[dropcap]ప[/dropcap]చ్చదనపు దారంతా
మండుటెండతో ముచ్చట్లను సోకుచేస్తోంది
రాత్రవగానే చీకటి స్నానానికి దీపాల నలుగు పెట్టుకుని
వాహనాలను వాద్య సమ్మేళనం చేస్తుంది….
హైవే అంటే అంతే
ఒంటరితనాన్ని మోస్తున్నట్టుంది
అంతలోనే నవ్వుల పందిరవుతుంది
గుదిబండలను మోస్తుందికానీ
ఎవరికీ గుదిబండ కాదు
ఇప్పుడు లాక్ డౌన్ అనుభవపు
పహారాలో ఉంది
లాక్ డౌన్ అనుభవాలంటే ఏంచెబుతుందో
దాచుకున్నవలస కార్మికుల ఆనవాళ్ళను వెతుకుతుందో
చుట్టూ ప్రవహించే పేదరికపు నదులను చూపుతుందో
రవాణా చూపుడువేలు కదా హైవే అంటే
ఆ చూపుడువేలిప్పుడు
ఖాయిలా పడ్డ పరిశ్రమలా బోసిపోయిందని దుఃఖించందెవరని
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నారెవరో
పడిలేవటం కొత్తాకాదు
పడిపోవటం తెలియనిదీ కాదు
పడిపోయిన ప్రతిసారీ
ఎన్ని జీవితాలను పారబోయాలో
ఎన్ని నొప్పులు దాచుకోవాలో
బరువు దింపుకునే వీలూలేదు
బరువు మోసే వ్యవస్థాలేదు
అవస్థలే ఆదరువుగ
మూడు పువ్వులు ఆరు కాయలుగా
ఆకలి వర్థిల్లుతుంటే
హైవే వరాలతల్లి ఎంతమాత్రమూ కాదు
కొత్త రియాలిటీ చెక్ బారోమీటర్లే దారంతా…
బారో(borrow)చేసేందుకు రూపాయిలేని చోట
మనిషి శిలగా మారినా
ఉలిగా మారినా
సరిగమలు పలకని శిలామురళి
రవళించని జీవనరాగమై
నిట్టూర్పుల దుఃఖాన్ని దాచుకుని హైవే
స్వాగతాన్నో వీడ్కోలో పలికే
జీవనవనంగా మారక తప్పటంలేదు
ఉద్వేగాల మారకమూ తప్పటంలేదు