[box type=’note’ fontsize=’16’] Biswabandhu Mohapatra ఆంగ్ల కథకి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి అనువాదం ఈ “హేమంత సంతాపము“. [/box]
చీకట్లు ముసిరేకొద్దీ పార్క్ పలుచబడుతోంది, ఇంకా ఏడు కూడా కాకముందే. చలి బాగా ముదిరిందప్పుడే ఊళ్ళో. పగళ్ళు కుంచించుకుపోతున్నాయి. సాయం సంధ్య రావడానికి త్వరపడుతుంటే, ఉదయసంధ్య వెళ్ళిపోడానికి బద్ధకిస్తోంది. చెట్లు ఆకులు రాల్చేస్తుంటే ప్రకృతి హరితవస్త్రం జారవిడుస్తున్నట్టుంది. వసంతం ఎప్పుడు రానుందో!!! మొక్కల పువ్వులకు, ప్రాణుల నవ్వులకు కొత్త రంగుల అలంకారాలు ఎప్పుడో!!!
గగనం లోని తారల మసక వెలుగు. వాటి మధ్యలో చంద్రుడు ఒంటరి అయి దిగులుతో శుష్కించినట్టు కనిపిస్తున్నాడు. నాలాగే – ఈ పార్కులో ఇంతమంది మధ్యలో కూడా ఏకాంతంలో నను నే కోల్పోతున్నట్టే. అందుకే నేమో నాకు చంద్రునికీ ఏదో తెలియని దగ్గరితనం.
సిమెంట్ బెంచీ మెల్లమెల్లగా మరింత చల్లబడుతోంది. కావలివాళ్ళలాగా దగ్గర్లో నిలబడి ఉన్న దీపస్తంభాలు నెమ్మదిగా మసకవెలుతురు ప్రసరిస్తున్నాయి. సన్నగా మంచుబిందువులు ఉండుండి రాలుతున్నట్టున్నాయి. డిశంబర్ వెళ్ళిపోయింది. టెంపరేచర్ రోజురోజుకూ తగ్గుతూ నగరాన్ని వణికిస్తోంది.
అందరూ వెళ్ళిపోయారు బహుశా. నేనే చివరాఖరుకు పార్క్ వదిలినట్టున్నాను. ఊ…ఊహూ.. కాదు .. ఇంకెవరో ఉన్నారేమో అక్కడ… నిర్లిప్త! ఎనిమిదేళ్ళ క్రితం నాకోసం ఒక స్లీవ్ లెస్ స్వెట్టర్ అల్లింది. అది వేసుకున్నప్పుడు నాకెంతో థ్రిల్లింగ్ గా అనిపించింది. హేమంత ఋతువు వచ్చేసినట్టు … వసంతమూ రాకుండా ఎందుకుంటుంది?
ప్చ్, రానేలేదే… … వసంతం రానేలేదే ఆ తర్వాత! తరువులు కొత్త చిగుళ్ళు, మొగ్గల అలంకారాలు తొడగనే లేదే! పక్షులు ఆలాపనలు మరిచిపోయాయేం? నిర్లిప్త…… నా జీవితంలోంచి వెళ్ళిపోగానే అంతా ఐపోయింది.
ప్రతీ హేమంత చలిగాలులలో నిర్లిప్త నాకోసం అల్లిన అదే స్లీవ్ లెస్ స్వెటర్ వేసుకుంటాను. వేసుకుని, ఆమెను నాలో పొదువుకున్నట్టు పులకిస్తాను. బహుశా స్వెటర్లు అల్లే కళను ఆమె మరిచిపోయి ఉంటుందా? ఏమో! కాకున్నా ఇంకెవ్వరికీ ఎప్పుడూ అల్లి ఉండకపోవచ్చు.
“ఒక్క రెండు నెలలు వెయిట్ చేయి… వచ్చే వసంతకాలంలో మనం పెళ్ళిపల్లకీ ఎక్కుదాం. అప్పుడు నేను తప్పక పెళ్ళి చేసుకుంటాను.” ఎవరు ఎవరికి మాటిస్తున్నారు? మాటలు వినబడినవైపు అడుగులు వేశాను. కొన్ని గజాల అవతలే, అమ్మాయి ఒడిలో తలపెట్టుకొని పడుకున్నట్టున్నాడు అబ్బాయి, ఆ వసంతం కోసం ఎదురుచూస్తూ! వణికించే చలి గాలులను, మంచు తుంపరలను ఏమాత్రం పట్టించుకోకుండా.
హేమంత ఋతువు వచ్చేసినట్టు … వసంతమూ రాకుండా ఉంటుందా ఏం?
కానీ ఆ అమ్మాయి ఏడుపు గొంతుతో ఏదో అంటోంది – “ ఎవరికి తెలుసు…..? ….. ఈ రెండు నెలలలో ఏమైనా జరగొచ్చు. ఆ వసంతం రాకుండానే నేనీ ఊరు వదలి వెళ్ళాల్సి రావచ్చు.”
అబ్బాయి నోట మాట రాలేదు. నిస్సహాయంగా ఉండిపోయుంటాడు బహుశా. ఈ చలిగాలుల హేమంతానికైనా అర్థమౌతోందా అతని నిస్సహాయత?
“ఓకే. వెళ్దాం పద. బాగా చీకటిపడుతున్నట్టుంది.” ఆ యువకుడు లేచి నిలబడ్డాడు ఆమెకు చేయందిస్తూ.
“కానీ చివరికి నీవేమంటావో వినాలని .. ఉన్నాను.” బాయ్ ఫ్రెండ్ నుంచి ఒక ఖచ్చితమైన సమాధానం కోసం ఎదురుచూస్తోందామె.
“ప్లీజ్, డార్లింగ్… ఈరోజు ఎలా వచ్చిందో.. ఆరోజూ అలా వస్తుంది. ఈ హేమంతం లాగే ఆ వసంతమూ మన జీవితాల్లో వస్తుంది. రాకుండా ఎలా ఉంటుంది? “
“అలా ఆశించడానికి లేదోయ్! వసంతం వస్తుందని ఎదురుచూస్తూ కూర్చోరెవరూ. ఎవరికి తెలుసు, వసంతం రాకుండానే గ్రీష్మం వచ్చేస్తే?? పశ్చాత్తాప పడాల్సొస్తే, ఈ సమయాన్ని వదిలేసినందుకు?! ప్రేమ ఋతువులో మనముండగా చలిగాలి, ఎండవేడి మననేం చేస్తాయి? హేమంతమైతే ఏంటి? వసంతమైతే ఏంటి? ప్రేమించుకునే వాళ్ళకు ఏ ఋతువైతే ఏం ? తేడా ఏంటి?”
“అరె, ఎవరు నువ్వు? ఎందుకు నా స్వెటర్ లాగేస్తున్నావు?”
ఆ అబ్బాయి అడ్డుపడుతున్నా కూడా అతని ఒంటి మీదనుంచి నేను స్వెటర్ లాగేస్తూ అతన్ని హెచ్చరించాను-“చూడబ్బాయ్! ప్రేమను బాధించే చలి ఏదీలేదు. వసంతం కోసమే ఎవరూ ఎదురుచూడనక్కరలేదు. ప్రేమలో ప్రతీ ఋతువూ అదే ఋతువే, వసంతమే!”
“అయ్యో, నా స్వెటర్….?” ఆ అబ్బాయికి పాపం, నా మాటలేవీ అర్థం అయినట్టే లేదు. అతను నా చేతిలోంచి తన స్వెటర్ లాగుతున్నాడు.
నేను అతన్ని వెనక్కి తోసి పరుగెత్తాను. అతను వెనకనుంచి అరుస్తున్నాడు.” వాచ్ మాన్…! వాచ్ మాన్..! దొంగను పట్టుకోండి.దొంగ! దొంగ!”
“ఏమైంది, సర్! ఎక్కడ , దొంగెక్కడ? ఎందుకు మీరు స్వెటర్ విప్పి చేతిలో పట్టుకున్నారు? చాలా చలిగా ఉంది, వేసుకోండి సర్! మీకు చలి వేయడం లేదా?” వాచ్ మాన్ నావైపు ఒక్క పరుగుతో వచ్చి అన్నాడు.
“ఓ.. ఔను, నా స్వెటర్ నా చేతిలోనే ఉంది. నా ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏరీ ఆ ప్రేమికులు? వసంతం వస్తుందనుకుంటున్న ఆ అబ్బాయి ఎదురుచూపులేమైనాయి?
“తొమ్మిదైపోయింది, సర్! పదండి. గేట్ క్లోజ్ చేయాలిక నేను.”
ఏంటీ, వాచ్ మాన్ మాట విని తీరాలా ఏం…? నన్నొక పిచ్చివానిగా జమకట్టి పార్క్ బయటకు తోసేస్తాడో ఏమో!
నిర్లిప్తా! నీవు నా జీవితం నుంచి వెళ్ళిపోయాక, ప్రతీ హేమంతమూ నన్నిలా గాయపరుస్తూనే ఉంది! సంతాపంలో ముంచుతూనే ఉంది! వసంతం కోసం వేచి వేచి వేసారిపోతున్నాను. ప్రతీ సారీ ఈ హేమంతం వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. కానీ ఈ హేమంత, శిశిరాలైనాక వసంతం మాత్రం రాదు! గ్రీష్మం వచ్చేస్తుంది.
హ్మ్… ఆ హాయైన తీయని వసంతం కూడా నీతో పాటే వెళ్ళిపోయింది శాశ్వతంగా!
ఆంగ్లమూలము – Biswabandhu Mohapatra