Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-91: హేవిటో…

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]హే[/dropcap]విటో…ఈ మధ్య ప్రపంచమంతా ప్రకటనలమయంగానే కనిపిస్తోంది. బైట తిరిగే కార్లూ, బైక్‌లే కాకుండా ఇంట్లో ఉపయోగించుకునే ఫ్రిజ్, స్టవ్, కుక్కర్, గ్రైండర్, మైక్రోవేవ్, వాషింగ్ మెషిన్ లాంటివి ఆయా కంపెనీలు వాటి అమ్మకాలు పెంచుకుందుకు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారంటే అర్థముంది.

కానీ, ఉదయం లేచింది మొదలుకొని వాడే టూత్ బ్రష్, పేస్ట్ దగ్గర్నుంచి, ఆకలి వెయ్యడానికి ఏం వాడాలో, ఏ ఏ అన్నం కూరలూ తినాలో, ఎలా తినాలో, ఎప్పుడు తినాలో, తిన్నాక ఆ అన్నం అరగడానికి ఏం వాడాలో, నల్లటి చర్మం తెల్లబడాలంటే ఏం వాడాలో, పొట్టిగా ఉన్నవాళ్ళు పొడుగవడానికి ఏం చెయ్యాలో, ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు ఏం పెట్టాలో, ఎవరైనా దెబ్బలాడుకుంటున్నప్పుడు వాళ్ల కోపం తగ్గించడానికి ఏమివ్వాలో లాంటివన్నీ ప్రకటనలుగా చేసేసి మనమీద రుద్దేస్తున్నారు తయారీదారులు.

నాకైతే ఆ ప్రకటనలు చూస్తుంటే వాళ్ల టార్గెట్ స్త్రీలూ, పిల్లలూ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఒక ప్రకటనలో చూసేను…ఏడేళ్ళ పిల్లాడు బ్రష్ మీద పేస్ట్ ఎక్కువ వేసేసుకోడం గమనించిందిట వాళ్ళమ్మ. దానివల్ల పేస్ట్ తొందరగా అయిపోవడమే కాకుండా… ఆ పేస్ట్‌తో పళ్ళు తోముకోవడానికి బదులు పిల్లాడు దాన్ని తినేస్తున్నాడేమో అని అనుమానం వచ్చిందిట వాళ్లమ్మకి. అప్పుడు వాళ్ళమ్మ ఈ సమస్యనుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటే ఒక కంపెనీ మనిషి వచ్చి ఒక టూత్ పేస్ట్ ట్యూబ్ చూపిస్తాడు. అది బ్రష్ మీద పెట్టి నొక్కగానే సరిగ్గా కావల్సినంత పేస్ట్ మటుకు బ్రష్ మీద పడగానే ఇంక ట్యూబ్ నుంచి పేస్ట్ రావడం ఆగిపోతుంది. దీనివల్ల పిల్లాడు ఎక్కువ పేస్టు తీసుకునే అవకాశం లేదని ఘట్టిగా చెపుతుంటాడు అలాంటి టూత్ పేస్ట్ ట్యూబ్ తయారుచేసిన ఆ కంపెనీ మనిషి. అది చూడగానే ఆ తల్లి వెంటనే ఆ కంపెనీ ట్యూబ్ కొనడానికి పరిగెడుతుంది.

అబ్బ.. ఆ తల్లిని ఎంత చక్కగా బుట్టలో వేసుకున్నాడూ అనిపించింది ఆ ప్రకటన చూడగానే.. అసలు పిల్లాడు అలాంటి పని చేస్తుంటే తల్లి ఏం చెయ్యాలీ.. టూత్ పేస్ట్ తినడానికి కాదు…పళ్ళు తోముకుందుకే అని ఆ పిల్లాడికి అర్థం అయేలా చెప్పాలి. ఎక్కువ పేస్ట్ వేసుకుంటే దానివల్ల వచ్చే అనర్ధాలు చెప్పాలి. ఓ నాలుగురోజులు దగ్గరుండి ఆ పిల్లాడు సరిగా పేస్ట్ వేసుకునేలా అలవాటు చెయ్యాలి. ఒక్కసారి అలా అలవాటు చేస్తే ఇంక మళ్ళీ తప్పు చెయ్యడు పిల్లాడు. ఇలా నేను చెపితే అందరూ నన్ను చూసి నవ్వుతారు. అసలు ఈ కాలంలో తల్లులకి అలా అర్ధం అయేలా చెప్పే టైమేదీ అంటారు. ఒకవేళ చెప్పినా ఆ ఏడేళ్ళ పిల్లాడికి అర్ధం అవద్దూ అంటారు. అందుకని సులభంగా చేసే పని హాయిగా వెంటనే వెళ్ళి ఆ కొత్త ట్యూబ్ ఎంత డబ్బైనా కొని తెచ్చేస్తారు.

కానీ, ఈ రోజుల్లో పిల్లలు మహా గడుగ్గాయిలు. ఏదీ చెప్పగానే వినరు, నమ్మరు. వాళ్ళు ప్రాక్టికల్‌గా చేసి చూస్తే కానీ దేన్నీ ఒప్పుకోరు. ఒకవేళ ఈ ఏడేళ్ళ పిల్లాడు అలా ఒకసారి సరిపడ్డంత పేస్ట్ రాగానే, ఆ ట్యూబ్‌ని పక్కకి పెట్టెయ్యకుండా ఇంకోసారి దానిని నొక్కడని గారంటీ ఏవిటీ… దీనికి జవాబు ఏ కంపెనీవాడూ చెప్పలేడు..

అన్నింటికన్న చెప్పుకోవలసిన విషయం ఏవిటంటే ఈ రోజుల్లో అందరూ ఇన్‌స్టెంట్ వాటికి బాగా అలవాటుపడిపోయేరు అనిపిస్తోంది. అన్నీ రెడీమేడ్‌గా దొరికిపోతుంటే కష్టపడే తత్వం తగ్గిపోయిందేమో మరి.. దానిని సమర్ధించుకుందుకు బోల్డు కారణాలు కూడానూ..

మరి లేకపోతే ఇదేమైనా సబబా చెప్పండి.. ఇదివరకు ఎవరింటికైనా వెడితే తినడానికి ఏవైనా పెట్టినా పెట్టకపోయినా కనీసం కాఫీయో టీయో తప్పకుండా ఇచ్చేవారు. కానీ ఈమధ్య ఆరోగ్యసూత్రాలు వివరిస్తూ కాఫీ తాగడం ఒంటికి మంచిది కాదంటూ టీ ఇస్తున్నారు.. పోనీ ఆ టీ అయినా శుభ్రంగా ఇన్నిపాలూ, ఇంత పంచదారా వేసి చిక్కటి టీ ఇవ్వడం అపరాధమైపోయినట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ మంచివి కావుట. అదేదో గ్రీన్ టీ ట.. మనం వెళ్ళేక అప్పటికే ఎలక్ట్రిక్ కెటిల్‌లో ఉన్న వేణ్ణీళ్ళని ఓ కప్పులో ఒంపి పక్కనే ఉన్న అట్టపెట్టెలోంచి ఒక గ్రీన్ టీ పేకట్‌ని అపురూపంగా తీసి అందులో ముంచి, పక్కగా ఓ దారాన్ని పట్టుకుందుకు ఆ కంపెనీ పేరున్న ఓ అట్టముక్కని వేలాడదీసి ఎంతో అందంగా ట్రేలో పెట్టి అందిస్తున్నారు. అది ఆరోగ్యానికి చాలా మంచిదిట. ఒక రంగూ, రుచీ, వాసనా లేని దాని గురించి బోల్డు వింతలూ, విశేషాలూ చెప్పడం కూడానూ.. నాలాంటి దానికయితే అవి ఒట్టి వేణ్ణీళ్ళు తాగినట్టుంటాయి. అంటే నేనేదో గ్రీన్ టీకి వ్యతిరేకురాలిననుకోకండి. అసలు ఆ ప్రకటనల్లో దాని గురించి ఎంత బాగా చెప్పకపోతే వీళ్ళకి దాని మీద అంత ప్రావీణ్యత వస్తుందీ అని నా అనుమానం.

కానీ ఆ మర్నాడే గ్రీన్ టీలో అలాంటి గొప్పగుణాలేమీ లేవని ఇంకెవరో ఫుడ్ స్పెషలిస్ట్ టీవీలో కొచ్చి చెపుతారు. రోజుకో సైంటిస్ట్ వస్తారు. ఈరోజు కాఫీ తాగితే ఒంటికి మంచిదికాదని ఒకరు చెప్తారు.. మర్నాడు కాఫీ రోజుకి ఒక కప్పు తాగితే పరవాలేదని ఇంకోళ్ళు చెప్తారు. ఆ మూడోరోజు కాఫీ రోజులో ఎన్నిసార్లు తాగితే అంత మంచిదని మరొకళ్ళు ప్రవచిస్తారు.

ఏది నమ్మడం.

కొన్నాళ్ళు దంపుడుబియ్యం తినమన్నారు. ఆ తర్వాత బియ్యం వద్దు, గోధుమలు తినండి అన్నారు. ఇప్పుడేమో అందరూ చిరుధాన్యాల మీద పడ్డారు.

అసలు ఇవేవీ తెలీకుండా ఏ సీజన్‌లో ఏది దొరికితే అది తిని తొంభైయేళ్ళు హాయిగా బతికిన మా తాతలూ, తండ్రులూ ఇవన్నీ వింటే ఏవంటారో!

ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కాదనడానికి నేనెవర్ని! కానీ నేను కోరుకునేది మటుకు ఒక్కటే.. అదేమిటంటే…

“సర్వేజనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు..” అనీ..

Exit mobile version