర్మగారు చెప్పారురా!

104. మేధావి

రామయ్య: మీ అబ్బాయి మేధావి అని ఎలా చెప్పగలవు?

కృష్ణయ్య: వాడు ఒక్క నిమిషంలో గ్యాస్ సబ్సిడీ గురించి అర్థమయ్యేలా చెప్పేశాడు తెలుసా!

105. హైటెక్

టీచర్: ‘ఈతగింజ ఇచ్చి, తాటిగింజ లాగుట’ అనే చమత్కారమును ఈనాటి హైటెక్‍లో ఏమంటారో చెప్పండి చూద్దాం?

ఆకాశ్: చాక్లెట్ ఇచ్చి, కట్లెట్ కొట్టేసినట్లు.

106. బి.పి.

రోగనాథ్: డాక్టర్! నాకు బి.పి. ఉందా?

డాక్టర్: అసలు నీ బాడీలో రక్తమే లేదు. ఇక బి.పి. ఎక్కడిది?

107. పైపైచ్చు

అధికారి: ఇదేమిటయ్యా? ఆఫీసులో కూడా హెల్మెట్ పెట్టుకుని పని చేస్తున్నావు?

భయరాజు: ఈ పాత భవనం ఎప్పుడైనా కూలిపోవచ్చునని! పైగా రోజూ పైపెచ్చులు ఊడి పడుతున్నాయి సార్!

108.  నరకమే స్వర్గం

అనుమాన్: స్వామీ! నాకు మళ్ళీ నరకాన్ని ప్రసాదించు.

విష్ణుమూర్తి: నరక బాధలు పడలేకే కదా, స్వర్గానికి పంపించమని వేడుకున్నావు! స్వర్గం బాగుంది కదా! హాయిగా అనుభవించు.

అనుమాన్: ఈ స్వర్గంలో కష్టాలు లేనే లేవు. నాతో మాట్లాడే వాళ్లే కరువయ్యారు! నా నరకంలోనే నాకు స్వర్గముంది స్వామీ. నాకు నరకాన్ని ప్రసాదించు స్వామీ!

విష్ణుమూర్తి: అభీష్ట సిద్ధిరస్తు.

(సమాప్తం)

Exit mobile version