Site icon Sanchika

హాస్యరంజని-4

[dropcap]వి[/dropcap]షయ తీవ్రతను తగ్గించేది విషాన్ని సైతం అమృతంగా మార్చేది ‘హాస్యరసం’. ఇది మనందరికీ అవసరం. ఆరోగ్యానికి హాస్యమే ఆహారం. ఆరోగ్యమే మహా సంపద. ‘సాహిత్య శ్రీ’ కొండూరి కాశీవిశ్వేశ్వరరావు గారు అందిస్తున్న హాస్యరంజని (నవ్వుల శతకం) ఆస్వాదించండి.

31. దెయ్యం కథలు

చిన్న: ఘోస్ట్ రైటర్ అంటే ఎవరో నీకు తెలుసా?

కన్న: తెలుసు! దెయ్యం కథలు వ్రాస్తాడు.

32. కామెడీ

డైరక్టర్: అసలు నీకు కామెడీ అంటే తెలుసా?

కమెడియన్: కామెడీలో కింగ్‍ని. నాకు తెలుసా అని అడుగుతువా?

డైరక్టర్: నువు కింగ్‌వా, క్వీన్‍వా అని అడగలేదు. అసలు కామెడీ అంటే ఏమిటి?

కమెడియన్: లుంగీ కట్టుకుని శీర్షాసనం వేయటమే కదా, కామెడీ అంటే!

33. డొనేషన్

రాయుడు: ఇదేమిటయ్యా! ఇలా అండర్‍వేర్ వేసుకుని రోడ్లపై తిరుగుతున్నావ్?

పద్మనాభం: డొనేషన్ ఇచ్చిన దాత పేరు ప్రచారం కోసం వస్తువల మీద రాయించమన్నారు కదా!

34. పచ్చి పచ్చిగా

రాము: ఆ రవితేజ ఎందుకని పచ్చి పచ్చిగా మాట్లాడుతున్నాడు?

శీను: ఓ అదా! వాడు పచ్చి కూరలు బాగా తింటున్నాడులే!

35. ఒకే గొడుగు

శ్యామల: అదేమిటీ? ఒకే గొడుగులో తన కుటుంబాన్నంతా వర్షంలో తడుపుకుంటూ వెళుతున్నాడు కుటుంబరాజు?

విమల: ఓ అదా! ఒకే గొడుగులో తన కుటుంబం నడుస్తుందని మనకి చెప్పడం కోసమే!

36. బోర్

సూరజ్: అసలు నాకు బోర్ కొట్టనే కొట్టదు అంటావు. అదెలా సాధ్యం?

ధీరజ్: మేము రోజూ బోరు బావులు తవ్వుతూ ఉంటాం కదా!

37. అసమ్మతి రాగం

గురువు: ఇదేం రాగం శిష్యా? ఈ రాగం కొత్తగానూ, విచిత్రంగానూ ఉందే!

శిష్యుడు: ఇదే అసమ్మతి రాగం గురువు గారూ! ఈ రాగం రాజకీయంలో పనికి వస్తుంది.

38. పరిశోధనలు

మూర్తి: బావగారూ! మా అమ్మాయిని మీ అబ్బాయికిచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నాం. మరి మీ అభిప్రాయం చెప్పండి.

శాస్త్రి: మా అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు కదా!

మూర్తి: ఇంతకూ ఏం చదువుతున్నాడు?

శాస్త్రి: కరెంట్ బిల్లుల మీద పరిశోధనలు చేస్తున్నాడు.

మూర్తి: అయితే ఇప్పట్లో ఆ పరిశోధనలు పూర్తి కావు, మీ అబ్బాయి చదువూ పూర్తి కాదు.

శాస్త్రి: అయితే ఏమంటారు?

మూర్తి: ఇంకొక సంబంధం చూసుకుంటాము అని అంటాను! వస్తాను శెలవ్.

39. చలిమంట

గురువు: నీకు నువ్వే అమాయకుడను అని ఎలా చెప్పుకుంటావు?

శిష్యుడు: చలిమంటలో చలి ఉంటుందని, ఎండాకాలం చలిమంట వేసుకున్నాను గురువు గారూ!

40. శివకేన్

తాతయ్య: ఒరేయ్ మనా! ఇంత మండు వేసవి కాలంలో కూడా ఈ గాలివాన ఏమిటిరా?

మనవడు: తాతయ్యా! ఇది ‘శివకేన్’ అట. అందుకే ఈ వర్షాలు.

తాతయ్య: ఇంతకూ ఈ శివకేన్ ఏమిటిరా?

మనవడు: తాతయ్యా! నువ్వు చాలా పెద్దవాడివై పోయావు. ఏ విషయమూ నీకు త్వరగా అర్థం కాదులే!

తాతయ్య: అసలు ఈ శివకేన్ అంటే ఏమిటో చెప్పరా!

మనవడు: హరికేన్ లాంటిదే ఈ ‘శివకేన్’.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version