Site icon Sanchika

హౌజ్‌వైఫ్

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘హౌజ్‌వైఫ్’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఉ[/dropcap]దయాన్ని
తట్టి నిదురలేపిన తను
తటాలున తలుపుతీయగానే
వాకిలి గబగబా ఊడ్చేసుకుని
కళ్ళాపి స్నానం కానిస్తుంది
ముగ్గుల ముస్తాబూ చేసేసుకుంటుంది

తనంటే ఎంత భయమో ఆ ఇంటికి

తను అడుగు పెడితే చాలు
వంటిళ్ళు గడగడలాడిపోతుంది
భగభగమంటున్న పొయ్యి కూడా
భయభయంగానే మండుతుంటుంది
తినుబండారాలు
తీరైనరీతిలో తయారవుతుంటాయి
ఎంతగా ఉడకాలో అంతే ఉడుకుతుంటాయి
ఏ రుచిలో ఉండాలో
తెలిసి మరీ మసలుకుంటుంటాయి

తనంటే ఎంత భయమో ఆ ఇంటికి

తను
తరిమేసిన పిల్లలను పాఠశాలలు
వెళ్ళగొట్టిన పెద్దవాళ్ళను కార్యాలయాలు
బెదురు తీర్చి అక్కున చేర్చుకుంటాయి

తన హస్తవాసి ఏంటోగాని
మురికి రోగంతో మాసిన దుస్తులు
తెల్లగా తళతళలాడిపోతాయి
మంట రుగ్మతతో మాడిన పాత్రలు
మునపటిలా మిలమిలా మెరిసిపోతాయి

తనంటే ఎంత భయమో ఆ ఇంటికి

పని తీరి కాస్త నడుం వాల్చగానే
పక్కన చేరిన పగలు సేదదీరమంటూ
గుబులు గుబులుగానే జోకొడుతుంది
కునుకులో కావిలించుకోబోయిన నిదుర
కాసేపటికే మొహమాటంగా దూరమోతుంది

బైబై లతో ఉదయం తీసుకెళ్ళినవాళ్ళను
భద్రంగా వెనక్కి తెచ్చేస్తుంది సాయంత్రం
తనకు భయపడి ఎక్కడో దాక్కున్న సందడి
‌సడేమియా అంటూ
ఆ వెళ్ళిన వాళ్ళతో పాటు లోనకొచ్చేస్తుంటుంది

తనంటే ఎంత భయమో ఆ ఇంటికి

పనులను
పకపకలూ ఇకఇకలను
క్రమక్రమంగా అరిగిస్తూన్న కాలం
బిక్కుబిక్కుమంటూ కరిగిపోతుంటుంది

ఒళ్ళంతా చిందరవందరైన ఇల్లు
ఒద్దికగా తనను తాను సర్దేసుకునేంతవరకూ
గడబిడల గొంతేసుకుని అరుస్తూ
ఓపిక కళ్ళతోనే అజమాయిషీ చేస్తుంటుంది

తనంటే ఎంత భయమో ఆ ఇంటికి

సాయంత్రాన్ని సాగనంపేసిన రాత్రి
బెదురు బెదురుగా పదపదమంటుంటే
ఆనాటి పనులకు సెలవిచ్చేసి
ఎదురుచూస్తోన్న నిదురను పలుకరిస్తుంది

అవును తను హౌజ్ ‌వైఫ్
ఆ గృహానికి అంతా తానే
అన్నీ తానే.. అన్నింటా తానే అయిన గృహిణి
లెక్కేమీ పుచ్చుకోకుండా
లెక్కలేనన్ని పనులు చక్కబెడుతున్న
కంటికి కనిపించని కష్టమైన
ఇంటిపనులెన్నో ఇష్టంగా చేసుకుంటోన్న
అన్నింటినీ అదిరించే, అందరినీ బెదిరించే
ఆ ఇంటి ఉద్యోగి కమ్ యజమానురాలు

(అమ్మమ్మను చూశాను, అమ్మను చూశాను. మా ఆవిడనూ చూశాను…ఇలాగే, ఈ విధంగానే, ఇంటిని చక్కబెట్టుకుంటూ. అలాంటి గృహిణులైన ఆడవాళ్ళెందరెందరికో గౌరవంగా ఈ కవిత అంకితం.)

Exit mobile version