[dropcap]పం[/dropcap]డుగంటే-
ప్రకృతి కాంత సోయగాల మాలిక
పలు హృదయాల పరవశాల డోలిక
తెలుగింట వెలుగుల పంట సంక్రాంతి
సంబరాలు అంబరాన్నంటే క్రాంతి
కొత్త అల్లుళ్లకు ఇది ఆటవిడుపు
కోడి పందాలకు పెద్ద మదుపు
కోడె గిత్తలు రంకెలు వేసే సమయం
ధాన్యాల రాశులతో గాదెలు నిండే కాలం
కన్నె పిల్లల కమనీయ కోలాహలం
గుమ్మాలకు కళకళలాడే పచ్చని తోరణాలు
ముంగిట పరచుకున్న ఇంద్ర ధనస్సులు
పురేకులతో చూడచక్కని రంగవల్లులు
గంగిరెద్దప్పన్నల సన్నాయి వాద్యాలు
హరిదాసుల పసందైన కీర్తనలు
ప్రతి ఏటా వచ్చే పరిమళాల పండుగ
పరవశాలు నింపే ప్రతి ఎదలో నిండుగ
ప్రతి ఇంట హేమంత హేల!
ప్రతి కంట కాంతుల కళ!