హిమాచల్ యాత్రానుభవాలు-8

0
2

[box type=’note’ fontsize=’16’] మనాలి ఆకర్షించినంతగా తనను సిమ్లా ఎందుకు ఆకట్టుకోలేదో వివరిస్తున్నారు డి. చాముండేశ్వరిహిమాచల్ యాత్రానుభవాలు” అనే ఈ యాత్రాకథనంలో. [/box]

మనాలి చివరి చరణం

[dropcap]ఉ[/dropcap]దయం టీ తాగిన తరువాత హోటల్ నుండి కాలినడకన బయలుదేరాము.

పట్లికుల్ గ్రామం దాకా నడిచి తిరుగు ప్రయాణంలో బస్సులో వెనక్కి రావాలని అనుకున్నాము. రోడ్డు వారగా జాగ్రత్తగా పరిసరాలను పరికిస్తూ నడక ప్రారంభించాము. దారికి ఇరుప్రక్కలా ఎత్తయిన వృక్షాలు, చిన్న సెలయేళ్ళు, అందమైన పూల మొక్కలు. ముఖ్యంగా గులాబీలు చాల పెద్ద సైజులో పూస్తాయి. పచ్చని పచ్చిక బయళ్లు.

దారికి ఎడమ ప్రక్కన వేగంగా ప్రవహించే బియాస్ నది. ‘వదల బొమ్మాళి వదల’ అంటూ మనతో పాటుగా ప్రవహిస్తూ, జీవన గమ్యంలో ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు, అడ్డంకులూ ఉన్న వెరవక ఆగక తన అంతిమ గమ్యం సాగర గర్భాన్ని చేరేలోపున దారిలో స్వచ్ఛమైన నదిని కలుషితం చేస్తున్నా సహిస్తూ జీవులకు జీవనాధారంగా మారి మేలుచేస్తున్న నది చెప్పే జీవిత సత్యం అమూల్యం. తరచి చూస్తే, వింటే ప్రకృతి నుండి మనమూ మన పూర్వీకుల్లా అనేక జీవిత పాఠాలను నేర్చుకుని ప్రకృతితో సహజీవనం సాగించి భావితరాలకు అందించవచ్చు.

ఓహ్! సడెన్‌గా తాత్వికత వచ్చింది అనుకుంటున్నారా? హిమాలయ సావాసం చేస్తే తప్పక తాత్వికత వస్తుంది. అందుకే కాబోలు ఋషుల నుండి రజినీకాంత్ వరకూ హిమాలయాలలో తమని తాము వెతుక్కున్నారు.

ఇక్కడ నాకో సినిమా గుర్తుకు వస్తోంది. ‘ఎవడె సుబ్రహ్మణ్యం’.

ఆలా నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ మౌనంగా పయనించాము. దోవలో ఒకచోట ఆగి టీ తాగాము. అదొక బాహానా నదిని చూడటానికి.

ఈ వైపునుండి అటుకి కట్టిన ఇరుకు వంతెనపై సరుకుల వాహనం, కార్లు వెళ్ళటం చూసి అచ్చెరువొందాము. మరింత ముందుకు వెళితే అనేక పండ్ల దుకాణాలు చూసాము. మనకు అరుదుగా దొరికే పండ్లు. కొనుక్కున్నాము.

మరింత ముందుకు వెళ్ళితే వివిధ ప్రదేశాల నుండి వచ్చిన యువతీయువకుల ట్రెక్కింగ్ చూసాము. అనేక ట్రెక్కింగ్ కాంప్స్ ఉన్నాయి మనాలి చుట్టుప్రక్కల. మధ్య మధ్యలో ఆగుతూ లోకల్స్‌తో కబుర్లాడుతూ, వారి సాధక బాధకాలు అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాము.

అక్కడ వ్యవసాయం, పండ్లతోటలు, ఉన్ని దుస్తులు, పర్యాటకం, హోటల్ లాంటివే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. పట్లికుల్‌కి కొద్దీ దూరంలో ఉన్న 15 మైలే లేదా బడాగ్రం గ్రామంలో అనేక రిసార్ట్స్ ఉన్నాయి. అక్కడే నదిని ఆనుకుని హోటల్స్ ఉన్నాయి. ఒక హోటల్ ఎంచుకొని లోపలి వెళ్లి నదిని ఆనుకుని ఉన్న టేబుల్ చూసి కూర్చున్నాము ముందుకు వంగితే చేతికి బియాస్ నదీమతల్లి చల్లని నీటి స్పర్శ ఆనందాన్ని కలుగచేసింది.

నదిని, ప్రవాహపు వేగాన్ని, లోతును అంచనా వేస్తూ ప్రశాంతంగా కూర్చున్నాము. లంచ్ అక్కడే తిని కొద్దిసేపటి తరువాత లోకల్ బస్సు ఎక్కి మధ్యాన్నం 3 గంటల ప్రాంతంలో గదికి వచ్చి తిరుగు ప్రయాణానికి రెడీ అయ్యాము.

మనాలి నుండి మా ఫ్రెండ్స్ కారులో వారితో పాటుగా సిమ్లా వెళ్లి రెండు రోజులు ఉండి తిరిగి ఢిల్లీకి చేరుకుందామని ప్లాన్ మార్చాము.

సిమ్లా విశేషాలు

సిమ్లా హిమాచల్ ప్రదేశ్ రాజధాని. 1864 నుండి 1947 వరకు బ్రిటిష్ వారి వేసవి విడిది. దేవత శ్యామల దేవి పేరిట వెలసిన నగరమట. 19 వ శతాబ్దంలో ప్రస్తుత సిమ్లా నగరం దట్టమైన అటవీ ప్రదేశమట. ఇప్పటికి అటవీ ప్రాంతం ఉంది. కానీ సాంద్రత తగ్గింది.

1972 లో మా తండ్రి గారితో అందరం పిల్లలు, అమ్మ రోడ్డు మార్గాన కారులో నార్త్ ఇండియా యాత్ర చేసాము. హైదరాబాద్ నుండి నేపాల్ నుండి ఒరిస్సా మీదుగా హైదరాబాద్. అప్పుడు మంచు కారణంగా కాశ్మీర్, సిమ్లా వెళ్లలేకపోయాము. ఆ లోటు ఈ మధ్యకాలంలో తీర్చుకున్నాము.

మనాలి నుండి కారులో దాదాపు 8 గంటలు ప్రయాణించి సిమ్లాకు 15 కిమీ దూరంలో ఉన్న షోగి అనే ఊరిలో హోటల్ చేరాము. టీ తాగి ఫ్రెష్ అయ్యి కారులో సిమ్లా మాల్ రోడ్ చూడటానికి వెళ్ళాము. సాయంత్రపు రష్ వల్ల దాదాపు  గంటకు పైగా పట్టింది చేరటానికి. ఒక్కోసారి గంటల తరబడి ట్రాఫిక్ జాం అవుతుందిట. మాల్ రోడ్ పార్కింగ్ దూరంగా ఉంది. అక్కడ వున్న లిఫ్ట్ ఎక్కి పైకి చేరాము. మార్కెట్ చూసుకుంటూ, జామ్స్ కొనుక్కుని వెనక్కి రూమ్‌కు వచ్చి డిన్నర్ చేసాము. వేసవి సెలవులు కావటంతో సిమ్లా రద్దీగా ఉంది.

మరునాడు ఉదయం త్వరగా బయలుదేరి షోగిలో ఉన్న టాయ్ ట్రైన్ స్టేషన్‌లో కల్కా నుండి సిమ్లా వస్తున్న ట్రైన్ ఎక్కి సిమ్లా వరకు వెళ్లాలనుకున్నాము. కానీ స్టేషన్‌లో చాల వెయిటింగ్ ఉంది. సో టైం వేస్ట్ అయింది. ట్రైన్‌లో రష్‌గా ఉంది. ఎలాగోలా ఎక్కి కూర్చున్నాము. స్లోగా కొండ ఎక్కుతున్న రైల్ స్పీడ్ తక్కువ. మనం దానితో పరుగెత్తవచ్చు. ప్రకృతి రమణీయం. దేవదారు వృక్షాలు పట్టుకోవచ్చు. చీకటి సొరంగం నుంచి వెళ్ళినప్పుడు మా వాళ్ళు సెల్ ఫోన్ టార్చ్ వేసి వెలుగు తెచ్చారు. ఆడవాళ్ళం కొద్దిగా కంగారు పడ్డాము.

ట్రైన్ స్పీడ్ చూసిన మేము నెక్స్ట్ స్టేషన్ తారాదేవిలో దిగేసాము. డ్రైవర్ అక్కడికి వాన్ తెచ్చాడు. స్టేషన్ నుండి సిమ్లాకి వెళ్ళాము. అక్కడికి దగ్గరలో ఉన్న జకూ హనుమాన్ గుడికి వెళ్ళాము. అతిపెద్ద విగ్రహం ఎక్కడి నుండైనా కనిపిస్తుంది. దేవదారు వృక్షాల నీడలో గుడి. స్థానిక కథనం ప్రకారం సంజీవని మూలికని అన్వేషించడానికి బయలుదేరిన హనుమ మార్గమధ్యంలో కొద్దిసేపు ఈ పర్వత ప్రాంతంలో విశ్రమించాడట. ఇక్కడ వానరాలు పెద్ద సంఖ్యలో కనిపించాయి.

తరువాత మాల్ రోడ్‌లో ఉన్న పురాతన క్రిస్ట్ చర్చి చూసాము. లంచ్ టైం కావటంతో అక్కడి హోటల్‌లో లంచ్ తిన్నాము. నెక్స్ట్ స్టాప్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ అడ్వాన్సుడ్ స్టడీస్. ఇది అబ్జర్వేటరి హిల్ మీద ఉంది. ప్రస్తుతం ఇదొక విద్య సంస్థ.

బ్రిటిష్ నిర్మాణ శైలిలో ఉన్న విశాల కట్టడం. బ్రిటిష్ హయాంలో ముఖ్యమైన సమావేశాలు, చర్చలు, ఒప్పందాలు జరిగిన చోటు. 1884-88 మధ్య నిర్మితం. దీన్ని వైస్రోయ్ లాడ్జి అనేవారట. దీనికి 1888 ముందుగానే విద్యుత్ సరఫరా ఉంది.

నిర్మాణంలో ఎక్కువగా కలప వాడారు. ఆ రోజుల్లోనే అగ్నిప్రమాద నివారణకు అధునాతనమైన పద్ధతులు వాడారు. 1945 సిమ్లా సమావేశం ఇక్కడే జరిగింది. 1947లో ఇండియా విభజన నిర్ణయం జరిగింది ఇక్కడే. నేతలు వాడిన ఫర్నిచర్ భద్రంగా ఉన్నాయి.

1947 తరువాత దానికి రాష్ట్రపతి నివాస్‌గా వ్యవహరించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతి అయ్యాక దీన్ని అత్యున్నత విద్య సంస్థగా మార్చారు 1965లో.

బిల్డింగ్‌లో కొంతభాగం గైడెడ్ టూర్ ఉంది. లోపలి ముఖ్యమైన ప్రదేశాలు చూపించి వివరిస్తారు. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం.

చుట్టూ పూల వనాలు, పచ్చిక బయళ్లు ఆహ్లాదాన్ని ఇస్తాయి. చిన్న కాంటీన్ కూడా ఉంది. చరిత్ర పుటల్లోకి తొంగి చూసి, ఆలోచనలు ముసురుతుంటే అక్కడ నుండి బయలుదేరి మా హోటల్ దారిలో ఉన్న తార దేవి టెంపుల్‌కి బయలు దేరాము. కాళీ మాతకు ప్రతి రూపమట. కొండపైన ఉంది. అక్కడ నుండి సిమ్లా పరిసర అందాలు చూడవచ్చు. మేము వెళ్ళినప్పుడు మూల గుడికి మరమత్తులు కారణంకా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మాత్రం చూడగలిగాము. చీకటి పడేవేళకు షోగి లోని హోటల్ చేరుకొని విశ్రమించాము. మరునాడు ఉదయం బయలుదేరి చండీగర్ మీదుగా ఢిల్లీ చేరుకున్నాము. యాత్ర సుఖంగా పూర్తి అయ్యిందని ఆనందపడ్డాము.

సిమ్లాలో కూడా పూల విరులు అద్భుతం. కానీ మనాలిలో ఉండి చూసిన మీదట, ఏంటో ఊహించుకుని వచ్చినందువల్లో లేక రాజధాని మరియు వేసవి విడిది కావటం వల్లనో సిమ్లా అంతగా నచ్చలేదు, నిరాశపరచింది. విపరీతమైన రద్దీ. కొండలు పిండి చేస్తూ కట్టిన కడుతున్న లెక్కలేనన్ని కట్టడాలు. సిమ్లా అటవీ ప్రాంతం నుండి, కాంక్రీట్ అరణ్యంగా మారుతున్న వేగం చూసి అభివృద్ధి ఫలం అంటే ప్రకృతి వినాశనం అని తెలిసింది. మనసు బాధతో మూల్గింది. ఆ వినాశనంలో అందరం పాత్రధారులమే కదా అనిపించింది.

ఎల్లలు దాటినా సమాచారం చేరవేత కారణంగా మితిమీరిన పర్యాటకం స్థానిక వనరులను నాశనం చేస్తూ, ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రకృతిపైన ఎనలేని భారాన్ని మోపుతున్నది. ఈ వేసవిలో సిమ్లా వాసులు యాత్రికులను రావద్దని చేసిన విన్నపాలకి కారణం తీవ్రమైన నీటి ఎద్దడి.

మితిమీరిన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నాలు చూసాము. విపరీతమైన యాత్రికుల రద్దీ కారణంగా కలగాల్సిన ఆనందం కలగలేదు.

పాఠకులను నిరుత్సహ పరచటం నా ఉద్దేశం కాదు. ఎందుకో చూసిన, ఫీల్ అయినా నిజాలు చెప్పాలని అనిపించింది. అంతే. చక్కని పర్యాటకానికి, పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టకుండా విదేశాల్లో లాగా కఠిన నిబంధనలు, పాలసీలు చెయ్యగలిగితే మన ముందు తరాల వారికీ మన పర్యాటక సంపద, వారసత్వాన్ని అందించగలము.

1970 తిరుమలకి 2017 తిరుమలకి ఉన్న వ్యత్యాసం గుర్తుకు వచ్చింది.

చైల్ హిల్ స్టేషన్, హిమాచల్ ప్రదేశ్ క్యాంపింగ్ అనుభవాలు, నా హిమాచల్ యాత్ర అనుభవాలని, కాశ్మీర్ యాత్ర విశేషాలు అందాలను తదుపరి వివరిస్తాను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here