Site icon Sanchika

హిమాచల్ యాత్రానుభవాలు-2

[box type=’note’ fontsize=’16’] “హిమాచల్ యాత్రానుభవాలు” అనే ఈ యాత్రాకథనంలో బియాస్ నది పుట్టుపూర్వోత్తరాలను తెలుపుతూ, నదీ పరివాహక ప్రాంతంలో తాము పొందిన అనుభూతిని పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరి. [/box]

[dropcap]మ[/dropcap]నాలి యాత్రలో మధురానుభూతి జీవనది బియాస్. నది మూలం ఢిల్లీ నుండి మనాలి రోడ్డుమార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మండికి కొంచం ముందు ఉంది. దాదాపు 3-4 గంటలు బియాస్ నది ప్రవాహంతో పాటు పయనిస్తూ పచ్చని లోయలు, జలపాతాలు, సెలయేళ్ళు, హిమాలయ పర్వతశ్రేణులు, ప్రకృతి ఒడిలో అద్భుతమైన సూర్యోదయ అస్తమయాలు కన్నులపండుగ చేస్తాయి. మనస్సును ఆకట్టుకుంటాయి. మరల మరల ఆ అనుభూతిని కావాలని కోరుకుంటాము. ప్రకృతి ఒడిలోని బియాస్ నది మానవ నాగరికతకు సజీవసాక్షి.

హిమాలయ పర్వతశ్రేణుల్లో సముద్రమట్టానికి 14308 అడుగుల ఎత్తులో రోహతాంగ్ పాస్‌లో ఆవిర్భవించి కులు లోయ నుండి తన ఉపనదులతో కలసి ప్రవహిస్తూ “మండి” నుండి కాంగ్రా లోయకీ, అక్కడ నుండి పంజాబ్ లోకి సట్లెజ్ నదితో కలసి ప్రవహించి సింధు నదికి ఉపనదిగా పశ్చిమాన పాకిస్తాన్లోకి ప్రవహిస్తూ ఉంటుంది.

అలెగ్జాండర్ చక్రవర్తి భారతావని పై క్రీ.శ. 360లో దండయాత్ర సాగిస్తుండగా ఆ వీరుని నది ఆవలికి పోనివ్వక ఆపింది బియాస్. 8 ఏళ్ల నిరంతర యుద్ధాలతో విసిగి అలసి కుటుంబానికి దూరంగా ఉండి నీరసపడిన సైనికులు ఎంతమాత్రం యుద్ధానికి ఇష్టపడక వెనుదిరిగి దేశానికి వెళ్ళటానికి సిద్ధపడ్డారు. వారిని బియాస్ నది ఒడ్డుపై మూడురోజులపాటు ఎంతగా నచ్చచెప్పాలని చూసినా వీలుకాక దేశానికీ తిరిగి వెళ్తూ మార్గమధ్యలో మరణించాడని చారిత్రక కథనం. బియాస్ నదికి పురాతన పేరు ‘విపిష’ అనగా హద్దులులేనిది. ‘అర్జికుజ’గా వేదాలలో, ‘హైఫసిస్’గా పురాతన గ్రీకులో చెప్పబడినది. అంతేకాదు వ్యాస మహర్షి నిర్మిత వ్యాసకుండం అనే చోటనుండి ఆరంభం అవుతున్నందున దానికి ‘వ్యాస’ అనే పేరొంది. కాలక్రమేణా బియాస్‌గా మారిందిట. మహాభారతంలోని సభాపర్వంలో విపాషా లేదా వ్యాస నది గురించిన ప్రస్తావనవుంది.

ఇంకొక పురాణ గాథ ప్రకారం సప్తఋషులలో ఒకడైన వశిష్ఠుని కల్మాషపాద రాజు రాజగురువుగా నియమించి గౌరవించాడు. కానీ ఆ పదవిని కోరుకుంటున్న మరొక గొప్ప జ్ఞాని విశ్వామిత్రుడు అసూయతో రగిలిపోతూ తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. వసిష్ఠ ఋషికి 100 మంది కుమారులు. ఒకనాడు అతని పెద్ద కుమారుడు నడుస్తున్న రహదారిలో రాజు కల్మాషపాదుడు ఎదురువచ్చి దారి ఇమ్మని అడిగితే వసిష్ఠుని కుమారుడు “రాజా! రహదారిపై నాకే మొదటి హక్కు” అని దారివ్వలేదు. అందుకు కోపించిన రాజు వసిష్ఠ కుమారునికి కొరడా దెబ్బలతో దండించగా కోపంతో అతడు “నీవు మానుషమాంసం తిందువుగాక” అని శపించాడు .

అదృశ్యరూపంలో అక్కడే ఉన్న విశ్వామిత్రునికి తగిన అవకాశం దొరికిందని భావించి తన ఆధీనంలో ఉన్న ఒక రక్కసికి రాజు శరీరంలోకి ప్రవేశించి వసిష్ఠుని 100కుమారులను తినమని చెప్పాడు. తన కుమారుల దుర్మరణం తెలుసుకున్న వసిష్ఠుడు వివేకాన్ని, జ్ఞానాన్ని మరచి దుఃఖంతో తానూ మరణించాలని ప్రయత్నించాడు. మేరు మహాపర్వతం శిఖరం నుండి దూకితే మేరువు తన శిలలను దూదిలా మెత్తగాచేసి బ్రతికించింది.

ఇదికాదని మండుతున్న అడవిలో దూకితే అగ్ని చల్లారిపోయింది. మెడకు బండరాళ్లను కట్టుకుని సముద్రంలో దూకితే దూదిలా పైకి తేలాడు. మహోగ్రంగా ప్రవహిస్తున్న నదిలో దూకితే ఆ నది 100పాయలుగా చీలి ఋషిని బ్రతికించి శతతృ నదిగా పురాణాల్లో పిలువబడి నేడు సట్లజ్ నదిగా పిలవబుతున్నది. చివరి ప్రయత్నంగా తనను తాను బంధించుకుని హిమాలయ పర్వతశిఖరం నుండి ప్రవహిస్తున్న నది వరద ప్రవాహంలో దూకాడు. ఆ నది ఋషిని బంధవిముక్తుని చేసి ఒడ్డుకు చేర్చింది. ఆనాటి నుంచి ఆ నది విపిష అంటే బంధాలు లేనిది, వ్యాసగా పిలువబడి నేడు బియాస్‌గా పిలవబడుతోంది.

కథలు ఏమైనా బియాస్ నదీ ప్రవాహ ప్రాంతం సారవంతం. వ్యవసాయం, పర్యాటకంతో ప్రకృతి ఒడిలో విలసిల్లుతోంది. అంతేకాదు అనేక ప్రాచీన సంస్కృతులకు, సంఘటనలకు సాక్షీభూతం. దేవతలకు నెలవైన కొలువైన పవిత్రస్థలంగా స్థానికులు పరిగణిస్తారు.

(సశేషం)

Exit mobile version