Site icon Sanchika

హాస్యరంజని-5

[dropcap]వి[/dropcap]షయ తీవ్రతను తగ్గించేది విషాన్ని సైతం అమృతంగా మార్చేది ‘హాస్యరసం’. ఇది మనందరికీ అవసరం. ఆరోగ్యానికి హాస్యమే ఆహారం. ఆరోగ్యమే మహా సంపద. ‘సాహిత్య శ్రీ’ కొండూరి కాశీవిశ్వేశ్వరరావు గారు అందిస్తున్న హాస్యరంజని (నవ్వుల శతకం) ఆస్వాదించండి.

41. ఓపెన్ హార్ట్

తమాషా రోగి: నాకు ఓపెన్ హార్ట్ చేయండి.

ప్రోగ్రామర్: ఇది టి.వి. ఛానల్ బాబూ! ఇక్కడ చెయ్యరు.

తమాషా రోగి: మీరే కదా ‘ఓపెన్ హార్ట్’కి స్వాగతం అని ఫోను చేసి మరీ చెప్పారు.

ప్రోగ్రామర్: ఇది మా ప్రోగ్రామ్ పేరు.

తమాషా రోగి: అయితే! ఇప్పుడు నేనేమి చెయ్యాలి?

ప్రోగ్రామర్: వెంటనే మీరు ఆసుపత్రికి వెళ్ళి ఓపెన్ హార్ట్ చేయించుకోండి.

42. మ్యూజిక్

బామ్మ: అదేమిటిరా? టీ.వి.లోంచి బోరింగ్ శబ్దాలు వస్తున్నాయి?

మనవడు: అది టి.వి. సీరియల్ బామ్మా! శబ్దాలు అలాగే వస్తాయి.

బామ్మ: మరి మాట మాటకీ మధ్యన బోరింగ్ వేస్తున్న శబ్దాలు వస్తున్నాయేమిటి?

మనవడు: ఓహో అదా! ఆ మ్యూజిక్ డైరక్టర్ ఇంతకు ముందు బోరింగులు వేసేవాడు  బామ్మా!

43. ఓపెన్

టీచర్: ఇదేమిటయ్యా! ఏకంగా టేబుల్ మీద పుస్తకం పెట్టి మరీ పరీక్షలో కాపీ చేస్తున్నావ్?

కాపీ రాజు: ఇది ఓపెన్ యూనివర్శిటీ పరీక్ష కదా. అందుకే ఓపెన్‍గా రాసేస్తున్నా.

44. క్లాస్

ప్రిన్సిపల్: ఇదేమిటయ్యా! కాలేజీకి రాగానే నన్ను తిడుతున్నావ్?

అధ్యాపకుడు: కాలేజీకి రాగానే క్లాస్ తీసుకోవాలి అని చెప్పింది మీరే కదా!

45. గుర్తు చేశారు

రామ్: నువ్వు సిగరెట్లు కాల్చటం మానేశావుగా! మరి ఈ రోజు ఎందుకని ఆనందంగా మళ్ళీ సిగరెట్లు కాలుస్తున్నావు?

రాజు: ఈ రోజు ‘ప్రపంచ పొగాకు దినోత్సవం’ అని పేపర్లో, టి.వి., రేడియోల్లో ప్రకటనలు ఇచ్చారు. మరి పొగాకు దినోత్సవాన్ని జరుపుకోవాలి కదా.

46. పెండలం

గురువు: కంద, పెండలం గూర్చి మీకు ఏమి తెలియునో వివరించుము.

శిష్యులు: నాకు పెండలం గూర్చి తెలియును. పెండలం గోడ గడియారములో ఉండును గురువు గారూ!

47. సర్వరు

పెరుమాళ్ళు: నాకు ఇవ్వవలసిన పత్రం బేగా ఇత్తే ఇంటికి పోతాను. నువ్విచ్చే పత్రం కోసం పొద్దున్నే వచ్చాను. ఇప్పుడు సూడు, సాయంత్రం అయిపోయింది.

ఆపరేటర్: కంప్యూటర్‍లో సర్వర్ పని చేయటం లేదు. ఇంకొక గంట ఆగాలి.

పెరుమాళ్ళు: సర్వరు పనిచేయకపోతే, ఎంటనే ఇంకొక సర్వరుని పనిలోకి తీసుకోవాలి. జీతం ఎక్కువగా ఇత్తే, ఆడే.. ఆ సర్వరే పని చేత్తాడు. ఛ..

48. క్రీడాకారుడు

భార్య: ఏమండీ! ఈ విషయం మీకు తెలుసా?

భర్త: నువు చెపితే తెలుస్తుంది.

భార్య: మన అల్లుడు పేకాట ఆడతాడట!

భర్త: ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు.

భార్య: మరి క్రీడాకారుడు అని చెప్పి పెళ్ళి చేసుకున్నాడుగా!

భర్త: ఇరవై ఏళ్ళ క్రిందట నువ్వు మోసపోయావుగా! అలాగే.

భార్య: భలేవారందీ మీరు! పోలీస్ అనుకుని మీతో పెళ్ళికి ఒప్పుకున్నాను.

భర్త: ఇప్పుడు తెలిసిందా! నేను నకిలీ పోలీస్‍ననీ, అల్లుడు అసలైన క్రీడాకారుడని!

49. బొగ్గు పులుసు వాయువు

టీచర్: బొగ్గు పులుసు వాయువు అనగానేమి? వివరించండి.

బాలరాజు: మనం పులుసు వండుతున్నప్పుడు అది మండిపోయి బొగ్గులగును. ఆ బొగ్గుల నుండి వచ్చు వాయువునే బొగ్గు పులుసు వాయువు అందురు సార్!

50. తిరిగి రాని లోకం

శిష్యుడు: గురువు గారూ! తిరిగి రాని లోకం ఎక్కడుందో, అది ఎలా ఉంటుందో వివరంగా చెప్పండి.

గురువు: అసలు అలాంటి లోకమే లేదురా బడుద్దాయ్!

శిష్యుడు: మరి గొప్పవాళ్ళు స్వర్గస్థులయిన తరువాత తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారు అని అంటారు కదా!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version