హృదయ నివేదన!

0
3

[dropcap]ని[/dropcap]ద్దురరాని రాత్రిళ్ళు
ఎన్నో తెల్లని కాగితాలని చుట్టూ చేర్చుకొని
నల్లని సిరాతో నింపేస్తున్నాను
కవిత్వమంటే ఏంటో తెలియని నాకు
మెలుకువలో కలలసందడిలా పరిచయమై
కమ్మని కవనాలు లిఖించే అదృష్టం కల్పించావు నువ్వు!
హృదయం చేస్తున్న లయకు అక్షర రూపమిస్తున్నట్లుగా
పదాలను పేర్చుతూ వ్రాస్తున్నాను
ఇదే కవిత్వమంటూ.. అందరూ గుర్తిస్తూ.. మెచ్చుకుంటుంటే ..
‘అది నా ఘనతేంకాదు..
నిన్ను తలచుకున్నప్పుడల్లా
నా యద పొందే పరవశాలకు మరోరూపం ఈ కవిత్వం’
అనుకుంటూ మురిసిపోయే ఆనందానికి కారణం నువ్వు!
మెరిసే నీ నుదుటి సిందూరాల లావణ్యాలు
విరిసే నీ పెదవుల చిరునవ్వుల సొగసుల సౌందర్యాలు
కదిలే నీ కాలి సిరి మువ్వల సవ్వడుల సమ్మోహనాలు
ఎన్నితీరుల వర్ణించినా తక్కువే!
నువ్వేమన్నా.. నువ్వేం చేసినా..
అది నాకు అద్భుతాల పరిచయమే!
విశ్వంలోని అందాన్నంతా ఒక్క చోట చేర్చి
రమణీయంగా తీర్చిదిద్దిన ‘అపరంజి’లా నువ్వు!
మరపురాని కలలా మురిపెంగా మురిపిస్తూ..
కళ్ళెదురుగా నిలిచి ‘దేవత’లా .. నువ్వు!
నిన్నెంతగా అభిమానిస్తున్నానో..
నిన్నెంతగా ఆరాధిస్తున్నానో..
నిన్నెంతగా ప్రేమిస్తున్నానో..
చెప్పడానికి మాటలు లేవు!
నేలపై వున్న భాషలు చాలవు!
నీలాల నింగిలో వెన్నెల వన్నెల
వెలుగుజిలుగుల కాంతులతో.. పున్నమి జాబిలిలా నువ్వు!
నేలపై నీకై తపిస్తూ మౌనంగా ఘోషించే సంద్రంలా నేను!
ఆ దూరం తగ్గనిది!
నా వేదన తీరనిది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here