[dropcap]స[/dropcap]రిమాటకోసం క్షణాలు చెవులు రిక్కిస్తాయ్
సమయమిలా హాయిగా కళ్ళుతెరవడం బావుంది
ఈ ఋతువేదో గమ్మత్తు చేస్తోంది
ఇటువంటి శీతాకాలమొకటి ఊహకందలేదు
నిట్టూర్పుల సత్యప్రవాహమిదా!?
అయినా కొంచం నింద
హేమంతం మహా సోమరి
సిగ్గరి గడసరీనూ
చెంపలపై, పొగమంచును కాల్చే అగ్గుల్ని రాజేసి
గుంభనగా తప్పుకుంటుంది
నిజ్జంగా నిజం;
నిన్నులో నన్ను చూసుకుంటాను
ధ్యాసంతా నీలా నువ్వై ఉందని అడగాలనుకుంటాను
ఇంకా ఇంకా పుట్టే మాటలు ఏవయ్యుంటాయని నవ్వుకుంటాను
ఇలా నిన్నలు వెళ్ళడం బావుంది
పుట్టిన ఈరోజులు బావున్నాయి
రేపన్న దిగులుకి సమయమేం మిగల్లేదు
మైకమంటిన కాలమహిమలో రోజులిలా
నీలా
నాలా
మనకులా