హిమాచల్ యాత్రానుభవాలు-1

    1
    3

    [box type=’note’ fontsize=’16’] హిమాచల్ ప్రదేశ్‌లో తాము జరిపిన పర్యటన వివరాలను తెలుపుతూ, తాము పొందిన అనుభూతిని పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరిహిమాచల్ యాత్రానుభవాలు” అనే ఈ యాత్రాకథనంలో. [/box]

    [dropcap]మం[/dropcap]డు వేసవి భానుడి భగభగల వేడిని తప్పించుకోవడానికి హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ, మనాలి, సిమ్లా వెళ్లాలని అనుకున్నాం. అందుకు కావలసిన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు సేకరించి రెండు నెలల ముందుగా మాకు అనుకూలమైన తేదీలను బట్టి ముందుగా రైలు ప్రయాణం కోసం టిక్కెట్ల లభ్యత పరిశీలించి ముందుగా అనుకున్న తేదీలలో మూడవ తరగతి ఏసీలో బుకింగ్ చేసుకున్నాము.

    తరువాత మేము వెళ్లే ప్రదేశాలలో ఉన్న వివిధ తరగతుల హోటళ్ల వివరాలను యాత్ర సైట్స్‌లో పరిశీలించి నచ్చిన హోటల్‌ను బుకింగ్ చేసుకుని వెళ్ళవలసిన రోజు కోసం ఆతృతగా ఎదురు చూస్తూ రెండు నెలలు గడిపాము.

    ఈ మధ్య కాలంలో కులూ, మనాలి, సిమ్లాలో చూడదగిన ప్రదేశాలను తెలుసుకున్నాము. చాలా ఆన్‌లైన్ యాత్ర సైట్స్, ట్రావెల్ ఏజెంట్లు పైన చెప్పిన ప్రదేశాలకు విహార యాత్ర ఏర్పాట్లు చేసి తిప్పి చూపిస్తారు. కానీ మేము వారి మీద ఆధారపడి వెళ్లకుండా స్వయంగా ఏర్పాట్లు చేసుకున్నాము. అందువల్ల ఎక్కువ రోజులు, ప్రదేశాలు తక్కువ ఖర్చుతో చూశాం.

    మే 1వ తేదీ సికింద్రాబాద్ నుండి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో బయలుదేరి ఢిల్లీ చేరుకుని కల్కాజిలో ఉండే మా అమ్మాయి ఇంటికి చేరుకున్నాము. రెండు రోజులు మనవరాలితో ఆడుకుని నిర్ణీత తేదీన బుక్  చేసుకున్న బస్ ఎక్కడానికి హిమాచల్ భవన్ చేరుకున్నాము.

    మా యాత్ర బేస్‌గా మనాలి పెట్టుకున్నాము. అందుకని ఢిల్లీ నుండి మనాలికి బస్ ప్రయాణం ఎంచుకున్నాము. మనాలికి 70 కిమి దూరంలో మండి ఎయిర్‌పోర్ట్ ఉంది. ట్రైన్‌లో  చండీగఢ్, అంబలా, జోగీందర్ నగర్ స్టేషన్స్ నుండి బస్‌లో చేరవచ్చు.

    కానీ మేము ఢిల్లీ నుండి నేరుగా మనాలికి బస్‌లో వెళ్ళటానికి ఇష్టపడ్డాము. అనేక ప్రైవేట్ బస్‌లు ఉన్నాయి. కానీ మా అల్లుడు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ బస్‌లు సురక్షితం, సుఖప్రయాణం అని అందులో బుక్ చేశారు. ప్రయాణం చాలా చక్కగా ఉంది.

    ఢిల్లీ మండి హౌస్ మెట్రో స్టేషన్ దిగి ఆటోలో హిమాచల్ భవన్‌కి వెళ్ళాము. సాయంత్రం ఆరున్నర, ఏడున్నరకు బస్సులున్నాయి. మేము ఆరున్నర బస్‌లో బయలుదేరి మనాలి ఐదున్నరకి చేరాము.

    రాత్రి ప్రయాణము కావటంతో బైటకి ఎక్కువ చూడలేకపోయము.

    బస్ దోవలో రెండు సార్లు రాత్రి భోజనానికి, తెల్లవారుజామున కాలకృత్యాలకి అగుతుంది. మండి అనే ఊరు నుండి మనాలి దాకా దాదాపు రెండు గంటలకు పైగా రోడ్డు ప్రక్కగా ప్రవహించే బియాస్ నది, కొండలు, లోయలు, ఉదయించే బాల భానుని ముద్దు మోము, దారుల వెంట వికసించిన పూలు చూసి తరించిన అనుభూతి వర్ణనాతీతం.

    బస్‌లో కొందరు మాత్రమే ప్రకృతి అందాలను చూస్తున్నారు. మనకి కనపడని ప్రకృతి అందాలు.

    మా యాత్ర తొలి రోజే గొప్ప అనుభూతిని ప్రోగుచేసుకుని యాత్ర మొదలు పెట్టాము. తలుచుకుంటేనే ఆనందం కలుగుతుంది.

    మాములుగా అందరూ చేసేది వెళ్లే చోట ఊరి మధ్యలో హోటల్స్ తీసుకోవటం. ఇరుకు ప్రదేశాలని పార్కింగ్ లేదని, వ్యూ సరిగా లేదని ఫీల్ అయి ప్రయాణ ఆనందాన్ని తగ్గిచ్చుకుంటాము.

    అలా కావద్దని మేము మనాలికి 9 కిమి దూరంలో ఉన్న 18 మైల్ లేదా బ్రాన్ అనే ఊరిలో ఢిల్లీ లడాక్ హైవే ప్రక్కన ఉన్న అనేక హోటల్స్‌లో ఒక చిన్న హోటల్ –  హోటల్ మనాలి డ్రీమ్స్‌లో రెండవ అంతస్తులో రోడ్డు, నది అభిముఖంగా ఉన్న గది తీసుకున్నాం పదిహేను రోజులకి.

    అదొక బడ్జెట్ హోటల్. ఇంటర్నెట్, టీవీ, భోజన వసతి ఉన్నాయి. రూమ్స్ నీట్‌గా పెద్దగా ఉన్నాయి. హోటల్ స్టాఫ్ చాలా స్నేహపాత్రులు. ఫుడ్ తాజాగా రుచిగా ఉంది. రూమ్ లోకి వెళ్లిన తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తయారై క్రింద ఉన్న రిసెప్షన్‌కి వచ్చి మేనేజర్‌తో మాటకలిపి చుట్టూ ప్రక్కల ప్రదేశాలకు చేరటానికి వసతులు గురించి కనుకున్నాము. అన్ని యాత్రాస్థలాల లాగా టాక్సీలు ఉంటాయన్నారు. కావాలంటే ఏర్పాటు చేస్తామన్నారు. కానీ మేము తొందరపడ దలుచుకోలేదు.

    మాకు చాలా సమయం ఉంది. లోకల్‌గా ఉండే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో తిరగాలని అనుకున్నాము. అందువల్ల స్థానికులతో మాటకలపొచ్చు, లేదా పరిశీలించొచ్చు. ముందుగా హోటల్ పరిసర ప్రాంతాలు తిరిగి వద్దామని నడక ఎంచుకున్నాము. హోటల్ ఎదురుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల కనపడింది. శుభ్రంగా తయారైన విద్యార్థులు క్రమశిక్షణతో ప్రార్థనకి వెళ్తున్నారు. వాళ్లని చూసి బాల్యం గుర్తుకొచ్చింది. వారి ముఖాల్లో చదుకోవలనే ఆసక్తి స్పష్టంగా కనిపిస్తున్నది.

    ఇంకొంచం ముందుకి నడిస్తే విష్ణు ఆలయం ఉంది. చిన్న గుడి. మేమూ లోపలికి వెళ్లి పూజలో పాల్గొన్నాము. పూజారి ఆదరంతో పలకరించి స్వయంగా దేవునికి పూలు పెట్టనిచ్చారు. పూలు కొనలేదు. దోవలో విరగబూసిన అడవి గులాబీలు తెంపి తెచ్చాము. గుడి ప్రక్కగా ఉన్న చిన్న కాలిబాట వెంట  వెళితే నదిని దగ్గరగా చూడవచ్చు అంటే  వెళ్ళాము.

    నది ప్రవాహం నాలుగు రకాలు. నది జన్మస్థానంలో సున్నితంగా ప్రవహించి, నీటి ఉధృతిని పొందుతూ కొండల్లో ఎత్తయిన శిలలపై నుండి దూకి ప్రవహిస్తూ, మహా ప్రవాహంగా ఉబుకుతూ పరవళ్లు తొక్కుతూ సుదూర తీరాన్ని చేరాలని ప్రవహిస్తూ గమ్యానికి ముందు అలసి సొలసి తన గర్భంలో ఉన్న సారాన్ని వదిలి సాగర గర్భం చేరటం చివరి దశ అని చదివిన గుర్తు.

    మన నదులు వర్షాధారాలు. హిమాలయ నదులు జీవనదులు. అందుకే చూపరులని ఆకర్షిస్తాయి. నది దగ్గరకు వెళ్ళిన మేము మైమరిచిపోయాము. ప్రవాహపు చప్పుడు చెవులకు యింపుగా ఉంది. నది లోకి దిగకుండా దూరం నుండీ చూసేలా రాళ్ళతో గోడ కట్టి ఉంది. అంతే కాదు నది దగ్గరకు వెళ్ళటం ప్రమాదం అని హెచ్చరికలు కలవు.

    కొద్ది సేపు ఉండి వెనక్కి వచ్చిన మమ్మల్ని గుడి పూజారి ‘నది చూసారా?’ అని ప్రశ్నించారు. ‘నది గురించి తెలుసా’ అన్నారు. తెలియదన్నాము.

    అప్పుడు ఆయన చెప్పిన కథ మీకు చెబుతున్నాను.

    (సశేషం)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here