హఠాత్తుగా!!

0
3

[box type=’note’ fontsize=’16’] జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ గోపీనాథ్ మహంతి ఒడియా భాషలో రాసిన కథని తెలుగులో అనువదించి పాఠకులకు అందిస్తున్నారు శ్రీమతి చాగంటి తులసి. [/box]

[dropcap]ఆ[/dropcap]శ్వయుజ పున్నమి దగ్గర పడ్డాది. బట్టలు కొనడానికి పట్నం వచ్చాడు నటవర్. తెలిసున్న ఓ గుమస్తా ఇంట్లో బట్టలూ, మిగతా సామాన్లు పెట్టి బయటపడేసరికి సాయంత్రం అయింది. పట్నంలో ఎవరిని చూడు – ఒక్కరికీ తీరుబడి లేదు! చిన్నప్పుడు చదువుకున్న కథ జ్ఞాపకం వచ్చింది. బడికెళ్ళే పిల్లాడు ఆడుకుందాం రమ్మని ఎవర్ని పిలిచినా మాకు పని ఉందంటే మాకు పని ఉందన్నారు. చీమకీ తీరికలేదు! తేనెటీగకీ తీరికలేదు! పాపం పిల్లాడు! ఏం చేస్తాడు! వాడు బడికి వెళ్ళక తప్పలేదు!! పట్నంలో వీళ్ళంతా ఆ కథే చదివి ఉంటారా?!

రోడ్డు పక్కనున్న స్కూలు వైపు చూశాడు. పిల్లలు గట్టిగా పాఠం వల్లె వేస్తున్నారు. అరుపే వినిపిస్తోంది. పాఠం కాదు! రోడ్డుకు రెండోవేపు రంపం మిషను. భయంకరమైన చప్పుడు. ఆ మిషీను వేపు రెప్పవాల్చకుండా ఓ ఐదునిమిషాలు చూశాడు. ఎంతకని చూడ్డం! విసుగొచ్చి మళ్ళీ రోడ్డు కిటువేపు కళ్ళు తిప్పేడు.

చంటివాడు కునా ఏం చేస్తూ ఉండి ఉంటాడూ? వెర్రివెధవాయ, బాగా నీరసించి పోయాడు. వైద్యుడు వాడి పొట్టలో క్రిములు ఉన్నాయి అన్నాడు. శరీరం పుల్లలా, పొట్ట ఉబ్బిపోయి, చేతులూ కాళ్ళు పలచటి వెదురుకర్రల్లా తల మాత్రం పెద్దగా! అయితే ఏం? పాఠాలన్నీ కంఠతావే! పదేళ్ళు లేవు. మొత్తం అన్ని ఎక్కాలూ వచ్చేశాయి. అనాస పనాసరసం రోజూ ఇచ్చినా గుణం కనపడలేదు. జబ్బు తగ్గలేదు. ఎలా ఉన్నవాడు అలాగే ఉన్నాడు. అంతా ‘ఎలాంటి తండ్రికి ఎలాంటి పిల్లాడు?’ అంటారు.

పెద్ద పిల్లాడు బునా పొలం పని చూస్తున్నాడు. ఈ అశ్వయుజ మాసంలో వాడి పెళ్ళి చెయ్యాలని ఉంది. అందుకే ఈ రోజు పట్నంలో రాత్రికి ఉండిపోవలసి వచ్చింది. ఈవేళ ఆ పెద్ద మనుషులు వీళ్ళింటికే వచ్చేదుంది. మధ్యవర్తుల ఎదుట ఇచ్చి పుచ్చుకోడాలు రాయించుకోవలసి ఉంది.

పెళ్ళి వాయిదా వెయ్యడానికి వీలులేదు. బూనా వాళ్లమ్మ ఆరోగ్యం బాగుపడే లక్షణాలు ఏం కనబడ్డం లేదు. పాపం! ఎలా ఉండేది ఎలా అయిపోయింది! చక్కటి మనిషి. తీర్చిదిద్దిన రూపం! జుట్టు మోకాళ్ళ వరకు వేళ్ళాడుతూ ఎంత పొడుగ్గా ఉండేదో కద! ఏమైపోయిందో ఆ రూపం! అసలు అదేనా ఇది? గట్టిగా అదిమిపట్టుకుంటే పీటమీద ఒత్తిన చపాతీలా అతుక్కుపోతుంది! తనకన్నా ఎంత? ఐదేళ్ళే కదా చిన్నది! మహా ఉంటే నలభై ఉంటాయి. ఎముకల గూడు అయిపోయింది. అంత జుట్టూ ఊడిపోయింది. తల తిరగడం, అరికాళ్ళ మంటలు, ఒళ్ళు ఒణుకు! వాత పిత్త దోషం అంటాడు వైద్యుడు. వాటికి తోడు కఫం గాని పెరుగుతుందేమోనని భయం! వాత పిత్త కఫం మూడు ఒకేసారి పెరిగితే గొంతు గఢ్ గఢ్‌లు, ఎండిపోయాయా ఖఢ్ ఖఢ్‌లు అంటుంది శాస్త్రం!

వాడికి పల్లెలోని ‘అఠరాబాంక’ నది జ్ఞాపకం వచ్చింది. ఓసారి ఆటు ఓసారి పోటూను! రూపం, యవ్వనం, ధనం, సంతానం!!

నది ఒడ్డునే ఉన్న మర్రిచెట్టుకింద బాబాజీ దిగారు. చిలుం పీలుస్తూ చెప్పారు. “నదిలో ఆటూ పోటూ వస్తాయి. సరిగ్గా అదేనయ్యా ఇల్లూ సంసారం! సుఖం అన్నది లేదు. ఇది పట్నం. అందరికందరూ ఎవరి మానాన వారే! ఓ మాటా మంతీ ఉండదు. సానుభూతి పలకరింపు ఉండదు”. గట్టిగా నిట్టూర్చి నటవర్ అక్కణ్ణుంచి బయల్దేరాడు. పనేం లేదు. ఉట్టిదే తిరగడం! ఎలాగో ఓలాగ రోజు నడిపి రేపు బస్సు పట్టుకుని ఊరికి తిరిగి వెళ్ళిపోవాలి.

ఎర్రటి పెదాలు, తాజాపండులా నున్నగా మెరిసే బుగ్గలూ, రంగురంగుల చీరలు! టాపు తీసేసిన రిక్షామీద జతలు జతలుగా కూచుని పట్నవాసపు స్త్రీలు షికారుకి బయల్దేరారు!

బూనా వాళ్లమ్మ పురుడు తర్వాత పురుడు. తిరగబెట్టి మళ్ళీ మళ్ళీ వచ్చి పడే మలేరియా. మనిషి ఎలా అయిపోయిందో! వాడి మనసు బరువెక్కి పోయింది. పాపం, దానికి ఇవ్వడమే తెలుసు. ఇచ్చి ఇచ్చి డొల్ల అయిపోయింది. చెయ్యి చాచి ఎప్పుడూ ఇది కావాలని అడిగి ఎరగదు!

తన బలాన్ని, ధైర్యాన్ని ఆరోగ్యాన్ని, చక్కదనాన్ని సర్వాన్నీ అర్పించేసింది! మట్టిఇల్లు! అయితేనేం, గోడలూ నేల నున్నటి నునుపు! కంచుగిన్నెలూ పాత్రలూ గాజువా అన్నట్టు తళతళా మెరుస్తూ!! పెరట్లో ఓ మూల తన ఎడం చేత్తో పాడేసిన నిమ్మచెట్టు పెరిగి పెద్దదై విస్తరించింది. పొలం, తోటా దొడ్డీ మొత్తం సంసారం! ఉట్టిలో వేళ్లాడుతూ ఎండబెట్టిన మామిడి బొరుగులు నిండిన కుండలు, ఒడియాలు నిండిన పెద్ద పెద్ద ముంతలు. ఇల్లంత శుభ్రంగానూ పశువుల పాకలు! నున్నటి ఆవుల దూడల ఒంటిమీద ఈగన్నది వాలడమే! వాలాయా జారి పడతాయి!! రాత్రంతా దానికి జాగారమే! పిల్లల ఉచ్చగుడ్డల్లో పడుకుని వాళ్ళని దోమలు ఎక్కడ కుడతాయో అన్న బెంగతో పాపం అది తన యవ్వనాన్ని మొత్తం శక్తిని ధారపోసింది. తనకోసం ఏం మిగుల్చుకోలేదు. చీకట్లు విడువకముందే తెల్లవారుఝామునే పనిలోపడితే అర్ధరాత్రివరకూ పనే పని! ఒకటే పని!

తను? ఆరోగ్యంగా ఉన్నాడు. సాదాసీదాగా సంసారంలో మునుగుతూ తేలుతూ!

పట్నంలో తిరుగుతూ తిరుగుతూ వాడు పెద్ద మైదానం వేపుకి వెళ్ళాడు. అబ్బో! ఎంతమంది జనమో! పట్నంలో సగం ఇక్కడే ఉన్నట్టుంది! ఇసకవేస్తే రాలనంతమంది! జనం మధ్యకి వెళ్ళగానే నటవర్ వ్యక్తిగతమైనదంతా మాయమైపోయింది. బూనా లేడు. బూనా అమ్మ లేదు. ఇల్లు లేదు. ఉన్నది జనమే! జనంతో మనసు ముడిపడిపోయింది. ఇంటిబాట పట్టిన ఒంటరి గొర్రెలాగ రెండు గెంతుల్లో ఎగురుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. మైదానంలో ఫుట్‍బాల్ మేచ్ అవుతున్నాది. ఓ వేపు ‘బారిపడా’. రెండోవేపు ‘జయపూర్’. ఎటూ ఇంకా గోల్ అవలేదు. ఏమిటీ గోల్? ఈ మూలనుంచి ఆ మూలవరకూ ఆట! పడుతూ లేస్తూ ఒకరితో ఒకరు పరుగులు!

అది చూసేసరికి మనసు పాడైపోయింది. తన ప్రాపంచిక జ్ఞానంతో నటవర్ ఆలోచనలో పడ్డాడు. “అసలు ఈ పనేంటి? దీనికింత జనం ఏంటి? చెమటతో తడిసి ముద్దవుతూ పరువంలో ఉన్న కుర్రాళ్ళు ఓ ఇరవైరెండుమంది అసలు ఏ పనికోసం పరుగెడుతున్నారు? గాలినిండా నింపి పొంగించిన చర్మంతో చేసిన ఓ గుండ్రటి పిండాన్ని పట్టుకుని తమ మగతనాన్ని పరీక్షించుకోడానికా? ఇందుకేనా వీళ్ల తల్లిదండ్రులు నీళ్ళలా డబ్బు ఖర్చుచేస్తూ వీళ్ళని చదివిస్తున్నారు? ఈ గుండ్రటి పిండాన్ని తన్నే విద్య నేర్చుకోవడం కోసమేనా?

ఇరవై ఇద్దరు – ఇరవై ఇద్దరు – పడుచుకుర్రాళ్ళు కలిసి పని చేయాలనుకుంటే ఓ ఇల్లు కట్టడానికి మట్టిని పిసకగలరు! మట్టి తవ్వగలరు! తొక్కగలరు! దేన్నైనా విరగ్గొట్టగలరు. కట్టగలరు! ఊహించి చూడు – ప్రతీవాడి చేతికీ ఒక్కో నాగలిని ఇచ్చి పదండ్రా, ఈ మైదానాన్ని దున్నండి అంటే దున్నలేరా? పన్నెండు ఎకరాల మైదానం! వెధవది, ఒట్టిగడ్డి మొలిచి ఉన్నాది! ఈ ఇరవై ఇద్దరు పడుచు కుర్రాళ్ళు బోలుడు బోలుడు పంట పండించగలరు! ఆ పని చెయ్యకుండా ఇదిగో, ఈ తమాషా చేస్తున్నారు! పట్నవాసపు వాళ్ళ ఆలోచనలే చిత్రమైనవి! కడుపునిండా తరవాణీ అన్నం తిండానికి బదులు నాలుగుపైసల సిగరెట్టు కొనుక్కుని గుడుగుడూ శబ్దం చేస్తూ గుప్పుమని పొగ వదుల్తారు. ఈ పరుగులూ అలాంటివే! ఎక్కడ ‘బారిపడా’ ఎక్కడి ‘జయపూర్!!’

హాఫ్‍టైమ్ అవబోతోంది. భయంకరమైన గోలా గగ్గోలుమధ్య ‘బారిపడా’ జట్టు ఓ గోల్ పోగొట్టుకుంది. గోల్ కోసం ‘జయపూర్’ జట్టు ప్రాణాలు ఒడ్డి మరీ ఆడింది. ఆ జట్టు ఆ వేపుకి పరుగెడుతోంది. ఇంతలో బారిపడా గోల్ పోస్టు దగ్గరికి బంతి వెళ్ళిపోయింది. ఇంకేముంది పోరు! ఒకటే పోరు! తన్నుకోవడం, ఒకరిని ఒకరు తోసుకోవడం! పద్మవ్యూహం! జయపూర్ కుర్రాడు ఎగురుతున్న జుట్టూ, చప్పిడి ముక్కూ, కండలేని మొహం, కారు నలుపురంగూ, ఎత్తు పొడుగ్గా! భలే బహద్దర్! గాలికన్నా వేగంగా పరిగెడుతున్నాడు. గుండులా ఉన్న పడుచు కుర్రాడు! చూడు! చూడు! వాడే బంతి లాగేసుకున్నాడు. అన్నివేపులనుండీ బొబ్బలు! కేకలే కేకలు – “ఒరే! ఒరే! కంధ్‍గాడు కొట్టేస్తున్నాడ్రా!!”

ఏమిటీ వాడు కందా ఎవడైతేనేం? కొడతాడు! కొట్టరా కొట్టు కిక్! కొట్టు కిక్! గోల్! గోల్!

ఆట మత్తులో నటవర్ మునిగిపోయాడు. వాడికి తెలీకుండానే వాడి మనసుని పూర్తిగా ఓ కొత్త చైతన్యం ఆక్రమించింది. ఇది కొత్త చైతన్యమా? వాస్తవానికి? అతి పురాతనమైన ఆదిమప్రవృత్తా? తన్ని కొట్టి లాక్కునే ప్రవృత్తి! తనకే ఉండాలనే? తన దగ్గరే ఉంచుకునే? శత్రువుని ఓడించే! ఎలాంటి కష్టాలూ, అడ్డంకులు రానీ, తన వాంఛని తీర్చుకోడానికి వెన్నెముకను నిఠారుగా చేసుకుని నడుం బిగించే?

రైతూ అలాగే పనికి అతుక్కుపోతాడు! అలాగే అతుక్కుపోయింది బూనా అమ్మ! ఊళ్ళో జనం! దావాలు! పొలాలు పోగొట్టుకుని, ఇల్లు గుల్ల చేసుకుని ఓ పిడిగుద్దుకూ, రెండు చెంప పెట్టులకూ పగ తీర్చుకోవడానికి మూడేళ్ళో నాలుగేళ్ళో దావాలు!! అదే ఇది!!

సమూహంలో ఉండి చేసే ప్రయత్నం! స్వీయప్రకటన!! కొట్టు గోల్! గోల్ కొట్టు! కొట్టు కొట్టు! తనకు తెలీకుండానే తనను తాను జయపూర్ పక్షంలో కలిపేసుకున్నాడు. జయపూర్ పక్షానికే కాదు – తనే ఆ కారు నలుపు పొడుగైన కుర్రాడు అయిపోయాడు! వాడి సుళువు బలువు కష్టం తనవి అయిపోయాయి. వాడు ఎవడో తనకి తెలియని వాడే అవచ్చు అయినా నటవర్ మనసులో ఓ భాగమైపోయాడు. మనసు వాడి విజయంలో తన విజయాన్ని వెతుక్కుంటోంది. ఉత్తేజంతో గట్టిగా అరుస్తున్నాడు.

కొట్టు గోల్ కొట్టు!

మునివేళ్ళమీద నిలబడి ఎగిరిఎగిరి పడుతున్నాడు. తోసేస్తూ మోచేతుల్తో పొడిచేసి తొలగించుకుంటూ జనం వరసలని దాటుకుంటూ ముందు వరసలోకి పోవడానికి ఆయాసపడ్డాడు. తను వెనక్కి అయిపోయాడు. మనసుకి బాధగా ఉంది. జయపూర్ గోల్ కొట్టలేకపోయింది.

హాఫ్‍ టైం ఎంత వేగంగా అయిపోయిందో కదా! సోడా తాగడం, నిమ్మరసం పీల్చడం, చెమట ఆరబెట్టుకోవడం అయిన తర్వాత ఆటగాళ్ళు పోరాటానికి మళ్ళీ మైదానంలోకి వచ్చారు. సైడ్‍లు మారారు. ఇటువేపు వారు అటూ, అటువేపు వారు ఇటూ వచ్చారు. జయపూర్ విజయానికి మనసులో దేవుళ్ళకీ, దేవతలకీ మొక్కుకుంటూ ఏకాగ్రచిత్తంతో ఆట చూడ్డం మొదలుపెట్టాడు. ఈసారి జయాపూర్ ముందు ఉంది. బంతి తీసుకుని ముందుకి వెళ్ళేరు. ఇంకేమిటి గోలే!! గోలే!!

తన గొడుగుని మీదకి ఎత్తి ఎగిరిఎగిరి తన ఆనందాన్ని ప్రకటించాడు. కొందరు అటువేపూ కొందరు ఇటువేపూ తనలాగే ఎగిరి ఎగిరి ఆనంద పడుతున్నారు. ప్రేక్షకులు మంచి ఉత్సాహంతో ఉత్తేజంతో ఉన్నారు. మాంఛి చర్చలో ఉన్నారు. గొప్పగా ఉంది గోలాగగ్గోలు. కొంతమంది జయపూర్ వేపు! కొంతమంది బారిపడా వేపు! ఈ వేపు నుంచి ‘అప్ అప్’ అంటూ ఉత్సాహపరిచే ప్రయత్నం; ఆ వేపునుండి ‘డవున్ డవున్’ అంటూ నీరు కార్చే ప్రయత్నం!!

ఆట మంచి రసపట్టులోకి వచ్చింది. రెండుపక్షాల వాళ్ళు బహు జాగ్రత్తగా ఉన్నారు. ఓసారి ఇటువేపు వాళ్ళు చొచ్చుకుపోతే అటువేపు వాళ్ళు ఆ వెంటనే అడ్డుకుంటూ ఎదురుకుంటున్నారు.

ఆ జయపూర్ కారు నలుపు కుర్రాడు బంతి తీసుకుని ముందుకు దూసుకు పరిగెడుతున్నాడు. ‘అప్ అప్!’ చాతకపక్షిలా నటవర్ అరుస్తున్నాడు. ‘అప్ అప్ జయాపుర్!’ మరెవరో గట్టిగా అరుస్తూ ఉత్తేజపరుస్తున్నాడు!

“డవున్! డవున్! గుఱ్ఱంగాడా! అప్! అప్! బారిపడా!” ఇంకొకడు ఎవడో గట్టిగా అరిచాడు. ఇద్దరికిద్దరూ తమ తమ పద్ధతుల్లో అరుస్తున్నారు.

“ఒరే! అదిగో గుఱ్ఱం ముందుకు వెళ్తోందిరో! పట్టుకో! పట్టుకో!” గట్టిగా ఓ అరుపు. వాడి మాట మనసుకు గుచ్చుకుంది. నటవర్ అటు తిరిగాడు.

“గుఱ్ఱం అని ఎవరిని అంటున్నావ్?”

“వాడే! మరెవడు! పొడుగు జుత్తులవాడు! అరెరే! గుఱ్ఱం దూరిందిరా! పట్టుకోండి! పట్టుకోండి!”

“మాటలు జాగ్రత్తగా రానియ్యి” అన్నాడు నటవర్.

“ఏం? నువ్వు గుఱ్ఱానికి అన్నగారు ఏనుగువా? ఓహో!”

“పోరాబే! ఒంటెగాడా!”

“నువ్వు? నువ్వు గాడిదగాడివి! ఎంత పెద్ద చెవులో!!”

ఆ మాటలు చెవిని పడీ పడ్డంతో తనకి తెలీకుండానే హఠాత్తుగా తన చెయ్యి లేచింది. అవతలి మనిషి చెంపమీద ఓ పెట్టు పెట్టింది.

కృశించిన శరీరం, కొద్దిగా పెరిగిన గడ్డం, లోతుకుపోయిన బుగ్గలు, కళ్ళజోడు, తలమీద రెండంచులున్న టోపీ!

మరో దెబ్బ మళ్ళీ ఎడం చెంపమీద కొట్టాడు.

వాడి నోట్లోంచి నెత్తురు! కళ్ళజోడు తుళ్ళిపోయి కిందపడబోతూ ఉంటే గబుక్కున పట్టుకున్నాడు. నెత్తురు కారుతున్న నోటితో ఆ మనిషి బొబ్బపెట్టాడు. “చంపేశాడురా కొట్టి చంపేశాడురా!”

చూస్తూ ఉండగానే ఎంతోమంది అరుస్తూ కేకలేస్తూ వచ్చిపడ్డారు. అన్నివేపుల నుండి ‘కొట్టు కొట్టురా! కొట్టు కొట్టు!’ అంటూ గగ్గోలు. నిలుచున్న పాలాన నటవర్ ఎదట ఓ శత్రువుల సమూహం వచ్చి పడ్డాది! రెప్పపాటులో కోట్లాట మొదలయింది. పిడిగుద్దులు, కర్రలతో కొట్టుకోడాలు, రాళ్ళరువ్వులు, తొయ్యడాలు, తన్నడాలు, అల్లకల్లోలం, పరుగులు, కేకలు, పారిపోవడాలు – రకరకాల అరుపులు – ఎవరు కొడుతున్నారో – ఎవరిని కొడుతున్నారో ఎందుకు కొడుతున్నారో తెలుసుకోడానికి చూడ్డానికి వీలూ సమయం లేదు. ఒకడెవరో ‘ఆగరా బాబు ఆగు’ అంటూనే ఉన్నాడు. వాడి వీపుమీద దఢేలుమని దెబ్బపడ్డాది. ఎవడో గుంపులో అమ్మోయి! బాబోయి! అని మొర్రోమని ఏడుస్తున్నాడు. ఎవడో పారిపోతున్నాడు.

లాఠీలతో పోలీసులొచ్చి పడ్డారు.

గుంపు చెదిరిపోతోంది.

తప్పుకోండి…. తప్పుకోండి. పరుగెత్తరా! పారిపో! పారిపో!

నెత్తిమీద తగిలిన దెబ్బని చేత్తో తడిమి నెత్తురు కారుతోందో ఏమిటో అని చూసుకున్నాడు. పోలీసు లాఠీ గట్టిగా తగల్లేదు. చిన్నపాటి గాయం.

ఎలాగో పోరాటం ఆగింది. మైదానం అంచున ఉన్న ఎత్తువేపు రోడ్డు మలుపు తిరిగింది.

బారిపడా గోల్ చేసింది. గుంపులోంచి గట్టిగా వినిపించింది. “గోల్! గోల్! అప్! అప్! బారిపడా!” ఇప్పుడు ఇక కోపం రాలేదు!

శాంతపడి నటవర్ తన బసవేపు తిరుగుమొహం పట్టేడు. బంతిలో ఓ చిన్న భాగంలా తలమీద బొప్పి కట్టింది.

ప్రతిరోజు ఆశతో ఎదురుచూసే తన పాత ఆలోచనలను తిరిగి పట్టుకుని నటవర్ నడుస్తూ ‘ఇవాళ ఎంత పెద్ద ఉపద్రవం తప్పిందో కదా! ఇదంతా విని బునా అమ్మ ఏమంటుందో?’ అనుకున్నాడు!

~ ~

ఒడియా : గోపీనాథ్ మహంతి

తెలుగు : చాగంటి తులసి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here