Site icon Sanchika

హృదయరాగం

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘హృదయరాగం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]తూ[/dropcap]ర్పు దిక్కుకి పసిడి వర్ణాన్ని అద్దుతూ
బాలభానుడు ఉదయిస్తున్న శుభసమయం..
సన్నగా కురుస్తున్న మంచు బిందువులు
మల్లెమొగ్గలపై చేరి అందంగా మెరుస్తుంటాయి!
చిరుగాలి తాకిడికే తట్టుకోలేక
పూలమొక్కలన్నీ వయ్యారంగా
ఊగుతూ మురిపిస్తుంటాయి!
కోవెల నుండి శ్రావ్యంగా వినిపిస్తున్న
గుడిగంటల నాదాలు
ఓంకారాల తన్మయాలు
తొలిపొద్దుల మేల్కొలుపు రాగాల సుస్వరాలు
పరవశింపజేస్తుంటాయి!
పక్షుల కిలకిలారావాల సందళ్ళు
ఎదలకు ఉల్లాసాలని పరిచయం చేస్తుండగా
ప్రకృతి అందంగా శోభిల్లుతూ అలరిస్తుంటుంది!
కలల లోకాన అప్పటి వరకు
హాయిగా విహరించిన హృదయాలు
తొలి వేకువల ఆనందాలని తిలకిస్తాయి
ఉత్సాహంగా మరో కొత్త రోజుకు
స్వాగతం పలుకుతూ
విజయాలని అందుకోవాలని తలుస్తూ
పనుల్లో లీనమవుతుంది అశేష మానవాళి!
ఉదయమంటే..
మనల్ని మనం సరికొత్తగా
ఆవిష్కరించుకునే అవకాశ ప్రారంభం!

 

 

Exit mobile version