[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘హృదయ దౌర్బల్యం’ అనే రచనని అందిస్తున్నాము.]
శ్రీ భగవానువాచ:
కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్।
అనార్యజుష్టమస్వర్గ్యమ్ అకీర్తికరమర్జున॥
[భగవద్గీత 2 వ అధ్యాయం (సాంఖ్య యోగం, 2 వ శ్లోకం)]
[dropcap]ప్రి[/dropcap]యమైన అర్జునా, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్త భ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది ఇప్పుడు నువ్వు పిరికితనానికి లోనుకావడం అసలు తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా, ఈ లోకంలో నిన్ను అపకీర్తి పాలుజేస్తుంది. కాబట్టి ఈ తుచ్చమైన హృదయ దౌర్భల్యమును విడిచి యుద్ధానికి సిద్ధం కమ్ము అని భగవానుడు వ్యాకులత్వానికి లోనైన అర్జునుడిని హెచ్చరించాడు.
దౌర్బల్యం నుండే క్రూరత్వం పుడుతుంది. ఈ క్రూరత్వం మనుషుల్లో మానవత్వాన్ని మరుగున పడేస్తుంది. కాబట్టి ఈ హృదయ దౌర్బల్యం పట్ల మనం అందరం అప్రమత్తంగా వుండాలి. జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి ఎంతో స్ఫూర్తి, ఉత్సాహం అవసరం. ఆశావహంతో, ఉత్సాహంతో, మరియు సామర్థ్యముతో ఉండి; బద్ధకం, దురలవాట్లు, అజ్ఞానం, మరియు మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి.
శ్రేయస్సు అంటే జ్ఞానప్రాప్తి. దాని కోసం చేసే ప్రయత్నం మనలోని అరిషడ్వర్గాల వలన, భౌతిక సుఖాల కోసం పరుగులు తీసే మన చాంచల్యం వలన, భౌతిక ప్రపంచంలో ఇతరులతో పోల్చుకొని వారి వలనే మనం కూడా విజయం సాధించాలన్న తపన కోసం సులభంగా కొనసాగవు. జ్ఞానాన్ని కోరేవారు అరుదు. యోగమో, ధ్యానమో, జపమో ఏదో ఆధ్యాత్మిక సాధన ప్రారంభించవచ్చు. కాని అది కొనసాగటానికి బాహ్యమైన అవరోధాల కంటే వ్యక్తి లోపల ఉండే అవరోధాలు ఎక్కువ. కొన్ని సంవత్సరాలు యోగసాధన చేసిన వారికి కూడా లోపల ఉన్న శత్రువులు, కామమో, అహంకారమో, ధనాశ, కీర్తి కాంక్ష మొదలగు దౌర్బల్యము. ఇందులో ఏదో ఒకటి మనిషి పతనానికి కారణం అవుతాయి. కాబట్టి అన్ని అవరోధాలకు కారణమైన మానసిన హృదయ దౌర్బల్యాన్ని జయించడం ఎంతో అవసరం. మనిషి మనుగడకు హృదయ దౌర్బల్యం మిక్కిలి అవరోధం కాబట్టి సాధకులను దాన్ని జయించి తీరమని భగవానుడు అర్జునుడిని నిమిత్త మాత్రంగా చేసుకొని పై శ్లోకం ద్వారా ఉపదేశించాడు.
అర్జునుడు అనుభవిస్తున్న మనోభావం, నైతిక బాధ్యతా, నిజమైన కారుణ్యమూ కాదు, నిజానికి అది హృదయంలో నుండి జనించిన శోకము, చిత్తభ్రాంతి మాత్రమే, అని శ్రీ కృష్ణుడు అర్జునుడికి పై శ్లోకం ద్వారా విశదీకరిస్తున్నాడు. దీని మూలకారణం మన హృదయాలలో జనించే మానసిక బలహీనతలో ఉంది. నిజమైన కరుణ మరియు విజ్ఞానంపై, అతని ప్రవర్తన ఆధార పడివుంటే, తనకి అయోమయము, శోకం కలిగి ఉండేవి కావు.
సానుకూల ఆలోచన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మెరుగైన హృదయనాళ ఆరోగ్యానికి కూడా దారితీస్తుందని సైన్స్ చెబుతోంది, అయినప్పటికీ మనలో చాలా మంది తమంతట తాముగా లేదా చుట్టుపక్కల వ్యక్తుల ప్రభావంతో ప్రతికూల ఆలోచనా విధానాలను అనుసరిస్తూనే ఉన్నాము.
ఈ ప్రతికూల ఆలోచనా ధోరణి గురించి భగవానుడు ద్వాపర యుగంలోనే అంటే దాదాపుగా అయిదు వేల సంవత్సరాల క్రితమే మానవాళిని హెచ్చరించడం గమనించదగిన విషయం.