హే, భగవాన్..!

8
2

[dropcap]ఎ[/dropcap]వరో పంచివెళ్ళిన
కాలం గదిలో పుచ్చిపోయిన భావాలను
మనసు మడిలో జాగ్రత్తగా విత్తుకుని
కలుపు భాష్యాలను
ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుని
నీవాడైన వాణ్ణి,
నీ తోడునీడైన వాణ్ణి
నీవే బయటకు దయచేయమన్నావు
ఇప్పటి ఆధునికతకు పనికిరాడనుకుని
నీ జగతి ప్రగతికి ఒక అడ్డం అనుకుని

తప్పులేదనో, తప్పటం లేదనో
పక్కకి తప్పుకున్నాడు మౌనంగా

వివేకాన్ని ఉండచుట్టి విసేరేసి
అవివేకపు పుచ్చుకఱ్ఱను ఆసరా చేసుకుని
నీ కోటగోడలను నీవే బద్దలుకొట్టేస్తుంటే
నీ రక్షణకు నీవే నీళ్ళొదుకొంటుంటే

కసిరి, తనను చీదరించుకుంటున్న నీపై
కన్నీళ్ళ జాలిచూపులు కనబరుస్తూ
వెళ్ళిపోయాడు వెనక్కి దూరంగా
మరింత మరింత దీనంగా

దూర దూరంగా నడుస్తూ
ప్రచ్ఛన్నంగా తిరుగాడుతున్న ప్రమాదం
దగ్గరకొచ్చేస్తూన్న చప్పుళ్ళు
వినపడుతున్నాయి విస్పష్టంగా
తెగబడి దాడిచేసే
ఆనవాళ్లు అగుపడుతున్నాయి
ఇప్పుడిప్పుడే స్పష్టంగా.. అతి స్పష్టంగా

ప్చ్, దురదృష్టం
నీ ఆఖరికేకలు వినపడవేమాత్రం
అల్లంత దూరానకెళ్ళిపోయిన ఆయనకి
వినపడినా,
నీకై వెనక్కి రావాలని అనుకున్నా..
సాయంవచ్చే సమయమూ లేదు..

ఒప్పుకున్నా, లేకపోయినా
తప్పుడు భావనలతో బతుకును దాటేసిన
నీకిప్పుడంతా
సమయం మిగిలున్నంతవరకంతా
భయం, బాధ, అశాంతి
బొంది కలుగులోంచి ప్రాణం బయటపడితే
అనంతానంత ఆత్మశాంతి
హే, భగవాన్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here