[శ్రీ దేవులపల్లి రామానుజరావు రచించిన ఈ వ్యాసం ఆంధ్రపత్రిక, విజయ సంవత్సరాది సంచికలో (1953-54, సంచిక 44) తొలిసారి ప్రచురితమైంది. 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ కోసం డా. జి.వి. సుబ్రహ్మణ్యం గారు సంకలనం చేసిన ‘సారస్వత వ్యాసములు’ అనే గ్రంథం ప్రథమ సంపుటంలో చేర్చబడిన ఈ వ్యాసాన్ని సంచిక పాఠకుల కోసం ప్రత్యేక వ్యాసంగా అందిస్తున్నాము.]
[dropcap]ఇ[/dropcap]రువదియవ శతాబ్దమున మొదటి యర్ధభాగము గడచి, రెండవ యర్ధభాగము ప్రారంభ మైనది. ఈ యేబది సంవత్సరాలలో మన దేశమున చరిత్ర నిర్మాణము జరిగినది. ఈ యర్ధశతాబ్ధము, అందు ముఖ్యముగ గడచిన శతాబ్దము, హైదరాబాదు చరిత్రలో అత్యంత ప్రధాన ఘట్టము. మధ్యకాలపు రాజవంశ పరిపాలన అంతమొంది సంపూర్ణ బాధ్యతాయుత పరిపాలన యేర్పడినది. రాజకీయముగా జరిగిన యీ మార్పుల ప్రభావము ఆర్థిక సాంఘిక సాహిత్య రంగములందు గూడ గోచరించుచున్నది. అందుచేత హైద్రాబాదులో గడచిన కొన్ని శతాబ్దాల యందు జరిగిన సాహిత్య కృషిని సమీక్షించుకొనుటకు ఇది సరియైన సమయమని నిస్సందేహముగా చెప్పవచ్చును.
ఈ సారస్వత వికాసమును సమీక్షించు నప్పుడు ఇక్కడి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో నుంచుకొనుట అవసరము. హైద్రాబాదు స్వదేశ సంస్థానాలలోనేకాక వెనుకబడి యున్న స్వదేశ సంస్థానాలలో గూడ మొదటిదిగా నుండెను. ఇక్కడి పరిపాలకులు ప్రజల భాషలతో నేమాత్రము సానుభూతి కలిగియుండలేదు. అంతేకాదు; వారీభాషల యభివృద్ధిని వ్యతిరేకించి వాని యభివృద్ధిని సర్వవిధముల నిరోధించిరి. తత్ఫలితముగా తెలుగు సరస్వతికి కొంతకాలము అజ్ఞాతవాసము తప్పలేదు. రాజరాజనరేంద్రుని నుండి రఘునాథరాయల వరకు రాజాస్థానాలలో ముత్యాలశాలలందు దీనారటంకాల తీర్థమాడిన ఆంధ్రశారద ఉర్దూ పార్సీ అరబ్బీ బిబ్బీల వెనుక నెట్టివేయబడి తబ్బిబ్బు జెందినది. అందుచేత హైద్రాబాదు రాష్ట్రమున తెలుగు సరస్వతిని అరబ్బీ పార్సీ సంప్రదాయాలచేత పరిపోషితమైన ఉర్ధూభాషకు ఊడిగము చేయించు ప్రయత్నాలను ప్రతిఘటించుట భాషాప్రియుల ప్రథమ కర్తవ్యమైనది. ఇండియా యూనియన్‍లో ఇంగ్లీషువారు ఏమి చేసినప్పటికిని సారస్వత సమావేశాలను నిషేధించి ఆంధ్రభాషా వికాసమునకు అడ్డుపడలేదు. రాజకీయాలతో ప్రమేయములేని వీరేశలింగ ప్రభృతుల నిరంతర కృషికి నిరోధములు కలుగలేదు. హైద్రాబాదు రాష్ట్ర ప్రత్యేక పరిస్థితుల ననుసరించి ఆంధ్ర గ్రంథ పఠనాసక్తిని విద్యావంతులలో నిలిపి పోషించుటయే యొక ఘనకార్యమైనది. ఆంధ్రసారస్వత సంస్కృతుల వికాసమునకు అభివృద్ధికి యీ ఘనకార్య సాధనయే ప్రథమ సోపాన మైనది. ఈ దృక్పథముతోనే యీ ప్రాంతమందలి తెలుగు భాషా వికాసమును మనము అవలోకించవలసియుండును.
ఆంగ్ల భాషా సంపర్కములేని ఉర్దూభాషా ప్రభావమును గూడ మనము గమనింపవలసియున్నది. హైద్రాబాదులో ఉర్దూభాష రాజభాషయై, విశ్వవిద్యాలయ బోధనాభాషయై, విద్యాధిక ప్రపంచమున గణుతి కెక్కినది. నలుగురు పెద్దలొకచోట సమావేశమైనచో వారి నాలుకలమీద ఉర్దూ సరస్వతియే నాట్యమాడినది. సంస్కృతాంధ్రములందు పాండిత్యము కలిగి. పల్లెటూళ్ళలో నివసించుచు, అధునాతన ప్రపంచమునకు దూరముగా నుండి, రాజాదరణ లేక, గ్రాసవాసోదైన్యమున కృశించుచుండిన పండిత బృందము మొదటివర్గము. కొలదియో, గొప్పయో పరిచయము ఉర్దూ, పార్సీ భాషలతో కలిగి లౌకిక ప్రపంచమున వ్యవహార్తలైన ఆస్తిపరులు రెండవ వర్గము. ఆంగ్లభాషలతో యీ రెండు వర్గాలకు కూడ సంబంధము అల్పమే. అందుచేత తెలంగాణములోని ఆంధ్రభాషపైన ఆంగ్లభాషా ప్రభావము ఆలస్యముగా పడినదని చెప్పవలసి యున్నది. ఉర్దూభాషా ప్రభావము ఆలస్యముగా పడినదని చెప్పవలసి యున్నది. ఉర్దూ భాషా మరియు ఆంగ్ల భాషా ప్రభావాలు పూర్తిగా భిన్నమైనవి. ఆంగ్లభాషతో పోల్చినప్పుడు ఉర్దూప్రాయము కడుకొద్దిది. ఉర్దూభాష ప్రత్యేకత శృంగారము మరియు సూఫీ తత్వము. ఆంగ్లభాష ప్రపంచ విజ్ఞానమునకు ప్రపంచ సాహిత్యమునకు ఆటపట్టు. ఉర్దూ అప్పుడప్పుడే పరిపాలకుల భాషయగుటకు ప్రాకులాడు స్థితిలో నుండెను. ఆంగ్లభాష సకల ప్రపంచమునకు వ్యవహార యోగ్యమై, వాడుకలోనికి వచ్చియుండెను. కావుననే ఇండియా యూనియన్‌లో ఆంగ్లభాష వలె హైద్రాబాదులో ఉర్దూభాష పాఠకులను ఉత్తేజితులను జేసి, ఆంధ్రమహారాష్ట్ర కర్ణాటక వాఙ్మయములందు చెప్పదగిన పరిణామాలను కలుగజేయలేక పోయినది. కావున హైద్రాబాదు రాష్ట్రములో ఆంధ్ర భాషా వికాసము పూర్వవాఙ్మయ పఠనము మీదనే యెక్కువ ఆధారపడవలసి వచ్చినది. భావకవిత్వపు వెల్లువ మరియు నవలారచన వ్యాసంగ ప్రవాహము తెలంగాణ క్షేత్రమున తక్కువగా పొంగిపొరలినట్లు కనపడుచున్నది. హైద్రాబాదులో ఆధునికాంధ్ర వాఙ్మయ వికాసము ముఖ్యముగా నాలుగు మార్గముల జరిగినట్లు స్పష్టము కాగలదు. ఒకటి చరిత్ర పరిశోధన, రెండవది విజ్ఞాన వాఙ్మయ నిర్మాణము, మూడవది కథానికా రచన. నాలుగవది ప్రభుతమునకు ప్రజలకు మధ్య జరిగిన సంఘర్షణచే ప్రేరితమైన కవితా రచన.
తెలంగాణమున ఆంధ్రభాషా వికాసమునకు తోడ్పడిన సంస్థానాధీశ్వరులను ఈ సందర్భమున ప్రశంసింపవలసి యున్నది. ప్రభుత్వ విధానము ప్రజల భాషల అభివృద్ధికి ప్రతికూలముగా నున్న సందర్భమున నిజామునకు సామంతులైయున్నప్పటికిని గద్వాల, అమరచింత మొదలైన సంస్థానాధీశ్వరులు తెలుగు కవులను ఆదరించి, పోషించినారు. ఆధునిక యుగనిర్మాతమైన శ్రీ తిరుపతి వేంకట కవుల వంటివారు తమ సారస్వత జైత్రయాత్రల సందర్భమున యీ సంస్థానాలకు అరుగుదెంచి సన్మానములను పొందినట్లు నానారాజ సందర్శనము తెలుపుచున్నది. ఈ సంస్థానాలు మినుకు మినుకుమని తెలుగు భాషాదీపములు వెలుగుచున్న ప్రమిదలలో కొంత చమురు పోసి, ఆరిపోకుండునట్లు కాపాడిన గౌరవము సంపాదించుకొనినవి.
విజ్ఞాన చంద్రికా గ్రంథమండలియు తత్ర్పకటనలు అనేక ఇతర గ్రంథ మాలల అవతరణకు కారణభూతమైనవి. గోలకొండ, కిన్నెర, దివ్యవాణీ సుకృతి ప్రాసాదము, మాతృభారతి, ఆంధ్రశ్రీ, కాకతీయ, పూలతోట, వీరేశలింగకవి కంకాభరణ కృషి ప్రచారిణి, శివధర్మ, విజ్ఞాన ప్రచారిణి, వేంకటేశ్వర కావ్యమాల గ్రంథమాలలను ఈ సందర్భమున పేర్కొనవలసి యున్నది. అణా, దేశోద్దారక, ఆంధ్రకేసరి గ్రంథమాలలు కొద్దినెలలో ప్రజలకు అవసరమైన విజ్ఞానమును ప్రసాదించు ఉత్తమ వచన గ్రంథములను ప్రకటించినవి. సాధన సమితి ఆంగ్ల విద్యా భూషితులైన యువకులు స్థాపించి నిర్వహించు సంస్థ. ఇందులో కథకులు అధిక సంఖ్యాకులు. ఈ సమితి తెలంగాణ రచయితల ఖండకావ్యములను, కథానికలను విరివిగా ప్రకటించి ప్రశంశనీయముగా భాషాసేవ జేయుచున్నది. యువకులు నిర్వహించుచున్న మరొక సంస్థయగు ‘సాహితీ మేఖల’ యొక్క ఆశయము కవితారచన, కావ్యప్రచారము. ఇందులో కవులు అధిక సంఖ్యాకులు; నూతన భావాలతో పాటు యీ కవులు ప్రబంధవక్వతతో కూడిన శైలిని అలవరచు కొనినారు. ఈ యెడ్డాణములో పొదిగిన రత్నములు కొన్ని నిజముగా సానలుదీరియున్నవి. ఈ దశాబ్దములోనే అవతరించిన ఆంధ్ర చంద్రికా గ్రంథమాల, మరియు విజ్ఞానవర్ధినీ పరిషత్తులు సరిగా విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి ఆశయాలతోనే కృషిచేయుచు, వివిధ విజ్ఞాన శాఖలకు సంబంధించిన మంచి గ్రంథములను ప్రకటించుచున్నవి. అభ్యుదయ యువకవులు సారథ్యము వహించుచున్న తెలంగాణ రచయితల సంఘము చేయుచున్న కృషి గూడ ఈ సందర్భమున ప్రస్తుతించ దగియున్నది.
భాషా వికాసమునకు పత్రికల ద్వారా జరిగిన కృషిని ప్రత్యేకముగా పేర్కొనవలసియున్నది. ఇండియా యూనియన్‍లోని పత్రికల కున్న స్వాతంత్ర్యములో నూరవభాగ మైనను హైదరాబాదు పత్రికలకు లేకపోవుట జగత్ర్పసిద్ధమైన సత్యము, హైద్రాబాదులోని రచయితలకు తగినంత ప్రచారము కలుగకపోవుటకును, ఇతరాంధ్ర దేశ రచయితలతో వారికి పరిచయము కలుగక పోవుటకును, పత్రికా స్వాతంత్ర్యము లేకపోవుట యొక ముఖ్య కారణమని చెప్పవచ్చును. అయినప్పటికిని తీవ్ర ప్రతిబంధకాలను అధిగమించి కొంతకాలమైనను సేవజేసిన పత్రికలు కొన్ని కలవు. వీని పూర్వసంపుటాలను పరిశీలించినచో కథకులకు, కవులకు, వ్యాసకర్తలకు, విమర్శకులకు, పరిశోధకులకు, నాటికా రచయితలకు, ప్రోత్సాహము నిచ్చి, యీ పత్రికలు భాషా వికాసమునకు తోడ్పడినట్లు విశదము కాగలదు. ఈ పత్రికల కృషి ఫలితముగా ఉన్నతవిద్య నభ్యసించిన యువకులు నూతనరీతుల భాషాసేవకు బద్ధకంకణులైరి, వీరిలో సకలాంధ్ర ప్రశస్తి గాంచిన కథకులు, రచయితలు క్రమముగా సిద్ధమైనారు. గోలుకొండ, తెనుగు పత్రిక, నీలగిరి, సుజాత, శోభ, భాగ్యనగర్, సారథి, ఆంధ్రాభ్యుదయము మొదలైన పత్రికలలో ప్రకటితమైన వాఙ్మయము హైదరాబాదులో జరిగిన భాషా వికాసమునకు మంచి నిదర్శనము. ఈ కాలమున ఆంగ్లభాషా పరిచయముతో పాటు ఆంధ్ర భాషలో ప్రావీణ్యము సంపాదించిన యువకులు ముందంజవేసి కథలు, గేయాలు, వ్యాసాలు మొదలైనవి వ్యావహారిక భాషలో రచింపసాగిరి, హైద్రాబాదు పోలీసు నాజీశక్తుల నగ్ననృత్యము, రజాకార్ల రాక్షస కృత్యములు, నిజాము నిరంకుశ చర్యలు, వీనిపైన తిరుగుబాటు యువకుల గేయాలలోను రచనలలోను శక్తివంతమైన శైలిలో వ్యక్తీకరించుట జరిగినది. సజీవమైన భాషలో కండగల కవిత్వ మీ సంఘర్షణ సాహిత్యమున సమృద్ధిగా అవతరించినది. ఈ రచనల సమీక్ష కొరకొక ప్రత్యేక వ్యాసమే వ్రాయవలసియున్నది. ఇందుతోపాటు ఆంధ్ర సారస్వర పరిషత్తు తెలంగాణము నందంతటను శాఖోపశాఖలతో విస్తరించి, వయోజనులకు రాత్రి పాఠశాలలను నిర్వహించి, పరీక్షలను నిర్వహించి, మన భాషలోని మంచి పుస్తకములను ప్రజా సామాన్యముచే పఠింపజేసి, స్వయముగా ప్రజలకు అవసరమైన విజ్ఞాన ప్రదములగు ఉత్తమ గ్రంథములను ప్రకటించి, దేశములో ఒక మంచి సాహిత్య వాతావరణము కలుగజేసి, రచనాశక్తికి సర్వవిధముల దోహద మొసగుచున్నది.
ఈ విధముగా హైద్రాబాదులో రచనావ్యాసంగము, ఆంధ్రభాషా వికాసము ఒక విశిష్టమైన ఫక్కిని జరిగినది. పరిశోధన, విజ్ఞానము, కథానిక, సంఘర్షణ యుగమునకు సంబంధించిన అభ్యుదయ కవిత్వము, తెలంగాణ రచనలలో ప్రధాన స్థానము నాక్రమించుచున్నవి. ఆంధ్రభాషకు, ఆంధ్ర సంస్కృతికి కృతిమమైన సరిహద్దులు పొలిమేరలు కల్పించుటకు వీలులేదు. అట్టి ప్రయత్నాలు నెరవేరగల అవకాశాలు అవతరించినవి. సమగ్రాంధ్ర దృక్పథముతో సాహిత్య కృషి జరుగవలసి యున్నది. అట్లు జరుగుచున్నది కూడ. కృష్ణా గోదావరి తుంగభద్రలు సకలాంధ్రులకు సమిష్టి స్వత్వము. నన్నయ, తిక్కన, పోతన మొదలగు మహాకవులు వివిధ ప్రాంతాలలో అవతరించి ఆంధ్రభాషను ఆరాధించి నప్పటికిని ఆంధ్రజాతి కంతకును వారు సమానముగా గౌరవపాత్రులై యున్నారు. వారి కృషి సకల ప్రాంతము లందలి ఆంధ్రభాష యొక్క అభ్యుదయమునకు మార్గదర్శకమైనది. ఈనాడు తెలంగాణము, రాయలసీమ, సర్కారు జిల్లాలలో జరిగిన సాహిత్యకృషిని అందరము కలిసి సమీక్షించుకొని ముందుకు అడుగువేయవలసి యున్నది.
– శ్రీ దేవులపల్లి రామానుజరావు