[dropcap]తె[/dropcap]ల్లవారుజామున రెండు గంటల సమయం.. నగరం అంతా నిద్రపోతుంది. నిశ్శబ్దంగా ఉన్న చెరువులో ఒక్కసారిగా అలజడి. గజాసురుని గర్భం నుండి వచ్చిన శివుడిలా చెరువులోని నీళ్లను చీల్చుకుంటూ వినాయకుడు పైకి లేచాడు. చేతులతో నీళ్లను అటూ ఇటూ పక్కకు తోస్తూ దారి చేసుకుంటూ గట్టుమీదికి వచ్చి మెల్లిగా నడుచుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు. రోడ్డుమీద లైట్ల వెలుతురు.. సీసీ కెమెరాలు.. తల పంకించి ముందుకు నడిచాడు. కొంత దూరం నడిచి ఓ అపార్ట్‌మెంట్ ముందు ఆగాడు. తాళం వేసిన గేట్లోంచే లోపలికి వెళ్ళాడు. లిఫ్ట్‌లో నిలబడి పైకి వెళ్లి 401 ఫ్లాట్ ముందు ఆగాడు. కాలింగ్ బెల్ నొక్కబోయి వద్దనుకుని మెరుపుగా డోర్ లోంచి బెడ్ రూం లోకి వెళ్ళాడు. గాఢంగా నిద్రపోతూ కనిపించాడు గణపతి. తొమ్మిదిరోజులు గణేశుని ఉత్సవాలు ఘనంగా జరిపించి రాత్రి ఎనిమిది గంటల వేళ నిమజ్జనం చేసి వచ్చాడు. తొమ్మిదిగంటలకల్లా భోజనం ముగించి బెడ్ ఎక్కాడు. అలసిన శరీరానికి క్షణాల్లో నిద్ర ఆవహించింది. గణపతి అపార్టుమెంటు సెక్రెటరీ.
“గణపతీ” పెద్దగా పిలిచి నాలుగుసార్లు వేగంగా గట్టిగా తట్టాడు గణపతిని వినాయకుడు. గుర్రుపెట్టి నిద్రపోతున్న గణపతి ఉలిక్కిపడి లేచి చికిలించిన కళ్ళను విప్పారించి “స్వామీ.. మీరు.. మీరు” మాటలు రాక సంభ్రమంగా చూశాడు.
“నన్ను నిమజ్జనం చేసి వచ్చి పనైపోయిందని హాయిగా నిద్ర పోతున్నావా?” కోపంగా చూశాడు వినాయకుడు.
“స్వామీ అపచారం.. అదేంమాట.. అయ్యో ఏమిటి ఈ అవతారం.. నీళ్ళు కారుతూ ఈ తడి బట్టలు ఏంటి?”
రొప్పుతూ చిరాగ్గా అటూ ఇటూ చూశాడు వినాయకుడు.
“స్వామీ.. ముందు మీరు కూర్చోండి” అంటూ సింగిల్ సోఫా చూపించాడు. వినాయకుడు అయిష్టంగా సోఫాలో కూర్చున్నాడు. గణపతి వినాయకుడి పాదాల దగ్గర కూర్చొని తల పైకెత్తి ప్రేమగా అడిగాడు.
“స్వామీ.. ఏంటి అలా ఉన్నారు.. కోపం వచ్చిందా? ఎందుకు? నేనేం తప్పు చేశాను? ప్రతి అపార్టుమెంటులో గణేశుని ఉత్సవాలు చేసుకుంటున్నారని మేమూ చాలా శ్రమకోర్చి క్రితం సంవత్సరం నుండి మొదలు పెట్టాం. మీ ఆశీస్సులతో నిర్విఘ్నంగా జరుపుకుంటున్నామని సంతోషించాం. ఇదేంటి స్వామీ మీకెందుకు కోపం వచ్చింది మా పూజలో ఏమైనా పొరపాటు జరిగిందా? మీకు ఇష్టమైన నైవేద్యాలు ఏమైనా అందలేదా? దయచేసి సెలవీయండి”
ముఖం తిప్పుకున్నాడు వినాయకుడు.
“స్వామీ.. నన్ను నిలదీయటానికి వచ్చి మళ్ళీ సంశయం దేనికి చెప్పండి? మీరు ఏది చెప్పినా నేను శిరసావహిస్తాను” చేతులు జోడించి పాదాలు కళ్ళకద్దుకుని భక్తిభావంతో అన్నాడు గణపతి. గణపతి వైపు కినుకగా చూశాడు వినాయకుడు
“స్వామీ” దైన్యంగా చూశాడు గణపతి.
“ఏం చెప్పను గణపతీ.. బాధగా ఉంది నీ చిన్నతనంలో నువ్వు నా పూజను ఎలా చేసుకునే వాడివి గుర్తుందా?”
“గుర్తులేకేం స్వామీ.. నాన్నగారు తన సైకిల్‌పై నన్ను తీసికెళ్లే వారు రకరకాల పత్రిని సేకరించే వాళ్ళం. కొన్ని మా ఇంటి పెరట్లోనే ఉండేవి. ఇరవైఒక్క పత్రాలతో పూజించేవాళ్ళం. మట్టి గణపతిని ఎలా చేయాలో నాన్నగారు నేర్పారు. పూజ అయిపోయి ఉద్వాసన చెప్పిన తర్వాత పెరట్లో ఒక చెట్టు మొదట్లో పూజించిన వినాయకుడ్ని భక్తిభావంతో ఉంచేవాళ్ళం”
“అవునా.. మరి ఇప్పుడు?”
“ఇప్పుడంటే అంతా మారిపోయింది గద స్వామీ”
“ఏం మారిపోయింది?”
“అంటే.. పల్లె నుండి పట్టణానికి వచ్చి ఇప్పుడు నగరానికి వచ్చాం”
“వస్తే”
“ఇప్పుడన్నీ అపార్టుమెంట్సు.. ఇండిపెండెంట్ హౌసెస్ అంతగా లేవుగా స్వామీ”
“నేను అడిగేది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి” చిరాగ్గా చూశాడు వినాయకుడు.
“మరోసారి అడగండి స్వామీ అర్థం చేసుకుంటాను” నమ్రతగా అన్నాడు గణపతి.
“ఇలా విగ్రహాలు తయారు చేయండి.. ఇలా పూజించండి అని నేను కోరానా?”
“ఊరుకోండి స్వామీ.. మీరెందుకు కోరుతారు? అయినా మీరు మాకేమన్నా కనిపిస్తారా ఏంటి? ఏదో అదో తృప్తి.. మీ మీద భక్తితో మేమే ఇలా ప్లాన్ చేస్తున్నాం”
“ఇదేం ప్లాను?”
“అంటే.. అదిగాదు స్వామీ”
“గణపతీ.. నేను కాస్సేపు మాట్లాడతాను విను”
“అలాగే స్వామీ”
“గణపతీ.. మీ ప్రేమతో అభిమానంతో ఊపిరి సలపని పరిస్థితి అంటే ఎంతో కొంత అర్థం ఉంది.. ఇదేమిటి? పోటీలు పడి నా విగ్రహాలను తయారు చేయిస్తూ క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరి కొన్ని వందల వేల సంఖ్య పెంచుతూ గొప్పలు చూపించడమే మీ ఉద్దేశమా? నన్నునన్నుగా ఉండనీయక ఇలా నన్ను ఎందుకు మారుస్తున్నారు? అపార్టుమెంటు కడుతున్నారంటే నాలో భయం కలుగుతుంది”
“భయం ఎందుకు స్వామీ”
“ప్రతి సంవత్సరం ఇంకా ఎత్తు.. ఇంకా ఎత్తు అంటూ నా ఎత్తులు పెంచేస్తున్నారా.. కెమికల్స్ ఉపయోగించి నన్ను తయారు చేస్తున్నారా.. అసలు ఈ జన ప్రవాహం ఏమిటి.. ఈ ధ్వనులు ఏంటి.. ఈ పోలీసు బలగాలు ఏంటి? సిసి కెమెరాలు ఏంటి? ఇంత కోలాహలంగా నా నిమజ్జనం జరపాలా? ఏంటి ఈ ఖర్మ.. ఏంటి నాకీ దశ?”
“అదేంటి స్వామీ అలా అంటారు? మిమ్మల్ని ఇంకా ఘనంగా పూజించుకుంటున్నామని మీరెందుకు అర్థం చేసుకోరు? మీరు నెగటివ్‌గా ఆలోచించి మమ్మల్ని తప్పు పడతారేంటి?” గణపతికి వినాయకుడి మీద కాస్త కోపం వచ్చింది.
“ఆపు గణపతీ.. నా గోడు నేను చెప్పుకుందామని వస్తే నువ్వేంటి ఇంకోలా మాట్లాడతావు?”
“స్వామీ”
“ప్రతి వీధిలో నన్ను పెట్టమని ఎవరు చెప్పారు?”
“ప్రేమ స్వామీ.. ప్రేమ.. పోనీ భక్తి అనుకోండి”
“నన్ను ముంచే భక్తి నాకెందుకయ్యా.. ఆగు.. నీకు అర్థం అయ్యేలా చూపిస్తాను.. ఇలా చూడు” అంటూ వినాయకుడు తన కుడి అరచేతిని గణపతి కళ్ళ ముందు ఉంచాడు. ఆ అరచేయి పెద్దగా అయి మరి కొన్ని క్షణాల్లోనే ఇంకా పెద్దగా మారి ఓ వీధిని చూపెట్టింది.
“స్వామీ”
“ఆ ఇంటి యజమానికి గుండెనొప్పి వచ్చింది. అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఈ ట్రాఫిక్‌లో అంబులెన్స్ రాలేక ఎన్ని అవస్థలు పడుతుందో చూడు అదిగో ఆ వీధిలో నా హోరే.. వెనక్కు మళ్లిందా అంబులెన్స్.. మళ్లీ ఈ వీధిలోకి వచ్చిందా?
ఇక్కడా అదే హోరు”
“స్వామీ”
“అదిగో.. అతని ప్రాణం పోయింది”
“స్వామీ” బాధగా చూశాడు గణపతి. అరచేతిని గుప్పిటలా చేసుకుని ఎప్పటిలా అయిపోయాడు వినాయకుడు.
“నా పూజకు ఓ జానెడో.. మూరెడో మట్టి విగ్రహం ఇంత పత్రి ఇవి చాలవా? గణాలకు అధిపతినని.. విఘ్నాలకు అధిపతినని అంటూ ఓ.. నన్ను ఇంత ఎత్తులో నిలబెట్టి నన్ను ఎందుకు అవస్థపెడతారు? నేనే వద్దంటున్నాగా”
“అలా అంటే నేనేం చెప్పగలను స్వామీ.. ఏదో మా సంతోషం మా సరదా.. దానికోసం మేం ఎంత కష్టపడుతున్నాం తొమ్మిది రోజులు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించడంలేదా?”
“నేను చెప్పేది నీకు అర్థం కావటంలేదు.. నా పేరున ఇంత భారీఎత్తున బలవంతపు చందాలు వసూలు చేసి ఇంతింత వేదికలు పెట్టి అంత ఎత్తులో వినాయకుడ్ని కొని తొమ్మిదిరోజులు పూజలు చేసి నైవేద్యాలు పెట్టి నన్ను ఎందుకింతగా ఇరుకున పెడుతున్నారు? అయినా గణపతీ.. నా పూజ ఏంటి? జరిగే కార్యక్రమాలు ఏంటి? నా కథను హరికథగా చెబితే పదిమంది కూడా ఉండరు. అదే.. రికార్డింగు డాన్సులు డీజేల ఉదృతం మ్యూజికల్ నైట్స్ అంటే ఈలలు వేస్తూ గోలగా అరుస్తూ పిచ్చిపట్టిన వాళ్ళలా ఎగురుతుంటారు. మీ సంతోషం సరదా కోసం నన్ను ఈ రకంగా ఉపయోగించుకుంటారా? నీ చిన్నప్పటిలా నాకు ఇరవైఒక్క పత్రాలతో ఎంతమంది పూజ చేస్తున్నారు?”
“ఇరవైఒక్కపత్రాలు అంటే ఈరోజుల్లో కష్టంగదా స్వామీ చెట్లు అంతగాలేవు అన్నన్ని పత్రాలు ప్రయత్నించినా దొరకటం లేదు కూడా.. మార్కెట్లో దొరికే పత్రినే తెస్తున్నాం.. అమ్ముకునే అతను లాభాలు రావాలని రకరకాల ఆకులు కట్టగట్టి ఇస్తున్నాడు.”
“అయినా నేను భరిస్తున్నాను గదా.. ప్రజలంతా బాగుండాలనే నేను కోరుకుంటాను.. అదే ప్రజలంతా కల్సిమెల్సి నా కెందుకు సంతోషం కలిగించరు? ఇలా నేను ఆలోచించడంలో తప్పేముంది?”
“కరెక్టే స్వామీ”
“మీరేంటో.. మీకే తెగ భక్తి ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.. మీరు ఎటు వెళ్ళిపోతున్నారో మీకు తెలవడం లేదు నాపట్ల భక్తి శ్రద్ధ ఉన్నట్లు నాకు ఏమాత్రం కనిపించటం లేదు నిన్నునువ్వు ఎంత సమర్థించుకున్నా.. నీకంటే తెలవదు గాని నాకు తెలవదా? నేను చూడనా?”
“స్వామీ”
“ఇదిగో ఇలా చూడు” అరచేతిని గణపతి కళ్ళ ముందు ఉంచాడు. ఆ అరచేయి పెద్దగా అయి ఇంకా పెద్దగా మారి కూర్చున్న పదిమంది సమూహాన్నిచూపించింది.
“వీళ్లను గుర్తుపట్టగలవా?”
“ఎందుకు గుర్తుపట్టను? వాడు అజయ్..ఇంకోడు సత్యం.. వాడు భద్రం అంటూ వరుసగా అందరి పేర్లు చెప్పాడు గణపతి.
“వీళ్లంతా మీ వీధిలో యువకులే కదా.. నీకు సహాయం చేసిన వాళ్లే గదా”
“అవును స్వామీ..అయ్యో..అదేంటి? ఆ బాటిల్స్.. ఛ.. ఛ..వాళ్లు చాలా మంచి పిల్లలు..ఏదో కూల్ డ్రింక్స్…”
“పైకి చూడు”
“మం…జీ.. ర వైన్స్.. స్వామీ.. ఇదేమిటి?” అయోమయంగా చూస్తున్న గణపతి వైపు చూడాలన్పించక చేతిని గుప్పిటగా మలిచాడు వినాయకుడు.. తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు గణపతి.
“నాలాగా ఇవన్నీ నువ్వు చూడలేవు కాబట్టి నీకు చూపించాను.. నిమజ్జనానికి తాగి తందనాలు ఆడుతూ తీసుకెళ్తారా?”
“ఇలా చాలా పెద్ద తప్పు స్వామీ.. మీ ఎదురుగా గుంజిళ్ళు తీస్తా.. వాళ్లను క్షమించండి”
వినాయకుడు మౌనం వహించాడు.. కొన్నిక్షణాల తర్వాత గణపతే వినమ్రంగా అడిగాడు.
“స్వామీ మమ్మల్ని ఏం చేయమంటారు?”
“కాలనీ మొత్తంమీద ఒక ఒక వినాయకుడ్ని పెట్టుకోండి.. ఇలా వీధి వీధికి కాదు.. వీధిలో ఉన్న ప్రతి అపార్టుమెంటులో కాదు.. ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారు.. అంతా అక్కడికి వెళ్లి దండం పెట్టుకోండి”
“అంటే.. సెంటిమెంటుగా ఫీల్ అవుతాం కద స్వామి.. మేమంటే క్రితం సంవత్సరం నుండి ప్రారంభించాం.. మిగతావాళ్లు ఎన్నో సంవత్సరాలుగా….”
“పిచ్చివాడా.. మీరంతా నా బిడ్డలే.. మిమ్మల్ని శపిస్తానా? మీరు ఇలా చేస్తే ఇంకా గొప్ప ఆశీస్సులు ఇచ్చి మీ బాగు కోరుకుంటాను. మీ మంచి మాట.. మీ మంచి మనసు.. వీటిని నేను ఇష్టపడతాను గాని ఇలా దర్భంగా చూపించేవన్నీ నాకెందుకు? ఏ ఆడంబరాలూ నన్ను చేరవు.. మీ భక్తి మాత్రమే నన్ను చేరుతుంది. ఒకరోజా మూడురోజులా.. తొమ్మిది రోజులా అని ఏమీ ఉండదు. మీ శక్తి కొద్ది మాత్రమే ఏర్పాట్లు చేసుకోండి.. పూజించండి.. గణపతీ.. నిమజ్జనం తర్వాత నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా”
“ఏముంది.. చెరువులో హాయిగా విశ్రాంతి తీసుకుంటారు అంతే కదా”
“అందుకే అన్నాను నీ పని అయిపోయింది హాయిగా నిద్ర పోతున్నావని.. లే.. నాతో రా.. పద.. చూపిస్తాను” అంటూ చేయి అందించాడు వినాయకుడు.. క్షణాల్లో ఇద్దరూ ఇక్కడ మాయమై చెరువు దగ్గర ఉన్నారు. తెల్లవారుఝామున మూడుగంటల సమయం. “స్వామీ.. ఆ చప్పుళ్ళు ఏంటి?” అమాయకంగా అడిగాడు గణపతి.
“మీ చప్పుళ్లు అయిపోయాయిగా.. ఇక ఈ చప్పుళ్ళు ఉంటాయి.. అదిగో.. అటు చూడు”
కొంతమంది చెరువు ఒడ్డున వినాయకుళ్లను సుత్తితో కొడుతూ ఉన్నారు.
“చూస్తున్నావా? తల పగిలి.. ముఖం పగిలి.. కళ్ళు చిదిమి.. చేతులు కాళ్ళు విరగొట్టి.. ఇదిగో.. మీ భక్తిభావం ఇలా వుంది”
“స్వామీ.. ఇక చెప్పకండి” రెండుచెవులూ మూసుకున్నాడు గణపతి.
“వినటానికే నువ్వు ఇష్టపడటంలేదు.. బాధ భరిస్తుంటే నాకు ఎలా ఉంటుంది? నా విగ్రహంలో ఉండే ఇనుపచువ్వలు మిగతా మెటీరియల్ వాళ్ళకు కావాలి.. అవి అమ్ముకుంటే డబ్బు వస్తుంది”
“ఇలా తప్పు స్వామీ.. మహాపరాధం” చెంపలు టపటప వాయించుకున్నాడు గణపతి. ఒక్కసారిగా క్రిందికి వాలిపోయి వినాయకుడికి సాష్టాంగ దండ ప్రణామం చేసాడు.
“ఏమండీ.. ఏవండీ” పరుగున వచ్చి గణపతిని నిద్రలేపింది రూపాదేవి.
“ఏంటి?” అంటూ మేల్కొన్నాడు గణపతి.
“నాకు ఒక కల వచ్చిందండీ.. మీరు ఎప్పుడు లేస్తారా.. నా కల గురించి ఎప్పుడు చెబుదామా అని.. అరగంటనుండి ఎదురు చూస్తున్నాను. ఇక ఇప్పట్లో లేచేట్టులేరని లేపుతున్నాను. లేవండి” ప్రాధేయపూర్వకంగా అంది రూపాదేవి. లేచి కూర్చున్నాడు గణపతి. కల అంతా వివరంగా వివరించింది రూపాదేవి. భయంతో వణికిపోయిన గణపతి కాసేపటికి తేరుకున్నాడు.
“రూపా.. భక్తి పేరు మీద మనం ఏం పొరపాట్లు చేస్తున్నామో తెలిసింది. ఈసారినుండి మనం మట్టి వినాయకుడ్ని పూజించుకుందాం.. మనకు మేలు కలుగుతుంది.. దేవుడు సంతోషిస్తాడు” భక్తిభావంతో అన్నాడు గణపతి.
“నిజమే.. అలాగే చేద్దాం” ఉత్సాహంగా అంది రూపాదేవి.