Site icon Sanchika

శిశిరానికి చిగురులనిచ్చే ‘గీత్ వసంత్’ మహాకవి నీరజ్

[box type=’note’ fontsize=’16’] “వారి మాటల వలన నాలో ఎంతో శక్తి వచ్చింది. ఉదాసీనంగా మారిపోయిన నా మనస్సులోకి మళ్ళీ ఆకుపచ్చటితనం వచ్చింది” అంటున్నారు డా. టి. సి. వసంత ప్రముఖ హిందీ కవి స్వర్గీయ నీరజ్ గురించి చెబుతూ. [/box]

[dropcap]నా[/dropcap]కు చిన్నప్పటి నుండి గీతాల పట్ల ఆసక్తి ఉంది. తెలుగు హిందీ గీతాలు చదివినప్పుడు కవి కావ్యజగత్తులో నేనూ తల్లీనం అయిపోయేదాన్ని. అసలు ఈ కవి వ్యక్తిత్వం ఎట్లా ఉంటుందో, కవి ఇట్లా చెప్పాడంటే ఆయన జీవితంలో ఎటువంటి సంఘటనలు జరిగి ఉంటాయి, అసలు కవి ఇట్లా రాయడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? కవి ఇంతగా భావుకుడు అయ్యాడంటే అతడి మనసు సాగరంలోని అలలు ఎంత ఉవ్వెత్తున్న లేచి ఉంటాయి అని ఆలోచించేదాన్ని.

శ్రీ గోపాల్ దాస్ ‘నీరజ్’ గారి గీతాలు మొట్టమొదట చదివినప్పుడు కవి ఒకవైపు గాలి దుమారాలలో సుడిగాలుల్లో, తుఫానులలో “నేను తుఫానులలో కూడా బాట వేసి ముందుకు నడిచే బాటసారిని” అని అంటూ, మరోవైపు ఏమీ చేయలేని నిస్సహాయతను చూపిస్తూ “బిడారు కదిలింది, ఎడారిని చూస్తూ నిల్చున్నా, నిద్ర లేవకుండానే ఎండ కరిగిపోయింది, ఆకు – ఆకు నేలరాలింది. కొమ్మ – కొమ్మ కాలిపోయింది” అన్న భావాలు వ్యక్తం చేశారు. ఒక మనిషిలో ఇంతగా విరోధీ తత్వాలు ఉంటాయా అని అనిపించింది.

మై పంథీ తుఫానోం మే రాహ్ బనాతా
మేరా దునియా సే కేవల్ ఇతనా నాతా
వహ్ ముఝే ఠోకతీ హై అవరోధ్ బిఛాకర్
మై ఠోకర్ ఉసే లగాకర్ బఢతా జాతా

(मैं पन्थी तूफ़ानों मे राह बनाता..
मेरा दुनिया से केवल इतना नाता..
वेह मुझे रोकती है अवरोध बिछाकर..
मैं ठोकर उसे लगाकर बढ्ता जाता..)

***

హో సకా నా కుచ్ మగర్
శామ్ బనగయీ సహర్
వహ్ ఉఠీ లహర్‍ కి ఢహ్ గయీ కిలె బిఖర్- బిఖర్
ఔర్ హమ్ లుటే లుటే
వక్త్ సే పిటే – పిటే
దామ్ గాంఠ్ కే గవాం, బాజార్ దేఖతే రహే
కారవాం గుజర్ గయా గుబార్ దేఖతే రహే

(हो सका न कुछ मगर
शाम बन गई सहर,
वह उठी लहर कि ढह गए किले बिखर-बिखर
और हम लुटे-पिटे,
वक्त से पिटे-पिटे,
दाम गाँठ के गँवा, बाज़ार देखते रहे!
कारवां गुज़र गया गुबार देखते रहे)

లోకం నాకు అడ్దంకులు కలిగిస్తుంది. నేను దాన్ని తలదన్ని ముందుకు నడుస్తా అంటూ ముందడుగు వేసే కవి ఏమీ చేయలేనంటూ విధి ఎదురుగా తలవంచే భావాన్ని వ్యక్తం చేస్తాడు. ఒక వైపు ప్రచండ ప్రభంజన తీవ్రత, మరో వైపు మంద మారుత లాలిత్యం, ఒకవైపు హృదయాన్ని ఊపే ఉద్వేగాల తీవ్రమైన జలపాతం లాంటి వేగమైన శైలి, మరోవైపు మనస్సును స్పర్శించే సున్నిత భావాల లాలిత్యమైన శైలిలో జీవితం గురించిన మార్మికతను ప్రకటిస్తాడు ఈ కవి హృదయాంతరంగాలలో. ఇటువంటి భావోద్వేగాలలో కవి నీరజ్ ఒక యుద్ధం చేశారు. ఎన్నో విలువైన కవితలు గీతాలు ఆయన కలం నుండి వెలువడ్డాయి.

‘గీతాలు లేని విశ్వం కాటితో సమానం’ అంటూ రాసి పాడి అందరి మన్ననలను అందుకున్న నీరజ్  ఇక లేరు. నీరజ్ స్వర్గస్థులయ్యారు అన్న వార్త టి.వి.లో వినగానే నా కళ్ళు చెమర్చాయి. 1985లో జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు వచ్చాయి. అవన్నీ నా జీవితంలో బంగారు క్షణాలు. ఆ క్షణాల ఆకుపచ్చటితనం నా మనస్సులోని ఏడు పొరలలో అట్లాగే ఉంది. నేను ఎమ్.ఎ. హిందీ డిగ్రీ తీసుకున్నాక  పిహెచ్‌.డి చేయాలి అని అనుకున్నప్పుడు మా శ్రీవారు కామేశ్వర సోమయాజి గారు, మా తమ్ముడు సత్యప్రకాశ్ – నీరజ్ గీతాల మీదే చేయాలని పట్టుబట్టారు. 1969 సంవత్సరంలో నా పెళ్ళి అయింది. 69, 70, 71 ప్రాంతాలలో  హైదరాబాద్ చిక్కడపల్లి రోడ్ల మీద వీళ్ళిద్దరూ నీరజ్ పాటలు పాడుతూ వాటిల్లోని అర్థాలు చెప్పుకుంటూ, విశ్లేషణ చేస్తు ఆకాశంలో విహరిస్తూ ఉండేవాళ్ళు. మా వారు 70లో పుట్టిన మా అబ్బాయి పేరు నీరజ్ అని పెట్టాలని అనుకున్నారు. ఇంటివాళ్ళతో, మిత్రులతో కొంత తర్జన భర్జనలు జరిగాయి. ఇక్కడ నీరజ్ అన్న పేరు పెట్టుకోరు, అందువలన నీరజ అని పిలుస్తారు అని అనుకున్నారు. చివరికి ప్రశాంత్ అన్న పేరు పెట్టారు. మా వారు ఉద్యోగ రీత్యా ఎస్.బి.హెచ్.లో పని చేసేవారు, నాందేడ్‌కి ట్రాన్స్‌ఫర్ కావడం వలన 1980 ప్రాంతాలలో అక్కడికి వెళ్ళిపోయాము.

ఔరంగాబాద్ మరఠ్వాడా విశ్వవిద్యాలయానికి అప్పటికి ఇంకా అంబేద్కర్ మరఠ్వాడా విశ్వవిద్యాలయం అన్న పేరు లేదు. వెళ్ళి మా వారు హిందీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ అయిన డా. రాజుర్‌కర్ గారిని కలిశారు. వారు డా. రాజ్‌మల్ బోరాగారిని కలవమన్నారు. ఆయన సబ్జెక్ట్ భాషా విజ్ఞానం. తరువాత మేం ఇద్దరం వారిని కలిసాము. నా సబ్జెక్ట్ భాషా విజ్ఞానం, గీతాల మీద… అంటు అంతగా ఇష్టపడలేదు. నేను ఎమ్.ఎ. వరకూ ప్రైవేటుగా చదివాను.

19 సంవత్సరాలకు వివాహితనై 20 సంవత్సరాలకు తల్లినై, ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూ, పడుతూ లేస్తూ చదివిన చదువు నాది. అంటే ఒక రకంగా వానాకాలం చదువు అనే చెప్పాలి. ప్రైవేటుగా చదివినందువల్ల గీతాల మీద రీసెర్చి చేయగలనా అని వారు అనుకున్నారు. అందువలన 5 టాపిక్‍ల మీద రాసి తీసుకు రమ్మన్నారు. చివరికి నీరజ్ పట్ల నాకున్న ఇంటరెస్ట్‌ని చూసి, రాసిన వాటిని చూసి ఒప్పుకున్నారు.

దాదాపు ఒక సంవత్సరం నాందేడ్ నుండి మేం ఇద్దరం ఔరంగాబాద్‌కి వెళ్ళి ఆ రాత్రి హోటల్ రూమ్‌లో ఉండి మరునాడు యూనివర్సిటీకి వెళ్ళి నేను గీతాల మీద రాసిన విశ్లేషణను చూపెట్టేదాన్ని. అప్పుడు రూప్‌లేకర్ గారు డి.జి.ఎమ్.గా ఉండేవారు. మావారు ఈ విషయం చెప్పగానే వికసించిన మొహంతో అన్నారు – “తెలుగు మాతృభాష అయి ఉండి సోమయాజీ! ఇంటి బాధ్యతలు నెరవెరుస్తూ, మీ మిసెస్‌కి హిందీ సాహిత్యం పట్ల ఇంత ఇంటరెస్ట్ ఉంటే మీకు ఈ సహాయం చేయడం నా ధర్మం” అంటూ వెంటనే ట్రాన్స్‌ఫర్ చేశారు.

రాజ్‌మల్ బోరాగారు తొందరగా ఏదీ ఒప్పుకోరు. గీతాల విశ్లేషణ, అలంకారాలు, ఛందస్సు విషయంలో ఆయనకి సరిగా లేదని అనిపించినా నేను మళ్ళీ మళ్ళీ రాసేదాన్ని. కొన్ని వందల పేజీలు రాశాను. థీసిస్ చాలా భాగం రాయడం పూర్తయ్యింది. బోరాగారు కవి నీరజ్‌ని ఇంటర్వ్యూ తీసుకోవాలని అప్పుడే అది పరిపూర్ణం అవుతుందని అన్నారు. మొదటిసారి ఢిల్లీ దాకా వెళ్ళాము కాని ఇందిరాగాంధీ గారి హత్య వలన అల్లర్ల వలన మేము అలీఘర్ (అలీఘఢ్) వెళ్ళలేకపోయాము. రెండోసారి అలీఘర్ వెళ్ళినప్పుడు ఇంట్లో నీరజ్ గారు లేరు. కవి సమ్మేళనం కోసం బయటకు వెళ్ళారు.

నీరజ్ గారి భార్య సావిత్రి గారు మమ్మల్ని ఎంతో ఆదరించారు. ఆవిడ ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. “బేటీ! ఇప్పటికీ చెబితే వినరమ్మా. ఇంకా ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. మీరిద్దరూ ఔరంగాబాద్ నుంచి ఇంత దూరం వచ్చారు. వారు లేరు. చాలా బాధగా ఉంది” అని అంటూ చాలా కబుర్లు చెప్పారు. “భాయీ సాహెబ్! మీరు ఇక్కడ హోటల్ రూమ్‌లో ఉంటున్నారు. చాలా ఖర్చవుతుంది. మీరు ఔరంగాబాద్ వెళ్ళిపొండి. మీరే ప్రశ్నలు వేయాలనుకుంటున్నారో రాసి పంపించండి. నేను వారి చేత సమాధానాలు రాయిస్తాను. మా మరిది కూతురి పెళ్ళి పదిహేను రోజుల్లో ఉంది. అప్పుడు వారు ఘాజియాబాద్‌కి వస్తారు. మళ్ళీ ఇంటికి వస్తారో రారో. అక్కడి నుంచి అక్కడికి కవి సమ్మేళనాళకి వెళ్తారో తెలియదు” అని అన్నారు. మేం వెనక్కి ఢిల్లీ వచ్చాము. అక్కడ ఎస్.బి.హెచ్.లో పని చేస్తున్న మా వారి కొలీగ్ కృష్ణమూర్తి, అంబికలు పదిహేను రోజులు వాళ్ళ ఇంట్లో ఉండమని, నీరజ్ గారిని కలిసే వెళ్ళమని పట్టుబట్టారు. మేం ఇద్దరం, నా కొడుకు వాళ్ళ ఇంట్లో దాదాపు పదిహేను రోజులు ఉన్నాము.

మధురలో పాండే అనే అతను నీరజ్ గారి రచనలపై ఎం.ఫిల్ లేక పిహెచ్.డియో చేస్తున్నారని తెలిసింది. వారిని కలిసాము. మధుర రైల్వే స్టేషన్‌లో ఆయనకి పుస్తకాల షాపు ఉంది. అక్కడ కూర్చుని మాట్లాడుకున్నాము. మధుర స్టేషన్‌లో, వెయిటింగ్ రూమ్‌లో కూర్చుని నీరజ్ తను రాసినవి చదువుతారని సలహాలు ఇస్తారని చెప్పారు. నీరజ్ గారు ఎంత నిగర్వో అర్థం అయింది.

నీరజ్ గారిని కలవడానికి తెల్లవారు ఝామున బయలుదేరి వెళ్ళాము. అది ఎండాకాలం. అక్కడంతా పెళ్ళి సందడి. వాళ్ళందరూ ఎంతో ఆదరించారు. దాదాపు మధ్యాహ్నం రెండు గంటలయింది. నీరజ్ గారు రాలేదు. నేను పైన కూర్చున్నాను. మొగవాళ్ళందరూ కింద కూర్చున్నారు. అప్పటికే నేను చాలా అలసిపోయి ఉన్నాను. వెనక్కి వెళ్ళిపోదామా అని అనుకుని కిందకి వచ్చాను. మావారు అక్కడ లేరు. ఆయనని విడిదికి తీసుకువెళ్ళారు. వచ్చేస్తారు అని అన్నారు. నాకు అంతా కొత్త, కొంచెం గాభరాగా అనిపించింది.

నీరజ్ గారు వచ్చారు. నన్ను తన కారులో విడిదికి తీసుకువెళ్ళారు. నీరజ్ ముఖంలో ఉన్న తేజస్సు, ఆ అందం గురించి మావారు ఎప్పుడూ పొగుడుతూ ఉండేవారు. విడిదికి వెళ్ళాక, పొద్దుటి నుండి నేనేమీ తినలేదని తెలిసి ఐస్‌క్రీమ్ తెప్పించారు. ఆ తరువాత ఆయనతో మాట్లాడాలని ఒక్కొక్కరే వస్తున్నారు. చాలా టైమ్ అయింది. చివరికి కలకత్తా నుండి కవి సమ్మేళనానికి ఆహ్వానించడానికి వచ్చిన ఆయనతో కాస్సేపు మాట్లాడారు నీరజ్.  ఇంకా చాలామంది ఉన్నారు. “నేను ఈమెతో మాట్లాదాక మీతో మాట్లాడుతాను” అని నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. అక్కడంతా పెళ్ళి సందడి. నేను అనుకున్నంతగా మాట్లాడలేకపోయాను.

2010 నుంచి 2013 వరకు హైదరాబాద్ వచ్చాక మా శ్రీవారు నీరజ్ గారితో ఫోన్‌లో చాలాసేపు మాట్లాడుతూ ఉండేవారు. గజళ్ళు, గీతాలు, ఫిలాసఫి, పెద్ద పెద్ద సాహిత్యకారుల గురించి మాట్లాడుతూండేవారు. మావారు మన చలం గారి గురించి చెప్పేవారు. మావారు రాసిన ‘అన్‌గినత్ రాగ్, అమర్ సంగీత్ కా ఏక్ భండార్’ అనే కవితను చదివి వినిపించారు. ఈ కవితను నీరజ్ ప్రత్యేక సంచిక 2011లో ‘నవనికష్’ (కాన్పూర్, ఢిల్లీ)లో ‘జాగ్‌తిక్ ప్రేమ్ గాయక్ నీరజ్ జీ కో ఆదారాంజలి’ అన్న శీర్షికన వేశారు. మావారు స్వర్గస్తులయ్యాక నేను నీరజ్ గారికి ఫోన్ చేసి చెప్పాను. వారు నన్ను ఒక తండ్రిలా ఓదార్చారు. “వసంతా! మీవారు మీ ఇంట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం, మరాఠీ పుస్తకాలు చాలా ఉన్నాయని చెబుతూ ఉండేవారు. మీరు ఆ పుస్తకాలన్నింటినీ జాగ్రత్తగా సంరక్షిస్తూ లైబ్రరీలా తయారు చేసుకోండి. అదే సరస్వతీ నిలయం అని పూజించండి. మీరు మీవారికి గౌరవం చూపించే మార్గం ఇది ఒక్కటే. మీ కలం ఎప్పుడూ ఎండిపోకూడదు. నిరంతరం మీరు రాస్తూనే ఉండండి. అనువాదాలు చేయండి. మీవారు కోరుకున్నది అదే. మీకు ఎప్పుడూ నా ఆశీర్వాదాలు ఉంటాయి.” వారి మాటల వలన నాలో ఎంతో శక్తి వచ్చింది. ఉదాసీనంగా మారిపోయిన నా మనస్సులోకి మళ్ళీ ఆకుపచ్చటితనం వచ్చింది.

నీరజ్ గారికి నా పుస్తకాలు ‘రమణీ సే రమణాశ్రమ్ తక్’ (చలం జీవితచరిత్ర -3 భాగాలు, దాదాపు 1400 పేజీలు), ‘ప్రజనన్ తంత్ర్ తథా దైవీ భావన’ (తాపీ ధర్మారావు, ఏటుకూరి ప్రసాద్ గారి రచనల హిందీ అనువాదం), ‘విద్రోహీ వసుంధర’, ‘మాఖన్ ప్రేమ్’ ఇంకా కొన్ని పుస్తకాలు పంపించాను. తరువాత వారు ఫోన్‌లో – పుస్తకాలు చూసానని చాలా సంతోషపడ్డానని, ప్రతీ రోజూ ప్రొద్దున్న వాళ్ళ ఇంటికి కొందరు స్నేహితులు వస్తారని, పేపర్ చదివాకా మాట్లాడుకుంటూ కూర్చుంటారని చెప్పారు. చలంతో నీరజ్‌ని పోలుస్తూ నేను రాసిన దానిని చదివారు.

ఈమధ్య ఏప్రిల్‌కి ముందు వారికి నేను ఫోన్ చేశాను. నాకు వచ్చిన అవార్డుల గురించి చెబుతూ ఆ సందర్భంలో వేదిక మీద వారి గురింది చెప్పానని చెప్పాను. ఒక పత్రిక కోసం నీరజ్ కవిత ‘మా మత్ హో నారాజ్’ తెలుగులోకి అనువదిస్తాననీ, వారి అనుమతి కావాలని అడిగాను. “వసంతా!” అన్నమాట స్పష్టంగా పలికారు. చేయమని చెప్పారు. కాని మాట అంత స్పష్టంగా లేదు. 85లో వారి అనుమతి తీసుకుని కొన్ని గీతాలను తెలుగులోకి అనువదించాను. నా థీసిస్‌లో కొన్ని వారి గీతాల తెలుగు అనువాదాలు ఉన్నాయి.

నీరజ్ నన్నూ, మావారిని అలీఘర్ రమ్మన్నారు. వెళ్ళలేకపోయాము. దాదాపు ఒక సంవత్సరం క్రితం నన్ను రమ్మనారు. కాని వెళ్ళలేకపోయాను. 67 సంవత్సరాల వయసులో అంతో ఇంతో అనారోగ్యం మనిషికి తప్పదు. ‘ఒక్కసారి వెళ్ళి కలిసి రావల్సింది’ అని ఇప్పుడు పదే పదే అనుకుంటున్నాను. ఆయన తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం మా మేనమామ శ్రీ ఏటుకూరి ప్రసాద్ గారు నానక్‌రామ్‍ భగవాన్ దాస్ కాలేజీలో నీరజ్ గారు కవి సమ్మేళనానికి వచ్చారని, అప్పుడు బాలస్వరూప్ రాహీ గారు కూడా వచ్చారని తన దగ్గర ఉన్న వాళ్ళ ఇద్దరి ఫోటో నాకు ఇచ్చారు. ఇన్ని సంవత్సరాల నుండి ఆ ఫోటో నా దగ్గర ఉంది.

ఈ మధ్య భోపాల్, కాన్పూర్, ఢిల్లీల నుండి నీరజ్ మీద విశేష సంచికలు వచ్చాయి. నా ఆర్టికల్ ‘నీరజ్ కే గీతోం మే రహస్య్‌వాద్’ (నీరజ్ గీతాలలో రహస్యవాదం)ని ‘నవనికష్’లో వేశారు. ఆ తరువాత నా అనుమతి తీసుకుని ఇదే ఆర్టికల్‌ని సౌజన్యంతో రెండు మూడు పత్రికలు ప్రచురించాయి.

లక్నోకి చెందిన వయోవృద్ధులు శ్రీ దివాకర్ పాండే గారు హైదరాబాద్‌లో చాలాకాలం హిందీ ఎడిటర్‌గా పనిచేశారు. కవి శ్రీ దేవా ప్రసాద్ గారు వారిని కారులో తీసుకువచ్చారు. కాన్పూర్‍లో తను నీరజ్ ఒకే గదిలో ఉన్నామనీ, నీరజ్ గారి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఈ మధ్యే వారు స్వర్గస్థులయ్యారు.

అమెరికాలోని హవాయిలో ఉండే శ్రీ రమానాథ్ పాండే గారు మా ఇంటికి వచ్చారు. వారు కూడా నీరజ్‌ని గురించిన ఎన్నో విషయాలు చెప్పారు. ఈ వయోవృద్ధులందరూ హిందీ కవుల గురించి, ముఖ్యంగా నీరజ్ గురించి చెబుతున్నప్పుడు నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా శ్రద్ధగా వింటూ ఉంటారు.

నీరజ్ స్వర్గస్తులయ్యారు అన్న వార్త ప్రస్తుతం చెన్నయ్‍కి వెళ్ళీన మా బాబుకి చెప్పాను – “బబ్లూ, నీరజ్ చనిపోయారు” అని. వినగానే, “అయ్యో, అమ్మా! నీరజ్ చనిపోయారా! నాన్నకి నీరజ్ అంటే ఎంతో ఇష్టం. చాలా బాధగా ఉంది” అని అన్నాడు.

దినపత్రికలో నీరజ్ మరణవార్త చదవగానే మరిది కృష్ణప్రసాద్ ఎంతో బాధపడుతూ ఫోన్‍లో మాట్లాడాడు. “నీరజ్ అంటే అన్నయ్యకి ఎంత పిచ్చి ఉండేది” అంటూ చాలా సంఘటనలని గుర్తు తెచ్చుకున్నాడు. నా చిన్నమరిది విజయ్‌కుమార్ రెండు వారాల క్రితం మా ఇంటికి వచ్చినప్పుడు చాలా సంవత్సరాల క్రితం తన క్లాసులో ‘నీరజ్ కే కావ్య్ మే ప్రకృతి చిత్రణ్’ గురించి, నా గురించి చెప్పానని అన్నాడు. నా చెల్లెలు జయశ్రీ నీరజ్‌కి సంబంధించిన పాత పుస్తకాలన్నింటినీ వెలికి తీసింది. టి.వి.లో నీరజ్ గారి మీద వచ్చిన ప్రోగ్రామ్‍లను నేను నా కోడలు రేణుక కదలకుండా చూస్తూనే ఉన్నాము. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నీరజ్ మా కుటుంబంలో ఒక వ్యక్తిగా మేం అందరం భావించాం. మా కుటుంబంలో ఒక పెద్దమనిషి వెళ్ళిపోయాడని అందరం ఫీల్ అవుతున్నాం. నాకు నా మిత్రులు ఎందరో ఫోన్లు చేశారు.

ఆర్థిక స్థితి సరిగా లేక, ఆరు సంవత్సరాల వయస్సులో తండ్రి లేని పిల్లవాడై, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, చివరికి టాంగా సైతం తోలారు. తల్లీ తమ్ముళ్ళని పోషిస్తూ, నెమ్మది నెమ్మదిగా చదువుకుంటూ, రెండు రోజులు ఆకలి కాకూడదని లావు లావు పూరీలు తిని విరోచనలతో బాధపడుతూ, ఎత్తు పల్లాలు చూస్తూ, ఆటుపోట్లకి తట్టుకుంటూ ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిన మహాకవి నీరజ్ వృద్ధాప్యంలో చాలా కాలం నుంచి భార్యావియోగంతో బాధపడుతూ మిలన్ గుంజన్ ప్రభాత్‍కి తండ్రిగా, ఒక్క గొప్ప గీత్‌కార్‌గా, మన దేశం లోనే కాదు, విదేశాలలో కూడా మంచి పేరు తెచ్చుకుని, గీతాలే ప్రాణాలు అని బతికిన ఆయన 94 సంవత్సరాల వయసులో గగనానికి వెళ్ళిపోయారు. ఈ శ్రమ పూజారిని, ప్రేమ పూజారిని పాఠకులు ఎన్నడూ మరచిపోరు. ఇంకా పది కాలాల పాటు ఆయన బ్రతికే ఉంటారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఎప్పుడో ’85లో ‘గీత్‌కార్ నీరజ్’ అన్న శీర్షికన థీసిస్ రాశాను. ఇప్పుడు ఈ 64 సంవత్సరాల వృద్ధాప్యంలో నీరజ్ గారి గురించి అంతో ఇంతో రాయగలిగాను. ఆయన ఆశీర్వాదాలు నా పట్ల ఎప్పుడూ ఉంటాయని నా నమ్మకం.

డా. టి. సి. వసంత

Exit mobile version